Vijaya Lakshmi
Published on Dec 06 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?లింగభైరవి, భూతశుద్ధి వివాహం... ఈ రెండు పదాలు ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న మాటలు. ప్రముఖ టాలీవుట్ నటి సమంత రెండో వివాహం తమిళనాడు లోని కోయంబత్తూర్ లోని లింగభైరవి ఆలయంలో భూతశుద్ధి పద్ధతిలో జరిగిందని ఈశా ఫౌండేషన్ ప్రకటించింది. దాంతో ఈ లింగభైరవి, భూతశుద్ధి వివాహం అనేవి బాగా ట్రెండింగ్ లో కొచ్చాయి.
అయితే అసలెవరీ లింగభైరవి? ఏ దేవత? లింగభైరవిని ఎందుకు పూజిస్తారు? లింగభైరవి ఆరాధన ఎక్కడ చేస్తారు? ఎవరు చేస్తారు? ముఖ్యంగా ఈశా ఫౌండేషన్ లో ఉన్న లింగభైరవి ఆలయంలో మనం నమ్మలేని, చాలామంది అంగీకరించని ఒక వివాదాస్పద విషయం ఉంది అదేంటి?
అలాగే అసలు భూతశుద్ధి వివాహం అంటే ఏంటి? ఈ పద్ధతిలో వివాహం చేసుకోవడం వలన ఏం జరుగుతుంది? అసలెందుకు చేసుకోవాలి ఈ భూతశుద్ధి వివాహం? ఇది మన హిందూ సంప్రదాయ వివాహ పద్ధతుల్లో అంతగా కనబడదు. మరి ఇది ఎలా వాడుకలోకి వచ్చింది? ఇంకో వింత విషయమేంటంటే కొత్తగా వివాహం చేసుకున్తున్నవారే కాదు, ఇప్పటికే వివాహం అయినవారు కూడా మళ్ళీ ఇలాంటి వివాహం చేసుకోవచ్చట! ఎందుకలా!? ఇలాంటి ఎన్నో విశేషాలు వివరంగా ఈ బ్లాగ్ లో ...
లింగభైరవి అమ్మవారు. లింగ రూపంలో ఉన్న భైరవి అమ్మవారు. శివుడు లింగరూపంలో కనిపించటం అత్యంత సహజమైన విషయం. మనం శివుడ్ని విగ్రహ రూపంలో కాకుండా లింగ రూపంలోనే చూస్తాం కూడా. కానీ అమ్మవారిని ఎప్పుడైనా లింగరూపంలో చూశారా? లింగ రూపంలో దర్శనమేచ్చే అమ్మవారే లింగభైరవి. అసలు లింగభైరవి ఆలయాల గురించి చాలా అరుదుగా వింటూ ఉంటాం... చూస్తూ ఉంటాం. అందులోనూ కోయంబత్తోర్ లో ఈశా ఫౌండేషన్ లో ఉన్న లింగభైరవి ఆలయం మరింత విశిష్టమైనది. అలాగే ఏవో కొన్ని అరుదైన ఆలయాల్లో తప్ప స్త్రీలు పూజారులుగా ఉండటం వినం చూడం. కాని ఇక్కడ ఈ లింగ భైరవి ఆలయంలో పూజారులు స్త్రీలే.
ఈ ఆలయంలో అమ్మవారు కాళరాత్రి లాంటి నల్లటి ఛాయతో, తీక్షణమైన కళ్ళతో, వెలుగులు చిమ్మే త్రినేత్రంతో, తన వైభవాన్ని చాటే బంగారురంగు చీరతో, పది చేతులు చాచి మనల్ని ఆహ్వానిస్తున్నట్లు ఉంటుంది లింగభైరవి దేవి. మనకి అమ్మవారు లింగరూపంలో కొలువై ఉన్న ఆలయాలు చాలా అరుదుగా తెలుసు. అక్కడక్కడ కొన్ని ఉన్నా అవి పెద్దగా గుర్తింపు లేకుండానే ఉన్నాయి.
