మహానటి | నవల పార్ట్ 2

Vijaya Lakshmi

Published on Oct 03 2025

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

2003, ఫిబ్రవరి నెల ఆంధ్రభూమి సచిత్ర మాస పత్రిక లో ప్రచురించబడిన నవల

  “మహానటి” ధారావాహిక – 2

   రచన : మావూరు.విజయలక్ష్మి


“ప్రేమ...” అదొక నిర్వచనానికి అందని అందమైన భావం. అలాంటి ప్రేమకు చక్కని ఉదాహరణగా, నిజమైన ప్రేమకు నిదర్శనంగా షాజహాన్ ను చెప్తారు. షాజహాన్ కు తన భార్య ముంతాజ్ బేగంపై గల ప్రేమను, ఆ ప్రేమకు చిహ్నంగా అతడు కట్టించిన, విశ్వంలోనే అపురూపమైన కట్టడంగా, ప్రపంచ వింతల్లో ఒకటిగా బాసిల్లుతున్న పాలరాతి మందిరం తాజ్ మహల్ గురించి, దాని నిర్మాణ క్రమం గురించి ఆకర్షణీయంగా వర్ణించి చెప్తున్నారు హిస్టరీ లెక్చరర్.

ఆ ప్రేమ కథను ఆసక్తిగా వింటున్నారంతా. హిస్టరీ లెక్చరర్ వర్ణనతో ముగ్దులైపోయిన చాలామంది స్టూడెంట్స్, ఆ అపురూప ప్రేమచిహ్నాన్ని ఎప్పటికైనా చూసి తీరాలని నిశ్చయించుకున్నారు అప్పటికప్పుడే.

తార కూడా ఆ విషయం గురించే ఆలోచిస్తోంది. అయితే ఆమె ఆలోచనలో ఉన్నది షాజహాన్ చక్రవర్తి ప్రేమ కథ కాదు... ఈ మధ్య వారానికి ఒకటిగా తప్పనిసరిగా తనకొస్తున్న పేరు లేని ప్రేమలేఖల గురించి. అవి ప్రేమలేఖలు లేఖలు అనవచ్చో... అనకూడదో గాని, నిజానికి ఆ ఉత్తరాల్లో ‘పుట్టినరోజు శుభాకాంక్షలు’ ‘అభినందనలు’ ‘పలకరింపులే’ తప్ప, పేజీల కొద్ది సాగే ప్రేమ కబుర్లు ఉండవు. అసలా ఉత్తరాలు రాస్తున్నది ఆడో, మగో కూడా తెలియదు. అయినా... ఆ ఉత్తరాల కోసం ఎదురుచూడడం ఒక బలహీనతగా మారిపోయింది తారకు.

అసలు తన క్లాస్ మేట్స్ ఎవరైనా తనను అల్లరి పెట్టడానికి అలా రాస్తున్నారేమో అన్న అనుమానం కూడా వచ్చింది. ఆ ఉద్దేశ్యంతోనే వాళ్ళని చాలా నిశితంగా పరీక్షించేది. కానీ అనుమానించదగ్గ ఆధారాలు ఏమీ దొరక్క పోవడంతో, ‘ఈ అజ్ఞాత ప్రేమికుడు ఎవరో చాలా పిరికివాడిలా ఉన్నాడే... పేరు కూడా రాయడం లేదు’ అనుకుంది. ఎందుకో ఆ భావం ఎక్కువసేపు మనసులో ఉంచుకోలేకపోయింది తార. “తాము ఇష్టపడే వ్యక్తుల్లోని బలహీనతలు కూడా బలహీనతలుగా కనపడవేమో!”

“తారా! ఏంటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు!?” అడిగింది అనిత

“అబ్బే! ఏం లేదు.. నేనేం ఆలోచించడం లేదే?”

“అది చెప్పడానికి అంతగా తడబడడం ఎందుకో?” ఏడిపిస్తున్నట్టుగా అంది అనిత.

“తడబాటా! నాకా... నాకెందుకు తడబాటు?”

“అదేమిటో... మరి నీ మాటలే చెబుతున్నాయి...! అయినా నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? ఎవరికోసం ఎదురు చూస్తున్నావో నాకు తెలుసులే!” అల్లరిగా అంది అనిత.

