వింత వినాయకులు : బాలకృష్ణుడిని ఒళ్లో కూర్చోబెట్టుకొని ... | Strange Vinayaka: Sitting on the lap of Balakrishna...

Vijaya Lakshmi

Published on Sep 03 2025

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

ఈమధ్యకాలంలో కొన్నేళ్ళ నుంచి వినాయక నవరాత్రి సంబరాల్లో వినాయక మండపాలలో రకరకాల ఆకారాల్లో భంగిమల్లో గణపయ్యను చూస్తుంటాం. కొన్ని ఆకారాలు ఆశ్చర్యం గొలిపితే మరికొన్ని విచిత్రంగా విడ్డూరంగా ఉంటాయి. అయితే గణేశ మండపాలలో మాత్రమే కాదు, ఇలా ప్రత్యేకమైన భంగిమల్లో ఆకారాల్లో వినాయకుడు కొలువుతీరిన ఆలయాలు కొన్ని ఉన్నాయి. ఆ ఆలయాలు ఎక్కెడెక్కడ ఉన్నాయి... గణపయ్య ఏ రూపాల్లో కొలువై ఉన్నాడో అలా ఎందుకు కొలువుతీరాడో చూద్దాం...


 

బాలక్రిష్ణుడ్ని ఒడిలో కూర్చోబెట్టుకొని.

శ్రీమహావిష్ణువు పార్వతీదేవికి సోదరుడని భావిస్తారు. దాని ప్రకారం పార్వతీదేవి కుమారుడు వినాయకుడు శ్రీమహావిష్ణువుకు మేనల్లుడుగా భావిస్తారు. ఇక శ్రీకృష్ణుడు శ్రీ మ‌హావిష్ణువు అవతారం. మేనమామ బాల‌కృష్ణుడి రూపంలో మేన‌ల్లుడయిన వినాయకుడి ఒడిలో కూర్చొని భాగ‌వతం వింటున్న అపురూప దృశ్యం నిజంగా అద్భుతం క‌దా! ఈ అద్భుతాన్ని మనం కేర‌ళ‌లోని కొట్టాయం స‌మీపంలోని మ‌ళ్లియూర్ పుణ్య‌క్షేత్రంలో చూడ‌వ‌చ్చు.


పూజారే కారణం

అయితే ఇక్కడ వినాయకుడు ఒడిలో బాలకృష్ణుని కూర్చోబెట్టుకొని ఉన్న భంగిమలో వెలియడానికి కారణమేంటి అన్న విషయానికి వస్తే ఆలయ పూజారి శంక‌ర‌న్ నంబూద్రిని చెప్పుకోవాలి. శంకరన్ నంబూద్రి ప్రతి నిత్యం గ‌ణ‌ప‌తి విగ్రహం పక్కనే సాల‌గ్రామాన్ని పెట్టుకుని పూజిస్తుండేవాడు. అక్కడే నిత్యం భాగ‌వ‌తం పారాయ‌ణం చేస్తుండేవాడు. ఒక‌నాడు నంబూద్రి పూజ‌లో ఉండ‌గా వినాయ‌కుడి విగ్రహంలో బాలకృష్ణుని రూపం కనబడింది. దాంతో తను చూసిన ఆ దృశ్యాన్ని ఒక విగ్రహంగా చెక్కాడు. ఆ విగ్రహమే ఇప్పుడు ఈ ఆల‌యంలో ప్రధాన విగ్రహంగా పూజ‌లందుకుంటుంది.

వినాయ‌క చ‌వితి రోజు ఆ ఆల‌యంలో పితృదోష ప‌రిహార పూజ‌లు జ‌రుపుతారు. సంతాన భాగ్యం కోసం పాలు, పాయ‌సం నివేదించి పూజిస్తారు. తులాభారం ఇచ్చి మొక్కులు కూడా తీర్చుకుంటారు.



వినాయకి : స్త్రీ రూపంలో వినాయకుడు

మరో వింత వినాయక రూపం తమిళనాడులో ఉన్న సుచీంద్రం ఆలయంలో ఉన్న విజయ వినాయకి రూపం. కొన్ని సందర్భాల్లో పురుష దేవుళ్లు స్త్రీరూపం ధరించినట్టుగా పురాణ కథల్లో వింటూంటాం. అలాగే వినాయకుడు కూడా స్త్రీశక్తిగా అవతరించాడని ఓ కథనం ఉంది.


