పూరీ క్షేత్రాన్ని ముంచెత్తిన సముద్రం – సంకెళ్ళతో హనుమంతుడు | Bedi hanuman temple puri history

Vijaya Lakshmi

Published on Mar 13 2026

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

పూరీ క్షేత్రాన్ని ముంచెత్తిన సముద్రం – సంకెళ్ళతో హనుమంతుడు 

సాధారణంగా మనం Hanuman ను గద పట్టుకుని ధైర్యంగా నిలబడిన రూపంలో లేదా భక్తితో చేతులు జోడించి ఉన్న రూపంలో చూస్తాం. కానీ పూరీ క్షేత్రంలో మాత్రం ఆయన చేతులకు సంకెళ్లతో బంధించబడి కనిపిస్తాడు. అసలు హనుమంతుడిని ఎవరు బంధించారు? ఎందుకు బంధించారు? ఈ ప్రశ్నలకు సమాధానం ఒక అద్భుతమైన పురాణ గాథ ఉంది.

భారతదేశంలోని అత్యంత పవిత్రమైన ఆలయాలలో ఒకటి Jagannath Temple. ఈ క్షేత్రం చార్ ధామ్ యాత్రలో భాగంగా ఉండటం వల్ల ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు.

ఈ ఆలయం చుట్టూ ఎన్నో అద్భుతమైన పురాణ కథలు ఉన్నాయి. వాటిలో అత్యంత ఆసక్తికరమైన కథ బేడీ హనుమాన్ కథ.

లంకకే నిప్పంటించిన వాడూ, రావణుడి లాంటి వాడే బంధించలేని హనుమంతుడిని, సాక్షాత్తూ జగన్నాథ స్వామి ఎందుకు బంగారు సంకెళ్లతో కట్టేశాడు? పూరీ సముద్రాన్నే శాసించేంత శక్తి ఉన్న ఆంజనేయుడు, ఆ స్వామికి ఎందుకు ఖైదీలా మారిపోయాడు? ఈ అద్భుతమైన కథ వెనుక ఉన్న అసలు రహస్యం ఈ బ్లాగ్ లో



మన పురాణాల్లో ఊహకు కూడా అందని ఎన్నో అద్భుతమైన కథలున్నాయి. వాటిలో ఒకటి, పూరీ జగన్నాథుడికి, మన పవనసుతుడైన హనుమంతుడికి ఉన్న విడదీయరాని బంధం. మనకు హనుమంతుడంటే ఎలా గుర్తొస్తాడు? చేతులు జోడించి నమస్కరిస్తూనో, లేదా గద పట్టుకుని ధైర్యం చెబుతున్నట్టుగానో కనిపిస్తాడు. కానీ, పూరీలో మాత్రం స్వామి చేతులకు సంకెళ్లతో బంధించబడి కనిపిస్తాడు. ఆయనే "బేడీ హనుమాన్". అసలు తన ప్రాణభక్తుడిని ఆ జగన్నాథుడు ఎందుకు బంధించాడు? ఆ సంకెళ్ళకు, సముద్రపు హోరుకు ఉన్న సంబంధం ఏంటి? ఈ ఇంట్రెస్టింగ్ పురాణ కథ

పూరీ జగన్నాథ క్షేత్రం మహిమ

బేడీ హనుమాన్ లేదా పూరీ క్షేత్రంలో సంకెళ్ళతో ఉన్న హనుమంతుడి  కథ గురించి తెలుసుకునే ముందు మనం పూరీ క్షేత్రం గొప్పతనం గురించి కొద్దిగా తెలుసుకుందాం. చార్ ధామ్‌లలో ఒకటైన ఈ పవిత్ర స్థలాన్ని భక్తులు భూమిపై ఉన్న వైకుంఠంగా భావిస్తారు. పురాణాల ప్రకారం, జగన్నాథుడు తన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కొలువై ఉన్నప్పుడు, దేవతల దగ్గరి నుండి సామాన్య మానవుల వరకు ప్రతీ ఒక్కరూ ఆ స్వామి దర్శనం కోసం తపించేవారు. ఆయన రూపాన్ని ఒక్కసారి చూస్తే చాలు, జన్మ ధన్యమైపోతుందని నమ్మేవారు. ఇంత అద్భుతమైన భూలోక వైకుంఠం లాంటి పూరీ జగన్నాథ క్షేత్రాన్ని మీరు దర్శించుకున్నారా... జగన్నాథుని దర్శించుకున్నపుడు మీ అనుభూతి కామెంట్స్ లో తప్పక చెప్పండి. జై జగన్నాథ అని కామెంట్ చెయ్యండి. సరే కథలోకి వచ్చేస్తే


