5వ శక్తిపీఠం జోగులాంబ : వాస్తు దోషాలు, నరఘోష, ఇంట్లో చీడపీడలు తొలగించే దేవి | Alampur jogulamba shaktipeeth full details

Vijaya Lakshmi

Published on Dec 07 2025

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

“లంకాయాం శంకరీదేవీ, కామాక్షీ కాంచికాపురే,

ప్రద్యుమ్నే శృంగళాదేవీ, చాముండీ క్రౌంచపట్టణే, అలంపురే జోగులాంబా..." 

అంటూ ఆది శంకరాచార్యులు చెప్పిన ప్రకారం అష్టాదశ శక్తిపీఠాలలో 5 వ శక్తిపీఠం అలంపురం జోగులాంబ శక్తి పీఠం.

"అలంపురం… ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం సమీపంలోని ఈ ప్రాచీన క్షేత్రం… అది కేవలంఒక దేవాలయం కాదు ఆధ్యాత్మిక ప్రాధ్యాన్యత, చరిత్ర, కలిగిన అద్భుతం. శక్తి పీఠాల జాబితాలో ప్రత్యేక స్థానం కలిగిన జోగులాంబ అమ్మవారి చరిత్ర ఒక్కసారి వినేవారు మరచిపోలేరు.

జోగుల’ అంటే...

జోగుల’ అంటే రాత్రిపూట రక్షించే శక్తిగా చెప్తారు. అమ్మవారు గ్రామాలను చెడు శక్తుల నుంచి కాపాడేందుకు ఈ నేలని ఎంచుకుందని చెబుతారు. అలంపురం జోగులాంబ... ఆ తల్లిని దర్శించుకుంటే వాస్తు దోషాలు, వాటి సంబంధంగా వచ్చే కీడు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఎప్పుడో క్రీస్తు శకం 6వ శతాబ్దంలో చాళుక్యరాజులు నిర్మించైనా ఆలయం. అత్యద్భుతమైన గోపురాలు, , స్తంభాలు వాటిపై ఉన్న శిల్పకళ అప్పటి నిర్మాణశైలి ఇప్పటివారికి చూపించే సజీవ సాక్ష్యంగా ఉన్న ఆలయం. 

ఆ ఆలయంలో అమ్మవారి రూపం చాల చిత్రంగా ఉంటుంది. అమ్మవారి కేశాలు గాలిలో తేలుతున్నట్లు ఉంటాయి, ఆ కేశాలలో బల్లి, తేలు, గబ్బిలం, కపాలం వంటివి కనిపిస్తాయి. ఇంకెక్కడా లేని విచిత్రమైన రూపం. అత్యంత ఉగ్రరూపంలో ఉండడం వలన అమ్మవారిని గతంలో ఓ కిటికీ ద్వారా చూసేవారట. ప్రస్తుతం అమ్మవారు అందరికీ దర్శనీయురాలిగా అందరి ఆరాధనలందుకుంటోంది. అమ్మవారి ఆలయం కింది భాగంలో జలగుండం ఉందని చెప్తారు. ఆలయం కింద జలగుండం ఏంటి? జోగులాంబ అమ్మవారు వాస్తు దోషాలను, గృహదోషాలను పరిహరిస్తుందా?  అష్టాదశ శక్తిపీఠాలలో 5 వ దయిన అలంపురం జోగులాంబ చరిత్ర, ఆలయ విశేషాలు...



5వ శక్తిపీఠం

అలంపూర్, తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల జిల్లా, అలంపూర్ మండలానికి చెందిన ఓ గ్రామం. చారిత్రక ప్రాధాన్యం గలిగిన ప్రదేశం ఆలంపూర్ లో వెలిసింది జోగులాంబ అమ్మవారు. ఈ  ఆలయమే 5 వ శక్తిపీఠం. జోగులాంబ అమ్మవారు వెలసిన ఈ అలంపురాన్ని పూర్వం హలంపురం, హటాంపురం అని పిలిచేవారు. అదే క్రమంగా అలమ్పురంగా రూపాంతరం చెందింది.

youtube play button


యోగంబ

ఇక్కడ సతీదేవి ఖండిత శరీర భాగాలలో  పైదవడ పడిందని చెప్తారు. సాధారణంగా కింద దవడకంటే పైదవడ కాస్త వేడిగా ఉంటుంది గనుక అమ్మవారు ఇక్కడ రౌద్ర స్వరూపిణి. అమ్మవారి ఉగ్రరూపాన్ని శాంతింపజేసేందుకు ఆలయ కిందిభాగంలో జలగుండం ఏర్పాటుచేసారు. ఈ అమ్మవారు యోగులు, ఉపాసకులకు కల్పవల్లి. అందుకే పూర్వంఅమ్మవారిని యోగులంబ, యోగాంబ అని పిలిచేవారని, కాలక్రమంలో ఈ పేరు జోగులాంబ గా స్థిరపడిందని ప్రతీతి. ఇప్పటికి కూడా ఏడాది పొడవునా సుదూర ప్రాంతాల నుంచి సాధకులు, యోగులు ఈ క్షేత్రాన్ని దర్శిస్తూ ఉంటారు.



