కనుమ నాటి కోనసీమ ప్రభల తీర్థం రాష్ట్ర పండుగగా | వీరభద్ర ప్రభలు | what is prabhala teertham

Vijaya Lakshmi

Published on Jan 12 2026

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

సంక్రాంతి పండుగ వచ్చేసింది. సంక్రాంతి అంటేనే సందళ్ళు, సరదాలు. భోగిమంటలు, బొమ్మలకొలువులు, గాలిపటాలు, కోడి పందాలు, పిండివంటలు. ఇవన్నీ ఒక ఎత్తయితే ప్రంపంచాన్ని ఆకట్టుకునే కోనసీమ ప్రభలతీర్థం ఒక ఎత్తు. ప్రభలతీర్థం కొంతమందికి తెలిసినా చాలామందికి ఈ ప్రభలతీర్థం అన్నమాట కొత్తగా ఉంది కదూ. ఎస్... గోదావరి జిల్లాల్లో,  పచ్చదనాల కోనసీమలో సంక్రాంతి పండుగవేళ జరిగే అద్భుత ఉత్సవం ప్రభలతీర్థం. కొన్ని రోజుల క్రితమే జగ్గన్నతోట ప్రభలతీర్థాన్ని రాష్ట్రపండుగగా ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ నేపధ్యంలో అసలేంటీ ప్రభలతీర్థం... దీని చరిత్రేంటి? గోదావరి జిల్లాల్లో కోనసీమలో ప్రభలతీర్థానికి ఇంత ప్రాధాన్యత ఎందుకు? భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తరుపున పాల్గొని ప్రధానితో సహా అందరి మన్ననలు పొందిన ప్రభల శకటం చరిత్రేంటి? అసలు సంక్రాంతి పండుగ వేళే ఈ జగ్గన్నతోట ప్రభలతీర్థం ఎందుకు జరుగుతుంది? ఈ విశేషాలన్నీ ఈ బ్లాగ్ లో ...



సంక్రాంతి కళకళ

 సంక్రాంతి పండుగ అంటే తెలుగువారికి ఎక్కడలేని సంబరం. వృత్తి, ఉద్యోగాల రీత్యా సుదూరతీరంలో ఎక్కడెక్కడో ఉన్న తెలుగువారందరినీ పల్లెల్లో, సొంతూళ్ళలో ఒక్క దగ్గర చేర్చే ఏకైక పండుగ సంక్రాంతి పండుగ. సంక్రాంతి పండుగకు జనమంతా సొంతగడ్డకు తరలిపోవడంతో, కొన్ని పట్టణాలు, నగరాలే ఖాళీ అయిపోయి నిర్మానుష్యంగా మారిపోతాయంటే, తెలుగువారికి సంక్రాంతి పండుగ ఎంత ప్రాధాన్యమో అర్థమవుతుంది.

తెలుగుసీమలో పండుగకు తరలివచ్చిన పిల్లాపాపలతో, కుటుంబసభ్యులతో ప్రతి ఇల్లు, పల్లె కళకళలాడిపోతాయి. ఉవ్వెత్తున ఎగిసిపడే భోగిమంటలు, అందులో వేసే పిడకల దండలు, భోగిపళ్లు, బొమ్మల కొలువులు, ఘుమఘుమలాడే పిండివంటలు, చిరకాలానికి కలుసుకున్న స్నేహితుల పలకరింపులు, ఆత్మీయుల ఆదరింపులు, కూతుళ్ళ ముచ్చట్లు, అల్లుళ్ళ అచ్చట్లు అబ్బో...! సంక్రాంతి పండుగ సందళ్ళు చూడాలంటే తెలుగువారి లోగిళ్ళే.


