Vijaya Lakshmi
Published on Jan 09 2026
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?మౌని అమావాస్య సాధకులు, యోగులు, భక్తులు, ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ఆధ్యాత్మిక పండుగ. అమావాస్య తిథి పితృదేవతలకు అంకితం చేయబడింది. సంవత్సరంలో వచ్చే 12 అమావాస్యలలో మౌని అమావాస్యకు విశేషమైన ప్రాధాన్యం ఉంది. పుష్యమాసం ఆఖరి రోజు, మహాశివరాత్రికి ముందు వచ్చే అమావాస్య మౌని అమావాస్య. 2026 లో జనవరి 18 న వస్తుంది.
ఈ సంవత్సరం అంటే 2026 లో మౌని అమావాస్య తిథి ఈ నెల జనవరి 18, తెల్లవారుజామున 12:03 గంటలకు ప్రారంభమై. జనవరి 19 తెల్లవారుజామున 01:21 నిముషాలకు ముగుస్తుంది. పంచాంగం ప్రకారం మౌనీ అమావాస్యను ఈ ఏడాది జనవరి 18, ఆదివారం జరుపుకుంటారు.
మౌని అమావాస్య, చొల్లంగి అమావాస్య, దర్శ అమావాస్య ఇలా వివిధ పేర్లతో పిలవబడే పుష్య అమావాస్య ఇటు పిత్రుకార్యాలకు, అటు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, దానధర్మాల లాంటి ధార్మిక కార్యక్రమాలకు అత్యంత విశిష్టమైన రోజుగా పరిగణిస్తారు.
భారతీయ సనాతన ధర్మంలో ప్రతి తిథికీ, ప్రతి పర్వదినానికీ ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అర్థం ఉంది. ముఖ్యంగా అమావాస్య తిథి పితృదేవతలకు అంకితం చేయబడింది. సంవత్సరంలో వచ్చే 12 అమావాస్యలలో మౌని అమావాస్యకు విశేషమైన ప్రాధాన్యం ఉంది. మౌనాన్ని ఆచరించడం ద్వారా ఆత్మశుద్ధి, అంతర్ముఖత, దైవానుభూతి సాధ్యమవుతుందని నమ్మకం. అందుకే ఈ అమావాస్యను “మౌన అమావాస్య”గా పిలుస్తారు.
ఉత్తరాదిన ఈ మౌని అమావాస్యను అత్యంత విశేషంగా పాటిస్తారు. ప్రతి సంవత్సరం ప్రయాగ త్రివేణీ సంగమంలో జరిగే మాఘమేలాలో ప్రత్యేకించి ఈ మౌని అమావాస్య రోజున లక్షలాదిమంది సాధకులు, యోగులే కాకుండా ఎన్నడూ జనంలోకి రాని నాగసాధువులు కూడా పెద్ద సంఖ్యలో హాజరయి పుణ్యస్నానాలు చేస్తారు. ఉత్తరాదిన మౌని అమావాస్య రోజును మాఘి అమావాస్య అని కూడా అంటారు. ఉత్తరభారతంలో పాటించే క్యాలెండర్ ప్రకారం ఈ రోజు మాఘమాసంలో వస్తుంది కాబట్టి వారు దీనిని మాఘ అమావాస్యగా వ్యవహరిస్తారు.
పురాణాల ప్రకారం, మౌనీ అమావాస్య రోజున దేవతలందరూ ప్రయాగరాజ్‌లోని త్రివేణీ సంగమ తీరానికి వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తారని చెబుతారు. అందుకే ఈ రోజున చేసే స్నానాన్ని ‘దైవిక స్నానం’ అని పిలుస్తారు. ఇదే సమయంలో సూర్యుడు మకర రాశిలో ఉంటాడు. మౌనీ అమావాస్య మోక్షం పొందడానికి అత్యంత అనుకూలమైన సమయంగా పరిగణించబడుతుంది.
మౌనీ అమావాస్య నాడు సూర్యుడు మరియు చంద్రుడి అద్భుత కలయిక జరుగబోతుంది. దీంతో ఇది మోక్షం పొందడానికి అత్యంత అనుకూలమైన సమయంగా పరిగణించబడుతుంది.
ఆంధ్రప్రదేశ్‌లో మౌని అమావాస్యను 'చొల్లంగి అమావాస్య' గా జరుపుకుంటారు, గోదావరి ఏడు పాయల్లో ఒకటైన తుల్యభాగ తూర్పుగోదావరిలోని చొల్లంగిలో సముద్రంలో కలుస్తుంది. మౌని అమావాస్య రోజున అక్కడ స్నానం చేయడంవల్ల విశేష పుణ్యఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఇక్కడ ప్రతిఏటా జరిగే చొల్లంగి తీర్ధానికి ఎంతోమంది భక్తులు వచ్చి పవిత్ర స్నానాలు ఆచరించడంతో పాటు పెద్దలకు పిండప్రదానాలు చేస్తారు.