సముద్రుడి కోరిక

సమస్త జనులు దేవతలా లాగే సముద్రుడికి కూడా దేవదేవుడైన జగన్నాథుని చూడాలనే బలమైన కోరిక కలిగింది. కానీ సముద్రుడు తన చోటు వదిలి కదలలేడు కదా! అందుకే, తన అలల రూపంలోనైనా స్వామిని తాకాలని, ఆయన దర్శనం చేసుకోవాలని ముందుకు ఉరికాడు. ఉవ్వెత్తున ఎగసిపడే కెరటాలతో, భయంకరమైన శబ్దంతో ఆలయం వైపు దూసుకొచ్చాడు. స్థానిక కథల ప్రకారం, సముద్రుడు ఇలా మూడుసార్లు గుడిలోకి చొచ్చుకురావాలని చూశాడట. దానివల్ల గుడికి, నగరానికి కూడా తీవ్ర నష్టం జరిగింది. భక్తులు భయంతో వణికిపోయారు. ఆ సముద్రుడి గర్జనలకు గర్భగుడిలో ప్రశాంతత లేకుండా పోయింది. భక్తుల బాధను చూసిన జగన్నాథుడు, ఈ సమస్యకు ఒక పరిష్కారం ఆలోచించాడు. సముద్రాన్ని ఆపగలిగేంత శక్తి ఉండి, తన మాటను జవదాటని భక్తుడు ఎవరున్నారా అని చూశాడు. అప్పుడు ఆయనకు గుర్తొచ్చింది ఒకే ఒక్క పేరు... తన ప్రియ భక్తుడు, రామభంటు, వాయుపుత్రుడైన హనుమంతుడు!

జగన్నాథుడి ఆజ్ఞ

జగన్నాథస్వామి వెంటనే హనుమంతుడిని పిలిచి, "పవనసుతా! నా భక్తులకు సముద్రుని వల్ల ఇబ్బంది కలుగుతోంది. నువ్వు మహా బలశాలివి. వెంటనే తూర్పు ద్వారం దగ్గర, అంటే సముద్ర తీరంలో కాపలాగా ఉండు. సముద్రుడు ఆలయంలోకి రాకుండా, అతని ఘోష గర్భగుడి వరకు చేరకుండా ఆపాల్సిన బాధ్యత నీదే" అని ఆజ్ఞాపించాడు.

హనుమంతుడి కాపలా

స్వామి ఆజ్ఞ వినగానే హనుమంతుడి ఆనందానికి అవధుల్లేవు. "ప్రభూ! మీ ఆజ్ఞే నాకు శిరోధార్యం. ఈ క్షేత్రానికి ఎలాంటి ఆపద రాకుండా కంటికి రెప్పలా కాపాడతాను" అని మాట ఇచ్చి, సముద్ర తీరంలో కాపలాగా నిలబడ్డాడు హనుమంతుడు.


హనుమంతుడి మనసులో బాధ

హనుమంతుడు కాపలాకు నిలబడగానే, సముద్రుడు పూర్తిగా శాంతించిపోయాడు. గుడిలో మళ్ళీ ప్రశాంతత నెలకొంది. భక్తులు హాయిగా స్వామిని దర్శించుకోసాగారు. రోజులు గడుస్తున్నాయి. హనుమంతుడు తన పనిని ఎంతో నిబద్ధతతో చేస్తున్నాడు. కానీ, ఆయన మనసులో ఏదో తెలియని వెలితి. తన ఆరాధ్య దైవమైన జగన్నాథుడిని చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాడు. స్వామి సేవ చేస్తున్నా, ఆ స్వామినే చూడలేకపోతున్నానే అనే బాధ ఆయన్ని తినేయసాగింది.