గోదావరి జిల్లాల్లో ప్రభల తీర్థం

ఇవన్నీ ఒక ఎత్తయితే గోదావరి జిల్లాల్లో, కోనసీమలో జరిగే ప్రభలతీర్థాలు అందులోను జగ్గన్నపేట ప్రభలతీర్థం మరో ఎత్తు. ఎటు చూసినా పచ్చదనంతో, పండుగ వేళ పచ్చటి పట్టు పరికిణీ కట్టుకొని నిండు గోదావరిలా కళకళలాడుతున్న పల్లెపడుచులా భాసిల్లుతుంది కోనసీమ.

సంక్రాంతిని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లో అనేక ఉత్సవాలు జరుగుతాయి. అలాగే కోనసీమలో కూడా. కోనసీమ అనగానే ఎన్నో ప్రత్యేకతలు మన కళ్ళముందు కనబడతాయి. అందులో ముఖ్యమైనది ప్రభల తీర్థం ఒకటి. కోనసీమలో కొన్ని చోట్ల సంక్రాంతి నాడు, మరికొన్ని చోట్ల కనుమ నాడు ఈ ప్రభలతీర్థాలు నిర్వహిస్తారు. వీటన్నింటిలోనూ అత్యంత ప్రసిద్ధి చెందింది  జగ్గన్నతోటలో జరిగే ప్రభల తీర్థం.


జగ్గన్నతోట ప్రభల తీర్థం

అమలాపురానికి దగ్గరలోని మొసలపల్లి-ఇరుసుమండ గ్రామాల మధ్య గల ఏడెకరాలను జగ్గన్నతోటగా పిలుస్తారు. జగ్గన్నతోటలో ప్రతీ ఏడాది నిర్వహించే ఈ ప్రభల తీర్థానికి లక్షల సంఖ్యలో జనం తరలివస్తుంటారు. ఈ జగ్గన్నతోట ప్రభల తీర్థానికి 450 ఏళ్ల చరిత్ర ఉంది.


ఆంద్రప్రదేశ్ రాష్ట్ర పండుగగా

ఇటీవలే కోనసీమ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబమైన జగ్గన్నతోట ప్రభల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా నిర్ణయించారు. ఈ సంవత్సరం సుమారు 5-6 లక్షల మంది ఈ ఉత్సవాలకు హాజరవుతారని అంచనా.

జగ్గన్నతోట

మకర సంక్రమణ ఉత్తరాయణ మహాపుణ్యకాలంలో సంక్రాంతి మరునాడు వచ్చే కనుమ పండుగ నాడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మొసలపల్లి గ్రామం మొసలిపల్లి శివారు జగ్గన్నతోటలో జరుగుతుంది ఈ ఉత్సవం. ఒకప్పటి ఆ ప్రాంత సంస్థానదీశులైన శ్రీరాజావత్సవాయి జగన్నాధమహారాజుకు చెందిన తోట, జగ్గన్న తోట అనే పేరుతో ప్రసిద్ధి చెందింది.


450 ఏళ్ల చరిత్ర – ఏకాదశ రుద్రులు

 శతాబ్దాల చరిత్ర ఉంది ఈ ఉత్సవాలకు. ఏకాదశ రుద్రులు చుట్టుపక్కల 11 గ్రామాల నుంచి బయలుదేరి జగ్గన్నతోటలో ఆ రోజు కొలువు దీరతారని, అక్కడ ప్రజాక్షేమం కోసం చర్చిస్తారని కోనసీమ వాసుల నమ్మకం.

పురాణాల్లోని ‘ఏకాదశ రుద్రుల’కు ప్రతీకలైనవారు కోనసీమలోని ఇరుగుపొరుగు గ్రామాల్లో కొలువై ఉన్నారని,  మొసలపల్లి గ్రామదైవం భోగేశ్వరస్వామి ఆహ్వానం మేరకు వీరందరూ సంవత్సరానికి ఒకసారి సమావేశమై లోక కల్యాణం కోసం చర్చలు సాగిస్తారని,అలా 11మంది ఒకచోట నిర్వహించే సమావేశమే ప్రభల తీర్థం పరమార్థమని పెద్దలు చెబుతుంటారు.


