Vijaya Lakshmi
Published on Aug 03 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?“రాఖీ...” “రక్షాబంధనం” అక్కాతమ్ముళ్ళు, అన్నాచెల్లెళ్ళ పండుగ.
చిన్నా పెద్ద అనే తారతమ్యం లేకుండా ఆప్యాయతలను పంచే రాఖీ పండుగ కోసం సంవత్సరమంతా ఎదురు చూసే అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు ఉంటారంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. సంప్రదాయాలకు పెద్ద పీట వేసే మనదేశంలోనే కాదు విదేశాల్లో కూడా రకరకాల పేర్లతో రాఖీ పండుగను జరుపుకుంటారు.
అసలీ రాఖీ పండుగ... రక్షాబంధన్ ఎప్పుడు ఎలా ప్రారంభమయింది....? రాఖీల పండుగ అంటే కేవలం రాఖీలు కట్టి నుదట బొట్టు పెట్టి స్వీట్ తినిపించడం వెంటనే అన్నదమ్ములు బహుమతులు ఇవ్వడం ఇదేనా....!? అసలు రాఖీలు కట్టడం వెనుక ఉన్న ఉద్దేశమేంటి...!? రాఖీ పండుగను ఎప్పుడెప్పుడు ఎవరెవరు జరుపుకున్నారు...!? ఆ వివరాల్లోకెళితే ...
అసలు రాఖీని పౌర్ణమి రోజుమే ఎందుకు కట్టాలి....ఈ ప్రశ్నకు పండితులు చెప్పే వివరణ ఎలా ఉందో తెలుసా! పౌర్ణమి అంటేనే చంద్రుడు నిండు ప్రకాశంతో వెలుగుతూ కనిపిస్తాడు. రాఖీ కట్టడానికంటే ముందు సోదరి తన సోదరుడి నుదిటిన బొట్టు పెడుతుంది. మనిషి ఆత్మ నుదిటిన ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. సోదరి నిండు పౌర్ణమి నాడు సోదరుడి నుదిటిన బొట్టు పెడితే ఆ ఆత్మ ప్రకాశవంతమై పవిత్రతను సంతరించుకుంటుందట. అందుకే రాఖీ కట్టేముందు సోదరి తన సోదరుడి నుదుట బొట్టు పెడుతుంది. అనంతరం రాఖీ కట్టి నోరును తీపి చేస్తుంది. నోరును తీపి చేయడం వెనుక కూడా ఓ రహస్యం దాగి ఉందట. తీపి ఎంత మధురంగా ఉంటుందో, మనమంతా ఎప్పుడూ మధురమైన మాటలే మాట్లాడాలని... మన వ్యవహారం కూడా మధురంగా ఉండాలనే ఉద్దేశంతోనే నోరు తీపి చేస్తారట.
నిజానికి రక్షాబంధన్ అనేది కేవలం అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు కట్టుకునేది మాత్రమేకాదు... తమ ఆత్మీయులకు మంచి జరగాలని కోరుకునే ఎవరైనా ఎవరికైనా రక్షా కట్టడం అనే ఆచారం పూర్వకాలంలో ఉండేది. ఈ విషయాన్ని రుజువు చేసే కథనం పురాణాల్లో ఉంది. పూర్వం దేవతలకు, రాక్షసులకు మధ్య పుష్కరకాలం అంటే పన్నెండేళ్ళపాటు యుద్ధం సాగింది. యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు శక్తిహీనుడై, తన పరివారమంతటినీ కూడగట్టుకొని అమరావతిలో తలదాచుకుంటాడు. భర్త నిస్సహాయతను చూసిన దేవేంద్రుని భార్య ఇంద్రాణి ఎలాగైనా తన భర్తకు విజయం కలగాలన్న ఉద్దేశంతో దేవేంద్రుడిని యుద్ధానికి ఉత్సాహాపరిచి ముందుకు పంపుతుంది. అంతటితో ఊరుకోకుండా భర్తకు విజయం కలగాలని కోరుకుంటూ సరిగ్గా ఆ రోజు శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను పూజించి భర్త చేతికి ఒక రక్ష కడుతుంది. అది గమనించిన దేవతలందరూ వారు పూజించిన రక్షలను తీసుకువచ్చి ఇంద్రుడికి కట్టి పంపుతారు. సమరంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతాడు. ఇంద్రాణి అయిన శచీదేవి ప్రారంభించిన ఆ రక్షాబంధనం... నేడు రాఖీ పండుగగా రూపుదిద్దుకుందని పురాణాలు చెబుతున్నాయి.
