విశాఖపట్నం సింహాచలం క్షేత్రంలో చందనోత్సవానికి లక్షలాది మంది భక్తులు ఎందుకు వస్తారు? | Interesting facts about simhachalam chandanotsavam

Vijaya Lakshmi

Published on Apr 13 2026

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

విశాఖపట్నం సింహాచలం క్షేత్రంలో చందనోత్సవానికి లక్షలాది మంది భక్తులు ఎందుకు వస్తారు?

సంవత్సరంలో 364 రోజులు చందనం పూతలో ఉండి, కేవలం ఒక్క రోజు మాత్రమే తన అసలు రూపాన్ని చూపించే సింహాద్రి అప్పన్న గురించి మీకు తెలుసా? ఆ నిజరూపం వెనుక ఉన్న వేల సంవత్సరాలనాటి రహస్యం ఏంటి? లక్షలాది మంది భక్తులు వైశాఖమాసంలో కేవలం ఆ 12 గంటల దర్శనం కోసం ఎందుకు తపించిపోతారు, ఆ అద్భుతమైన చందనోత్సవం వెనుక ఉన్న కథేంటో ఈ బ్లాగ్ లో చూద్దాం.

మన దేశంలో ఎన్నో అద్భుతమైన ఆలయాలున్నాయి, వాటి వెనుక మరెన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. కానీ, ఓ దేవుడు తన నిజ స్వరూపాన్ని ఏడాది పొడవునా ఎందుకు దాచుకుంటాడు? తన భక్తులకు కేవలం కొన్ని గంటలు మాత్రమే ఎందుకు దర్శనమిస్తాడు? అసలు ఆ రూపంలో ఉన్న శక్తి ఏంటి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఒక్కచోట దొరుకుతుంది. అదే, విశాఖపట్నంలోని సింహగిరి కొండపై కొలువైన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం. ఉత్తరాంధ్రులకు అత్యంత ప్రీతి పాత్రమైన, సింహాద్రప్పన్న అంటూ ఎంతో ప్రేమగా పిలుచుకునే శ్రీ వరాహలక్ష్మీనరసింహస్వామి.

చందనోత్సవం

ప్రతి ఏటా అక్షయ తృతీయ రోజున జరిగే చందనోత్సవం కేవలం పండుగ కాదు, అదొక అద్భుతం. స్వామి వారిపై ఉన్న చందనాన్ని తొలగించి, వారాహ లక్ష్మీ నరసింహుని అసలు స్వరూపాన్ని, అంటే 'నిజరూప దర్శనాన్ని' భక్తులకు కలిగించే అపురూప క్షణలు అవి. ఈ ఒక్క దర్శనం కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచే కాక, పక్క రాష్ట్రాల నుంచి కూడా లక్షల మంది తరలివస్తారు. మండుటెండలో భగభగలాడే భానుడి ప్రతాపాన్ని కూడా ఓర్చుకుంటూ ఓపికగా స్వామి దర్శనం కోసం నిరీక్షించే క్షణాలు. ఇంత కష్టపడుతూ కూడా ఇంత మందిని ఇక్కడికి తీసుకొస్తున్న ఆకర్షణ ఏంటి? ఆ ఒక్కరోజు కొన్ని గంటల దర్శనంలో అంత స్పెషల్ ఏముంది? పదండి, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.

స్థల పురాణం

ఈ ఆలయం కథ కృతయుగం నాటిది. మనందరికీ తెలిసిన ప్రహ్లాదుడి కథతోనే ఇది ముడిపడి ఉంది. రాక్షస రాజు హిరణ్యకశిపుడు తన కొడుకైన ప్రహ్లాదుడిని విష్ణు భక్తి నుంచి దూరం చేయాలని చూడగా, శ్రీ మహావిష్ణువు నరసింహావతారంలో స్తంభం నుంచి ఉద్భవించి, హిరణ్యకశిపుడిని సంహరించి ప్రహ్లాదుడిని కాపాడాడు.

స్థలపురాణం ప్రకారం, ఆ తర్వాత ప్రహ్లాదుడే ఇక్కడ నరసింహ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించి మొదటి ఆలయాన్ని కట్టించాడు. కానీ, కాలక్రమంలో ఆ ఆలయం శిథిలమై, స్వామి విగ్రహం ఓ పుట్టలో కూరుకుపోయింది.