పుష్య బహుళ అమావాస్య అయిన ఈ మౌని అమావాస్య రోజు సింహాచలం నరసింహుని కొండ క్రింద పుష్కరణిలో సింహాచల అప్పన్న కు ప్రత్యేక పూజలతో పాటు తెప్పతిరునాళ్లు వేడుకలను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ•.
మౌని అమావాస్య రోజున గంగమ్మ తల్లి ఆకాశం నుంచి అమృతంగా మారి కిందికొస్తుందని నమ్ముతారు. అందుకే మౌని అమావాస్య రోజున సూర్యోదయానికి ముందే గంగా నదిలో త్రివేణీ సంగమంలో స్నానం చేయాలి.
అందరూ గంగానది త్రివేణీ సంగమానికి వెళ్లి స్నానం చెయ్యలేరు. ఆ అవకాశం లేనివారు మరేదైనా నదిలోకాని, ప్రవహించే నీటిలోగాని, అదికూడా సాధ్యం కానివారు ఇంట్లోనే స్నానం చేసే నీటిలో కాస్త గంగాజలం కలుపుకొని, 'గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధుం కురు' అన్న శ్లోకాన్ని పఠిస్తూ స్నానం చేయాలి. ఈ పర్వదినాన పూర్వీకులను స్మరించుకుంటూ పిండప్రదానాలు, పూజలు చేయడం ద్వారా మోక్షాన్ని పొంది, వైకుంఠానికి వెళ్తారని నమ్ముతారు.
పితృకార్యాలకు అత్యంత ముఖ్యమైన రోజు అమావాస్య. మౌని అమావాస్య రోజున పితృదేవతలకు పిండ ప్రదాన కార్యక్రమాలు నిర్వహించడం వలన వారికి ఉత్తమ గతులు కలగడంతో పాటు, పితృదోషాలు కూడా తొలగిపోతాయని జ్యోతిష పండితులు చెబుతున్నారు.
జ్యోతిషపరంగా కూడా మౌని అమావాస్యకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఎవరి జాతకంలో అయితే చంద్రుడు బలహీనంగా ఉంటాడో వారందరూ మౌని అమావాస్య రోజున గోమాతకు పెరుగన్నం తినిపించాలి. ఇలా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభించడంతో పాటు చంద్రుడికి సంబంధించిన దోషాల నుంచి విముక్తి లభిస్తుందని, ఈ రోజున వెండి నాగుపామును పూజించి ప్రవహించే నీటిలో తెల్లని పువ్వులతో పాటు వేయడం వల్ల కాలసర్ప దోషం వంటివి తొలగిపోతాయని కూడా పండితులు చెబుతున్నారు.
మౌని అమావాస్య నాడు శనైశ్చరుడిని కూడా పూజిస్తారు. నల్ల నువ్వులు లేదా నువ్వులనూనెతో ఈ రోజు శనిదేవునికి అభిషేకం చేస్తే శనిదోషాల నుంచి ఉపశమనం లభిస్తుంది.
రావి చెట్టు త్రిమూర్తులకు ప్రతిరూపంగా భావిస్తారు. మౌని అమావాస్య రోజు రావిచెట్టును పూజిస్తే సకల పాపాలు తొలగిపోయి సకల సౌఖ్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం. ఈ రోజు రావి చెట్టుకి నీటిని సమర్పించి అక్కడ దీపం వెలిగించాలి. చెట్టు చుట్టూ దారాలు చుడుతూ 108 ప్రదక్షిణలు చేస్తే శుభ ఫలితాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు.
అన్నిటికంటే ముఖ్యంగా ఈ రోజున మౌన దీక్షతో లక్షీనారాయణులను ఆరాధిస్తే ఆధ్యాత్మిక ఉన్నతి లభిస్తుందని పురాణ కథనాలు చెబుతున్నాయి.
‘మౌనిఅమావాస్య’ పేరులోనే మౌనం ఉంది. ‘మౌన్’ అన్న సంస్కృత పదం నుంచి మౌని అనే పదం పుట్టుకొచ్చినట్టు చెబుతారు. మౌని అంటే ‘సంపూర్ణ నిశ్శబ్దం’. మాటల్ని త్యజించి, మనస్సును నియంత్రించి, ఆత్మతో సంభాషించుకునే స్థితి. మౌని అమావాస్య రోజున సాధకులు, యోగులు, భక్తులు మాటల్ని తగ్గించి లేదా పూర్తిగా మౌనం పాటించి, ఉపవాసం, స్నానం, జపం, ధ్యానం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మౌనాన్ని ఆచరించడం ద్వారా ఆత్మశుద్ధి, అంతర్ముఖత, దైవానుభూతి సాధ్యమవుతుందని నమ్మకం. అందుకే ఈ అమావాస్యను “మౌన అమావాస్య”గా పిలుస్తారు.
