Vijaya Lakshmi
Published on Oct 23 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?చాముండీ క్రౌంచపట్టణే... అష్టాదశ శక్తిపీఠాలలో నాలుగవది మైసూర్ లోని చాముండేశ్వరిదేవి ఆలయం. త్రికరణ శుద్ధిగా ఈ తల్లిని మొక్కుకున్న ప్రతి మొక్కును అతి శీఘ్రంగా నెరవేస్తుంది. శత్రుభయం ఉండదు. విరోధులు మిత్రులపుతారు పెను విపత్తులాంటి ఆపదలు. కష్టాలు కన్నీళ్ళు అమ్మతన గోటితో తీసివేస్తుంది. ఇంతటి మహిమగల మహాశక్తి అయినందు వలన భారతదేశం నలుమూలలనుంచి వచ్చి అమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి ఇష్టకామ్యాలు తీర్చుకుంటారు.
చాముండేశ్వరిదేవిని కర్ణాటక ప్రజలు నాదదేవి అని పిలుస్తారు. వారు అమ్మవారిని తమ రాష్ట్ర దేవతగా భావిస్తారు.
సాధారణంగా ఎంతోమంది మహమ్మదీయ ప్రభువులు హిందూ ఆలయాలను ధ్వంసం చేసారని, కొల్లగొట్టారని, ఇలా ఎన్నో కథలు వింటూంటాం. కాని ఈ ఆలయం విషయంలో మాత్రం దానికి భిన్నంగా జరిగింది. మహమ్మదీయ ప్రభువులు ఈ ఆలయాన్ని కొల్లగొట్టడం కాదు... డానికి ఎన్నో కానుకలు సమర్పించి ఆలయ అభివృద్ధికి ఏంతో పాటుపడ్డారు. ఈ ఆలయ విశిష్టతలలో అది కూడా ఒకటి. అదే మైసూర్ చాముండీ ఆలయం...
అష్టాదశ శక్తిపీఠాలలో నాలుగవది చాముండేశ్వరీ శక్తిపీఠం. కర్ణాటకలోని మైసూర్‌లో. మైసూర్ నుండి 13 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 3,489 అడుగుల ఎత్తులో ఉన్న చాముండికొండ పైభాగంలో ఉంది ఈ శక్తిపీఠం. దీనిని క్రౌంచపీఠం అని కూడా పిలిస్తారు. ఇక్కడ సతీదేవి తలవెంట్రుకలు పడ్డాయని కొన్ని కథనాలు చెప్తుంటే అమ్మవారి దివ్యాభారణాలు పడ్డాయని మరికొన్ని కథనాలు చెప్తున్నాయి.
కర్ణాటక రాష్ట్రంలో ముడవ అతిపెద్ద నగరం మైసూరు. బెంగళూరుకు నైరుతి దిశగా సుమారు 146 కిలోమీటర్ల దూరంలో మైసూరు ఉంటుంది. మైసూరు, చాముండీదేవి అనగానే వెంటనే మనకు జ్ఞాపకం వచ్చేది మహిషాసురుడు. మహిసాసురుడిని సంహరించిన ఆమ్మవారు ఇక్కడ చాముండీదేవిగా కొలువుతీరిందని పురాణ కథనాలు. అసలు మైసూరు అనే పదం మహిషూరు అనే పదం నుంచి వచ్చిందని కూడా చెప్తారు. ఈ ప్రాంతమంతా ఒకప్పుడు మహిషాసురుడి రాజ్యం. మహిషుడి ఊరు. అందుకే అతడు పాలించిన ఊరిని మహిశాపురం అని మహిషూరు అని పిలిచేవారని అదే తరువాతి కాలంలో మైసూర్ గా మారిందని చెప్తారు.
