Vijaya Lakshmi
Published on Oct 13 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?ఆ కామక్షీ శక్తిపీఠం తమిళనాడులోని కంచి క్షేత్రంలో నెలకొని ఉంది. కంచి క్షేత్రం ఆలయాల నగరం. ఎన్నో ప్రాచీన గ్రంధాలలో వర్ణించబడిన నగరం. కంచిగా ప్రసిద్ధి చెందిన కాంచీపురం. ఈ నగర ప్రాశస్త్యాన్ని వర్ణిస్తూ పుష్పేషు మల్లి.. పురుషేషు విష్ణు.. నారీషు రంభ.. నగరేషు కంచి.. . అన్నాడు మహాకవి కాళిదాసు. అంటే పువ్వులలో అత్యున్నతమైనది మల్లె అని, పురుషులలో ఉత్తమోత్తముడు శ్రీ మహా విష్ణువని, స్త్రీలలో అందమైన వనిత రంభ అని, నగరాల్లో మహోన్నతమైనది కాంచీపురం అని వర్నిన్చాచు మహాకవి కాళిదాసు మహాకవి.
కామాక్షి అమ్మవారు ఈ ఆలయంలోని గర్భగుడిలో లలితా దేవి రూపంలో నాలుగు చేతులతో పద్మాసన భంగిమలో ఉంటుంది. పై రెండు చేతులు పాశం, అంకుశం కలిగి ఉంటాయి. మిగిలిన రెండు చేతులు చెరకు, పూల బాణాలను పట్టుకున్నాయి. ఆమె తన కళ్ళ ద్వారానే తన భక్తుల కోరికలను తీరుస్తుంది కాబట్టి ఆమెను 'కామాక్షి' అని పిలుస్తారు. లలితా పరమేశ్వరి లలితోపాఖ్యానం పుస్తకంలో అదే రూపంలో నివసిస్తుందని వర్ణిస్తారు.
అష్టాదశ శక్తిపీఠాలలలో రెండవదైన కంచి క్షేత్రం శక్తిపీఠం మాత్రమె కాదు ఇంకా చాలా విశేషాలే ఉన్నాయి. శక్తి క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందిన మూడు క్షేత్రాలలో ఒకటి. కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశి విశాలాక్షి ఈ మూడు మహా మహిమాన్వితమైన శక్తి క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి.
పంచభూత లింగాలలో ఒకటి ఇక్కడే ఉంది. ఈ క్షేత్రం 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఒకటి. ఇక్కడ మహావిష్ణువును వామనమూర్తిగా ఆరాధిస్తారు.
అష్టాదశ శక్తిపీఠాలలో రెండవదయిన కంచి క్షేత్రంలో సతీదేవి కంకాళం పడిందని కొన్ని కథనాలు చెప్తుంటే సతీదేవి వీపుభాగం ఇక్కడ పడిందని మరికొన్ని కథనాలు చెప్తున్నాయి. ఇక్కడ అమ్మవారు కామాక్షీదేవిగా కొలువుతీరింది. కామాక్షి అమ్మవారిని కామాక్షి తాయి అని, కామాక్షి అమ్మణ్ణ్ అని పిలుచుకుంటారు స్థానికులు. పద్మాసనంలో కూర్చున్న అమ్మవారిని దర్శనం చేసుకుంటే శాంతి, సౌభాగ్యాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. ఈ క్షేత్రం తమిళనాడులోని చెన్నై పట్టణం నుండి 75కి.మీ దూరంలో ఉన్నది. కా అంటే సరస్వతి రూపం.. ‘మా’ అనేది లక్ష్మీదేవి రూపం.. ‘అక్షి’ అంటే కన్ను అని అర్థం. కంచిలో అమ్మవారు.. సరస్వతి లక్ష్మి రెండు కన్నులుగా కొలువుతీరింది అని ప్రతీతి. కామాక్షి దేవి ఆలయాన్ని గాయత్రీ మండపంగా పిలుస్తారు. ఇక్కడ అమ్మవారు శ్రీకామాక్షి, శ్రీబిలహాసం, శ్రీచక్రం అనే మూడు రూపాలలో దర్శనమిస్తారు. ఆలయంలోని అమ్మవారు పద్మాసనంపై కూర్చొని చేతులతో పాశం, అంకుశం, పుష్పబాణం, చెరకుగడలతో దర్శనమిస్తుంది. ఈ రూపంలో ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకుంటే శాంతి, సౌభాగ్యాలు లభిస్తాయని భక్తుల నమ్మకం.
