Vijaya Lakshmi
Published on Oct 19 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?అది రాంపూర్ అనే గ్రామం. ఆ ఊరిలో “మోడరన్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ ” అన్న బోర్డు ఉన్న పది అంతస్తుల భవనం అది. ఆ భవనం లో మెడికల్ కాలేజీ ఉంది. పక్కన అంతే పెద్దదయిన భవనంలో ఆసుపత్రి ఉంది. ఆ పక్క భవనాలలో కాలేజీకి సబంధించిన వివిధ విభాగాలు ఉన్నాయి.
హైదరాబాద్ నగరానికి వంద కిలోమీటర్ల దూరంలో, హైదరాబాద్, నిజామాబాదు హైవేలో, హైవేకి దాదాపు ఇరవయి కిలోమీటర్ల దూరంలో వంద ఎకరాల సువిశాల స్థలంలో ఉంది ఆ కాలేజీ. చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడ కట్టబడి ఉంది. దానిపై ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ అమర్చబడి ఉంది.
సువిశాలమైన ఆ కాంపస్ లో మెడికల్ కాలేజీ, మూడువందల పడకలు గల బోధనాసుపత్రి, దానికి సంబంధించిన వివిధ విభాగాలు ఉన్నాయి. అక్కడే వెయ్యి మంది విద్యార్ధులకి సరిపడ, అత్యాధునిక సదుపాయాలు ఉన్న హాస్టల్ ఉంది. ఆ హాస్టల్ లో మగపిల్లల, ఆడపిల్లల విభాగాలు వేరే ఉన్నాయి. అలాగే రెండు వర్గాలకి వేరు వేరు మెస్ లు అరేంజ్ చేయబడ్డాయి. ఆడపిల్లల హాస్టల్ చుట్టూ అత్యాధునిక రక్షణ వలయం కలిగిన ఫెన్సింగ్ ఉంది .
అదే కాంపస్ లో మెడికల్ కాలేజీలో పనిచేసే బోధనా సిబ్భందికి, నర్సులకి, మెడికల్ కాలేజీ, ఆసుపత్రికి సంబంధించిన వివిధ భాగాలలో పనిచేసే వాళ్ళకి క్వార్టర్స్ కట్టారు. అలాగే అత్యవసరంగా అవసరమయ్యే ఎలక్ట్రికల్, ప్లంబ్మ్బింగ్ పనులు చేసే వాళ్ళకి కూడా అక్కడే నివాస సదుపాయం కల్పించారు.
ఆ కాలేజీ కాంపస్ లోనే అన్ని సదుపాయాలు ఉన్న సూపర్ కాంప్లెక్స్ నిర్మింపబడి ఉంది. అందులోనే పెద్ద మాల్ ఉంది. అక్కడ గుండుసూది నుంచి సూపర్ కంప్యూటర్ వరకూ అన్నీ దొరుకుతాయి. స్పా,బ్యూటీ పార్లర్, నెట్ కేఫ్ లాంటి ఆధునిక సౌకర్యాలు ఆ భవనంలోనే కలిల్పించారు.
అక్కడ ఒక పెద్ద బుక్ షాప్ ఉంది. అందులో మెడిసిన్ కి సంబధించిన అన్నిరకాల పుస్తకాలు, పరికరాలు వగైరా దొరుకుతాయి. ‘జిమ్’ కూడా ఉంది. అలాగే రంగురంగుల పూలమొక్కలు, అరుదైన, అందమైన వృక్షాలు గల పార్క్ కూడా అదే ప్రాంగణంలో ఏర్పాటు చేసారు. ఒక విద్యార్ధి లేక విద్యార్ధిని అక్కడకు వస్తే, కేవలం అప్పుడప్పుడు తల్లిదండ్రులను, బంధువులను చూడడానికి బయటకు వెళ్ళాలి తప్ప ఇంకే విషయానికి కాంపస్ దాటి వెళ్ళాల్సిన అవసరం లేదు.