యుగాల చరిత్ర

యుగాలు గడిచాక, చంద్రవంశానికి చెందిన పురూరవుడు అనే రాజు, తన భార్య ఊర్వశితో కలిసి విమానంలో వెళ్తుండగా, సింహగిరి కొండపై ఉన్న స్వామి శక్తికి ఆకర్షితుడై కిందకు దిగాడు. పుట్టలో ఉన్న స్వామి విగ్రహాన్ని గురించి తెలుసుకొని పుట్టను తొలగించగా, "రాజా! ఈ విగ్రహాన్ని చందనంతో కప్పి ఉంచు. కేవలం వైశాఖ శుద్ధ తదియ (అక్షయ తృతీయ) నాడు మాత్రమే చందనం తొలగించి నిజరూప దర్శనం కల్పించు" అని ఆకాశవాణి వినిపించిందని పురాణ కథనం. ఆ ఆదేశం ప్రకారమే పురూరవుడు ఆలయాన్ని మళ్ళీ కట్టించి, చందన లేపన సంప్రదాయాన్ని మొదలుపెట్టాడని చరిత్ర చెబుతోంది. నాటి నుంచి నేటి వరకు అదే సంప్రదాయం కొనసాగుతోంది.

సింహాద్రప్పన్న ను చందనంతో ఎందుకు కప్పాలి?

ఇక ఇప్పుడు అసలు ప్రశ్నకు వద్దాం. అసలు స్వామి వారిని చందనంతో ఎందుకు కప్పాలి? పురాణాల ప్రకారం, దీనికి కారణం స్వామి వారి స్వరూపంలోనే ఉంది. సింహాచలంలో ఉన్నది కేవలం నరసింహుడు కాదు. ఇక్కడి స్వామి  శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి. హిరణ్యాక్షుడిని వధించిన ఉగ్ర వరాహావతారం, హిరణ్యకశిపుడిని సంహరించిన ప్రచండ నరసింహావతారం... రెండూ ఉగ్ర అవతారాలే. ఈ రెండు శక్తివంతమైన ఉగ్ర అవతారాల ఏకీకృత రూపం ఇది.

రెండు ఉగ్ర రూపాల కలయిక

ఈ రెండు ఉగ్ర రూపాల కలయిక వల్ల స్వామి వారి విగ్రహం నుంచి ఎప్పుడూ అత్యధిక ఉష్ణం వెలువడుతుందని నమ్మకం. ఆ వేడిని, ఆ ఉగ్రతను శాంతపరచడానికే, చల్లదనాన్నిచ్చే చందనాన్ని ఒక కవచంలా పూస్తారు. ఈ చందన లేపనం స్వామి వారి ఉగ్రతను తగ్గించి, భక్తులు దర్శించుకోవడానికి వీలుగా శాంత స్వరూపమైన లింగాకారంలోకి మారుస్తుంది. అందుకే, 364 రోజులు స్వామి వారు మనకు చందనం కప్పిన లింగాకార రూపంలో కనిపిస్తారు.

చందనతీత కార్యక్రమం

స్వామి వారికి పూత పూసే ఈ చందనం తయారీ ప్రక్రియ కూడా ఒక పెద్ద యజ్ఞంలా చేస్తారు. అక్షయ తృతీయకు కొన్ని రోజుల ముందే ఈ ప్రక్రియ మొదలవుతుంది. మేలురకం గంధపు చెక్కలను సుగంధ ద్రవ్యాలు, వనమూలికలతో కలిపి అత్యంత పవిత్రంగా, మంత్రాల మధ్య అరగదీసి సిద్ధం చేస్తారు. ఏడాదిలో నాలుగు సార్లు—అక్షయ తృతీయ తర్వాత మొదటి విడత, ఆ తర్వాత వైశాఖ, జ్యేష్ఠ, ఆషాడ పౌర్ణమిలకు—చందనాన్ని స్వామివారికి సమర్పిస్తారు. ఇలా ఏడాది మొత్తం స్వామి వారిపై కిలోల కొద్దీ  చందనం ఉంటుంది.

భక్తజనసంద్రంగా సింహాచలం కొండ

అక్షయ తృతీయ రోజున సింహాచలం కొండ భక్తజన సంద్రంగా మారిపోతుంది. గోవింద నామ స్మరణతో మారుమోగిపోతుంది. ముందు రోజు అర్ధరాత్రి నుంచే కార్యక్రమాలు మొదలవుతాయి. అర్చకులు స్వామి వారిపై ఉన్న పాత చందనాన్ని నెమ్మదిగా తొలగిస్తారు. దీనిని 'చందన ఉత్తరణం' అంటారు.

చందనం తీసేశాక, సింహగిరిపై ఉన్న గంగధార నుంచి తెచ్చిన పవిత్ర జలంతో స్వామికి 'సహస్ర ఘటాభిషేకం' చేస్తారు. ఆ తర్వాత, తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు, సుమారు 12 గంటల పాటు భక్తులకు నిజరూప దర్శన భాగ్యం కలుగుతుంది.