జగ్గన్నతోట ప్రభల తీర్థం ఎందుకు చేస్తారు?

లోకకల్యాణం కోసం పూర్వం ఈ తోటలోనే ఈ పదకొండు గ్రామాల రుద్రులు మొట్టమొదటిసారిగా సమావేశమయ్యారని, ప్రజా సంక్షేమం కోసం చర్చలు జరిపారని చెబుతారు. అప్పటినుంచి  ఏకాదశరుద్రులు సంవత్సరానికి ఒకసారి ఇక్కడ సమావేశం అవ్వడంతో ఈ తోట విశేష ప్రాధాన్యత సంతరించుకుంది. పూర్వం ఈ ప్రాంతంలో తీవ్రమైన పరిణామాలు, కరువు కాటకాలు, సంక్షోభం ఏర్పడ్డాయట. దాంతో ఈ పరిస్తితుల నుంచి ఆ ప్రాంతాన్ని రక్షించడం కోసం 11 గ్రామాల రుద్రులు ఈ తోటలోనే సమావేశం అయ్యి,  లోక రక్షణ కోసం చర్యలు తీసుకున్నారని చెబుతారు. ఆ ఘటనకు చిహ్నంగా నాటి నుంచి నేటి వరకు ప్రతీ ఏడాది కనుమ పండుగ రోజు ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఈ ఏకాదశ రుద్రులను ఒక్కచోట చేర్చుతారు 11 గ్రామాల ప్రజలు. దాదాపు 400 ఏళ్ల నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతుంది. ఏకాదశరుద్రులు ఒక్కచోటకొలువు తీరేది ఈ భూమండలం మొత్తానికీ ఈ ఒక్కచోటే అని గాఢంగా నమ్ముతారు.  

ఇది కూడా చదవండి : 

ఏకాదశ రుద్రులు  

అంబాజీపేట మండలంలోని వ్యాఘ్రేశ్వరం, శ్రీవ్యాఘ్రేశ్వరస్వామి, పుల్లేటికుర్రు అభినవవ్యాఘ్రేశ్వరస్వామి, మొసలపల్లి మధుమానంతభోగేశ్వరస్వామి, గంగలకుర్రు చెన్నమల్లేశ్వరుడు

గంగలకుర్రు(అగ్రహారం) వీరేశ్వరుడు. పెదపూడి మేనకేశ్వరుడు, ఇరుసుమండ ఆనందరామేశ్వరుడు, వక్కలంక విశ్వేశ్వరుడు, నేదునూరు చెన్నమల్లేశ్వరుడు, ముక్కామల రాఘవేశ్వరుడు, పాలగుమ్మి చెన్నమల్లేశ్వరులను 11 రుద్రులుగా భావిస్తారు. ఈ ఏకాదశ రుద్రులకు వ్యాఘ్రేశ్వరుడు అధిష్టానంగా చెప్తారు.


రుద్ర ప్రభలు తయారుచేసే పధ్ధతి

ఒక ప్రత్యేక పద్ధతిలో ఈ ప్రభలను తయారుచేస్తారు. తాటి దూలాలు, టేకు చెక్కలు, వెదురు బొంగుల సహాయంతో గోపురం ఆకారంలో కడతారు. వాటి మధ్య రంగురంగుల వస్త్రాలతో అందంగా అలంకరిస్తారు. కర్రలతో అలా తయారుచేసిన దానికి ఎర్రని గుడ్డను తెరలా కడతారు. ముందు, వెనక భాగాల్ని జీవాత్మ పరమాత్మల ప్రతీకలుగా పరిగణిస్తారు. పైభాగంలో ఆలయాల్లోని ఇత్తడి కలశాలను బోర్లించి కట్టి ఆ పైన వరి కంకులు, నెమలి పింఛాలు, పూల దండలతో అలంకరిస్తారు. వాటి మధ్యలో ఉత్సవ విగ్రహాలు ఉంచడానికి వీలుగా గద్దెలు ఏర్పాటు చేస్తారు. వాటి మీద ఆయా గ్రామాల్లోని శివుడి ఉత్సవ విగ్రహాలు అమరుస్తారు. చివరికి ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా వస్తుంది ప్రభల ఆకారం. ఈ ప్రభల్ని పరమశివుడి వెంట ఉండే వీరభద్రుడి ప్రతీకలుగా భావించి ‘వీరభద్ర ప్రభలు’గా పిలుస్తారు. 