మాటలు మనసును బయటకు లాగుతాయి. మౌనం మనసును లోపలికి తీసుకెళ్తుంది. ఈ సూత్రాన్నే చెబుతుంది మౌని అమావాస్య. మౌనం వల్ల మనస్సు ప్రశాంతమవుతుంది. కోపం, అసహనం తగ్గుతాయి. ఆలోచనలకు స్పష్టత వస్తుంది. ఆత్మవిమర్శ జరుగుతుంది. దైవ చింతన బలపడుతుంది. అందుకే “మౌనం మహా తపస్సు” అంటారు పెద్దలు. ఈ రోజున చేసే మౌన దీక్ష వలన స్వీయ నియంత్రణ, మానసిక ప్రశాంతత లభిస్తుందని, ఆధ్యాత్మిక పురోగతి, మోక్ష ప్రాప్తి లభిస్తుందని చెబుతారు.
ఆది శంకరాచార్యులవారు 'మౌనం' ఒక సాధువుకి ఉండవలసిన మూడు ప్రధాన లక్షణాలలో ఒకటిగా పేర్కొన్నారు. ఆధునిక కాలంలో రమణ మహర్షి ఆధ్యాత్మిక సాధన కోసం మౌన సాధన ముఖ్యమైనదిగా చెప్పారు. ప్రస్తుత రోజులలో అందరూ రోజంతా మౌనంగా ఉండే అవకాశం ఉండదు కాబట్టి కనీసం, పూజా, ధార్మిక కార్యక్రమాలు చేస్తున్నంత సేపయినా మౌనాన్ని పాటించాలని చెబుతున్నారు పెద్దలు.
👉 దైవారాధన లో పాల్గొనండి : లక్ష్మీ నారాయణులను, శివ పార్వతులను, లేదా మీ ఇష్టదైవాన్ని ఆరాధించండి.
👉 మంత్ర జపం చేయండి : మనస్సును శుద్ధి చేసుకోవడానికి మరియు దైవంతో అనుసంధానించడానికి మంత్ర జపం మీద దృష్టి పెట్టండి.
👉 పవిత్ర స్నానం చేయండి : గంగానది లేదా ఇతర పవిత్ర నదులలో స్నానం చేయండి లేదా ఇంట్లో గంగాజలం వాడి మంత్రపూరితంగా పవిత్ర స్నానం చెయ్యండి.
👉 దేవాలయాలను సందర్శించండి : దేవాలయాలు లేదా పవిత్ర స్థలాలను సందర్శించండి.
👉 పితృ కార్యాలు నిర్వహించండి : పూర్వీకులను గౌరవించడానికి పితృ పూజ, పిండ ప్రదానాలు వంటి పితృకార్యాలు, ఆచారాలను నిర్వహించండి.
👉 దానం చెయ్యండి : అవసరమైన వారికి ఆహారం, బట్టలు మరియు ఇతర వస్తువులను దానం చేయండి.
👉 ఆధ్యాత్మిక పఠనం : శ్రీమద్ భాగవతం మరియు భగవద్గీత వంటి గ్రంథాలు మరియు ఆధ్యాత్మిక పుస్తకాలను చదవండి, విష్ణు సహస్ర నామాలు, శివ సహస్ర నామాలు, లలితా సహస్ర నామాలు పారాయణ చెయ్యండి.
👉 శని దోష పరిహారాలు : ఈ రోజు శని దోష పరిహారాలు చేయడానికి (శని గ్రహం యొక్క ప్రతికూల జ్యోతిష ప్రభావాలు) శుభప్రదంగా పరిగణించబడుతుంది.
మౌని అమావాస్య నాడు, పేదలకు ఆహారం, దుస్తులు, దుప్పట్లు మరియు ఇతర ముఖ్యమైన వస్తువులను దానం చేయాలి. ఆవులకు సేవ చేయడం మరియు జంతువులు మరియు పక్షులకు ఆహారం ఇవ్వడం కూడా ప్రత్యేక పుణ్యాన్ని అందిస్తుంది. అలా చేయడం వల్ల పూర్వీకుల ఆత్మలు సంతృప్తి చెందుతాయి మరియు పూర్వీకుల పాపాల నుండి విముక్తి పొందుతాయి.
🔸 మౌని అమావాస్య నాడు ఆహారాన్ని దానం చేయడం ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున దానం చేయడం ద్వారా, పేదలు మరియు పేదలకు ఆహారం అందించండి.