సముద్రుడి మాయ

పురాణ కథల ప్రకారం, హనుమంతుడి ఈ బలహీనతను సముద్రుడు గమనించాడు. ఒకరోజు హనుమంతుడితో, "ఆంజనేయా, రేయింబవళ్లు ఇక్కడ కాపలా కాస్తున్నావు సరే, కానీ నీ స్వామిని చూసుకోకుండా ఏం భక్తి నీది? ఆయన కమలం లాంటి కళ్ళు చూసి నీకు ఎన్ని రోజులయ్యింది? దేవుడి దర్శనం కన్నా గొప్ప భాగ్యం ఉంటుందా?" అని హనుమంతుని భక్తిని మరింత రెచ్చగొట్టాడు.

ఆ మాటలతో హనుమంతుడి మనసు కరిగిపోయింది. నిజమే కదా, స్వామిని చూసి చాలా రోజులైంది అనుకున్నాడు.

అర్ధరాత్రి దర్శనం

ఇక అప్పటినుండి, అర్ధరాత్రి సమయంలో, సముద్రుడు కూడా శాంతంగా ఉన్నాడు కదా అని అనుకుని, ఎవరికీ తెలియకుండా మెల్లగా తన స్థానం నుంచి కదిలి జగన్నాథుని దర్శనం కోసం గుడిలోకి వెళ్ళేవాడు.

అసలు కథ ఇక్కడే మొదలైంది! హనుమంతుడు తన స్థానాన్ని వదిలి వెళ్లగానే, అడ్డుకునే వారు లేకపోవడంతో, సముద్రుడు కూడా ఆయన వెంటే మెల్లగా గుడిలోకి ప్రవేశించడం మొదలుపెట్టాడు. హనుమంతుడు దర్శనం ముగించుకుని తిరిగి వచ్చేసరికి, గుడి ప్రాంగణం మళ్ళీ నీటితో నిండిపోయేది. ఇలా చాలాసార్లు జరగడంతో, జగన్నాథుడు తన భక్తుడి ఈ చిన్న తప్పిదాన్ని ప్రేమతో గమనించాడు.

హనుమంతుని భక్తి గొప్పదే, కానీ కర్తవ్యం కూడా ముఖ్యమే కదా! తన భక్తుడు స్థానం వీడకూడదు, అలా అని తనను చూడాలనే భక్తుని తపనను కాదనలేడు. అప్పుడు జగన్నాథుడు ఒక అద్భుతమైన లీలను చూపించాడు.



జగన్నాథుడి లీలా

ఆయన హనుమంతుడిని పిలిచి, "ఆంజనేయా! నీ భక్తికి నేను ఎంతో మెచ్చాను. కానీ నువ్వు నీ స్థానాన్ని వీడటం వల్ల ప్రళయం వస్తోంది. నువ్వు ఇక్కడే, ఈ తీరంలోనే స్థిరంగా ఉండాలి. నా దర్శనం కోసం నువ్వు లోపలికి రావద్దు. కానీ, నువ్వు మళ్ళీ మళ్ళీ నీ స్థానాన్ని వీడకుండా ఉండేందుకు, నేను నిన్ను నా ప్రేమతో బంధిస్తున్నాను" అని చెప్పి, తన చేతులతోనే హనుమంతుని చేతులకు, కాళ్ళకు సంకెళ్ళు వేశాడట.

బేడీ హనుమాన్

అది శిక్ష కాదు, ఒక ప్రేమ బంధనం. తన భక్తుడు తన మాట వినేలా, అదే సమయంలో తన రక్షణలో ఉండేలా స్వామి వేసిన ఒక దివ్యమైన బేడీ అది. పురాణాల ప్రకారం, ఆ బంధనం బంగారు గొలుసులతో జరిగిందని చెబుతారు. అందుకే, పూరీలోని ఈ హనుమంతుడిని "బేడీ హనుమాన్" అని పిలుస్తారు. "బేడీ" అంటే ఒడియా, హిందీ భాషలలో సంకెళ్ళు అని అర్థం. ఆ రోజు నుంచి, హనుమంతుడు అక్కడే బంధింపబడి, సముద్ర ఘోషను గుడిలోకి రాకుండా అడ్డుకుంటున్నాడని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు.