ఇక స్థల పురాణం విషయానికి వస్తే పూర్వం మహిషాసురుడనే రాక్షసుడు కఠోర తపస్సుచేత బ్రహ్మ దేవుడి దగ్గర అనేక వరాలు సంపాదించుకున్నాడు. తనకు ఎవ్వరి చేతుల్లోను మరణం లేకుండా కూడా వరాన్ని కోరాడు మహిషాసురుడు కాని మరణం లేకుండా ఉండడం సాధ్యంకాదన్నాడు బ్రహ్మదేవుడు. మహిషాసురుడు స్త్రీని అబలగా భావించి, తనలాంటి వీరుణ్ణి ఏ స్త్రీ కూడా ఏమీ చెయ్యలేదని భావించి స్త్రీ తప్ప ఇతరుల చేతిలో మరణంలేని వరం పొందినాడు. సరే నన్నాడు బ్రహ్మ. పురుషుల చేతిలో తనకు మరణం లేకుండా వరం సంపాదించుకున్నాడు కాబట్టి, స్త్రీలెవ్వరూ తన లాంటి వీరుణ్ణి సంహరిమ్చలేరు కాబట్టి ఇక తనకు మరణమే ఉండదన్న గర్వంతో చెలరేగిపోయాడు మహిషుడు. అ వర గర్వంతో సకలలోకాలను పీడించసాగాడు. చివరకు ఇంద్రుని జయించి స్వర్గాన్ని కూడా ఆక్రమిస్తాడు. దాంతో భయభ్రాంతులైన సకలలోకవాసులు త్రిమూర్తులను వేడుకున్నారు. దుష్టపాలనతో ప్రజాకంటకుడుగా మారిన మహిషాసురుడు సంహరించుటకు జగన్మాత చాముండేశ్వరిగా అవతారము దాల్చి, రాక్షస సంహారము చేసెను. రాక్షస సంహారానంతరం చాముండేశ్వరి మాత మహిషాసురమర్ధినిగా ఖ్యాతి పొందినది. 18 చేతులతో ప్రతిచేతిలో ఒక ఆయుధంతో ఆ తల్లి దర్శనమిస్తుంది.
ముందుగా చండ, ముండ అనే రాక్షసులను సంహరించిన తర్వాత మహిషాసురుని వధించి మహిషాసురమర్దినిగా సకలలోక వాసుల కీర్తనలను అందుకుంటూ చాముండీ కొండ మీద కొలువు తీరింది. ఈ శక్తిమాతను దర్శించుకుంటే భక్తులు కోరిన కోరికలు నెరవేరదమే కాదు సకల సంపదలు, వ్యాపారాభివృద్ధి, ఆయురారోగ్యాలను ప్రసాదిస్తుందని నమ్మకం.
కర్నాటక రాష్ట్రంలో మైసూరులో మైసూరు ప్యాలెస్కు 13 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 3,489 అడుగుల ఎత్తులో ఉన్న కొండపై ఉంది ఈ శక్తిపీఠం. ఈ శక్తిపీఠాన్నే క్రౌంచపీఠం అని కూడా పిలుస్తారు. చాముండేశ్వరి దేవీ, కొలువు తీరిన ఆ కొండనే “చాముండి కొండ” అని పిలుస్తారు. పురాణకాలములో చాముండిపర్వతమును మహాబలాద్రి పర్వతము అని మహాబలగిరి అని కూడా పిలిచేవారు. ఈ శక్తి పీఠంలో అమ్మవారు దుష్ట సంహారిణిగా, మంగళదాయినిగా, జగన్మాతగా, చాముండేశ్వరిగా కొలువైంది. ఇక్కడి అమ్మవారిని పూజించడం వలన, ఆశించిన రంగంలో విజయం చేకూరుతుందని అంటారు. ఈ ఏడు అంతస్తులుగా ఉన్న ఆలయ గోపురాలో ప్రతి గోపురంపై ఒక చాముండేశ్వరి శిల్పం దర్శనమిస్తుంది. దేవాలయ ప్రాంగణంలో ఒక పెద్ద రావిచెట్టు ఉంటుంది. ఈ రావిచేట్టుకే భక్తులు కుంకుమ పూజలు చేస్తుంటారు. ఆలయం చుట్టూ విశాలమైన ఖాళీ ప్రదేశం ఉంటుంది.
ఈ ఆలయాన్ని 12 వ శతాబ్దంలో హోయసల పాలకులు నిర్మించారని దేవాలయ గోపురాన్ని 17 వ శతాబ్దంలో విజయనగర పాలకులు నిర్మించారు చారిత్రిక కథనాలు చెప్తున్నాయి.
ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పుకోవాలి. సాధారణంగా మహమ్మదీయ పాలకులు హిందూ దేవాలయాలను ధ్వంసం చేసారని, కొల్లగొట్టారని మనం చాలా చారిత్రక కథనాల్లో చదువుకున్నాం. కాని ఈ ఆలయం విషయంలో మాత్రం డానికి భిన్నమైన కథనాలు వింటాం. అవేంటంటే 1761-82 మధ్యకాలంలో మైసూరు సామ్రాజ్యాన్ని పరిపాలించిన ముస్లిం పాలకుడు హైదర్ అలీ చాముండేశ్వరి అమ్మవారికి ఆలయానికి చాలా ఆభరణాలు, వస్త్రాలు సమర్పించారు. ఈ సంప్రదాయాన్ని ఆయన కుమారుడైన టిప్పు సుల్తాన్ కూడా కొనసాగింఛి అమ్మవారికి అనేక ఆభరణాలు సమకూర్చడంతో పాటు ఆలయ అభివృద్ధికి కూడా పాటు పడ్డారని చెప్తారు.