అసలేవారీ లింగభైరవి దేవి. శక్తికి స్త్రీ రూపం లింగభైరవి దేవిగా చెబుతారు. సాక్షాత్తూ జగజ్జనని పార్వతీదేవే ఈ లింగభైరవి దేవి. తామసం, రాజసం,సత్వ గుణాల యొక్క అభివ్యక్తి గా, వీటిని వరుసగా దుర్గామాత, లక్ష్మీమాత మరియు సరస్వతిమాతగా సూచిస్తారు. తాంత్రిక యోగ శాస్త్రంలోని అత్యంత శక్తివంతమైన దేవీ స్వరూపాల్లో ఒకటి లింగభైరవి. తాంత్రిక యోగ శాస్త్రంలో అత్యంత శక్తివంతమైన దేవీ స్వరూపాలలో ఒకటైన “భైరవి” ప్రత్యేక రూపం ఇది. లింగాకారంలో ఉండడంతో లింగభైరవి అని పిలుస్తారు. తాంత్రిక యోగ సంప్రదాయంలో శక్తి స్వరూపంగా పరిగణించే భైరవి దేవికి లింగాకారంలో రూపొందించిన ప్రత్యేక రూపమే లింగభైరవి.
లింగభైరవిని ఆధ్యాత్మిక సాధకులు, యోగులు ముఖ్యంగా తాంత్రిక సాధనకు చేసేవారు ఎక్కువగా ఆరాధిస్తారు. భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక జీవితంలో సమతుల్యత కోరుకునే వారు భైరవి పూజ చేస్తారు.
నిత్య జీవితంలో వచ్చే వివిధ సమస్యల పరిష్కారం కోసం అంటే వ్యాపారం, ఆరోగ్యం, సంతానం, వివాహం, మానసిక శాంతి కోసం కూడా లింగభైరవి ఆరాధన చేస్తారు. లింగ భైరవి పూజ వల్ల భౌతిక , ఆధ్యాత్మిక శ్రేయస్సు లభిస్తుంది. ఆరోగ్యం, సంపద వంటి తక్షణ ప్రయోజనాలు ఉంటాయని, భైరవి సాధన భావోద్వేగ బుద్ధిని పెంఛి, జీవితాన్ని సుఖమయం చేస్తుందని, ఆందోళన, అతిగా ఆలోచించడం, ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుందని, అంటే కాకుండా ముఖ్యంగా ఆధ్యాత్మిక వృద్ధి.. దేవి అనుగ్రహం ద్వారా మోక్షం వైపు నడిపిస్తుందని చెబుతారు సాధకులు.
లింగ భైరవి దేవి కోరికలు తీర్చే దేవత అనేకన్నా..సాధులలో స్వయం శక్తిని నింపే దేవత అని, ఆమెను భక్తి, శ్రద్ధతో పూజిస్తే జీవితంలో అద్భుతమైన మార్పులు సంభవిస్తాయని భక్తులు చెబుతుంటారు.
భైరవి అంటే "భయంకరమైనది" అని అర్థం చెబుతారు. పురాణాల ప్రకారం పది మహావిద్యలలో ఒకటి భైరవి. భైరవుని భార్య. దేవి యొక్క 33 శుభ నామాలను మంత్రంగా కలిగి ఉంటుంది లింగ భైరవి స్తుతి. ఈ అమ్మవారి అనుగ్రహం పొందిన భక్తుల మనశ్శరీరాలను, శక్తులను స్థిరపరుస్తూ, జననం నుంచి మరణం వరకు జీవితంలోని ప్రతి దశలోనూ వారికి అండగా నిలుస్తుందని చెబుతారు. నవరాత్రుల సమయంలో లింగభైరవి దేవి దుర్గా, లక్ష్మి, సరస్వతి రూపాల్లో పూజలందుకుంటుంది
ఇక లింగభైరవి ఆలయాలు ధిల్లీ, హైదరాబాద్, లాంటి చాలా ప్రదేశాల్లో ఉన్నా అంతగా ప్రచారంలో లేవనే చెప్పాలి. అలాగే అమెరికా, నేపాల్లో కూడా ఈ ఆలయాలున్నాయని చెబుతారు. అయితే
తమిళనాడులో, కోయంబత్తూరుకు పశ్చిమాన సుమారు 30 కిలోమీటర్లు దూరంలో ఉన్న మా లింగ భైరవి ఆలయం ఇప్పుడు బాగా ప్రచారంలో కొచ్చింది.
ఈశా యోగా కేంద్రంలో ఉన్న ఈ ఆలయంలో లింగ భైరవి దేవిని, సద్గురు జగ్గీ వాసుదేవ్ గారు, 2010 జనవరిలో ప్రతిష్టించారు. దేవీ ప్రతిష్టాపన "ప్రాణ ప్రతిష్ట" ప్రక్రియ ద్వారా జరిగింది.