“నీ మొహం... నేనెవరి కోసం ఎదురు చూస్తాను!”

“పోస్ట్ మాన్ కోసం..”

“ఛ...! అతని కోసం నేను ఎదురుచూడటం ఏంటి?” కోపంగా అంది.

“ఆఫ్ కోర్స్! అతని కోసం అంటే... అతను తెచ్చే ఉత్తరం కోసం అన్నమాట”

ఉలిక్కిపడింది తార. ‘ఇలా మాట్లాడుతుందేంటి!? కొంపతీసి తన విషయం తెలుసుకోలేదు కదా!?

“ఏయ్... ఏంటి! మళ్లీ స్వీట్ డ్రీమ్స్ లోకి వెళ్ళిపోయావా?” చేతిలోని కవర్ తార కళ్ళ ముందు ఆడిస్తూ అంది అనిత.

తేరుకున్న తార దాన్ని లాక్కోబోయింది.

“ఏయ్! ఇలా దౌర్జన్యం చేయడానికి ప్రయత్నిస్తే ఎంత మాత్రం సహించేది లేదు. విషయమేంటో నీ నోటి ద్వారా వినవలెనని మాకు చాలా కుతూహలముగా ఉన్నది. ఆలస్యాన్ని ఇక ఎంత మాత్రం భరించలేం. అసలు సంగతేమిటో విన్నవించుకో...! అప్పుడే ఈ లేఖను నీకు ఇచ్చే విషయం ఆలోచిస్తాం” అంది నాటకీయంగా అనిత.

“ప్లీజ్ అనిత! దాన్ని ఇలా ఇవ్వవే...” బ్రతిమాల సాగింది తార.

“సరే... సరే... నువ్వు ఇంతగా వేడుకుంటున్నావు కాబట్టి... మాకు నీపై దయ కలుగుతున్నది. అయితే... ఈ లేఖ రాసిన వారెవరో చెప్పుము”

         “అదా! అది... ఒక ఫ్రెండ్”

“ఎవరా ఫ్రెండ్? ఆడ? మగ?” కవ్వింపుగా అంది అనిత.

ఏంటా క్రాస్ ఎగ్జామినేషన్! అనూ... నీకు ఇది ధర్మం కాదే! స్నేహితురాలిని ఇంతగా ఏడిపిస్తున్నందుకు భగవంతుడు నిన్ను తప్పక శపిస్తాడు”

“ఆ... భగవంతుడి శపిస్తే, ఏ దేవతలో దిగివచ్చి శాపవిమోచనం చేస్తారు లేవే. ఇంతకీ విషయం చెప్పలేదు” అంది అనిత.

ఇక తప్పదు అనుకున్న తార అంతా వివరించింది. అంతా విన్న అనిత పెదవి విరిచింది.

“ఓస్... ఇంతేనా! ఇంకా నీ ఉత్తర కుమారుడు ఏదో పేజీల కొద్దీ ప్రేమ పైత్యమొలకపోస్తాడేమో, చదివి కాస్త ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను. అయినా... నీ అజ్ఞాత ప్రేమికుడు ఇంత పిరికివాడేంటే బాబు! హు... పిరికివాడే కాదు పిసినిగోట్టుకూడాను. లేకపోతే ఈ పొడి మాటల ప్రేమంటే బాబు!”

మూతి ముడుచుకుంది తార. స్నేహితురాలిని ఇంకా ఇంకా ఉడికించడం ఇష్టం లేక తన చేతిలో కవర్ ఇవ్వడానికి బేరం పెడుతూ అంది అనిత. “ఇదిగో! అలా మూతి ముడుచుకోకు గాని, ఇది నీకు ఇవ్వాలంటే మాత్రం నువ్వొక పని చేయాలి” అంది కవర్ చూపిస్తూ.

“చెప్పు! ఏం చేయాలి?” ఇక ఆలస్యాన్ని ఏ మాత్రం భరించలేనట్టు గొంతు నిండా ఆత్రాన్ని నింపుకొని అడిగింది తార .