అద్భుత దృశ్యం

ఈ ఏకాదశ రుద్రులను ప్రభలపై ప్రత్యేక అలంకరణతో ఆకర్షనీయంగా తీర్చిదిద్ది, మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భాజాబజంత్రీల నడుమ అత్యంత కోలాహలంగా ఈ ప్రభలను జగ్గన్నతోటకు తీసుకువస్టారు ఆయా గ్రామాల ప్రజలు. ‘హరహర మహాదేవ’ ‘శరభ శరభా’ అంటూ నినాదాలతో, శివనామస్మరణతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోతుంది. భక్తి నినాదాలతో, శివయ్య స్మరణతో శివదేవునికి ప్రతీకగా భావించే ప్రభలను మోసుకుంటూ ఆయా గ్రామాలకు చెందిన భక్తులు జగ్గన్నతోటకు తరలి వెళ్ళే దృశ్యాలు చూడడానికి రెండు కళ్ళు చాలవు. ఈ ఏకాదశ రుద్రలకు మొసలపల్లికి చెందిన మధుమానంత భొగేశ్వరుడు ఆతిథ్యం ఇస్తారు. అందుకే మొసలపల్లి మధుమానంత భొగేశ్వర రుద్రుడు అన్ని ప్రభల కన్నాముందే జగ్గన్న తోటకు చేరుకుని, మళ్ళీ ఉత్సవం ముగిసిన తరువాత అందరు రుద్రులనూ తిరిగి సాగనంపిన తరువాత తన స్థానానికి చేరుకోవడం ఆనవాయితీ. ఈ 11 మంది ఏకాదశరుద్రులకు అధ్యక్షత వహించేది వ్యాఘ్రేశ్వారానికి చెందిన ‘శ్రీవ్యాఘ్రేశ్వర రుద్రుడు’. అందుకే ఈ వ్యాఘ్రేశ్వరుడుకి చెందిన ప్రభ తోటలోకి రాగానే మిగతా రుద్ర ప్రభలన్నింటినీ మర్యాదపూర్వకంగా ఒక్కసారిలేపి మళ్లీ కిందకుదించుతారు.



గంగలకుర్రు, గంగలకుర్రు (అగ్రహారం) రుద్ర ప్రభల ప్రత్యేకత

ఈ సంబరమంతా ఒక ఎత్తయితే దాదాపు 30 మంది మోస్తేనే గాని లేవని బరువైన ప్రభలను మోసుకొని రావడం మరో ఎత్తు. గంగలకుర్రు, గంగలకుర్రు (అగ్రహారం) నుంచి వచ్చే రుద్ర ప్రభలు ఈ జగ్గన్నతోటకి చేరుకోవాలంటే మధ్యలో కౌశికిగా పిలిచే ఏరు  దాటి రావాలి. ప్రవహించే ఏటిలో మామూలుగా నడవడమే ఒక కష్టసాధ్యమైన పని అనుకుంటే, అతి బరువైన ఆ ప్రభలు  మోసుకుంటూ కాలువలోంచి ఎలాంటి జంకుగొంకు లేకుండా,  ‘హరహర మహాదేవ’ శరభ శరభా అంటూ నినదిస్తూ రావడం నిజంగా ఒళ్ళు గగుర్పిడిచే అరుదైన, అపూర్వమైన దృశ్యం. సాక్షాత్తూ పరమేశ్వరుడే ఆ ప్రభలలో తమ ప్రాంతంలో నడయాడుతున్నాట్టు పులకిన్చిపోతారు ఆ ప్రాంతీయులు. ఇంట అరుదైన దృశ్యాన్ని చూడడానికి ఎక్కడెక్కడి ప్రజలు తరలి రావడంలో ఆశ్చర్యం ఏముంది! 


