Vijaya Lakshmi
Published on Sep 24 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?బొమ్మల కొలువు...! దసరా... అంటేనే అందరికీ గుర్తొచ్చేది నవరాత్రులు.. బొమ్మల కొలువులు. నవరాత్రి పూజలు అందరికీ ఆధ్యాత్మికతను పంచి ఇస్తే, బొమ్మల కొలువు ఆధ్యాత్మికతతో పాటు సరదాలను, సందడినీ ఇచ్చే వేడుక.
నిజానికి బొమ్మల కొలువు రెండు సందర్భాల్లో పెడతారు. సంక్రాంతికి, దసరా పండుగకు బొమ్మల కొలువు పెడతారు.
బొమ్మల కొలువు అంటే దొరికిన చక్కటి, అందమైన బొమ్మలను తీసుకొచ్చి పేర్చడం మాత్రమె కాదండోయ్ దానికీ ఓ పద్దతి ఉంది. బొమ్మల కొలువు తొమ్మిది మెట్లుగా ఏర్పాటు చేస్తారు. తొమ్మిది మెట్లే ఎందుకు? దీని వెనకున్న అర్థమేంటి పరమార్తమేంటి? బొమ్మల కొలువులో ఏయే దేవతలా మూర్తులు, ఏ క్రమంలో పేర్చాలి? దేవతలు మాత్రమేనా... దేవతలు కాకుండా ఇంకెలాంటి బొమ్మలు పెట్టాలి? అవి కూడా ఏ క్రమంలో పేర్చాలి? ఆ పేర్చడం వెనకున్న అంతరార్థం ఏంటి? బొమ్మల కొలువు ఏర్పాటు వెనకున్న సంప్రదాయం, ప్రయోజనం, పరమార్ధం ఏంటి? అసలెందుకీ బొమ్మల కొలువు? ఇలాంటి విషయాలన్నీ ఈ బ్లాగ్ లో తెలుసుకుందాం.
బొమ్మలకొలువు అంటే కేవలం బొమ్మల ప్రదర్శన మాత్రమే కాదందోయ్, ఇది మన ఆధ్యాత్మిక విశ్వాసం, కుటుంబ సమైక్యత, సాంస్కృతిక కళల ఉత్సవం. నవరాత్రి సందర్భంగా జరిగే ఈ పండుగలో దేవతల ఆరాధన, పిల్లల కోసం జ్ఞానపాఠాలు, మహిళల సృజనాత్మకత, సామాజిక ఐక్యత అన్నీ ఒకచోట కలుస్తాయి. ఒక్కో ప్రదేశంలో ఒక్కో పేరుతొ పిలిచినా బొమ్మల కొలువు పరమార్ధం, ప్రయోజనం మాత్రం ఒక్కటే. ఆధ్యాత్మిక, సామాజిక కలయిక, సాంఘిక ఐకమత్యం, సరదా, సందడుల వేడుక నవరాత్రి బొమ్మల కొలువు.
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ – బొమ్మల కొలువు అని పిలుస్తారు.
తమిళనాడు – గోలూ.
కర్ణాటక – బొమ్మా హేబ్బా.
కేరళ – నవరాత్రి కోలు.
దక్షిణాది లోనే కాదు ఉత్తరాది లో కూడా బొమ్మలకొలువు అత్యంత సంబరాలతో వేడుకగా జరుపుకుంటారు. అయితే దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా దసరా నవరాత్రులలో బొమ్మలకొలువు పెడితే, ఉత్తరాదిలో మాత్రం ఎక్కువగా సంక్రాంతి పండుగకు బొమ్మలకొలువు పెడతారు.
బొమ్మల కొలువు ఏర్పాటు చేసిన, ప్రతి రోజూ సాయంత్రము పేరంటానికి ముత్తైదువులను, పిల్లలను పిలిచి, అందరికీ తాంబూలము, దక్షిణ ఇవ్వడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని, అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని నమ్మకం.