“సింపుల్... నువ్వు నన్ను సినిమాకు తీసుకెళ్లాలి” లంచాలకు అలవాటు పడిన ఉద్యోగిలా అంది.

“ఓస్! ఇంతేనా... తప్పకుండా తీసుకెళ్తాను”

“ప్రామిస్”

“ప్రామిస్.. చాలు గానీ, అదిలా ఇవ్వవే” విసుగ్గా కవర్ లాక్కుని లైబ్రరీలోకి పరుగు తీసింది తార. కవర్ ఒకసారి ఇష్టంగా చూసి, లోపలి పేపర్ బయటకు తీసింది. దాన్ని చూస్తుంటే అప్రయత్నంగానే విజయ్ గుర్తుకొచ్చాడు. దాంతోపాటు అతని చూపులు కూడా.

‘ఇదేంటి... ఈ సమయంలో అతను జ్ఞాపకం వచ్చాడేంటి!? కళాభారతిలో పరిచయం తర్వాత అనుకోకుండా నాలుగైదుసార్లు కలుసుకోవడం జరిగింది. అతడు మాట్లాడేది తక్కువే అయినా, ఆ చూపులు మాత్రం ఏదో చెప్పాలని తాపత్రయపడుతున్నట్టుగా ఉండి, తనని ఇబ్బంది పెడుతుంటాయి. కానీ... ఎందుకో అతని సాన్నిహిత్యం ఆనందాన్నిస్తోంది.

తను... తను విజయ్ వైపు ఆకర్షింపబడుతోందా? మరి ఈ ఉత్తరాలు... వీటి కోసం ఎదురుచూడడం ఒక బలహీనతగా మారింది తనకు. ఇటు అజ్ఞాత ఉత్తరాల వ్యక్తి. అటు విజయ్. ఈ ఆకర్షణల మధ్య తన జీవితం ఏ మలుపు తిరగబోతోందో అన్న ఆందోళన మొదలైంది తారలో.

తారా...! తారా!”” కంగారుగా పిలుస్తూ వచ్చింది అనిత.

“ఏంటంత కంగారు... అని నింపాదిగా అడుగుతున్నావా తల్లి... మన యముడు గారు నీ కోసం కబురు పెట్టాడు”

         వాళ్ల దృష్టిలో యముడు అంటే ప్రిన్సిపల్. ఎంత అల్లరి పిల్లలైనా అతని ముందు పిల్లులు అవ్వాల్సిందే. సాధారణంగా ఎవర్ని తన రూమ్ కి పిలిపించుకోడు. ఎవరినైనా పిలిచాడూ అంటే వాళ్ళకి ఏదో మూడిందన్నమాటే! అందుకే అతన్ని స్టూడెంట్స్ అంతా ముద్దుగా యముడు అని పిలుచుకుంటారు. అలాంటి మనిషి ఈ రోజు తారని పిలిచాడు అంటే భయపడకుండా ఎలా ఉంటుంది.

సాలోచనగా ప్రిన్సిపల్ రూమ్ లోకి అడుగు పెట్టింది తార. అక్కడ అతనికి ఎదురుగా ఒక వ్యక్తి కూర్చొని మాట్లాడుతున్నాడు. ఆ మనిషిని చూడగానే ఎక్కడో చూసినట్టు అనిపించిందామెకు. ఎక్కడ చూసిందీ... ఎంత ఆలోచించినా జ్ఞాపకం రావడం లేదు. ఎవరతను ?”

“గుడ్ మార్నింగ్ సార్” విష్ చేసింది తార ప్రిన్సిపాల్ ని.

“గుడ్ మార్నింగ్. రామ్మా... తారా! ఇలా కూర్చో.” ఎదురుగా ఉన్న కుర్చీ చూపించి, “పరీక్షలకు బాగా ప్రిపేర్ అవుతున్నావా?” ఆప్యాయంగా అడిగారు ప్రిన్సిపాల్. తమ సంస్థకు పేరు తెచ్చిపెట్టే స్టూడెంట్స్ ని చూస్తే, ఎంత స్ట్రిక్ట్ టీచర్లుగా పేరుపడ్డవారికైనా ప్రేమాభిమానాలు పుట్టుకురావడం సహజమే.