1659 వరకు అతితక్కువ సదుపాయాలున్న ఈ దేవాలయాన్ని ఆ తరువాతి కాలంలో మైసూరును పాలించిన దొడ్డ దేవరాజ ఒడెయార్ అభివృద్ధి చేశారు. క్రమంగా మైసూరు రాజ వంశస్థుల కులదేవతగా, మైసూరుకు నాడ దేవత(గ్రామ దేవత)గా చాముండి దేవి నిత్య పూజలు అందుకుంటోంది.
ఇక మైసూర్, చాముండేశ్వరీ దేవి అనగానే వెంటనే జ్ఞాపకం వచ్చేది దసరా వైభవం. దసరా ఉత్సవాలకు మైసూర్ ప్రపంచ ప్రసిద్ధి చెందినది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ ఉత్సవాలను అంగరంగ వైభోగంగా నిర్వహిస్తారు. మైసూర్ రాజవంశస్తులు, ప్రభుత్వం ఈ కార్యక్రమాలను నభూతో నభవిష్యత్ అన్నఅన్నట్టుగా నిర్వహిస్తారు. రంగురంగు విద్యుత్ దీపాలతో, వినూత్నమైన కార్యక్రమాలతో వైభవానికి పరాకాష్టగా ఉంటాయి దసరా ఉత్సవాలు.
నవరాత్రులలో వెలకట్టలేని ఆభరణాలతో అలంకరించబడిన అమ్మవారిని చూడడానికి రెండు కళ్ళు కాదు వేయి కళ్ళైనా చాలవు. మైసూరు మహారాజు వంశస్థులతోపాటు, ప్రభుత్వ లాంఛనాలతో ఇక్కడ దసరా ఉత్సవాలను ఘనంగా జరుపుతారు. చాముండీ దేవికి ధరింపజేసే ఆభరణాలలో కొన్ని రాజవంశీయులు తమవద్ద ఉంచుకొని, వీటిని దసరా సందర్భంలో దేవస్థానానికి సమర్పిస్తూ రావటం అనాదిగా వస్తున్న ఆనవాయితీ.
నవరాత్రి ఏడవ రోజున చాముండీ దేవి ఆలయానికి సకల ఆభరణాలను తీసుకురావడం జరుగుతుంది. ఆ రోజు రాత్రి నుండి అన్ని ఆభరణాలను దేవికి అలంకరిస్తారు. దసరా పండుగ ముగిసిన కొద్ది రోజులకు ఆభరణాలను మళ్లీ ఖజానాకు తరలిస్తారు.
అయితే ఇక్కడొక విషయం గమనించాలి ఆ ఆభరణాలను మూలవిరాట్ విగ్రహానికి అలంకరించరు. మూల విగ్రహానికి డాలు, కవచం లాంటి నిత్యం అలంకరించే ఆభరణాలు ఉంటాయి. విశేషమైన ఆభరణాలను మాత్రం ఉత్సవ విగ్రహానికి అలంకరిస్తారు. అందువలన భక్తులకు విశేష ఆభరణాలతో అలంకరించబడిన అమ్మవారి శోభను చూసే అదృష్టం మాత్రం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే లభిస్తుంది. సంవత్సరానికొక్కసారి సర్వాలంకార భూషితమైన చాముండమ్మను చూడటం అదృష్టంగా భావిస్తారు భక్తులు.
అప్పటి మైసూరు మహారాజులు చాముండేశ్వరీదేవికి సమర్పించిన ఆభరణాల ఖరీదు ఎంత అనేది నిర్ధారించడం ఇప్పటికీ సాధ్యం కాలేదు. అమ్మవారి ఆభరణాలలో పచ్చలహారం ఒక్కదాని ఖరీదే మైసూర్ నగరాన్ని రెండుసార్లు వేలం వేస్తే ఎంత డబ్బు వస్తుందో అంతకంటే ఎక్కువ ఉంటుందని చెప్తారు. అమ్మవారి ఆభరణాలన్నిటి విలువ దేవుడెరుగ... అందులో ఒక్కోరాయి ఖరీదే లక్షలలో ఉంటుందని అంచనా.