ఈ ఆలయంలో పురుషులు మరియు మహిళలు అందరూ అమ్మను ఆరాధించవచ్చు. కానీ గర్భగుడిలోకి ప్రవేశించి లింగ భైరవి దేవిని పూజించడానికి కేవలం మహిళలకు మాత్రమే అనుమతి ఉంది. సాధారణంగా ఆలయాలలో పురుషులే పూజారుగా ఉంటారు. కాని ఈశా ఫౌండేషన్ లోని ఈ లింగభైరవి ఆలయంలో మాత్రం స్త్రీలే పూజారులు. స్త్రీ, పురుషుల మధ్య సమానత్వం వైపు పురోగతికి దీనిని ఒక ఉదాహరణగా నిలపాలని, శతాబ్దాలుగా పురుషుల సామ్రాజ్యంగా ఉన్న ఈ రంగంలో మహిళలకు కూడా ఉన్నత స్థాయిని కలిగించాలన్న ఉద్దేశమే దీనికి కారణమని, ఇది దేశంలో మహిళా సాధికారతకు కూడా ఒక ప్రధాన ఉదాహరణగా నిలుస్తుందని అంటారు సద్గురు.
రుతుస్రావ సమయంలో ఈ ఆలయంలోకి ప్రవేశం నిషిద్ధం. అసలు ఆ ఆలోచనే అపచారంగా భావిస్తారు. ఋతుస్రావ సమయంలో స్త్రీలు పవిత్ర గ్రంథాలను తాకడంగానీ పూజలు, ప్రార్థనలు చేయడంగానీ చెయ్యరు. కానీ ఈ ఈషా ఫౌండేషన్ లోని లింగభైరవి ఆలయంలో మాత్రం ఋతుస్రావంలో కూడా పూజలు, ఆరాధనలు చేయవచ్చు. ఇదొక అరుదైన అంశం.
ఆలయంలోని మహిళా పూజారులను 'భైరాగిని మా' అని పిలుస్తారు, వారు ఆలయంలో ప్రార్థనలు నిర్వహించడమే కాకుండా ఆలయ నిర్వహణ బాధ్యతలు కూడా చూస్తారు.
ఈ ఆలయంలో దాదాపు 10 మంది మహిళా పూజారులు ఉన్నారు, వీరిలో కొందరు యునైటెడ్ స్టేట్స్, లెబనాన్ మరియు పాలస్తీనా వంటి విభిన్న దేశాలకు చెందినవారు కూడా ఉన్నారని చెబుతారు.
ఇషా ఫౌండేషన్ లో ప్రతిష్ఠించిన ఈ లింగభైరవి అమ్మవారిని సందర్శించేందుకు ప్రపంచవ్యాప్తంగా భక్తులు తరలివస్తారు
దేవాలయంలో రోజూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం హారతులు జరుగుతాయి. అభిషేకం, దేవీ స్తోత్రం, లింగ భైరవి అర్ఘ్యం జరుగుతాయి. ప్రతి అమావాస్య, పౌర్ణమి, మంగళవారం, శుక్రవారం రోజుల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. ఇక్కడ అంటే ఈశా ఫౌండేషన్ లో ఇచ్చే సూచనల ప్రకారం ఇంట్లోనే లింగభైరవిని పూజించేవారూ ఉన్నారని చెబుతారు.. ఇంట్లో “లింగ భైరవి యంత్రం” లేదా చిన్న లింగ భైరవి రూపం తీసుకుని ప్రతిష్ఠ చేస్తారు. ప్రతి రోజూ సాయంత్రం సమయంలో దీపం వెలిగించి, నీళ్లలో పసుపు, కుంకుమ, పూలు వేసి అర్ఘ్యం సమర్పింఛి, ఇషా ఇచ్చే ప్రత్యేక భైరవి అర్ఘ్య మంత్రం పఠింఛి వారు సూచించిన ప్రకారం ఆరాధన చేస్తారు.
ఇక భూతశుద్ది వివాహం... హిందూ ధర్మం, యోగ శాస్త్రం ప్రకారం..మానవ శరీరం భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం పంచభూతాలతో నిర్మితమైంది. ఈ ఐదింటిని శుద్ధి చేసి, శరీరాన్ని, మనసును సమతుల్యం చేసుకోవడాన్నే భూత శుద్ధి అంటారు.
హిందూ సంప్రదాయంలో పెళ్లికి ముహూర్తం తప్పనిసరిగా చూస్తారు. వధూవరుల జాతకాల ఆధారంగా పెళ్లికి సుముహూర్తం నిర్ణయిస్తారు. కానీ, ఈ భూతశుద్ధి వివాహానికి ముహూర్తంతో సంబంధం ఉండదు. ఎప్పుడైనా ఈ పెళ్లి చేసుకోవచ్చు.