“ఎస్ సర్!” ప్రిన్సిపల్ ప్రశ్నకు సమాధానంగా అంది తార.

తన ఎదురుగా ఉన్న అతని చూపిస్తూ చెప్పసాగారు ప్రిన్సిపాల్ గారు. “ఇదిగో... ఈయన రామారావుగారని... మన తెలుగు నాటకాల్లో బాగా పేరు తెచ్చుకున్న నటుడు దర్శకుడు.”

ఆ గదిలో అడుగుపెట్టినప్పటినుంచి ఇతడిని ఎక్కడ చూశానో... అని తనను వేధిస్తున్న ప్రశ్నకు సమాధానం దొరికింది తారకు. ఈయన తన కాలేజీ వార్షికోత్సవానికి వచ్చిన ఆహ్వానితుల్లో ఒకరు.

ప్రిన్సిపల్ చెబుతున్నారు... “అంతేకాదు, ప్రతిభగల నూతన కళాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఒక నాటక సమాజాన్ని స్థాపించి, దాన్ని బాగా అభివృద్ధి చేస్తున్నారు కూడా. రాజమండ్రిలో ఏవో రాష్ట్ర స్థాయి నాటకోత్సవాలు ఉన్నాయట. దానికి వీరు కూడా ఒక నాటకాన్ని తీసుకువెళ్లాలనుకుంటున్నారు. ఇప్పుడు ఆ పని మీదే నీకోసం వచ్చారు.” ఆ పెద్దమనిషిని పరిచయం చేస్తూ అన్నారు ప్రిన్సిపల్.     

ఆ చివరి మాటకు ఉలిక్కిపడింది తార. ‘అతడు నాటకోత్సవాలకు వెళితే తనకు చెప్పడం ఎందుకు? ఆయనకు తనతో పనేంటబ్బా!’ ఆశ్చర్యంగా అనుకుంది తనలో తనే.

“కాలేజీ డే కి వేసిన నాటకంలో నీ నటనను చూసి వారు బాగా ఇంప్రెస్ అయ్యారట. అందుకే... వారిప్పుడు ప్లాన్ చేస్తున్న డ్రామాలో నీకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు...” ప్రిన్సిపాల్ గారు ఇంకా ఏదో చెప్తూనే ఉన్నారు.

ఆయన చెప్పింది విని, సంభ్రమాశ్చర్యాలతో నోట మాట రాలేదు తారకు. అసలు ఆ మాటల సారాంశం పూర్తిగా అర్థం కావడానికి పది నిమిషాలు పట్టింది తనకు. ‘తనకు రాష్ట్రస్థాయి నాటకోత్సవంలో అవకాశాలు రావడమా! అది కూడా ఎలాంటి ప్రయత్నాలు లేకుండా తనను వెతుక్కుంటూ వచ్చిన ఛాన్స్! ఏమాత్రం అనుభవం లేని తనకు... కేవలం కాలేజీలో సరదాగా వేసిన ఒక చిన్న నాటకం చూసి ఆహ్వానం పలుకుతున్నారా!’ మనసంతా ప్రశ్నలతో నిండిపోయింది. ‘అసలు తను స్పృహలోనే ఉందా!? ఏంటో... ఇదంతా నమ్మశక్యం కాకుండా ఉంది’

రామారావు గారు ఏదో చెబుతున్నారు. వాళ్ళ నాటక సమాజం ఇచ్చిన ప్రదర్శనల గురించి, సంపాదించిన బహుమతుల గురించి, వాళ్లు పరిచయం చేసిన నటీమణులు ఎంత పైకొచ్చిందీ, నూతన తారలను తామెంత ప్రోత్సహించేదీ... ఇత్యాది విశేషాలు అన్నీ వివరిస్తున్నాడతను.