మహాభారత కథలోనూ రక్షాబంధన ప్రసక్తి కనిపిస్తుంది. ధర్మరాజు కృష్ణుడిని అసలు రక్షాబంధనమెందుకు కట్టాలి? దాని విశేషమేంటని అడిగాడట. అప్పుడు కృష్ణుడు రక్షాబంధనాన్ని ఒకసారి కట్టించుకుంటే ఇక ఆ సంవత్సరమంతా ప్రేత, పిశాచ బాధ, దుష్ట శక్తుల బాధలుండవని, అనారోగ్యం, అశుభాలు ఏమాత్రం దరిచేరవని, దేవేంద్రుడికి శచీదేవి రక్ష కట్టిన విషయాన్ని కూడా చెప్పి అంత గొప్ప శక్తి రక్షాబంధనానికి ఉందని చెప్తాడట.
ఇక ఈ రాఖీ పండుగను పురాణ కాలం నుండి ఆధునిక కాలం వరకు ఎవరెవరు ఎలా జరుపుకున్నారో చూద్దాం...
శ్రీ మహాలక్ష్మిదేవి రాక్షసరాజు బలి చక్రవర్తికి రక్షాబంధనం కట్టిందట. దీని వెనుక ఉన్న కథ చూద్దాం... ప్రహ్లాదుని మనుమడైన బలి చక్రవర్తి విష్ణు భక్తుడు. తన అపరిమిత భక్తితో విష్ణుమూర్తిని పాతాళంలో తన వద్దే ఉంచేసుకున్నాడు. దాంతో లక్ష్మీదేవి బాగా ఆలోచించి, శ్రావణ పౌర్ణమి రోజున బలి చక్రవర్తికి రాఖీ కట్టింది. బలిచక్రవర్తి తనకు రాఖీ కట్టిన లక్ష్మీదేవిని సోదరిగా భావించి ''ఏం కావాలమ్మా'' అని అభిమానంగా అడిగాడు. లక్ష్మిదేవి వెంటనే విష్ణుమూర్తి కావాలని కోరింది. తనకు రక్షాబంధనం కట్టిన సోదరికి సోదరుడిగా తన బాధ్యత నిర్వహించాలి అనుకున్న బలి విష్ణుమూర్తిని తీసుకువెళ్ళడానికి అనుమతించాడు. దాంతో లక్ష్మీదేవి విష్ణుమూర్తిని వెంట తీసుకెళ్ళిపోయిందట. అందుకే రాఖీ పౌర్ణమిని ''బలేవా'' అని కూడా పిలుస్తారు. బలేవా అంటే బలిరాజు భక్తి అని అర్ధాన్ని చెప్తారు.
శిశుపాలుడిని శిక్షించే సమయంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుని వేలుకు గాయం అవుతుంది. ఆ వేలుకు కట్టు కట్టేందుకు నలుగురు నాలుగుదిక్కులకి పరుగులు తీస్తారు. కానీ అక్కడే ఉన్న ద్రౌపది మాత్రం ఏమాత్రం ఆలోచించకుండా తన చీరకొంగు చింపి వేలికి కట్టు కట్టిందట. అవ్యాజమైన ద్రౌపది అనురాగానికి శ్రీకృష్ణుడు కరిగిపోయాడు. “ఆపదలో ఆదుకునేందుకు నాకు రక్షను కట్టావు కాబట్టి, నీకు ఆపద వాటల్లినప్పుడు నీకు రక్షగా నేను నిలుస్తాను” అని వాగ్దానం చేశాడు. తనిచ్చిన మాట ప్రకారం తన సోదర ధర్మాన్ననుసరించి దుశ్వాసనుడి దురాగతం నుంచి అపరిమిత వస్త్రాన్నిచ్చి ఆమెను కాపాడాడని పురాణాలు చెప్తున్నాయి.
ద్రౌపదికి, కూడా వస్త్రాపహరణం సమయంలో, మహారాజ్యాధిపతి అయిన తండ్రి ద్రుపదరాజు కానీ, ఉద్దండులయిన ఐదుగురు భర్తలు కానీ గుర్తు రాలేదు. తనను ఆదుకునేవాడు తన సోదరుడైన కృష్ణుడే అనుకుంది. ఆర్తిగా, నిస్సహాయంగా శ్రీకృష్ణుని ప్రార్ధించింది. కృష్ణుడు ఆ క్షణంలో ద్రౌపదికి తరగని వస్త్రాన్ని ప్రసాదించి, అవమానం నుండి తప్పించాడు. ద్రౌపది, శ్రీకృష్ణుని వేలుకి చుట్టిన రక్షే రక్షాబంధనానికి నాందిగా నిలిచిందనీ... దానికి బదులుగా శ్రీకృష్ణుడు తన వాగ్దానాన్ని నిల్పుకొన్న తీరే సోదరుల బాధ్యతకు నిర్వచనంగా నిలుస్తుందనీ పెద్దలు చెబుతారు!