పరమేశ్వరుడు అంధకాసురుడిని వధించే సమయంలో చాలామంది దేవుళ్ళు స్త్రీరూపంలో ఆవిర్భవించారని పురాణ కథనాలున్నాయి. అలా వినాయకుడి నుంచి వినాయకి వచ్చిందని చెబుతారు. స్త్రీరూప వినాయకుడు 64 మంది యోగినులలో ఒకరని కూడా చెబుతారు.


గజానని, వినాయకి, విఘ్నేశ్వరి అన్న పేర్లతో వినాయకుని స్త్రీమూర్తిని  కొలుస్తారు. ఇందుకు నిదర్శనంగా తమిళనాడులోని చాలా ఆలయాల్లో గోడలమీద కుడ్యాలపై స్త్రీమూర్తిగా ఉన్న గణపతి మూర్తులు కనబడతాయి. తమిళనాడులోని సుచీంద్రం ఆలయంలో ఏకంగా వినాయకి విగ్రహాన్నే చూడొచ్చు.


త్రినేత్ర గణపతి

వినాయకుడికి సిద్ధి, బుద్ధి అనే ఇద్దరు భార్యలని పురాణ గాథ‌లు చెబుతుంటాయి. కానీ ఏ ఆల‌యంలో చూసినా గ‌ణేశుడు ఒక్కడే మనకు దర్శనమిస్తాడు. సిద్ధి బుద్ధిలతో కలిసి వినాయకుడు కనిపించే ఆలయాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. అలాంటి అరుదైన దేవాల‌యమే రాజ‌స్థాన్ రాష్ట్రంలోని స‌వాయ్ మ‌ధోపూర్ జిల్లా ర‌ణ‌థంబోర్ కోట‌లో ఉన్న త్రినేత్ర గ‌ణ‌ప‌తి ఆల‌యం.



ర‌ణ‌థంబోర్ వినాయ‌కుడిని ప‌ర‌మ శ‌క్తిమంతుడిగా చ‌రిత్ర చెబుతోంది. ర‌ణ‌థంబోర్ రాజు హ‌మీర్‌కూ, ఢిల్లీ పాల‌కుడు అల్లావుద్దీన్ ఖిల్జీకి మ‌ధ్య భీక‌ర యుద్ధం మొద‌లైంది. యుద్ధ స‌మ‌యంలో సైనికులకు అవ‌స‌ర‌మైన ఆహారాన్ని, ఇత‌ర స‌రుకుల‌ను కోట‌లోని ఒక ఆల‌యంలో నిల్వ చేశారు.


యుద్ధం దాదాపు ఏడాది పాటు కొన‌సాగింది. దీంతో నిల్వ చేసిన స‌రుకులు మొత్తం అయిపోయాయి. ఇక హ‌మీర్‌కు ఏమి చేయాలో అర్థం కాక, ఇలా జరిగిందేంటా? అని మ‌థ‌న‌ప‌డుతూ ఉన్నాడు. అప్పుడు నిద్రలో వినాయ‌కుడు ఆయ‌న క‌ల‌లోకి వ‌చ్చి మర్నాటికల్లా అన్ని స‌మ‌స్య‌లు తీరిపోతాయ‌ని చెప్పాడట. ఆ మర్నాడు ఉదయం కోటలో ఒక గోడ‌పై మూడు నేత్రాలు ఉన్న వినాయ‌కుడి ఆకృతి క‌నిపించింది. ఆ త‌ర్వాత ఖిల్జీ సేన‌లు వెనుదిరిగి వెళ్లిపోయారు. కోట‌లోని గోదాముల‌న్నీ కూడా సరుకుల‌తో నిండి ఉన్నాయి.