తార చెవులు యాంత్రికంగా వింటున్నాయా మాటలను. ఆమె మనసు మాత్రం ఊహల్లో విహరిస్తోంది. తనప్పుడే నాటకం వేసేసినట్టు... అందులో అద్భుతంగా నటించి, అందరి ప్రశంసలతో పాటు అవార్డులు కూడా అందుకున్నట్టు... అక్కడ నుంచి అలా అలా టీవీ సీరియల్స్ లో కూడా బిజీ నటీమణి అయిపోయినట్టు... ఎన్నెన్నో రంగుల దృశ్యాలు కళ్ళ ముందు కదులుతున్నాయి. అంత సంతోషంలోనూ ఆమెకో విషయం జ్ఞాపకం వచ్చి ఆనందాన్ని నీరు కార్చేసింది. ‘మరో రెండు వారాల్లోనే తన ఫైనల్ పరీక్షలు. ఇప్పుడు నాటకం రిహార్సల్ కు ఎలా వెళ్లగలదు? అనుకోకుండా వచ్చిన అవకాశం చేజార్చుకోవాల్సిందేనా?’ దిగులుగా అనుకుంది. నిరుత్సాహం కమ్మేసిందామెను.

“ఏమంటావమ్మా? ఒప్పుకున్నట్టేనా?” అడుగుతున్నారు రామారావుగారు.

“సారీ సార్! మరో 15 రోజుల్లో మా పరీక్షలు ప్రారంభమవుతాయి. ఇప్పుడు నేను రావడం కుదరదేమో” అంది నెమ్మదిగా.

“పర్వాలేదమ్మా! నాటకోత్సవాలకు ఇంకా రెండు నెలల టైం ఉంది. మీ ఎగ్జామ్స్ కూడా ఈ నెలాఖరితో అయిపోతాయని చెప్పారు ప్రిన్సిపాల్ గారు. ఆ తర్వాత నువ్వు రిహార్సల్స్ కు రావచ్చు.”

ఆమడదూరం పారిపోయిన ఉత్సాహం తిరిగి వచ్చి చేరింది తారకు. అంతలోనే మరో అనుమానం మెదిలింది తార బుర్రలో. “అమ్మ ఒప్పుకుంటుందా? కాలేజీలో నాటకం వేసినందుకే పెద్ద రాద్ధాంతం చేసింది. ఇక బయటి నాటకం అంటే...”

“మా అమ్మగారిని అడిగి వారం రోజుల్లో మీకు ఏ విషయం చెప్తాను. వస్తానండి. వస్తాను సర్.” ఇద్దరికీ చెప్పి వచ్చేసింది తార

************

సాయంత్రం వంటకు అన్ని సిద్ధం చేసుకుంటోంది పార్వతి. అక్కడే ఉల్లిపాయలొలుస్తూ కూర్చుంది తార.

“అమ్మా!” నెమ్మదిగా పిలిచింది.

“ఏంటి చెప్పు...”

“ఏం లేదులే...”

“ఏదో చెప్పాలనుకుంటున్నావు కదా! చెప్పు మరి”

“ఏం లేదులే...”

ఇక రెట్టించలేదు పార్వతి. ఉదయం నుంచి కూతురి అవస్థను చూస్తూనే ఉందామె. ఎప్పుడూ తన పనేంటో... తానేమిటో... అన్నట్టుండే కూతురు, ఈరోజు లేచిన దగ్గర్నుంచి పని ఉన్నా లేకపోయినా తన వెనకే అస్తిమితంగా తిరుగుతోంది. ఏదో చెప్పాలనుకుంటుంది... చెప్పలేకపోతోంది. ఒకటి రెండు సార్లు ఏదో చెప్పబోయి ఆగిపోయింది. ఇదంతా ఓరకంటితో గమనిస్తున్న పార్వతి మనసులో అనుమానబీజం మొలకెత్తింది. కూతురు ఏం చెప్పబోతోంది? ఆమె ఊహలన్నీ ఒకే ఒక్క ప్రశ్న దగ్గర ఆగిపోతున్నాయి. ‘తార ఎవరినైనా ప్రేమించిందా? అది బయట పెట్టడానికేనా ఈ ఆరాటమంతా? ఒకవేళ అదే నిజమైతే...!’ తలవిదిలించింది పార్వతి కలలో కూడా దాన్ని ఒప్పుకోలేకపోతోందామే

ఇప్పటికే కూతురికి పెళ్లి చేయకుండా చదివిస్తున్నందుకు బంధువుల విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. అలాంటిది కూతురు ప్రేమలో పడిందంటే వాళ్ళ నోటికి హద్దు ఉంటుందా? అది తను భరించగలదా? వెనక మగవాడి అండ ఉన్న ఆడవాళ్లు ఏం చేసినా కొట్టుకుపోతుంది. అదే ఒంటరిగా బాధ్యతలు మోసే తన లాంటి వాళ్ళు ఏం చేసినా అది చర్చనీయాంశమై కూర్చుంటుంది.