నిజానికి బొమ్మల కొలువు ఎలా పడితే అలా పెట్టకూడదు. బొమ్మలకొలువు పెట్టడానికి ఒక ప్రత్యేకమైన పద్దతి ఉంటుంది.
సాధారణంగా 5, 7, 9 మెట్లు వేస్తారు. కొందరు 11 మెట్లు కూడా పెడతారు. పై మెట్లు దేవతల స్థానం. మధ్యలో మెట్లు పురాణ సన్నివేశాలు. కింద మెట్లు సాధారణ జీవన దృశ్యాలకు సంబంధించిన బొమ్మలు పెడతారు.
ఆశ్వయుజ పాడ్యమి నుండి దశమి వరకు ఈ కొలువు ఏర్పాటు చేస్తారు. అందుకో కూడా వారి వారి ఆసక్తి, అవకాశం అనుసరించి 1వ రోజు ప్రారంభించి దశమివరకు పదిరోజులు, 3వ రోజు ప్రారంభించి దశమి వరకు, 5వ రోజు ప్రారంభించి దశమి వరకు, 7వ రోజు లేదా 9వ రోజు నుండి కూడా ప్రారంభించవచ్చు.
పై మెట్ల మీద గణేశుడు, దుర్గ, లక్ష్మి, సరస్వతి, విష్ణు, శివుడు. మధ్య మెట్ల మీద రామాయణం, మహాభారత ఇతిహాసాల ఘట్టాల బొమ్మలు, దశావతారాలు, శివపార్వతి కల్యాణం వంటి సన్నివేశాల బొమ్మలు అమర్చిపెట్టాలి. కింద వరుసలలో రైతులు, కూలీలు, జానపద బొమ్మలు, రోజువారీ జీవన దృశ్యాలు మొదలైన జన జీవన ఘట్టాల బొమ్మలు అమరుస్తారు.
బొమ్మల కొలువులో ఏర్పాటు చేసే మెట్లు దేవతల నుంచి మనిషి వరకు. సృష్టి క్రమాన్ని సూచిస్తాయని చెబుతారు.
కొలువులో పెట్టె బొమ్మలు భిన్నత్వంలో ఏకత్వాన్ని (Unity in Diversity) తెలియజేస్తాయి.
బొమ్మల కొలువులో చేసే సామూహిక పూజలు – సమష్టి శక్తిని, ఐకమత్యాన్ని, కలిసికట్టుగా ఉండడాన్ని ప్రతిబింబిస్తాయి.
బొమ్మల కొలువులో పిల్లల భాగస్వామ్యం వలన వారిలో సంస్కృతి, భక్తి, కళలపై అవగాహన పెరుగడానికి దోహదపడుతుంది.
ఇక బొమ్మల కొలువులో పూజావిధానం చూస్తె, ప్రతిరోజూ దీపం వెలిగించి, స్తోత్రాలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆరాధనలు చేయాలి.
ఇరుగు, పొరుగువారు, బంధువులు, స్నేహితులు ఇంటికి వచ్చి బొమ్మల కొలువును చూసి, అందరూ కలిసి కట్టుగా కాలం గడుపుతారు. దీని మధ్య మనుషుల మధ్య సత్సంబంధాలు పెంపొందించే అవకాశం ఉంటుంది.
బొమ్మల కొలువు లో ముఖ్యంగా చిన్నపిల్లలు పాటలు, కథలు చెప్పడం కూడా భాగంగా ఉంటుంది. దీనివలన రాబోయే తరాలకు చక్కటి మార్గదర్శకంగా కూడా ఉంటుంది.
ముఖ్యంగా ఈ బొమ్మల కొలువు మహిళల మధ్య స్నేహబంధం పెంచే వేదికగా కూడా భావిస్తారు.
