దేవుడే దాసిగా మారిన అద్భుతం | సతీ సక్కుబాయి చరిత్ర | pandaripur panduranga miracle stories

Vijaya Lakshmi

Published on Apr 11 2026

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

భక్తికి కులం లేదు, ప్రాంతం లేదు పేద గొప్ప బేధం లేదు. కేవలం స్వచ్ఛమైన మనసు ఉంటే చాలు, సాక్ష్టాత్తూ ఆ పాండురంగడే, ఆ విఠలుడే మనలని వెతుక్కుంటూ  దగ్గరకు దిగి వస్తాడని నిరూపించిన మహనీయులు ఎందరో. అందులో అగ్రగణ్యురాలు సతీ సక్కుబాయి. అత్తగారి వేధింపులు, కఠినమైన పరీక్షలు ఎదురైనా.. తన నోట విఠల నామ స్మరణను వదలని ఆ సక్కుబాయి కోసం, సాక్షాత్తూ ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే పనిమనిషిగా మారి ఇల్లాలు బాధ్యతలు మోశారు అంటే నమ్ముతారా? ఒక భక్తురాలి మీద కరుణతో, ఆ పండరీపుర పాండురంగడే ఆమె రూపంలో ఆమె ఇంట దాసిగా మారడం సాధ్యమేనా? నిరంకుశులైన  అత్తమామల క్రూరత్వం నుండి తన భక్తురాలిని కాపాడటానికి, స్వయంగా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే ఆమె రూపంలో వచ్చి, ఇంట్లో పనులన్నీ చేశాడంటే నమ్మగలమా? ఇది కట్టుకథ కాదు, కలియుగంలో జరిగిన ఒక అద్భుతం. అచంచలమైన భక్తికి, ఆ భగవంతుని అనంతమైన కరుణకు నిలువుటద్దంలా నిలిచిన ఒక మహాభక్తురాలు సతీ సక్కుబాయి నిజ జీవిత గాథ ఇది. ఆమె భక్తికి ఆ పాండురంగడే దాసుడైపోయాడు. అసలు సక్కుబాయి ఎవరు? ఆమె భక్తి ముందు ఆ విఠలుడు ఎలా దాసోహమయ్యాడు? హృదయాలను కదిలించే ఆ మహనీయురాలు సతీ సక్కుబాయి చరిత్రను ఒక్కసారి మననం చేసుకుందాం.

పాండురంగడి ప్రియ భక్తురాలు

సుమారు 15వ శతాబ్దంలో, మహారాష్ట్రలోని కృష్ణా నదీ తీరాన ఉన్న కరవీర పురంలో ప్రస్తుతం దీనినే  కొల్హాపూర్ అంటున్నాం. ఈ కరవీరపురం అనే గ్రామంలో ఒక సామాన్య బ్రాహ్మణ కుటుంబంలో సక్కుబాయి జన్మించింది. తల్లిదండ్రులు పేదవారే అయినా, గొప్ప హరి భక్తులు. ఆ భక్తి సక్కుబాయికి వారసత్వంగా వచ్చింది. చిన్నతనం నుండే ఆమె మనసు పండరీపురంలోని పాండురంగ విఠలుడిపై అతుక్కుపోయింది. ఆమెకు ఆటపాటలన్నీ ఆ పాండురంగడి నామస్మరణే. పసి ప్రాయంలో తోటి పిల్లలతో ఆడుకుంటున్నా, అమ్మకు పనిలో సాయం చేస్తున్నా, ఆమె పెదవులు ఎప్పుడూ "విఠలా, పాండురంగా, కృష్ణా" అని జపిస్తూనే ఉండేవి.

యుక్తవయసు వచ్చాక, ఆమెకు వివాహం జరిపించారు. అత్తవారింటికి వెళ్ళినా, ఆమె భక్తి ఏమాత్రం తగ్గలేదు, పైగా రెట్టింపయింది. ఇంటి పనులను ఒక సేవలా భావించి, ఎంతో శ్రద్ధగా చేసేది. కానీ ఆమె మనసు మాత్రం ఎప్పుడూ పండరినాథుడి పాదాల దగ్గరే ఉండేది. ఆమె భక్తి ప్రభావం ఎంతని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు. ఆమె పిడకలు చేస్తుంటే, ఆ పిడకలను చెవి దగ్గర పెట్టుకుంటే "రంగా, పాండురంగా" అనే నామం వినిపించేదంటే, ఆమె భక్తి ఏ స్థాయిలో ఉందో మనం ఊహించుకోవచ్చు. ఆమెకు నడకలో, పనిలో, మాటలో... ఇలా అన్నింటా ఆ కృష్ణుడే కనిపించేవాడు. ఆమె జీవితం ఒక నిరంతర నామ సంకీర్తనలా మారిపోయింది.

పాండురంగ విఠల నామం వదలని సక్కుబాయి

సక్కుబాయి భక్తి ఎంత స్వచ్ఛమో, ఆమె అత్తగారి మనసు అంత కఠినం. సక్కుబాయి భక్తిని చూసి సంతోషించాల్సింది పోయి, దాన్ని ఒక పిచ్చిగా, పని ఎగ్గొట్టడానికి ఒక సాకుగా చూడసాగింది ఆమె అత్తగారు. భర్త కూడా తల్లి మాటకు ఎదురు చెప్పలేనివాడు కావడంతో, సక్కుబాయికి కష్టాలు మొదలయ్యాయి.

"పొద్దస్తమానం ఆ దేవుడి జపమేనా? ఇంటి పనులు ఎవరు చేస్తారు?" అంటూ అత్తగారు ప్రతిరోజూ వేధించేది. ఆమె చేసే ప్రతి పనిలో వంకలు పెట్టేది. మాటలతో మొదలైన హింస, కొన్నాళ్లకు శారీరక హింసగా మారింది. చిన్న తప్పులకు కూడా చితకబాదేది. సరిగ్గా తిండి కూడా పెట్టేది కాదు. మిగిలిపోయిన చద్ది అన్నమే ఆమెకు దిక్కయ్యింది. అయినా సక్కుబాయి ముఖంలో చిరునవ్వు చెరగలేదు. ఆ కష్టాలను కూడా పాండురంగడి పరీక్షగా స్వీకరించి, మరింత భక్తితో ఆయన్ని తలుచుకునేది. "స్వామీ, నాకు ఐశ్వర్యం ఇచ్చి ఉంటే నిన్ను మరిచిపోయేదాన్నేమో. ఈ కష్టాల రూపంలో నన్ను ఎప్పుడూ నీ స్మరణలో ఉంచుతున్నందుకు నీకు ధన్యవాదాలు" అని అనుకునేంతటి స్థితప్రజ్ఞత సక్కుబాయిది. నిజమే  కష్టాల్లో కూడా దేవుడికి కృతజ్ఞతలు చెప్పడం ఎంత గొప్ప మానసిక పరిపక్వత!

రోజులు గడుస్తున్నా అత్తగారి క్రూరత్వం తగ్గలేదు. రోజంతా ఆమెతో గొడ్డు చాకిరీ చేయించేది. నీళ్లు తోడటం, ధాన్యాలు దంచడం, వంట చేయడం.. ఇలా క్షణం తీరిక లేకుండా పని చేయించి  వేధించేది. అయినా సరే, సక్కుబాయి తన పనిని చేస్తూనే మనసులో విఠల నామాన్ని స్మరిస్తూ ఉండేది.

పండరీపురం చేరుకున్న సతీ సక్కుబాయి

ఒకరోజు పండరీపురం వెళ్లే యాత్రికుల బృందం, "పాండురంగా, విఠలా" అని భజనలు చేస్తూ సక్కుబాయి ఇంటి ముందు నుండి వెళుతోంది. ఆ నామస్మరణ వినగానే సక్కుబాయి ఒళ్లు పులకించిపోయింది. ఆమె మనసు పండరీపురం వైపు పరుగులు తీసింది. ఆ యాత్రికులతో కలిసి ఒక్కసారైనా తన ప్రాణనాథుడైన పాండురంగడిని చూడాలని తపించిపోయింది.

ఈ విషయం తెలుసుకున్న అత్త, భర్త కోపంతో ఊగిపోయారు. "ఇల్లు వదిలి పారిపోతావా?" అంటూ ఆమె జుట్టు పట్టుకుని లాక్కొచ్చి, ఇంట్లోని ఒక స్తంభానికి తాళ్లతో కట్టేశారు. వాళ్లు ఆమె శరీరాన్ని బంధించగలిగారు కానీ, ఆమె మనసును కాదు. ఆ కట్లతో, ఆకలిదప్పులతో అలమటిస్తూ కూడా, ఆమె మనసు పూర్తిగా పండరినాథుని సన్నిధిలోనే ఉంది. "రంగా... పాండురంగా... నాకీ బంధనాలేంటి స్వామీ? నిన్ను చూడాలన్న నా ఆరాటం నీకు తెలియదా? ఈ జన్మకు నీ దర్శనం నాకు లేదా?" అని కన్నీళ్లతో వేడుకుంది. భక్తురాలి గుండెల్ని పిండేస్తున్న ఆ పిలుపు,  కరుణామయుడైన విఠలుడ్ని  కదిలించకుండా ఉంటుందా?

మారువేషంలో వచ్చిన పాండురంగస్వామి

భక్రాతులి ఆర్తనాదం ఆ గోపాలుడి చెవిన పడింది. ఆమె పడుతున్న బాధను చూడలేక, ఆయన మనసు కరిగిపోయింది. వెంటనే, ఆ పండరినాథుడు విఠలుడు ఒక సాధారణ స్త్రీ రూపంలో సక్కుబాయి దగ్గరకు వచ్చాడు. సక్కుబాయి ఎందుకు విలపిస్తావు ఆ పండరినాథుడు విఠలుడిని దర్శన్చాలనే కదా నీ కోరిక.  'నువ్వు పండరీపురానికి వెళ్లి స్వామిని దర్శించుకో, నీ బదులు నేను ఇక్కడ పనులు చేస్తాను' అని చెప్పి ఆమె కట్లు విప్పి, సక్కుబాయిని పండరీపురానికి పంపాడు. మారు రూపంలో ఉన్న స్వామికి నమస్కరించి, ఆనందభాష్పాలతో యాత్రికులతో కలిసి పండరీపురానికి బయలుదేరింది సక్కుబాయి. ఇక్కడ ఇంట్లో, సక్కుబాయి రూపంలో ఉన్న శ్రీకృష్ణుడు, తానే సక్కుబాయి అన్నట్టుగా ఆ స్తంభానికి కట్టుబడి ఉండిపోయాడు.

ఇంటి పనుల్లో సక్కుబాయిగా మారిన పాండురంగడు

కొంతసేపటికి సక్కుబాయి భర్త జాలిపడి కట్లు విప్పాడు. అప్పటి నుండి, సక్కుబాయి రూపంలో ఉన్న ఆ జగన్నాటక సూత్రధారి పాండురంగ విఠలుడు  ఇంటి పనులన్నీ చేయడం మొదలుపెట్టాడు. ఇంట్లో ఉన్నది సాక్షాత్తూ ఆ శ్రీక్రిష్ణుడైన పండరినాథుడే అని  తెలియని అత్తగారు, సక్కుబాయి రూపంలో ఉన్న ఆ కన్నయ్యను మరిన్ని కష్టాలకు గురిచేసింది. ఆ పరమాత్ముడు చిరునవ్వుతో సక్కుబాయి  చేసే ప్రతి పనీ చేశాడు. నీళ్లు మోశాడు, గిన్నెలు కడిగాడు, ఇల్లు శుభ్రం చేయడం, వంట చేయడం, పిండి దంచడం వంటి కఠినమైన పనులను కూడా చిరునవ్వుతో చేశాడు.  అత్తగారి తిట్లు కూడా భరించాడు. భక్తుడి కోసం భగవంతుడు ఎంతటి పనైనా చేయడానికి సిద్ధపడతాడని ఈ ఘట్టం నిరూపిస్తుంది."

 అత్త ఎన్ని మాటలన్నా,సక్కుబాయి  రూపంలో ఉన్న విఠలుడు ప్రేమతో సేవ చేస్తూనే ఉన్నాడు. ఆ ప్రేమకు, పనిలో ఆమెకున్న నేర్పుకు అత్తమామలు ఆశ్చర్యపోయారు. క్రమంగా వారిలో కూడా మార్పు మొదలై, ఆ ఇంటి వాతావరణమే ప్రశాంతంగా మారింది. అవును మరి అక్కడ ఉన్నది సామాన్యమైన కోడలు కాదు కదా  సాక్షాత్తూ ఆ జగన్నాటక సూత్రధారి జగన్నాధుడే కదా! మరి మార్పు రాకుండా ఉంటుందా?

పాండురంగనిలో లీనమైన సక్కుబాయి - సక్కుబాయి గా చిక్కుకుపోయిన పాండురంగడు

మరోవైపు, భక్తురాలైన సక్కుబాయి పండరీపురం చేరుకుంది. చంద్రభాగ నదిలో స్నానం చేసి, ఆలయంలోకి అడుగుపెట్టింది. ఏళ్ల తరబడి తాను ఎవరికోసమైతే తపించిందో, ఆ పాండురంగడిని కళ్లారా చూసేసరికి ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయింది. "స్వామీ...కృష్ణయ్యా,,, విఠలా" అంటూ ఆ విగ్రహాన్ని గట్టిగా కౌగిలించుకుంది. ఆ తన్మయత్వంలో, ఆనందపారవశ్యంలో, ఆమె ప్రాణం ఒక జ్యోతిలా వెళ్లి, ఆ పాండురంగడి పాదాలలో కలిసిపోయింది. భక్తికి ఇంతకంటే గొప్ప గమ్యం ఏముంటుంది? ఆమె భౌతిక శరీరం అక్కడే నిర్జీవంగా పడిపోగా, కృష్ణయ్య... ఆ పండరీపుర పాండురంగడు సక్కుబాయి రూపంలో ఆమె ఇంట్లో చిక్కుకుపోయాడు. పరిస్తితి గ్రహించిన రుక్మిణీదేవి ఆమెను తాకి సక్కుబాయికి తిరిగి ప్రాణం పోసింది.

రుక్మిణీదేవి సక్కుబాయిని ఆశీర్వదించి, 'ఓ సక్కు! నా ప్రభువు, నీ ప్రేమకు ముగ్ధులై నీ రూపంలో నీ అత్తమామలకు సేవ చేస్తున్నారు. నువ్విక్కడ తనువూ చాలిస్తే అక్కడ నా స్వామి చిక్కుకుపోతారు. కాబట్టి దయచేసి నీ ఇంటికి తిరిగి వెళ్లి అతన్ని విడుదల చేయి అని సక్కుబాయిని ఇంటికి పంపిందట.

ఇక్కడ ఇంట్లో, సక్కుబాయి రూపంలో ఉన్న కృష్ణుడు తన సేవను కొనసాగిస్తున్నాడు. పండరీపురం నుండి తిరిగి వచ్చిన యాత్రికులు, సక్కుబాయి మరణవార్తను ఆమె అత్తమామలకు, భర్తకు చెప్పారు. ఆ మాట విని వారు నిలువునా నీరయ్యారు.

"అదెలా సాధ్యం? సక్కుబాయి ఇక్కడే మాతో ఉంది కదా!" అని ఆశ్చర్యపోయారు.

ఇంతలో అప్పుడే ఇంటికి చేరుకున్న సక్కుబాయిని చూసి మరింత ఆశ్చర్యపోయారు. అసలు సక్కుబాయి ఇంటికి చేరగానే ఆమె రూపంలో ఉన్న విఠలుడు అంతర్ధానమయ్యాడు.  జరిగిన విషయాన్ని, విఠలుని కరుణను సక్కుబాయి ద్వారా తెలుసుకుని, భగవంతుని కరుణకు కదిలిపోయి, తమ క్రూరత్వానికి, మూర్ఖత్వానికి తమను క్షమించమని సక్కుబాయిని  వేడుకున్నారు ఆమె అత్త, భర్త.

     విన్నారు కదా! సతీ సక్కుబాయి కథ మనకు చెప్పేది ఒక్కటే. భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి గొప్ప గొప్ప యాగాలు, పూజలు మాత్రమె చేయనక్కర్లేదు. నిర్మలమైన మనసుతో, స్వచ్ఛమైన భక్తితో ఆయన్ను తలుచుకుంటే చాలు. ఆర్తితో పిలిస్తే, ఆ భగవంతుడు ఎక్కడున్నా పలుకుతాడు. అవసరమైతే, తన భక్తుల కోసం ఏ రూపమైనా ధరిస్తాడు, ఎలాంటి సేవైనా చేస్తాడు అనడానికి సతీ సక్కుబాయి జీవితమే గొప్ప ఉదాహరణ. ఆమె భక్తి ఆ భగవంతుడినే బంధించి, దాసుడిగా మార్చింది. భక్తికి అంత శక్తి ఉంది.



Recent Posts
తిరుమలలో జరిగిన అద్భుతం  |  అలిపిరి మెట్ల రహస్యం | shocking facts about tirumala Alipiri pathway
తిరుమలలో జరిగిన అద్భుతం | ...
సైన్స్ కే సవాల్ : పూరి గుడిలో అంతుచిక్కని 5 అద్భుతాలు | Puri Jagannath Temple Mysteries Explained  |  Science Failed?
సైన్స్ కే సవాల్ : పూరి గుడిలో...
హనుమంతుడికి కొడుకు ఉన్నాడా?  |  పంచముఖ ఆంజనేయుని అసలు రహస్యం | Mahiravana Story Telugu
హనుమంతుడికి కొడుకు ఉన్నాడా? | ...
300 ఏళ్ల రహస్యం! భీమవరం మావూళ్ళమ్మ అసలు కథ | Bhimavaram Mavullamma Temple Secrets
300 ఏళ్ల రహస్యం! భీమవరం మావూళ్ళమ్మ అసలు...
నరసింహావతారం 5 భయంకర రహస్యాలు    |    నరసింహుడి ఉగ్రరూపం వెనుక శాపం | Narasimha Avatar Mystery Telugu
నరసింహావతారం 5 భయంకర రహస్యాలు ...