దీంతో వినాయకుడే త‌మ రాజ్యాన్ని కాపాడాడ‌ని నమ్మిన హమీర్ రాజు . క్రీ.శ‌.1300వ సంవ‌త్సరంలో కోట‌లోనే వినాయ‌క ఆల‌యాన్ని నిర్మించాడు. ఆ స్వామే త్రినేత్ర గణపతి ఆలయం. ఈ స్వామిని కొలిస్తే విద్య‌, విజ్ఞానాల‌తో పాటు సంప‌ద‌ను, సౌభాగ్యాన్ని అనుగ్ర‌హిస్తాడ‌ని విశ్వాసం.


మిరాకిల్ వినాయ‌గ‌ర్


తమిళనాడులోని నాగర్ కోయిల్ జిల్లా కేరళపురంలోని శ్రీ మ‌హాదేవ‌ర్ అతిశ‌య వినాయ‌గ‌ర్ ఆలయంలో వినాయకుడు. ఈ వినాయకుడు రంగులు మారుతూ ఉంటాడు.

ఈ గ‌ణ‌ప‌తి మార్చి నుంచి జూన్ వ‌ర‌కు న‌ల్ల‌ని రంగులో ఉంటాడు. జూలై నుంచి ఫిబ్ర‌వ‌రి వ‌ర‌కు తెలుపు రంగులో ద‌ర్శ‌న‌మిస్తాడు. ఈ ఆల‌యంలోని బావి కూడా ఇలాంటి మ‌హ‌త్మ్య‌మే ఉంది. ఇక్క‌డి వినాయ‌కుడు త‌న రంగును మార్చుకున్న‌ట్టే. ఈ బావిలోని నీరు కూడా రంగు మారుతుంది. గ‌ణేశుడు తెలుపు రంగులో ఉన్నప్పుడు బావిలో నీరు న‌లుపు వ‌ర్ణంలో క‌నిపిస్తాయి. అదే న‌లుపు రంగులో క‌నిపిస్తే.. బావిలో నీరు తెలుపు రంగులో క‌నిపిస్తాయి. అంతేకాదు ఈ ఆల‌యంలోని మ‌ర్రి చెట్టు శిశిర రుతువుకు బ‌దులు.. ద‌క్షిణాయ‌ణంలో ఆకులు రాల్చి, ఉత్త‌రాయ‌ణంలో చిగురిస్తుంది. అందుకే ఈ ఆల‌యాన్ని మిరాకిల్ వినాయ‌గ‌ర్ ఆల‌యం అని కూడా పిలుస్తారు.


మ‌ధుర్ మ‌హాగ‌ణ‌ప‌తి


కేర‌ళ, క‌ర్ణాట‌క రాష్ట్రాల స‌రిహ‌ద్దులోని కాస‌ర్ గోడ్ జిల్లాలోని మ‌ధుర్ గ్రామంలోని శివాలయంలో ఉన్న వినాయ‌క విగ్ర‌హం. ఈ వినాయకుడి విగ్రహం క్రమంగా పెరుగుతోందని స్థానికులు చెప్తారు. నిజానికి ఈ ఆలయం శివాలయం. ఆ ఆలయ పూజారి కొడుకు ఆడుకుంటూ గర్భగుడిలోకి వెల్లి అక్కడ గోడ మీద ఏవో గీతాలు గీయడం మొదలుపెట్టాడు. ఆ గీతలు క్రమంగా వినాయకుడిగా రూపుదిద్దుకుంది. అయితే ఈ గ‌ణ‌ప‌తి విగ్ర‌హం నానాటికీ పెరుగుతోంది.


మధుర కారణంగా

ఈ విషయాన్ని  మ‌ధుర అనే ఒక స్త్రీ క‌నుగొన్న‌ది. దీంతో ఆమె పేరు మీదుగానే ఈ ఆల‌యం మ‌ధుర్ మ‌హాగ‌ణ‌ప‌తి ఆల‌యంగా ప్ర‌సిద్ధి చెందింది. ఈ విగ్ర‌హాన్ని మ‌ధుర తొలిసారిగా చూసింది కాబ‌ట్టి.. అప్ప‌టి నుంచి ఆ ఆల‌యంలో తొలి ద‌ర్శ‌నం మ‌హిళ‌ల‌కే క‌ల్పిస్తుండ‌టం విశేషం.