కొన్ని ప్రాంతాల్లో పెళ్లి చేసుకొని వెళుతున్న నూతన వధువుకు చీరె సారేలతో పాటు బొమ్మల కొలువు ఏర్పాటు చేసుకోడానికి బొమ్మలను ఇచ్చి పంపే సంప్రదాయం కూడా ఉంది. ఈ బొమ్మలను పట్టాడా గొంబే లేదా పట్టాత్ బొమ్మాయికల్ అని పిలుస్తారు.
బొమ్మల కొలువు ప్రారంభించిన సంవత్సరం ఒక వరుస బొమ్మలతో మొదలై, ప్రతీ సారి ఒకటి చొప్పున తొమ్మిది మెట్ల వరకు పెంచుతూ వెళతారు. ప్రతీ సంవత్సరము తప్పనిసరిగా ఓ క్రొత్త బొమ్మ కొనడం సంప్రదాయం. అలాగే వచ్చిన వారు కూడా ఒక కొత్త బొమ్మను బహుకరిస్తారు. ముఖ్యంగా బొమ్మల కొలువులో పాటించవలసిన, జాగ్రత్త పడవలసిన మరో ముఖ్యమైన అంశం... ప్లాస్టిక్ బొమ్మలు, బార్బీలు.. వంటివి కాకుండా మట్టి బొమ్మలు, కొయ్య బొమ్మలు మాత్రమే ఉండేలా చూసుకోవాలి.
సంస్కృతి సంప్రదాయాలు, నీతి కథలు, పురాణ గాథలు, ఇతిహాసాలు పిల్లలకు బోధపడేలా బొమ్మల కొలువును తీర్చిదిద్దుకోవాలి. దేవుని బొమ్మల్లో వినాయకుడు, సీతారాములు, రాదాకృష్ణులు, లక్ష్మిదేవి, సరస్వతిదేవి, పార్వతిదేవి.. పెట్టుకోవచ్చు. ఇక పెళ్ళితంతు బొమ్మలు, హాస్యబొమ్మలు, బామ్మ-తాత, గోపికలు, వివిధ జంతువుల బొమ్మలు, పక్షుల బొమ్మలు, పండ్లు, చెట్ల బొమ్మలు, ప్రయాణ సాధనాలు వంటివి కొలువులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
ప్రతి సంవత్సరం ఆనవాయితీగా బొమ్మల కొలువు పెట్టేవారు చెక్కతో మెట్ల బల్లను తయారు చేయించి పెట్టుకుంటారు. ఈ మెట్లు ఎప్పుడూ బేసి సంఖ్యలోనే ఏర్పాటు చేస్తారు. కొలువు ఏర్పాటు చేసినపుడు, శుభ్రమైన తెల్లటి బట్టతో మెట్లను కప్పి బొమ్మలను ఏర్పాటు చేస్తారు. ఈ బొమ్మలలో కొన్ని బొమ్మలు ఖచ్చితంగా పంచాంగం బ్రాహ్మణుడు, తల్లి=పిల్ల, పెద్ద ముత్తైదువ, ఆవు-దూడ లాంటి బొమ్మలు ఉండేలా చూస్తుకోవాలి.
మహిషాసురుడనే రాక్షసుడు ఒక్క స్త్రీ చేతిలో తప్ప మరెవరి వలనా మరణం లేకుండా బ్రహ్మ నుంచి వరం పొందాడు. బలహీనమైన స్త్రీ తననేం చెయ్యలేదు. ఇక ఎవరివల్లా తనకు మరణం లేదు అని గర్వంతో విర్రవీగుతూ మానవులను, మునులను, దేవతలను సకల లోకవాసులను ఎన్నో హింసలకు గురిచేస్తూ బాధపెడుతూ ఉన్నప్పుడు, ఆ బాధలను తట్టుకోలేక అందరూ కలిసి ఆ తల్లి పరాశక్తిని శరణు కోరడం ఆ తల్లి వెళ్లి మహిషాసురుడిని సంహరించి సకల లోకాలలో శాంతిని నెలకొల్పడం జరిగింది.