అమ్మవారి తల మీదున్న చామరాజ ముడి (కిరీటం), కంఠాభరణాలతో, కర్ణ పత్రాలతో, పతకాలు, హారం, 28 మణులను పొదిగిన కంఠి, జడ పిన్నులు, జడ బిళ్ల, వజ్ర ఖచితమైన త్రిశూలం, పాశుపతాస్త్రం, నాగాస్త్రం, కవచం, ఘంటా హస్త కవచం, కలశం, డమరుకాస్త్రం, ఖడ్గ హస్తం ఇలా వివిధ ఆభరణాలతో సర్వశోభితంగా చాముండీదేవి అలరారుతుంది.
ఖజానా నుండి ఆభరణాలను తీసుకురావటం మొదలు వాటిని దేవికి అలంకరించేవరకు ... ఆ ఆభరణాలను అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ పర్యవేక్షిస్తుంటారు. పోలీసులు, అర్చకులు, రాజకుటుంబీకులు మరియు ప్రభుత్వ అధికారుల సమక్షంలో పెట్టెను తెరిచి అమ్మావారికి అలంకరిస్తారు.
కుల దేవత చాముండీదేవి సకల ఆభరణాలను మైసూరు మహారాజులే ఇస్తూ వచ్చారు.
ముమ్మడి కృష్ణరాజు ఒడయార్ చాముండీ దేవికి పరమ భక్తులు. కుల దేవత ప్రీత్యర్థం నవరత్నాల పేరుతో తొమ్మిది సార్లు సేవలు చేసేవారు. నక్షత్ర మాలిక అనే విశేషమైన ఆభరణంతో దేవిని అలంకరించేవారు.
దసరా పండుగలో చాముండి అమ్మవారికి చండీ హోమం, వెండి రథోత్సవాలు యథావిధిగా కొనసాగుతాయి.
చాముండేశ్వరి ఆలయానికి వెళ్ళే మార్గంలోనే మనం మహిషాసురుని విగ్రహం కూడా చూడొచ్చు. ఒక చేతిలో కత్తితో, మరొక చేతిలో పడగవిప్పిన పాముతో ఉంటాడు మహిషాసురుడు ఈ విగ్రహంలో.
దేశంలోనే అతిపెద్ద నంది విగ్రహాలలో మూడవది ఇక్కడే...
ఇక దేవాలయ మెట్లమార్గంలో ఈ దేవాలయానికి సమీపంలోనే నల్లరాతితో మలచబడిన అతి పెద్ద నందీశ్వరుడు దర్శనమిస్తాడు.16 అడుగుల ఎత్తు, 25 అడుగుల వెడల్పు కలిగిన నల్లటి గ్రానైట్ తో చెక్కిన నంది విగ్రహం మనకు దర్శనమిస్తుంది. ఈ నంది దేశంలోనే అతిపెద్ద నంది విగ్రహాల్లో మూడోది.
చాముండేశ్వరి ఆలయానికి ఎలా వెళ్ళాలి
చాముండేశ్వరి ఆలయం మైసూరు నుండి 12 కి.మీ, బెంగళూరు నుండి 154 కి.మీ దూరంలో ఉంది. మైసూరులో విమానాశ్రయం, రైల్వే స్టేషన్ కూడా ఉన్నాయి. మైసూరు నుండి చాముండికొండకు చేరుకోవడానికి సిటీబస్సులు అందుబాటులో ఉన్నాయి. మైసూరు నుండి టాక్సీని కూడా అద్దెకు తీసుకోవచ్చు.
విమాన, రైలు మార్గాల ద్వారా మైసూరుకు చేరుకోవచ్చు. ఇక్కడికి బెంగళూరు నుండి కూడా రవాణా సౌకర్యాలు చక్కగా ఉన్నాయి. బెంగళూరు, హైదరాబాద్, తిరుపతి, చెన్నై, మంగళూరు ప్రాంతాల నుండి మైసూర్ కు ప్రభుత్వ/ ప్రవేట్ బస్సులు నిరంతరం తిరుగుతూనే ఉంటాయి.
మైసూర్ లో బసచేసి, చాముండి కొండకు వెళ్లి అమ్మవారిని దర్శించుకొని మళ్ళీ మైసూర్ కు చేరుకోవడం మంచిది.
ఇవి కూడా చదవండి