ఇక చరిత్రలోకొస్తే... ఎన్నో యుద్ధాలను తప్పించిన శక్తి రాఖీకి ఉందంటారు. రాజుల కాలంలో బలవంతులైన రాజులు రాజ్యకాంక్షతో పొరుగు దేశాల ఆక్రమణకు పాల్పడేవారు. కయ్యం కారణంగా ఇరు దేశాలు నష్టపోయేవి. అటువంటి క్లిష్ట సమయాల్లో అంతఃపుర కాంతలు శత్రురాజులకు కూడా తోరం కట్టడం, లేదా వాటిని పంపించడం ద్వారా సోదరి భావాన్ని చాటేవారు. దీంతో తమ రాజ్యం పై దండెత్తే ఆలోచనతో ఉన్న రాజులు ఆ ఆలోచనకు స్వస్తిపలికేవారట. దీనివల్ల రాజుల మధ్య కయ్యాలకు బదులు బంధాలు వర్థిల్లేవని ప్రతీతి.
అలెగ్జాండర్ భార్య రుక్సానా – పురుషోత్తముల కథ దీనికొక పెద్ద ఉదాహరణగా చెప్తారు.
అలెగ్జాండర్ భార్య రుక్సానా తక్షశిల రాజు పురుషోత్తముడిని తన సోదరుడిగా భావించి రాఖీ కడుతుంది. జగజ్జేతగా మారాలనే తపనతో గ్రీకు యువరాజు అలెగ్జాండర్ సాధారణ శకానికి పూర్వం 326లో భారత దేశంపై దండెత్తుతాడు. ఆ క్రమంలో బాక్ట్రియా (నేటి ఆఫ్గనిస్థాన్)కు చెందిన యువరాణి రుక్సానాను వివాహం చేసుకుంటాడు. ఆమె వివాహసంబంధాన్ని ఉపయోగించుకుని మధ్య ఆసియా దేశాలను, ముఖ్యంగా జీలం, చినాబ్ నదుల మధ్య ఉన్న రాజ్యాలను జయించాలని అలెగ్జాండర్ ఆలోచన. అలెగ్జాండర్ యుద్ధం ప్రకటిస్తాడు. పురుషోత్తముడి శత్రురాజు అంబి, అలెగ్జాండర్‌ను భారతదేశంపై దండెత్తాలని ఆహ్వానిస్తాడు. పురుషోత్తముడు యుద్ధానికి సిద్ధమవుతాడు. అయితే అలెగ్జాండర్ భార్య రుక్సానా పురుషోత్తముడిని తన అన్నలా భావించి రాఖీ కడుతుంది. దాంతో యుద్ధం సమసిపోయిందట.
రాణీ కర్ణావతి, హుమాయూన్ చక్రవర్తుల కథ కూడా రక్షాబంధనానికి ఒక ఉదాహరణగా చెప్తారు.
1535లో రాణీ కర్ణావతి భర్త చనిపోయాడు. దాంతో గుజరాత్ సుల్తాన్ బహద్దూర్ షా, చిత్తూరుపై కన్నేశాడు. ఏ క్షణాన అయినా సుల్తాన్ దండెత్తిరావచ్చని గూఢచారుల ద్వారా విన్న రాణీ కర్ణావతి బాగా ఆలోచించి, తనను కాపాడేవాడు మొఘల్ సామ్రాజ్యాధిపతి హుమాయూన్ చక్రవర్తే అని నమ్మి. వెంటనే హుమాయూన్ చక్రవర్తికి రాఖీ పంపింది. ఆ రాఖీ హుమాయూన్ మనసును గెలిచింది. కానీ అప్పటికే గుజరాత్ సుల్తాన్ చిత్తూరు కోటపై దాడి చేశాడు. హుమాయూన్ కు విషయం అర్ధం అయ్యేసరికి పరిస్థితి విషమించింది. రాణీ కర్ణావతితో సహా 13 వేలమంది స్త్రీలను సుల్తాన్ చెర పట్టాడు. హుమాయూన్ చిత్తూరు చేరేసరికి మహిళలందరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. హుమాయూన్ చక్రవర్తి, గుజరాత్ సుల్తాన్ను ఓడించి, చిత్తూరు రాజ్యాన్ని రాణీ కర్ణావతి కొడుక్కు ఇప్పించాడు. హుమాయూన్ కు మాత్రం ఆమె పంపిన రాఖీ తీపి గుర్తుగా మిగిలిపోయిందట.
ఇక రాజులు యుద్ధాలకు వెళ్లేముందు, ఏదైనా కార్యం తలపెట్టే ముందు రక్షను కట్టుకుని ఆ తర్వాత కార్యాలను మొదలుపెట్టి గెలుపొందేవారు. రాఖీపౌర్ణమి రోజు కట్టే రక్షలో అసామాన్యమైన విష్ణుశక్తి ఉంటుందన్నది ప్రజల ప్రగాఢ విశ్వాసం.
ఈ రాఖి పౌర్ణమినే, జంధ్యాల పౌర్ణమి, రక్షికా పూర్ణిమ, రఖ్రీ సాలునో, సారవీ పూర్ణిమ, నారికేళ పూర్ణిమ, నార్లీ పున్నమి ఇలా వివిధ పేర్లతో దేశవ్యాప్తంగా జరుపుకుంటారు.