ఆది పరాశక్తి దేవి 9 రోజుల పాటు 9 రకాల రూపాల్లో వివిధ రాక్షసులను సంహరించింది మరియు 9వ రోజు, మహిషాసుర మర్దిని రూపంలో మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరించింది. పదవ రోజు అంటే విజయ దశమి నాడు, చెడుపై మంచి సాధించిన విజయాన్ని గుర్తుచేసుకుంటూ ఈ పండుగను జరుపుకుంటారు.
ఈ సందర్భంలోనే అమ్మవారు తన పరివారంతో సకల దేవతా గణాలతో కొలువుతీరిందని, ఆ ఘటనను సూచిస్తూ అమ్మవారు రాక్షసునిపై విజయం సాధించిన దానికి చిహ్నంగా జరుపుకునే దసరా పండుగకు నవరాత్రులలో ఈ బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తారని కథనం. అందుకే బొమ్మల కొలువులో అన్ని దేవతా, ముని, మానవ గణాల బొమ్మల మధ్యలో అమ్మవారి మూర్తిని ఏర్పాటు చేస్తారు.
బొమ్మల కొలువు వెనక మరొక పౌరాణిక కారణం కూడా చెప్తారు. అమ్మవారు రాక్షస సంహారం కోసం బయలుదేరినపుడు సర్వ దేవతలు, మునిగణాలు తమ తమ శక్తులన్నీ అమ్మవారిలో నిక్షిప్తం చేసి, తమ తమ ఆయుధాలన్నీ అప్పగించి, అమ్మను యుద్ధానికి సాగనంపారు. ఆ సమయంలో అందరూ ఎటువంటి శక్తి లేని విగ్రహాల వలె మారిపోయారని దానిని సూచిస్తూ కూడ ఈ బొమ్మల కొలువు పెట్టడం జరుగుతుందని కూడా చెప్తారు.
సంక్రాంతి పండుగకు కూడా బొమ్మలకొలువు పెట్టడం కొన్ని ప్రాంతాల్లో, కుటుంబాల్లో ఆచారంగా ఉంటుంది. సంక్రాంతి బొమ్మలకొలువు నాలుగు రోజుల పాటు చేస్తారు.
జనవరి నెలలో జరుపుకునే సంక్రాంతి/ఉత్తరాయణ పండుగ సమయంలో కూడా కొలువు పండుగను పాటిస్తారు. ఇది 4 రోజుల పాటు జరుపుకునే పంట పండుగ:
1వ రోజు - భోగి; ఒక భోగి పండుగ
2వ రోజు - సంక్రాంతి; ఒక పంట పండుగ
3వ రోజు - కనుము; ఎద్దులు, ఆవులు, గొర్రెలు, మేకలు, పక్షులు మరియు చేపలు వంటి పెంపుడు జంతువుల పండుగ.
4వ రోజు - ముక్కనుము; సంక్రాంతి పండుగ చివరి రోజు.
సంక్రాంతి బొమ్మలకొలువు భోగి పండుగ నుండి ప్రారంభమై కనుము లేదా ముక్కనుము నాడు ముగుస్తుంది. సంక్రాంతి బొమ్మల కొలువు కు కూడా ఒక పురాణ కథనం ఉంది.
సంక్రాంతి పండుగ సమయంలో బొమ్మల ప్రదర్శనకు సంబంధించి ఒక ఆసక్తికరమైన పౌరాణిక కథ ఉంది. కలియుగం ప్రారంభంలో (హిందూ పురాణాల ప్రకారం ప్రస్తుత యుగం/కాల చక్రం) సంక్రాంతి సమయంలో కొలువు ఉనికిలోకి వచ్చిందని చెబుతారు. పంట పండుగ సమయంలో ఈ సంప్రదాయాన్ని పాండవ వంశానికి చెందిన రాజు శాతానికుడు ప్రారంభించాడు. శాతానికుడు జనమేజయుడు కుమారుడు, పాండవ యోధుడు రాజు అర్జునుడి మునిమనవడు.