దొడ్డ గ‌ణ‌ప‌తి గా ప్రసిద్ధి చెందిన భారీ గణేశుడు.


బెంగ‌ళూరులోని బ‌స‌వ‌న‌గుడి బుల్ ఆల‌యం ప‌క్క‌నే ఉంది ఈ దొడ్డ గ‌ణ‌ప‌తి ఆల‌యం. ఈ గ‌ణ‌ప‌తి విగ్ర‌హం 18 అడుగుల పొడ‌వు, 16 అడుగుల వెడ‌ల్పుతో భారీగా ఉంటుంది. ఈయ‌న‌ను స‌త్య గ‌ణ‌ప‌తి, శ‌క్తి గ‌ణ‌ప‌తి అని పిలుస్తుంటారు. వారంలో అన్ని రోజులు ఇక్క‌డ విఘ్నేశుడికి పూజ‌లు చేసి ర‌క‌ర‌కాల అలంక‌ర‌ణ‌లు చేస్తుంటారు. ఈ అలంక‌ర‌ణ‌లో ముఖ్య‌మైన‌ది వెన్న‌తో అలంక‌రించ‌డం. ఈ భారీ గ‌ణేశుడిని వెన్న‌తో అలంక‌రించేందుకు 100 కేజీలకు పైగా వెన్న అవ‌స‌రం ప‌డుతుంద‌ట‌.


త్రిశుండ్ గణపతి


మూడు తొండాలు, ఆరు చేతులు ఉన్న వినాయ‌కుడిని మనం ఎప్పుడూ చూడం. అయితే ఈ ఆకారంలో ఉన్న గణపతిని  మ‌హారాష్ట్ర పుణేలోని సోమ్వార్ పేట్ జిల్లాలోని న‌జ‌గిరి న‌దీ తీరంలో చూస్తాం. అక్కడ  మూడు తొండ‌లు ఉన్న త్రిశుండ్ గ‌ణ‌ప‌తి దేవాల‌యం ఉంది. సాధారంగా వినాయకుడిని మూషిక వాహనుడిగా చూస్తాం. కాని ఇక్క‌డి ఆల‌యంలో వినాయ‌కుడు నెమ‌లి వాహ‌నంపై ఆసీనుడై ఉంటాడు.


శ్వేతార్క‌ గ‌ణ‌ప‌తి



శ్వేతార్క‌మూలం అంటే తెల్ల జిల్లేడు వేరు. తెల్లజిల్లేడు  వేరులో విఘ్నేశ్వరుడు కొలువై ఉంటాడ‌ని ప్ర‌తీతి. తెల్లజిల్లేడు వేర్లు అచ్చం గ‌ణేశుడి ఆకారంలో క‌నిపిస్తాయని చెప్తారు. వ‌రంగ‌ల్ జిల్లా కాజీపేట ప‌ట్ట‌ణంలో రైల్వే దేవాల‌యం కాంప్లెక్స్‌లో ఉన్న గ‌ణ‌ప‌తి దేవాలయం శ్వేతార్క గ‌ణ‌ప‌తి ఆల‌యంగా ప్ర‌సిద్ధి పొందింది. ఈ దేవాలయంలో ఉన్న గ‌ణ‌ప‌తి విగ్ర‌హం స్వ‌యంభువుగా వెలిసింది.


కాణిపాకం వరసిద్ధి వినాయకుడు.


ఆంధ్రప్రదేశ్ లో చిత్తూరు జిల్లాలో ఉన్న ప్రసిద్ధ క్షేత్రం తిరుపతికి సమీపంలో ఉన్న కాణిపాకం వినాయ‌కుడి గురించి అంద‌రికీ తెలిసిందే. బావిలో వెలసిన ఈ గణపయ్య విగ్రహం నానాటికీ భారీగా పెరిగిపోతోంద‌ని చెప్తారు. కాణిపాకం వినాయకుడు సత్యప్రమాణాల దేవుడిగా ప్రసిద్ధి చెందాడు.


         ఇవి వింత ఆకారాలతో, విచిత్ర భంగిమలతో వివిధ ప్రదేశాలలో వెలసిన వినాయకుని ఆలయాలు.


ఇవి కూడా చదవండి

 

Recent Posts