ఇక్కడ మరొక విశేషం ఏంటంటే, ప్రతి దేవాలయంలోనూ ఆయా దేవతకు సంబంధించిన బీజాక్షరాలు చెక్కిన ఒక యంత్రాన్ని పీఠంలో ఉంచి, దానిమీద దేవత విగ్రహాన్ని ప్రతిష్ట చేస్తారు. దీనినే ప్రాణప్రతిష్ట అని అంటారు. కానీ కామాక్షి అమ్మవారి ఆలయంలో అలాంటి యంత్రం కామాక్షిఅమ్మ విగ్రహానికి ఎదురుగా ప్రతిష్టింపబడి ఉంది. పూజ కార్యాక్రమాలు అన్ని కూడా ఈ యంత్రానికే జరుగుతాయి.
ఆ యంత్రం వెనుక ఒక పురాణం ఉంది, రాక్షస సంహారం తరువాత అమ్మవారు క్రూరంగా ఉండేదట. ఆమెను శాంతింపజేయడానికి, దేవతలు ఇక్కడ గాయత్రి మండపాన్ని నిర్మించారు, ఇక్కడ 24 స్తంభాలు గాయత్రి మంత్రంలోని 24 అక్షరాలను సూచిస్తాయి. ఉగ్ర దేవత సింహాసనంలో కూర్చుండబెట్టి గాయత్రి మండపం తలుపులు మూసివేసి, వారు రాత్రంతా దేవిని ప్రార్థించారు. మరుసటి రోజు దేవతలు తలుపులు తెరిచినప్పుడు అమ్మవారు పద్మాసన భంగిమలో లలితా పరమేశ్వరిగా నవ్వుతున్న రూపంలో కనిపించింది. కామాక్షి అమ్మవారు ఈ రూపంలో శ్రీముఖ సంవత్సరం, తమిళ మాసి మాసం పూర్వ ఫాల్గుణి నక్షత్రం, శుక్రవారం నాడు దర్శనమిచ్చింది. అందుకనే ప్రతి సంవత్సరం తమిళ మాసి మాసంలో 10 రోజులు బ్రహ్మోత్సవం జరుపుకుంటారు, పూర నక్షత్ర అవతార దినం కూడా ఇందులో ఉంటుంది.
మరో కథనం ప్రకారంఇక్కడ అమ్మవారు ఉగ్రరూపిణిగా ఉంటూ, బలులు తీసుకుంటూ, రాత్రిపూట కాళికరూపం ధరించి, ఆలయం నుండి బయటకి వచ్చి ఊరంతా సంచరిస్తూ ఉండేదట. ఆ పరిస్తితుల్లో ప్రజలంతా భయబ్రాంతులకు గురైతే, ఆదిశంకరాచార్యుల వారు కఠోరమైన తపస్సు చేసి, ఆమెని ప్రసన్నురాలిని చేసుకొని, ఇకముందు తన అనుమతి లేనిదే ఆలయం ధాటి బయటకి వెళ్లకుండా ఉండేట్లు వరం పొందారట. దానికోసమే ఆయన ఈ యంత్రాన్ని తయారుచేసి అమ్మవారి విగ్రహం ఎదురుగా బంధ ప్రతిష్ట చేసారని చెప్తారు. అందుకే అమ్మవారు... ఉత్సవాలకు మాత్రం, ఉత్సవ కామాక్షి ప్రాంగణంలోనే ఉన్న శంకరులవారి అనుమతి తీసుకుని దేవాలయ ప్రాంగణం నుంచి బయటకు వస్తుందని కూడా ఓ కథ ప్రాచుర్యంలో ఉంది.
కామాక్షి దేవి ఈ కంచిక్షేత్రంలో మట్టితో చేసిన శివుని విగ్రహానికి పూజ చేస్తూ ఆరాధించేది. శివుడు ఆమె భక్తిని పరీక్షించడం కోసం, కంబనది రూపంలో పెద్ద అలలతో వచ్చాడట. అయినా కామాక్షి దేవి అదరలేదు బెదరలేదు. తన తపస్సును వీడలేదు. దాంతో శివుడు అలల ఉద్ధృతిని ఇంకా ఇంకా పెంచేసాడట. శివుడు. అప్పుడు కామాక్షీదేవి తన రెండు చేతులలో శివలింగాన్ని పట్టుకొని అలల నుంచి కాపాడిందని ఇక్కడి స్థల పురాణం. దేవి సూదిమొనపై కూర్చొని, పంచాగ్నుల మధ్య నిలబడి, శివుడిని గూర్చి తపస్సు చేసింది. ఆ కఠినమైన తపస్సుకు సంతసించి, శివుడు ఆమె ఎదుట ప్రత్యక్షమై వివాహమాడినట్లు ప్రతీతి.