మౌనాన్ని పాటించండి
🔸 మౌనంతో ఉంటూ నిత్య కార్యక్రమాలతో పాటు భగవదారాధనలో గడపండి .
పితృదోషాలు పోవాలంటే ఇలా చెయ్యండి
🔸 పితృ దోషం పోవాలంటే చొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య రోజు పూర్వీకులను లేదా పితృదేవతలను స్మరించుకుని సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. రాగిపాత్రలో ఎర్రటి పూలను నీటిలో కలిపి ఈ నీటితో సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి.
🔸 మౌని అమావాస్య రోజు చీమలకు పంచదార వేస్తే గ్రహదోషాలు నశిస్తాయి. చీమలు ఐకమత్యానికి నిదర్శనం. చీమలు కలిసికట్టుగా ఉండడానికి, శ్రమైక జీవనానికి నిదర్శనం. అందుకే వాటికి ఆహారం అందిస్తే మంచిదంటారు.
🔸 మౌని అమావాస్య రోజు నువ్వులు కానీ, నువ్వులతో చేసిన వస్తువులను కానీ దానం చేయడం వల్ల శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుంది. దుప్పటి, ఉసిరి కాయలు, నల్లని వస్త్రాలను దానం ఇస్తే పితృదోషాలు, గ్రహదోషాలు తొలగిపోతాయి.
చొల్లంగి లేదా మౌన అమావాస్య రోజు ఉపవాసం ఉండడం వల్ల పూర్వీకులకు మోక్షం లభిస్తుందని, చేపట్టిన పనులు నిర్విఘ్నంగా నెరవేరుతాయని, అమావాస్య రోజు పూర్వీకులు తమ వంశస్థులను కలిసేందుకు వస్తారని పండితులు చెబుతారు.
ఈ రోజు ఆకలితో మీ ఇంటిముందుకి వచ్చిన వారిని ఖాళీచేతులతో పంపించకండి. ఆహారం పెట్టంది..అవకాశం ఉంటే వస్త్రదానం చేయండి.
మౌని అమావాస్య రోజున సూర్యోదయానికి ముందే గంగా నదిలో స్నానం చేయాలి. పవిత్రమైన నదిలో స్నానం చేయడానికి వీలు కాని వారంతా ప్రవహించే నీటిలో స్నానం చేసేందుకు ప్రయత్నించాలి. ఈ పవిత్రమైన రోజున నిశ్శబ్దంగా ఉండి ధ్యానం, జపం చేయాలి. ఈరోజున ఉపవాసం ఉండే వ్యక్తులు ఎవ్వరితోనూ మాట్లాడకూడదు. మరుసటి రోజు అంటే అమావాస్య తిథి ముగిసిన తర్వాత ఉపవాస దీక్ష విరమించాలి. అనంతరం రాముడు లేదా ఇష్టమైన దేవుడి పేరుతో రోజును ప్రారంభించాలి.
ఈ అమావాస్య రోజంతా మౌనవ్రతాన్ని పాటించడం అసాధ్యం కాబట్టి 24 గంటలు మౌనవ్రతం చేయాల్సిన అవసరం లేదు. ఈ తిథి నాడు బ్రహ్మ ముహూర్త స్నానం చేయాలి. అలానే దానం సమయంలో మౌనంగా ఉండాలని పెద్దలు, పండితులు చెబుతుంటారు.
సమాధానం: 2026 లో, మౌని అమావాస్య జనవరి 18 న జరుపుకుంటారు.
సమాధానం : ఈ సంవత్సరం అంటే 2026 లో మౌని అమావాస్య తిథి ఈ నెల జనవరి 18, తెల్లవారుజామున 12:03 గంటలకు ప్రారంభమై. జనవరి 19 తెల్లవారుజామున 01:21 నిముషాలకు ముగుస్తుంది. పంచాంగం ప్రకారం మౌనీ అమావాస్యను ఈ ఏడాది జనవరి 18, ఆదివారం జరుపుకుంటారు.
సమాధానం: మౌని అమావాస్య నాడు, పేదవారికి ఆహారం, ధాన్యాలు మరియు వస్త్రాలను దానం చేయాలి.
సమాధానం: మౌని అమావాస్యను ఆధ్యాత్మిక శుద్ధి, పూర్వీకులకు నివాళులు అర్పించడం మరియు నిశ్శబ్ద ఉపవాసం పాటించడం కోసం జరుపుకుంటారు.
సమాధానం: మౌని అమావాస్య ప్రధానంగా శివుడు, విష్ణువు మరియు సూర్య భగవానుడికి అంకితం చేయబడింది
సమాధానం : చొల్లంగి అమావాస్య