అసలు  జగన్నాథుడు హనుమంతుడిని బంగారు గొలుసులతో బంధించాడు అనడంలో ఉన్న అసలు అర్థం ఏంటంటే... అవి కేవలం సంకెళ్లు కాదు, ఆయన దైవిక శక్తిని పూరీ క్షేత్ర రక్షణ కోసం స్థిరంగా నిలపడం అన్నమాట. అంటే, ఆ సంకెళ్ళతో జగన్నాథుడు హనుమంతుడిని బంధించలేదు... ఆయన అపారమైన శక్తిని ఆ క్షేత్రానికి ఒక రక్షణ కవచంగా మార్చాడు!

చూశారుగా, పూరీ క్షేత్రానికి, హనుమంతునికి ఉన్న బంధం ఎంత అద్భుతమైనదో! ఒకవైపు స్వామి ఆజ్ఞను పాటించాలనే కర్తవ్య నిష్ఠ. మరోవైపు స్వామిని చూడాలనే బలమైన కోరిక, స్వామి భక్తి. ఈ రెండింటి మధ్య నలిగిపోతున్న తన భక్తుడిని చూసి, జగన్నాథుడు అతన్ని ప్రేమతో బంధించిన ఈ లీల మనందరికీ ఒక గొప్ప పాఠం. దేవుడు తన భక్తులను ఎప్పుడూ శిక్షించడు, వారిని సరైన దారిలో నడిపించడానికి, వారి శక్తిని లోక కళ్యాణం కోసం ఉపయోగించడానికి కొన్నిసార్లు ఇలాంటి నియమాలు పెడతాడు.


ఈ పూరీ క్షేత్రంలోని బేడీ హనుమాన్ కథ, దేవుడికి, భక్తుడికి మధ్య ఉండే స్వచ్ఛమైన ప్రేమకు, నమ్మకానికి ఒక నిలువుటద్దం. మీరు ఎప్పుడైనా పూరీ వెళ్ళినప్పుడు, సముద్ర తీరంలో ప్రశాంతంగా, కానీ ఎంతో శక్తివంతంగా కొలువైన ఈ బేడీ హనుమంతుడిని దర్శించుకోవడం అస్సలు మర్చిపోకండి. ఆయన చేతులకు ఉన్న ఆ బేడీలు బానిసత్వానికి గుర్తు కాదు, జగన్నాథుని ప్రేమకు, పూరీ క్షేత్ర రక్షణకు ప్రతీక అని మాత్రం గుర్తుంచుకోవాలి.


youtube play button



youtube play button




Recent Posts
ఊర్మిళాదేవి నిద్ర : రామాయణంలో ఎవరికీ తెలియని మహా త్యాగం: ఊర్మిళా దేవి గాథ  | The Untold Sacrifice of Urmila in Ramayana
ఊర్మిళాదేవి నిద్ర : రామాయణంలో ఎవరికీ తెలియని...
900 ఏళ్ల చరిత్ర! కరకచెట్టు పోలమాంబ దేవి అద్భుత గాథ | Vizag Powerful Goddess Polamamba Story
900 ఏళ్ల చరిత్ర! కరకచెట్టు పోలమాంబ దేవి...
త్రిశంకు స్వర్గం నిజంగా ఉందా? విశ్వామిత్రుడు సృష్టించిన మరో స్వర్గం కథ  | Shocking Truth! Trishanku Swargam
త్రిశంకు స్వర్గం నిజంగా ఉందా? విశ్వామిత్రుడు సృష్టించిన...
సింహాచలం లక్ష్మీనరసింహస్వామి - చందనోత్సవంపై ఆసక్తికర కోణాలు - రహస్యాలు  | Simhachalam Temple History in Telugu
సింహాచలం లక్ష్మీనరసింహస్వామి - చందనోత్సవంపై ఆసక్తికర కోణాలు...
అక్షయ తృతీయ ఎందుకు జరుపుకోవాలి? | Importance & significance of Akshaya tritiya
అక్షయ తృతీయ ఎందుకు జరుపుకోవాలి? | Importance...