ఉగ్రస్వరూపం : జలగుండం

ఆలయాల నగరంగా చెప్పే పరమపావనమైన ఆలంపూర్ క్షేత్రంలో జోగులాంబ అమ్మవారు  మహా తేజోవంతమై దర్శనమిస్తారు. ఒకప్పుడు జోగులాంబ అత్యంత ఉగ్ర స్వరూపంతో ఉండేదట. ఆ ఉగ్రత్వాన్నుంచి అమ్మవారిని శాంతపరచడానికి దేవాలయం ఆవరణంలోనే కోనేరు తవ్విమ్చారని ఆ కోనేరు అమ్మవారిని చల్లబరుస్తుందని స్థానికులు చెబుతుంటారు. అమ్మవారి ఉగ్రత్వాన్ని తగ్గించి శాంతరూపిణిగా మార్చేందుకు 9వ శతాబ్దంలో జగద్గురువు శ్రీ శంకరాచార్యులవారు ఇక్కడ శ్రీ చక్రాన్ని ప్రతిష్టించారంటారు.

విచిత్ర రూపం

ఇతర ఏ దేవతలకు లేని విశిష్టత ఈ జోగులాంబ అమ్మవారి రూపానికి ఉంది. అమ్మవారి కేశాలు గాల్లో తేలుతూ ఉంటాయి. అందులో బల్లులు, తేళ్లు, గబ్బిలాలు కనబడతాయి. తల పై కపాలం కూడా ఉంటుంది. అమ్మవారి రూపం అలా ఎందుకుంటుంది అన్న విషయానికి వస్తే దానికి అక్కడి పూజారులు ఒక కథనాన్ని చెప్తారు. ఎవరి ఇంట్లో అయినా జీవ కళ తగ్గితే అమ్మవారి కేశాల్లో బల్లులు సంఖ్య పెరుగుతుందని చెబుతారు. ఆ కళ మరింత క్షీణిస్తే అక్కడికి తేళ్లు చేరుతాయని, ఆ తర్వాతి దశ అక్కడికి గబ్బిలాలు చేరడం. ఆ జీవ కళ మరింత క్షీణిస్తే ఆ ఇంట్లో మరణం సంభవిస్తుందని పురాణాలు చెబుతారు. ఇందుకు ప్రతిరూపంగానే అమ్మవారి తలలో ఉన్న కపాలం ఒక ఉదాహరణ అక్కడి పూజారులు చెప్తారు. అమ్మవారి విశిష్ట రూపం దర్శించుకొంటే వాస్తు సమస్యలు తీరుతాయని బల్లి, తేలు, గబ్బిలాలు వల్ల కలిగే దోషాలకు ఈ ఆలయంలో విరుగుడు లభిస్తుందని కూడా చెబుతారు.



దుష్టశక్తుల నుంచి కాపాడే గృహచండి

జోగులాంబ అమ్మవారిని గృహహచండిగా చెప్తారు. ముఖ్యంగా జోగులాంబ ఆమ్మవారు దుష్టశక్తుల నుంచి, ఇతరుల చెడు దృష్టి నుంచి కాపాడే దేవతగా కోలుచుకుంటారు భక్తులు.

ఏటా మాఘ శుద్ధ పంచమినాడు అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవం జరుపుతారు. ఆరోజు భక్తులకు జోగులాంబ నిజరూప దర్శనం ఉంటుంది. అదేరోజు సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తారు.

వంద సంవత్సరాల నిర్మాణం

ఇక ఆలయనిర్మాణం విషయానికి వస్తే ఆలంపూర్ లో  క్రీస్తు శకం 6వ శతాబ్దంలో చాళుక్యరాజులు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు చెప్తారు.  ఈ ఆలయం భక్తులను కట్టిపడేస్తుంది. అద్భుతమైన గోపురాలు, వాటిపై ఉన్న శిల్పకళ, స్తంభాలత పురాతన నిర్మాణ శైలితో, అప్పటి నిర్మాణశైలికి సజీవ సాక్ష్యంగా కనబడతాయి.  ఈ క్షేత్ర నిర్మాణానికి దాదాపు దాదాపు 100 సంవత్సరాలు పట్టిందని చెప్తారు.