విషయం ఏంటని కూతుర్ని అడగబోయింది. అంతలోనే విరమించుకుంది. ‘అది తన మనసులో మాట బయట పెట్టినప్పుడే వింటాను... తొందరెందుకు?’ అనుకుంది. తనకి ఇష్టం లేని సంఘటనను భరించక తప్పదని తెలిసినప్పుడు, అదెంత ఆలస్యమైతే... అంత మంచిదనుకోవడం మానవ మనస్తత్వం. ప్రమాదం ముంచుకొస్తుందని తెలిసినప్పుడు వీలైనంతవరకు అది పోస్ట్ పోన్ అవ్వాలని చూస్తాం. సరిగ్గా పార్వతి కూడా అలాగే అనుకుంది. అయితే కూతురు తన ఊహకందని విషయం చెప్పబోతోందని అది ఆమె జీవితాన్నే పూర్తిగా మార్చేస్తుందని తెలియదావిడకు.

తార ఆలోచనలు మరోలా ఉన్నాయి. ‘అమ్మ ఒప్పుకుంటుందా? కాలేజీ ఫంక్షన్లో నటిస్తానంటేనే పెద్ద గొడవ చేసింది. అప్పుడంటే కాలేజీలో కాబట్టి, ఫ్రెండ్స్ తో పాటు తను సరదాగా చేస్తానంటే, ముందు నిప్పులు కురిపించినా తరువాత మెత్తబడింది. మరిప్పుడు... బయటి నాటకాల్లో వేస్తానంటే భగ్గుమనదూ! ఎలా... ఎలా చెప్పడం? పోనీ ఆ ప్రసక్తి వదిలేద్దాం అంటే, తన మొదటి నాటకానికి వచ్చిన ప్రశంసలు... ముఖ్యంగా ఆరోజు అనితతో కలిసి చూసిన ప్రోగ్రాంలో ఆ కళాకారిణికి లభించిన గౌరవ మర్యాదలు గుర్తుకొచ్చాయి. దాంతోపాటు అలాంటి ఒక ప్రత్యేకత తనకూ కావాలనన్న తన ఆశ గుర్తొచ్చింది. ఇలా ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండగానే విషయం వెళ్లడవ్వకుండానే ఆరోజు గడిచిపోయింది.

***********************

సశేషం

మిగిలిన భాగం తరువాతి బ్లాగ్ లో


ఇది కూడా చదవండి



Recent Posts
5వ శక్తిపీఠం జోగులాంబ : వాస్తు దోషాలు, నరఘోష, ఇంట్లో చీడపీడలు తొలగించే దేవి  | Alampur jogulamba shaktipeeth full details
5వ శక్తిపీఠం జోగులాంబ : వాస్తు దోషాలు,...
2026 ఫిబ్రవరిలో శ్రీశైలం మల్లన్న బ్రహ్మోత్సవాలు ఎప్పటినుంచంటే...  | shri sailam bramhmotsavam
2026 ఫిబ్రవరిలో శ్రీశైలం మల్లన్న బ్రహ్మోత్సవాలు ఎప్పటినుంచంటే......
సమంత రెండో వివాహం : లింగభైరవి, భూతశుద్ధి వివాహం...  | Who is goddess lingabhairavi? What is bhootshuddhi marriage?
సమంత రెండో వివాహం : లింగభైరవి, భూతశుద్ధి...
మానూ మాకును కాను – నవల – 25  |  2019 స్వాతి అనిల్ అవార్డ్ నవల | Swathi magazine Award winning novel by MVSS Prasad
మానూ మాకును కాను – నవల –...
మానూ మాకును కాను – నవల – 24  |  2019 స్వాతి అనిల్ అవార్డ్ నవల | Swathi magazine Award winning novel by MVSS Prasad
మానూ మాకును కాను – నవల –...