నరసింహుని నిజరూప దర్శనం

ఆ స్వామి నిజరూపం చూడటానికి రెండు కళ్ళూ చాలవు. శరీరం మూడు వంపులతో ఉండే త్రిభంగ ముద్రలో, వరాహం ముఖం, మనిషి శరీరం, సింహం తోకతో స్వామి వారు దర్శనమిస్తారు. ఈ అపురూప దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు గంటల తరబడి ఎదురుచూస్తారు. ఆ శక్తి స్వరూపాన్ని నేరుగా చూస్తే సకల పాపాలు పోతాయని, దుష్టశక్తుల నుంచి రక్షణ లభిస్తుందని, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం సిద్ధిస్తాయని వారి ప్రగాఢ విశ్వాసం.

తొలి దర్శనం పూసపాటి గజపతి వంశీయులకే

ఆలయ అనువంశిక ధర్మకర్తలైన పూసపాటి గజపతి వంశీయులు తొలి దర్శనం చేసుకున్నాక భక్తులను అనుమతిస్తారు. ఆ పన్నెండు గంటలూ ఆలయ ప్రాంగణం "గోవిందా, గోవిందా" అంటూ గోవింద నామస్మరణతో మార్మోగిపోతుంది.

యుగయుగాల చరిత్ర

పురాణమే కాదు, ఈ ఆలయానికి గొప్ప చరిత్ర కూడా ఉంది. దాదాపు వెయ్యేళ్ళ చారిత్రక ప్రాధాన్యత దీని సొంతం. ఇక్కడ దొరికిన 500కు పైగా శిలాశాసనాలే దీనికి సాక్ష్యం. క్రీ.శ. 1087 నాటి చోళ రాజు కులోత్తుంగుడి శాసనం ఇక్కడ లభించిన వాటిలో చాలా పురాతనమైనది. ఆ తర్వాత తూర్పు గంగ వంశ రాజులు, ముఖ్యంగా కోణార్క్ ఆలయ నిర్మాత నరసింహదేవుడు, ఈ ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దినట్టు చెబుతారు.

రెడ్డి రాజులు, గజపతులు కూడా ఆలయాన్ని ఎంతగానో ఆదరించారు. ఇక విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు తన కళింగ యాత్రల సమయంలో రెండు సార్లు ఈ ఆలయాన్ని సందర్శించి, స్వామి వారికి విలువైన కానుకలు సమర్పించినట్లు శాసనాలు చెబుతున్నాయి. ఆ సందర్భంలోనే శ్రీకృష్ణదేవరాయలు విజయస్తంభాన్ని స్థాపించాడని చరిత్ర కథనాలు చెబుతున్నాయి. ఇలా ఎందరో రాజుల ఆదరణ పొంది, కళింగ మరియు ద్రావిడ వాస్తు శైలుల కలయికతో ఈ ఆలయం ఒక అద్భుత శిల్పకళాఖండంగా నిలిచింది.

చూశారుకదా, సింహాచలం చందనోత్సవం వెనుక ఉన్న పురాణం, చరిత్ర, మరియు ఆధ్యాత్మిక రహస్యం ఇదే. ప్రహ్లాదుడి భక్తికి ప్రతిరూపంగా, స్వామి వారి ఉగ్రతను చల్లార్చే చందన కవచంతో, లక్షలాది మందికి దర్శనమిచ్చే ఆ వరాహ లక్ష్మీ నరసింహుడి కథ ఇది. ఆ ఒక్కరోజు నిజరూప దర్శనం కేవలం ఒక వేడుక కాదు, జీవితంలో ఒక్కసారైనా పొందాల్సిన అద్భుతమైన అనుభూతి. ఆ నమ్మకమే లక్షల మందిని సింహగిరికి నడిపిస్తుంది.


Recent Posts
ఆంధ్రప్రదేశ్‌లోని శక్తిపీఠాలు పూర్తి చరిత్ర  | Complete History & Divine Miracles, how to reach, AP shaktipeethas
ఆంధ్రప్రదేశ్‌లోని శక్తిపీఠాలు పూర్తి చరిత్ర |...
పంచ మాధవ క్షేత్రాల రహస్యం  |  విష్ణువు కొలువైన 5 మహాక్షేత్రాలు  | Hidden Secrets of Pancha Madhava Temples  |  how to reach panchamadhava 5 Vishnu temples
పంచ మాధవ క్షేత్రాల రహస్యం |...
అర్థరాత్రి కోణార్క్ ఆలయంలో ఏం జరుగుతోంది  |  బ్రిటిష్ వారు ఇందులో ఏం దాచారు  | orissa Konark temple dark secrets, history & mystery
అర్థరాత్రి కోణార్క్ ఆలయంలో ఏం జరుగుతోంది ...
అన్వేషణ తెలుగు నవల 20వ భాగం  |  ఇందూరమణ  | Anveshana part 20 |   investigative & most suspense thriller novel
అన్వేషణ తెలుగు నవల 20వ భాగం ...
అన్వేషణ తెలుగు నవల 19వ భాగం  |  ఇందూరమణ  | Anveshana part 19 |   investigative & most suspense thriller novel
అన్వేషణ తెలుగు నవల 19వ భాగం ...