మౌర్యులు, శాతవాహనులు, బాదామీచాళుక్యలు, రాష్ట్ర కూటులు, కల్యాణీ చాళుక్యులు, కాకతీయులు, విజయ నగర రాజులు, సుల్తానులు ఈ ప్రాంతాన్ని పరిపాలించినట్లుగా శాసనాలు చెబుతున్నాయి. పాల్కురికి సోమనాథుని పండితారాధ్య చరిత్రలో ఈ క్షేత్ర ప్రస్తావన కనిపిస్తుంది. చారిత్రక ఆధారాలను బట్టి జోగులాంబ ఆలయాన్ని మొదట క్రీ.శ.ఆరో శతాబ్దంలో బాదామి చాళుక్యుడైన రెండో పులకేశి నిర్మించాడు. 14 వ శతాబ్దంలో బహమనీ సుల్తాన్ ఈ ఆలయంపై దాడి చేసి ధ్వంసం చేశారు. అయితే పూజారులు జోగులాంబ అమ్మవారు, ఆమె శక్తిరూపాలైన చండీ, ముండీ ల విగ్రహాలను బాలబ్రహ్మేశ్వర ఆలయంలో దాచి పెట్టడంతో వాటికి ఎలాంటి నష్టం వాటిల్లలేదు. ఆ విగ్రహాలకు కొన్నాళ్లు అక్కడే పూజలందించారు .అలా దాదాపు 615 సంవత్సరాలు అమ్మవారిని  ఒక చిన్న గుడిలో పెట్టి పూజలు నిర్వహించారు. 2005లో తిరిగి ఆలయాన్ని నిర్మించి అమ్మవారిని పునప్రతిష్టించారు.

నిజరూప దర్శనం

సంవత్సరానికొకసారి అమ్మవారి నిజరూప దర్శనం ఉంటుంది.. అప్పుడు భక్తులు వేల సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటారు. ఇప్పుడు ఆలంపూర్ మొత్తాన్ని పురావస్తు శాఖ వారు తమ పరిధిలోకి తీసుకొని తవ్వకాలు సాగిస్తున్నారు.

ఈ క్షేత్రంలో రోజూవారీ పూజలతో పాటు, అమ్మవారికి ప్రీతికరమైన మంగళ, శుక్రవారాల్లో ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి. కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా ప్రసిద్ధమైన ఇక్కడి అమ్మవారిని దర్శించుకునేందుకు నిత్యం వందల సంఖ్యలో భక్తులు వస్తుంటారు.



కార్తీకమాసం పూజలు, శివరాత్రి పర్వదినాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తారు. కార్తీకమాసంలో జోగుళాంబ అమ్మవారిని విశేష పూజలో పాల్గొనేందుకు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఇక్కడ జరిగే నవ వర్ణార్చన, కన్య పూజల కోసం మహిళలు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటారు. కార్తీక మాసంలో జరిగే ప్రత్యేక ఉత్సవాల కోసం దేవాలయాన్ని కన్నుల పండుగగా విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు. అలాగే శివరాత్రి పర్వదినాన బాలబహ్మేశ్వరుని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. శివరాత్రి పర్వదినం రోజు ఇక్కడ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసేందుకు తెలంగాణ, రాయలసీమకు చెందిన ప్రజలు ఎంతో ఆసక్తి కనబరుస్తారు.

బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం

ఇక్కడి బాలబ్రహ్మేశ్వర లింగాన్ని సాక్షాత్తూ బ్రహ్మ ప్రతిష్టించాడనీ, ఈ ఆలయాన్ని రససిద్ధులు నిర్మించారనే స్థలపురాణం చెబుతోంది. అలంపురంలోనే బ్రహ్మ ప్రతిష్టించిన 9 ఆలయాలున్నాయి. వీటినే నవబ్రహ్మ ఆలయాలంటారు. అవి.. తారక బ్రహ్మ ఆలయం, స్వర్గ బ్రహ్మ ఆలయం, పద్మ బ్రహ్మ ఆలయం, బాల బ్రహ్మ ఆలయం, విశ్వ బ్రహ్మ ఆలయం, గరుడ బ్రహ్మ ఆలయం, కుమార బ్రహ్మ ఆలయం, ఆర్క బ్రహ్మ ఆలయం, వీర బ్రహ్మ ఆలయం. వీటికి 1400 సంవత్సరాల చరిత్ర ఉంది. అయితే ఈ ఆలయాల్లో శివలింగాలే కొలువుతీరి ఉంటాయి. అయితే ఈ శివలింగాలు కొలువుతీరిన ఈ ఆలయాలను బ్రహ్మా ఆలయాలని ఎందుకు పిలుస్తారో తెలిపే ఆధారాలు మాత్రం కనబడవు, కాని బాలబ్రహ్మదేవుడు తపస్సుచేసి లింగాన్ని ప్రతిష్టించినందున బ్రహ్మేశ్వరుడని పేరొచ్చినట్లుగా చెబుతుంటారు. ఈ బాలబ్రహ్మేశ్వర ఆలయంలో మూలవిరాట్‌ అయిన స్వామివారి లింగము రుద్రాక్షలతో రూపొందించిన అద్భుత లింగము. భక్తులు ఎంతనీటితో అభిషేకం చేసినా ఒక్క నీటి బిందువు కూడా బయటికి రాదని చెబుతుంటారు.