కోనసీమ వేదసీమ

సాధారంగా గోదావరి జిల్లాలు, కోనసీమ అనగానే వెంటనే కళ్ళముందు కదిలేది పచ్చటి పైరుతో కళకళలాడే పంటపొలాలు, పిల్ల కాలువలు, గోదారి పాయలు, ప్రకృతి రమణీయత. అయితే అనేక దైవక్షేత్రాలకు నిలయమైన కోనసీమను వేదసీమ అని కూడా అంటారు.


రిపబ్లిక్ డే పరేడ్ లో ప్రభల శకటం

ఇంత ఆధ్యాత్మిక, చారిత్రిక ప్రాధాన్యత ఉన్నది కాబట్టే  2022 జనవరి 26న ఢిల్లీ కర్తవ్యపథ్‌లో జరిగిన 74వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తరుపున పాల్గొన్న ప్రభల శకటం అశేష జనాన్ని విశేషంగా ఆకర్షించింది.


FAQ : తరచుగా అడిగే ప్రశ్నలు

ప్రశ్న: ప్రభల తీర్థం ఎక్కడ చేస్తారు?

గోదావరి జిల్లాల్లో

ప్రశ్న: జగ్గన్నతోట ప్రభల తీర్థం ఎప్పుడు జరుగుతుంది? ఎక్కడ జరుగుతుంది?

మకర సంక్రమణ ఉత్తరాయణ మహాపుణ్యకాలంలో సంక్రాంతి మరునాడు వచ్చే కనుమ పండుగ నాడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మొసలపల్లి గ్రామం మొసలిపల్లి శివారు జగ్గన్నతోటలో జరుగుతుంది ఈ ఉత్సవం.

ప్రశ్న: జగ్గన్నతోట ప్రభల తీర్థం ఎందుకు జరుపుతారు?

లోకకల్యాణం కోసం పూర్వం ఈ జగ్గన్న తోటలోనే ఈ పదకొండు గ్రామాల రుద్రులు మొట్టమొదటిసారిగా సమావేశమయ్యారని, ప్రజా సంక్షేమం కోసం చర్చలు జరిపారని చెబుతారు. అప్పటినుంచి  ఏకాదశరుద్రులు సంవత్సరానికి ఒకసారి ఇక్కడ సమావేశం అవ్వడంతో ఈ తోట విశేష ప్రాధాన్యత సంతరించుకుంది. పూర్వం ఈ ప్రాంతంలో తీవ్రమైన పరిణామాలు, కరువు కాటకాలు, సంక్షోభం ఏర్పడ్డాయట. దాంతో ఈ పరిస్తితుల నుంచి ఆ ప్రాంతాన్ని రక్షించడం కోసం 11 గ్రామాల రుద్రులు ఈ తోటలోనే సమావేశం అయ్యి,  లోక రక్షణ కోసం చర్యలు తీసుకున్నారని చెబుతారు. ఆ ఘటనకు చిహ్నంగా నాటి నుంచి నేటి వరకు ప్రతీ ఏడాది కనుమ పండుగ రోజు ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఈ ఏకాదశ రుద్రులను ఒక్కచోట చేర్చుతారు 11 గ్రామాల ప్రజలు. దాదాపు 400 ఏళ్ల నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతుంది. ఏకాదశరుద్రులు ఒక్కచోటకొలువు తీరేది ఈ భూమండలం మొత్తానికీ ఈ ఒక్కచోటే అని గాఢంగా నమ్ముతారు.   

ప్రశ్న: జగ్గన్నతోట ప్రభల ఉత్సవానికి ఎంతమంది ప్రజలు వస్తారు?