ఈ కోవెల ప్రాంగణం చాలా విశాలంగా, ప్రశాంత వాతావరణంలో ఉంటుంది. ఇక్కడ ప్రతిరోజూ ప్రాతఃకాలంలో శ్రీకామాక్షి దేవి ఉత్సవమూర్తిని మేలుకొలిపి, నైవేద్యం సమర్పించి, హారతి ఇచ్చి, ఉత్సవమూర్తిని పల్లకిలో ప్రదక్షిణగా ఆలయంలోకి తీసుకుని వస్తారు. ఆ తర్వాత అమ్మవారి ఎదురుగా గోపూజ చేస్తారు. అనంతరం అమ్మవారి ద్వారానికి ఉన్న తెర తొలగించి హారతి ఇస్తారు. ఆ సమయంలో భక్తులు అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకోవచ్చు. శ్రీకామాక్షిదేవి ఆలయానికి ప్రాతఃకాలం 5 గంటలకే వెళ్తే గోపూజ చూడవచ్చు.
కామాక్షీదేవి ఇక్కడ ఐదు రూపాల్లో కొలువై ఉన్నారు. గాయత్రీ మంటపంలో కొలువై ఉన్న అమ్మవారిని మూలదేవతగా పరిగణిస్తారు. ఈ మండపంలో నాలుగు గోడలను నాలుగా వేదాలుగా, 24స్తంభాలను గాయత్రీ మంత్రంలోని 24 అక్షరాలుగా భావిస్తారు. తపో కామాక్షి, అంజనా కామాక్షి, స్వర్ణ కామాక్షి, ఉత్సవ కామాక్షి అనే మరో నాలుగు రూపాల్లో ఇక్కడ దేవి కొలువై ఉన్నారు.
అమ్మవారికి పౌర్ణమి రోజున నవావర్ణ పూజ, ప్రతీ బుధవారం చందనాలంకారం, రోజూ మూడు సార్లు అభిషేకం నిర్వహిస్తారు. ప్రతిరోజూ కుంకుమార్చన, చేస్తారు.
ఇక ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు అద్భుతంగా జరుగుతాయి. నవరాత్రులను మూడు విభాలుగా విభజించి అమ్మవారిని పూజిస్తారు. మొదటి మూడు రోజులు దుర్గాదేవిని, తర్వాత మూడు రోజులు లక్ష్మీదేవిని, చివరి మూడు రోజులు సరస్వతీ దేవిని శాస్త్రోక్తంగా ఆరాధిస్తారు. ఆ సయమంలో కన్య(బాలిక), సుహాసిని(వివాహిత)పూజలను విశేషంగా చేస్తారు. వీరిని పూజిస్తే అమ్మవారిని పూజించినట్లే అని భావిస్తారు.
ఈ ఆలయాన్ని ఆరవ శతాబ్దంలో పల్లవ రాజవంశ రాజులు నిర్మించారని చరిత్ర చెపుతుంది.అ తరువాత ఆలయం శిధిలం కాగా ఆలయ పునర్మానం జరిగిందిశ్రీ కామాక్షి దేవాలయంలో అమ్మవారి గర్భాలయం వెనుక భాగంలో శ్రీ ఆదిశంకరుల ప్రతిమ ప్రతిష్ఠించబడింది. దశరథ, తుండీర, శ్రీ కృష్ణదేవరాయలు, చోళ రాజులు, ఇక్ష్వాకు వంశస్థులు అమ్మవారిని ఆరాధించినట్లు చరిత్ర చెబుతోంది.
కామాక్షి దేవి మహత్యాల విషయానికి వస్తే కోకొల్లలు. అందులో ఒకటి . అమ్మను ఆరాధించి మూగవాడైన భక్తుడు వాక్కును సంపాదించుకొని అయిదు వందల శ్లోకాలతో అమ్మను కీర్తించిన ఘటన. అమ్మ కరుణ ఉంటె పుట్టుకతో మూగవాడు కూడా మాట్లడగాలాడని నిరూపించే ఘటన. ఆ ఘటనే మూకశంకరులకు సంబంధించినది. ఆ మూకశంకరులే కంచి క్షేత్రంలో ఆదిశంకరాచార్యుల వారు ఏర్పాటు చేసిన శంకరపీఠం సర్వజ్ఞపీఠంలోని 20 వ పీఠాధిపతి. ఈ మూక శంకరులు సాధారణ శకం 398 నుంచి 437 వరకు పీఠాదిపతి గా ఉన్నారు.