ఇక్కడి లింగం పై భాగం ఆవుగిట్ట ముద్ర కనిపిస్తుంది. ఒకప్పుడు ఈ క్షేత్రంలోనే జమదగ్ని మహర్షి ఆశ్రమం ఉండేదని చెబుతారు. ప్రధాన ఆలయ ప్రాంగణంలో శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించిన సూర్యనారాయణ స్వామి ఆలయం, నరసింహ స్వామి ఆలయం ఉంటాయి. ఇక్కడి పాప వినాశని తీర్థంలోని గదాధర విగ్రహ సన్నిధిలో శ్రాద్ధకర్మలు ఆచరిస్తే విశేష ఫలం లభిస్తుందని పెద్దలు చెబుతారు

ఆలంపూర్ జోగుళాంబ దేవాలయం సమీపంలో పురావస్తు ప్రదర్శనశాల ఉంది. దీనిని 1952లోనే ఏర్పాటు చేశారు. ఇందులో క్రీస్తు శకం 6వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 12వ శతాబ్దం మధ్య కాలానికి సంబంధించిన అనేక వస్తువులు ఇక్కడ బద్రపరచబడ్డాయి.

ఆలయ వేళలు

ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ దీనిని సందర్శకుల కోసం తెరిచి ఉంచుతారు.

వసతి

ఇక ఈ క్షేత్రంలో బస విషయానికి వస్తే.. ఆలంపూర్‌ చిన్న ఊరు కాబట్టి వసతి సౌకర్యాలు తక్కువగా ఉంటాయి. ఆలంపూర్‌లో అమ్మవారిని దర్శించుకుని తిరిగి కర్నూలు వెళ్లి అక్కడే బస చేయడం మంచిది.

ఎలా వెళ్ళాలి ...

హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్లే బస్సులు ఆలంపూర్ మీదుగా వెళ్తాయి. రైలు మార్గంలో వెళ్లేవారు కర్నూలు రైల్వే స్టేషన్లో దిగి, అక్కడ నుంచి 25 కిమీలు బస్సులో ప్రయాణిస్తే ఆలంపూర్‌కు చేరుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రముఖ నగరాలతో పాటు కర్నాటక నుంచి కూడా కర్నూలుకు నేరుగా బస్సు సౌకర్యం ఉంది. అదే విధంగా కర్నూలుకు దేశంలోని వివిధ పట్టణాల నుంచి కూడా నేరుగా బస్సు సౌకర్యం ఉంది.


ఇవి కూడా చదవండి

Recent Posts
5వ శక్తిపీఠం జోగులాంబ : వాస్తు దోషాలు, నరఘోష, ఇంట్లో చీడపీడలు తొలగించే దేవి  | Alampur jogulamba shaktipeeth full details
5వ శక్తిపీఠం జోగులాంబ : వాస్తు దోషాలు,...
2026 ఫిబ్రవరిలో శ్రీశైలం మల్లన్న బ్రహ్మోత్సవాలు ఎప్పటినుంచంటే...  | shri sailam bramhmotsavam
2026 ఫిబ్రవరిలో శ్రీశైలం మల్లన్న బ్రహ్మోత్సవాలు ఎప్పటినుంచంటే......
సమంత రెండో వివాహం : లింగభైరవి, భూతశుద్ధి వివాహం...  | Who is goddess lingabhairavi? What is bhootshuddhi marriage?
సమంత రెండో వివాహం : లింగభైరవి, భూతశుద్ధి...
మానూ మాకును కాను – నవల – 25  |  2019 స్వాతి అనిల్ అవార్డ్ నవల | Swathi magazine Award winning novel by MVSS Prasad
మానూ మాకును కాను – నవల –...
మానూ మాకును కాను – నవల – 24  |  2019 స్వాతి అనిల్ అవార్డ్ నవల | Swathi magazine Award winning novel by MVSS Prasad
మానూ మాకును కాను – నవల –...