ఫౌండేషన్ వారు చెబుతున్న దాని ప్రకారం, పెళ్లి కాని వారితో పాటు, ఇప్పటికే పెళ్లయిన జంటలు కూడా భూతశుద్ధి వివాహం చేసుకోవచ్చు. యోగా వ్యవస్థలో ఈ వివాహ మూలాలున్నాయని చెబుతున్నారు. అయితే స్త్రీ గర్భవతి అయితే మాత్రం ఈ క్రతువు చేయకూడదని చెబుతున్నారు.ఈ వివాహంలో అన్ని క్రతువులను కేవలం మహిళా పూజారే నిర్వహిస్తారు. భూతశుద్ధి వివాహంలో 'సుమంగళ'గా పిలిచే ప్రత్యేకంగా శిక్షణ పొందిన వలంటీర్లు వివాహం జరిపిస్తారు.
‘భూత శుద్ధి వివాహం’ అనేది వేల సంవత్సరాలుగా యోగ సంప్రదాయంలో కొనసాగుతున్న పవిత్రమైన వివాహ పద్ధతి అని పెద్దలు చెబుతున్నారు. పేరుకు తగినట్లుగానే ఇది మనుషుల దేహాల్లోని పంచభూతాలను శుద్ధి చేయడం. వాటిని సమతుల్యంలో ఉంచడం, దంపతుల మధ్య ఆలోచనలు, భావోద్వేగాలు, భౌతికతకు అతీతంగా లోతైన బంధాన్ని ఏర్పరిచే ఆధ్యాత్మిక ప్రక్రియగా చెబుతున్నారు.ఈ భూతశుద్ధి వివాహంలో ఇద్దరు వ్యక్తులు కేవలం శారీరకంగా లేదా మానసికంగా దగ్గరవ్వడం మాత్రమే కాకుండా వారిలోని ప్రాణశక్తి ఒకదానితో ఒకటి పెనవేసుకుంటుంది. వధూవరుల శరీరాల్లోని పంచభూతాలను ఒకే లయలో స్పందించేలా చేయడం ద్వారా, వారిద్దరి మధ్య విడదీయలేని ఒక శక్తివంతమైన బంధం ఏర్పడుతుంది. ఇది వారిని భార్యాభర్తలుగా మాత్రమే కాకుండా, ముక్తి మార్గంలో ప్రయాణించే సహ యాత్రికులుగా మారుస్తుందని చెబుతారు. సాధారణంగా లింగభైరవి ఆలయాల్లో లేదా కొన్ని ప్రత్యేకమైన స్థలాల్లో మాత్రమె ఇలాంటి వివాహాలు జరుగుతాయని పెద్దలు చెబుతున్నారు.
ఈ వివాహ పద్ధతిలో దంపతుల మధ్య అవగాహన మాటలకు అందనంత లోతుగా ఉంటుందని, వారి ఆలోచనలు, భావోద్వేగాలు ఒకే దిశలో ప్రయాణిస్తాయని, ఇద్దరూ కలిసి తమలోని చైతన్యాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లడానికి ఇది ఒక మెట్టులా పనిచేస్తుందని చెబుతారు. సంసార సాగరంలో కొట్టుకుపోకుండా, ఆనందంగా జీవిస్తూనే మోక్షం వైపు అడుగులు వేయడానికి ఈ బంధం సహకరిస్తుంది. -ఇద్దరు వ్యక్తులు తమ గత కర్మలను ప్రక్షాళన చేసుకుని, కొత్త జీవితాన్ని స్వచ్ఛంగా ప్రారంభించడానికి ఈ ప్రక్రియ దోహదపడుతుందని, ఇది కేవలం వివాహం కాదు.. రెండు ప్రాణాల పవిత్ర యజ్ఞం అని పండితులు చెబుతున్నారు.
లింగ భైరవి ఆలయాల్లో, ఈశా ఫౌండేషన్ ఎంపిక చేసిన పవిత్ర ప్రదేశాల్లో మాత్రమే ఈ విధానంలో పెళ్లిళ్లు నిర్వహిస్తారని కూడా చెబుతున్నారు. ఈ పద్ధతిలో వివాహం జరుగడం వల్ల దాంపత్య జీవితం సామరస్యంగా, శాంతియుతంగా ఉండడంతో పాటు దంపతుల జీవితంలో ఆధ్యాత్మికత వికసించేందుకు, కూడా దోహదపడుతుందని చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి