Vijaya Lakshmi
Published on Jul 28 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?కృష్ణయ్య విలక్షణ రూపం పాండురంగడు. తన భక్తుని కోసం విలక్షణ భంగిమలో వెలిసాడు పాండురంగ విఠలుడు. పాండురంగడు అనగానే మనకు వెంటనే జ్ఞాపకం వచ్చేది మహారాష్ట్రలోని చంద్రభాగ నదీ తీరాన ఉన్న పండరీపురం క్షేత్రం. అయితే మన తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో కూడా పాండురంగడు స్వయంగా వెలిశాడు. అచ్చంగా పండరీపురంలో ఎలా అయితే ఉంటాడో అదే విలక్షణ భంగిమలో అదే ఆకారంలో అదే ఆహార్యంతో, వెలిసాడు.
మహారాష్ట్ర పండరీపురంలో పుండరీకుని భక్తికి మెచ్చి స్వయంభువుగా వెలిస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో భక్త నరసింహం కోసం వెలిసాడు. తన పట్ల అపారమైన భక్తితో జీవిస్తున్న నరసింహంగారి భక్తికి మెచ్చి ప్రత్యక్షమవడమే కాకుండా అతనికి మొక్షాన్నిచ్చి తనలో ఐక్యం చేసుకున్నాడు పాండురంగడు. పాండురంగడు నరసింహం గారికి ప్రత్యక్షమయిన సంఘటన ని స్థానికులు ప్రత్యక్షంగా చూశారని, ఆ ఘటనకు సంబంధించిన వివరాలన్నీ అప్పటి వార్తా పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయని కూడా చెబుతారు. ఈ వార్తలకు సంబంధించి ఆనాడు వెలువడిన వార్తాపత్రికలు ఫ్రేము కట్టించి ఆలయంలో సందర్శకులకోసం వుంచారు.
భక్తులు అకుంఠిత దీక్షతో సుదీర్ఘకాలం భగవంతుని గురించి తపస్సు చేయడం ఆ తపస్సుకు మెచ్చి భగవంతుడు ప్రత్యక్షమవడం మనం పురాణాల్లో విన్నాం. గడిచిపోయిన యుగాల చరిత్రలలో విన్నాం. కాని కలియుగంలో అది సాధ్యమవుతుందా అంటే ఖచ్చితంగా సాధ్యం కాదనే అంటారు ప్రతి ఒక్కరూ. కాని భక్తునికి భగవంతునికి అనుబంధానికి యుగాలు అడ్డు కాదు అని నిరూపించబడింది. ఆ అసాధ్యం సాధ్యమైంది. దానిని ప్రజలందరూ తమ కళ్ళారా చూసారు కూడా… ఈ ఘట్టానికి వేదిక కీర పండరీపురం క్షేత్రం. కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలో చిలకలపూడి లోని కీరపండరీపురం క్షేత్రం.
మరి ఈ ఘట్టం ఎలా సాధ్యమయింది? పండరీపురంలో పాండురంగడు ఇక్కడెలా ప్రత్యక్షమయ్యాడు? అసలీ క్షేత్రానికి కీరపండరీపురం అన్న పేరెందుకు వచ్చింది…
పచ్చటి వరి పొలాలు, కొబ్బరి తోటల మధ్య నిశ్శబ్దంగా వెలసిన ఒక దివ్య క్షేత్రం... కీరపండరీపురం. కృష్ణా నది అలల సవ్వడులు, చిలకల కిలకిలరావాలు కలిసిన పవిత్ర గీతంతో అలరారే ఓ పుణ్యధామం. ఇది కేవలం ఒక దేవాలయం కాదు, భక్త నరసింహం అనే ఓ నిష్టాగరిష్టుడైన భక్తుని అచంచల విశ్వాసానికి, సాక్షాత్తు పరమాత్ముడే ప్రత్యక్షమైన అద్భుత ఘట్టానికి నిదర్శనం. మహారాష్ట్రలోని పండరీపురంలో వెలసిన విఠోబా ఆలయం స్ఫూర్తితో, ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున మచిలీపట్నానికి సమీపంలో వెలసిన క్షేత్రం **కీర పండరీపురం.** దక్షిణ భారత పండరిపురం. ఈ అద్భుతమైన దివ్యక్షేత్రం వెనుక ఉన్న ఆసక్తికరమైన చరిత్ర, విశేషాలలోకి వెళ్తే….
మచిలీపట్నం శివార్లలో, చిలకలపూడిలో ఉన్న **కీర పండరీపురం** ఒక విశేషమైన, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన పుణ్యక్షేత్రం. ఇక్కడ కొలువై ఉన్నది **పాండురంగ స్వామి.** మహారాష్ట్రలోని పండరీపురంలో ఉన్న విఠోబా దేవాలయం ఎంత ప్రసిద్ధి చెందిందో, ఈ కీర పండరీపురం కూడా పాండురంగని భక్తులకు అంత ముఖ్యమైనది. మచిలీపట్నంలోని కీర పండరీపురం, ఒక అద్భుతమైన చరిత్ర, అచంచలమైన భక్తికి ప్రతీక. ఇది ఒక భక్తుని కోసం సాక్షాత్కరించిన దైవం కథకు, ఆ ప్రాంత ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలకు నిదర్శనం.
ఈ ఆలయానికి "కీర పండరీపురం" అనే పేరు ఎందుకు వచ్చిందో స్పష్టమైన ఆధారాలు లేవు. కాని ఒక అభిప్రాయం ప్రకారం పూర్వం ఇక్కడ **దోస వ్రతం** చేసేవారుట. అంటే, దోస విత్తనాలు నాటి, అవి పెరిగి, కాయలు కాసేదాకా వాటిని సంరక్షించి, ఆ తర్వాత భగవంతునికి సమర్పించే ఆచారం ఉండేది. "కీర" అంటే సంస్కృతంలో చిలక అని కూడా అర్థం. ఈ ప్రాంతంలో చిలకలు అధికంగా ఉండటం వల్ల కూడా ఈ పేరు వచ్చి ఉండవచ్చునని మరొక వాదన వినబడుతుంది.
కీర పండరీపురం ఆలయ నిర్మాణానికి కారకుడు **శ్రీ భక్త నరసింహం** గారు. ఈయన 1889 ఏప్రిల్ 4న విశాఖపట్నం జిల్లా బొబ్బిలి తాలూకాలోని ఉత్తరావెల్లి గ్రామములో జన్మించారు. విశ్వకర్మ కులస్థులైన నరసింహంగారు చిన్నతనం నుంచే అపారమైన దైవభక్తిని కలిగి ఉండేవారు. 18వ ఏట చిలకలపూడికి వచ్చి వ్యాపారం చేసుకుంటూనే, క్రమంగా ఆయన మనసు పాండురంగ విఠలుని వైపు మళ్లింది.
నరసింహంగారు ఒకసారి మహారాష్ట్రలోని పండరీపురం వెళ్లి, అక్కడ శ్రీ మహీపతి మహరాజ్ అనే గురువు గారి దర్శనం చేసుకున్నారు. ఆ గురువుగారు నరసింహంగారికి పాండురంగోపాసన విధానం తెలిపి, శ్రీ విఠ్ఠల మంత్రముతో తులసిమాల ప్రసాదించారు. కొంతకాలం తర్వాత "శ్రీ విఠ్ఠల మహామంత్ర "ను కూడా ఉపదేశించి, ఆయనకు "భక్త నరసింహం" అనే పేరు పెట్టారు.
గురువుగారి ఆశీర్వచనంతో భక్త నరసింహం ఎప్పటి నుంచో తానున్న చోట పాండురంగనికి ఆలయాన్ని నిర్మించాలన్న తన సంకల్పానికి పూనుకున్నారు. ఆలయ శంకుస్థాపన కోసం పండరీపురంలోని చంద్రభాగా నదిలోని కొన్ని గులక రాళ్ళను ఉపయోగించాలని సంకల్పించారు. అయితే, ఆ సమయంలో చంద్రభాగా నది ప్రచండంగా ప్రవహిస్తూ ఉండటంతో రాళ్ళు తీయడం కష్టమైంది. అప్పుడు నరసింహంగారు చంద్రభాగను ప్రార్థించగా, పుండరీక దేవాలయం పక్కన ఇసుక దిబ్బ ఏర్పడింది. అక్కడి నుండి ఇసుక, రాళ్ళు, నీరు సేకరించి తిరిగి వచ్చారు.
ఆ సేకరించిన ఇసుకలో ఒక చిన్న గుండ్రని రాయి దొరికింది. దానిని పండరీపురంలో పాండురంగని ముందుంచి, నరసింహంగారు, వారి గురువుగారు ప్రార్థనలో మునిగి ఉండగా, పాండురంగని నుండి ఒక జ్యోతి వచ్చి ఆ గుండ్రని రాయిలో ప్రవేశించింది అని చెబుతారు.
ఆ రోజు రాత్రి పాండురంగడు నరసింహంగారి కలలో సాక్షాత్కరించి, కీర పండరీక్షేత్రములో శ్రీ శుక్లనామ సంవత్సరం, కార్తీక శుద్ధ ఏకాదశి బుధవారం (నవంబర్ 13, 1929) పగలు తన మూర్తి సాక్షాత్కరించగలదని తెలిపారు. నరసింహంగారు సంతోషంగా తిరిగివచ్చి ఆలయ నిర్మాణం ప్రారంభించారు. కొద్ది కాలం తర్వాత, గురువుగారైన మహీపతి మహరాజ్‌కు కూడా పాండురంగడు స్వప్న దర్శనమిచ్చి, తాను తెలిపిన రోజున కీర పండరీపురంలో సాక్షాత్కరిస్తానని తెలియజేశారు.
17th august 1927 న మొదలు పెట్టబడినఈ ఆలయ నిర్మాణం 28th జూన్ 1928 న పూర్తయింది. ఈ ఆలయ సముదాయాలు అన్నీ పూర్తిగా కట్టటానికి సుమారు 8 సంవత్సరాలు పట్టి, 1935 లో పూర్తి అయ్యాయి. అలా మచిలీపట్నం చిలకలపూడి కీర పండరీపురంలో శ్రీ రుక్మిణీ పాండురంగ స్వామి దేవాలయం రూపుదిద్దుకుంది.
పాండురంగని విగ్రహం మినహా ఆలయ నిర్మాణం పూర్తయింది. పాండురంగని సాక్షాత్కార వార్త అందరికీ తెలియడంతో ప్రజలు తండోపతండాలుగా ఆ విశేషాన్ని దర్శించాలని వచ్చారు. అధికారులు, కొందరు పెద్దలు దీనిని నమ్మక, గర్భగుడికి తాళం వేసి సీలు చేశారు. క్షణాలు గడుస్తున్న కొద్దీ నరసింహంగారికి ఆందోళన ప్రారంభమైంది. ఆంజనేయస్వామి ఆలయంలో ఆయనను ప్రార్థిస్తూ తన్మయావస్థలో ఉండగా, ఆంజనేయుడు ఆయనకి అభయమిచ్చాడుట. సరిగ్గా పన్నెండు గంటలయ్యేసరికి శ్రీ పాండురంగడు స్వయంగా సాక్షాత్కరించారు అని ప్రతీతి.
పాండురంగుడి పరమ భక్తుడైన నరసింహం 16.1.1974లో స్వర్గస్తులయ్యారు. ఆ సమయంలో ఆయన నుంచి ఒక కాంతి వెలువడి ఆలయంలో ఉన్న పాండురంగడిలో ఐక్యమయ్యిందట. ఈ దృశ్యాన్ని అక్కడున్న చాలామంది స్పష్టంగా చూసారని చెప్తారు. ఈ విషయాన్ని అప్పటి పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. ఆ పత్రికల క్లిప్పింగ్స్ ను మనం ఇప్పటికీ ఆలయంలో చూడవచ్చు.
దేవాలయ నిర్మాణ సమయంలోనే పాండురంగని ఆజ్ఞ ప్రకారం మహా మండపమునందు సమాధి నిర్మించి దానిమీద ఒక రాయి పరచి వుంచి తాను శరీరాన్ని వదిలిన తరువాత తన శరీరాన్ని అక్కడ వుంచమని చెప్పారట. వారు చెప్పిన విధంగానే చేసి అక్కడ ఆయన విగ్రహాన్ని స్ధాపించారు.
ఇక్కడి పాండురంగ విఠలుని విగ్రహం స్వయంభువుగా వెలసిందని ప్రతీతి. ఆలయంలో హూండీ ఉండదు. భక్తులు తమ కానుకలను నేరుగా స్వామివారి పాదాల చెంత సమర్పిస్తారు.
పడమర దిశగా వున్న సింహా ద్వారం లోనికి ప్రవేశించిన భక్తులకు తూర్పు ముఖంగా వున్న గర్భగుడిలో స్వామి దర్శనం ఇస్తాడు. ఈ గుడిలోని మూల విగ్రహం 3 అడుగుల పొడవు వుండి, పూర్తిగా శ్రీ పండరిపురం లోని శ్రీ పాండురంగని పోలివుంటుంది. సాధారణంగా స్వయంభు విగ్రహ పాద స్పర్స చాలా అరుదు గా దొరుకుతుంది. కాని ఇక్కడ స్వామి పాదాలను స్వయంగా తాకి ప్రార్ధించుకోవచ్చు. ఇదే ఇక్కడ ప్రత్యేకత. ఇక్కడ ప్రత్యేక పూజలు, ప్రత్యేక ఛార్జీలు ఉండవు. ఎలాంటి హడావిడి ఉండదు.
కీర పాండురంగస్వామిని దర్శించుకునే భక్తులందరికీ పండరీపురం శ్రీ పాండురంగని దర్శిస్తున్నామనే అనుభూతిని కల్గిస్తుంది. ఇప్పటికీ ఈ దేవాలయం శ్రీ భక్త నరసింహం గారి వంశం వారే నిర్వహిస్తున్నారు.
సుమారు 6 ఎకరాల స్థలం లో సుందరంగా నిర్మిచబడిన ఈ ఆలయంలో పాండురంగని పరమభక్తులైన భక్త జ్ణానదేవ్, భక్త తుకారాంల మఠం లు కూడా వున్నాయి. రాధమ్మ,రుక్మిణీ దేవి, సత్యభామ మొదలైన వారి ఉపాలయాలు ఉనాయి.
ఆలయ ప్రాంగణంలో దాదాపు 400 ఏళ్లనాటి అశ్వత్థ చెట్టు ఉంది. ఈ చెట్టు కింద భూమి పొరల్లో ఇప్పటికీ ఒక యోగి ధ్యానం చేస్తూ ఉన్నాడని భక్తులు ఇప్పటికీ నమ్ముతున్నారు. ఇదే ఆవరణంలో సహస్ర లింగ కైలాస మంటపం కూడా ఉంది. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఇక్కడ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుండే కాక, పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు.
కార్తీక మాసంలో మాంగినపూడి సముద్ర తీరంలో పవిత్ర స్నానాలు ఆచరించడం భక్తులకు ఒక ఆచారం. మహారాష్ట్ర సంప్రదాయాన్ని తలపించేలా ఇక్కడ భజన శైలులు, దిండోరి పద్ధతులు, వాగ్దేవి పూజలు కనిపిస్తాయి. స్వామివారికి పటిక బెల్లం (రాక్ క్యాండీ) నైవేద్యంగా సమర్పిస్తారు.
ఇక చిలకలపూడి అనగానే అందరికీ జ్ఞాపకం వచ్చే ఒక అంశం ఉంది. అదే రోల్డ్ గోల్డ్ నగలు. వీటిని చిలకలపూడి బంగారం అని కూడా అంటూ ఉంటారు. ఈ క్షేత్ర నిర్మాణానికి కారకుడైన భక్త నరసింహం గారే ఈ తన వ్యాపారంలో భాగంగా ఈ కాకి బంగారంతో నగలు చెయ్యటంకూడా కనిపెట్టారని అంటారు.
విజయవాడకి 82 కి.మీ. ల దూరంలో, కృష్ణాజిల్లాలో ముఖ్యపట్టణమైన చిలకలపూడిలో వున్న ఈ ఆలయం చేరుకోవటానికి వివిధ ప్రాంతాలనుంచి రైలు, రోడ్డు మార్గాలున్నాయి.