ఇక వీరు పీతాధిపతి అవడానికి అమ్మవారు వీరి విషయంలో చూపిన మహత్యం అద్భుతం. ఒకరోజు పుట్టు మూగవాడు, పండితుల కుమారుడయిన మూకశంకరులు కామాక్షీ అమ్మవారి ఆలయంలో కూర్చొని ఉన్నారు. అక్కడే మూకశంకరులకు సమీపంలోనే మరో సాధకుడు కూడా అమ్మను ధ్యానిస్తూ కూర్చొని ఉన్నారు. అప్పుడు సాక్షాత్తూ కామాక్షీదేవే ఒక మామూలు స్త్రీ రూపంలో తాంబూలం నములుతూ అక్కడికి వచ్చింది. అలా వచ్చిన అమ్మ ఆ సాధకుని దగ్గరకు రాగానే తను నములుతున్న తాంబూలం తీసి అతనికిచ్చింది. అయితే ఆమెను ఒక మామూలు స్త్రీగా భావించిన ఆ సాధకుడు ఆ తాంబూలం ఎంగిలి అని భావించి తీసుకోలేదు. అప్పుడు కామాక్షీదేవి దానిని ఆ పక్కనే ఉన్న మూక శంకరులకు ఇచ్చింది. ఆయన దానిని మహా ప్రసాదంగా తీసుకొని కళ్ళకద్దుకొని నోట్లో వేసుకున్నారట. అంతే....అమ్మ అనుగ్రహంతో తక్షణమే మూగావాదయినా మూకశంకరులకు మాట వచ్చింది. కవితా ప్రవాహం వెల్లువలా ఉరికింది. వెంటనే అమ్మవారిని చూస్తూ భక్తిగా, ఆశువుగా అమ్మవారి గొప్పతనం వర్ణిస్తూ వంద శ్లోకాలు, అమ్మవారిని స్తుతిస్తూ వంద శ్లోకాలు, అమ్మవారి నవ్వును వర్ణిస్తూ వంద శ్లోకాలు, అమ్మవారి పాదపద్మాలను వర్ణిస్తూ వంద శ్లోకాలు, మొత్తం 5 వందల శ్లోకాలు ఆశువుగా చెప్పారు మూక శంకరులవారు. ఈ శ్లోకాలనే మూక పంచశతి అంటారు.
అమ్మవారి అనుగ్రహంతో ఇలా పంచశతి శ్లోకాలు చెప్పిన తరువాత కామాక్షీదేవి ఆనందంతో నీకేం వరం కావాలో కోరుకొమ్మని అడిగిందట. అప్పుడు మూకశంకరుల వారు అమ్మా నిన్ను కీర్తించిన ఈ నోటితో మళ్ళీ లౌకికమైన మాటలు మాట్లాడలేను అందుకే నన్ను మళ్ళీ మూగవాడిని చెయ్యు అని అడిగాడు. సరేనంటూ అమ్మవారు ఆయనను మళ్ళీ మూగవాడిని చేసేసింది. ఈ విషయం తెలుసుకున్న అప్పటి కామకోటి పీతాధిపతి మార్తాండ విద్యాఘనేంద్ర సరస్వతీ స్వామి వారు మూకశంకరుల తల్లిదండ్రుల అనుమతితో ఆయనకు సన్యాసమిచ్చి పీఠానికి ఉత్తరాదికారిగా నియమించారు. ఇలా అమ్మవారి మహిమలు ఎన్నో ఎన్నెన్నో....
అమ్మవారి ఆలయం విశాలమైన ప్రాంగణంలో ప్రశాంతతకు మారుపేరుగా ఉంటుంది. ప్రతీరోజూ ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ.. తిరిగి 4 గంటల నుంచి రాత్రి 8.30వరకు అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు.
ఈ క్షేత్రానికి ఎలా వెళ్ళాలో చూద్దాం. కంచి క్షేత్రానికి బస్సు, రైలు మార్గాల్లో చేరుకోవచ్చు.
రోడ్డు మార్గం ద్వారా వెళ్ళాలి అంటే తిరుపతి చేరుకుని అక్కడ్నుంచి వెళ్లవచ్చు. తిరుపతిలో స్వామి దర్శనం చేసుకొని అక్కడి నుంచి వెళ్ళవచ్చు.తిరుపతి నుంచి కంచికి నేరుగా బస్సులు ఉన్నాయి. అలాగే హైదరాబాది, విశాఖపట్నం, విజయవాడ లాంటి నగరాలనుంచి బస్సులో నేరుగా చెన్నై వెళ్లి అక్కడ్నుంచి కోయంబేడ్ బస్స్టేషన్ నుంచి కంచికి బస్సులో వెళ్లవచ్చు.
రైలు మార్గంలో వెళ్లాలంటే:. చెన్నై వెళ్లి అక్కడ్నుంచి లోకల్ ట్రైన్ ద్వారా చేరుకోవచ్చు. మరోమార్గం తిరుపతికి నేరుగా ట్రైన్లో వెళ్లి అక్కడ్నుంచి పుదుచ్చేరి వెళ్లే రైలులో కంచికి వెళ్లవచ్చు.
విమాన మార్గం ద్వారా విల్లాలంతే చెన్నై విమానాశ్రయం నుంచి ప్రైవేటు వాహనాల ద్వారా కంచి వెళ్లవచ్చు.