సుమారు 5,6 లక్షల మంది వస్తారు.

ప్రశ్న: కోనసీమ ను వేదసీమ అని ఎందుకు పిలుస్తారు?

అనేక దైవక్షేత్రాలకు నిలయమైన కోనసీమను వేదసీమ అని కూడా అంటారు.

ప్రశ్న: రిపబ్లిక్ డే పరేడ్ లో ప్రభల శకటం ఎప్పుడు ప్రదర్శించారు?

ఇంత ఆధ్యాత్మిక, చారిత్రిక ప్రాధాన్యత ఉన్నది కాబట్టే  2022 జనవరి 26న ఢిల్లీ కర్తవ్యపథ్‌లో జరిగిన 74వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తరుపున పాల్గొన్న ప్రభల శకటం అశేష జనాన్ని విశేషంగా ఆకర్షించింది.

ప్రశ్న: జగ్గన్నతోట ప్రభల తీర్థం ఎక్కడ జరుగుతుంది>

అమలాపురానికి దగ్గరలోని మొసలపల్లి - ఇరుసుమండ గ్రామాల మధ్య గల ఏడెకరాలను జగ్గన్నతోటగా పిలుస్తారు. ఈ జగ్గన్నతోటలోనే ప్రతీ ఏడాదిజగ్గన్నతోట ప్రభల ఉత్సవం జరుగుతుంది.

ప్రశ్న: జగ్గన్నతోట ప్రభల తీర్థంలో సమావేశమయ్యే ఏకాదశ రుద్రులు ఎవరు?

అంబాజీపేట మండలంలోని వ్యాఘ్రేశ్వరం, శ్రీవ్యాఘ్రేశ్వరస్వామి, పుల్లేటికుర్రు అభినవవ్యాఘ్రేశ్వరస్వామి, మొసలపల్లి మధుమానంతభోగేశ్వరస్వామి, గంగలకుర్రు చెన్నమల్లేశ్వరుడు గంగలకుర్రు(అగ్రహారం) వీరేశ్వరుడు. పెదపూడి మేనకేశ్వరుడు, ఇరుసుమండ ఆనందరామేశ్వరుడు, వక్కలంక విశ్వేశ్వరుడు, నేదునూరు చెన్నమల్లేశ్వరుడు, ముక్కామల రాఘవేశ్వరుడు, పాలగుమ్మి చెన్నమల్లేశ్వరులను 11 రుద్రులుగా భావిస్తారు. ఈ ఏకాదశ రుద్రులకు వ్యాఘ్రేశ్వరుడు అధిష్టానంగా చెప్తారు.


ఇది కూడా చదవండి :

Recent Posts
రథ సప్తమి విశిష్టత: సూర్య జయంతి  |  పూజా విధానం | శాస్త్రీయ కోణం | ఆధ్యాత్మిక ప్రాముఖ్యత | Rath Saptami importance
రథ సప్తమి విశిష్టత: సూర్య జయంతి ...
తిరుమల (టిటిడి)  |  జనవరి 25న తిరుమలలో ర‌థ‌స‌ప్త‌మి వేడుకలు  | TTD news  |  Rath Saptami celebrations in Tirumala on January 25
తిరుమల (టిటిడి) | జనవరి...
తిరుమల 2026 ఏప్రిల్ నెల దర్శన, సేవల కోటా విడుదల వివరాలు | Tirumala April darshan, seva quota release details
తిరుమల 2026 ఏప్రిల్ నెల దర్శన, సేవల...
ఫిబ్రవరి నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో విశేష పర్వదినాలు | TTD news  |  important festivals  in Tirumala temple
ఫిబ్రవరి నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో విశేష...
2026 శ్రీ పంచమి (మదన పంచమి) ప్రాముఖ్యత  |  సరస్వతి పూజ విశేషాలు | Significance of sree panchami (Madan panchami) 2026
2026 శ్రీ పంచమి (మదన పంచమి) ప్రాముఖ్యత...