‘లోపలి విద్యార్ధిగా రా ...మెడిసిన్ డిగ్రీ చేతబట్టుకు బయటకు వెళ్ళు’ అన్నట్టు ఉంటుంది “మోడరన్ మెడికల్ కాలేజీ “ కాంపస్ లో ఎక్కడకక్కడ రక్షక సిబ్బంది నియమింపబడి ఉన్నారు. ప్రతి విభాగానికి సంబంధించిన రక్షణ సిబ్బంది విధులు స్పష్టంగా నిర్దేశింపబడ్డాయి. అలాగే ప్రతి విభాగానికి ఒక అధిపతిని నియమించారు. అతను ఆ విభాగంలో భద్రతకి పూర్తిగా పూచీదారు. ప్రతీ విభాగానికి సీ. సీ. కెమెరాలు అమర్చబడి, వాటిని ఇరవైనాలుగు గంటలూ పర్యవేక్షించే ఏర్పాటు చేయబడింది. కేంద్ర రక్షణ విభాగం ప్రతి నిమషం ఆ కాంపస్ లో ఏ మూల ఏం జరుగుతోందో పసిగడుతూ ఉంటుంది .
నిజానికి అది ఒక మెడికల్ కాలేజీ అయినా అక్కడ రక్షణ వ్యవస్థ సున్నితమైన ప్రభుత్వ సంస్థని మించిపోయి ఉంటుంది. అక్కడ ఉండి, చదువుకునే వాళ్ళకు అత్యంత భద్రత కల్పిస్తోంది కాలేజీ యాజమాన్యం. కనుక అక్కడ మెడిసిన్ చదవడానికి దేశ, విదేశాలలోని అత్యంత ధనికుల పిల్లలను పంపిస్తారు. మేనేజ్మెంట్ తమకు నచ్చిన వాళ్ళను ఎంపిక చేసుకోవచ్చు. వాళ్ళు ఏ బాష, ఏ జాతి, ఏ రాష్ట్రం, ఏ దేశం వాళ్ళన్నది కాలేజీ యాజమాన్యం పట్టించుకోదు. ప్రభుత్వ రూల్స్ ప్రకారం కొంత మందిని, యాజమాన్యం తమ కోటాలో, తమకు ఇష్టమైన స్టూడెంట్స్ ని కొంతమందిని చేర్చుకుంటుంది . అయితే అక్కడ ఫీజు కోట్లలో ఉంటుంది. అలాగే హాస్టల్ వగైరాలకి లక్షలలో అవుతుంది. అందుకు సిద్ధపడ్డ వారే అక్కడకు వస్తారు. అక్కడ జాయిన్ అవుతారు .
అక్కడ అన్ని భవంతులు, క్వార్టర్స్ తో సహా, పూర్తిగా సెంట్రల్ ఏ.సీ. తో ఉంటాయి. ఆ విషయం లో పెద్ద వాళ్ళు, చిన్నవర్కర్స్ అన్న బేధం చూపలేదు యాజమాన్యం.
ఆ కాలేజీలోనే రియల్ ఎస్టేట్ బిజినెస్ లో కోట్లకి పడగ ఎత్తిన జగన్నాధం కొడుకు ఆయుష్ మొదటి సంవత్సరం ఎం.బి.బి.ఎస్. లో చేరాడు. అతనితోబాటు చాలామంది చేరారు. వాళ్ళలో ఎక్కువ మంది తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ కి చెందినవారే. అయితే కొంతమంది వేరే రాష్ట్రాలవాళ్ళు, వేరే దేశాల వాళ్ళు ఉన్నారు. విదేశీయలలో చాలమంది చుట్టుపక్కల దేశాల వాళ్ళు. అయితే ఒకరిద్దరు ఆఫ్రికాఖండంలో దేశాల నుంచి కుడా ఉన్నారు .
మొదటి సంవత్సరం స్టూడెంట్స్ అందరూ చేరిన తరువాత హాస్టల్ కేటాయించారు. ప్రతి విద్యార్థికి, విద్యార్దినికి ఒక్కక్క గది కేటాయించారు. అందరూ వచ్చి సెటిల్ అయ్యాక యాజమాన్యం “ఫ్రెషర్సు డే “ నిర్వహించింది. కాలేజీలో చేరిన విద్యార్ధిని, విద్యార్ధులకు భయం పోవడానికి, ఒకరికి ఒకరు పరిచయం కావడానికి, అలాగే సీనియర్లతో ఫ్రెషర్సు పరిచయం చేసుకోడానికి ఏర్పాటుచేసిన ఫంక్షన్ అది. రాగింగ్ లాంటివి పాల్పడే వారి పట్ల యాజమాన్యం నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తుంది. అందుకని ఏ విద్యార్ధిగాని ,విద్యార్ధినిగాని జూనియర్ లను ఏడిపించడంలాంటివి ఆ కాలేజీలో మచ్చుకైనా కనపడవు.
“ఫ్రెషర్సు డే” ఫంక్షన్ అంగరంగ వైభవంగా జరిగింది. కొత్త పాత అనేది లేకుండా విద్యార్థులు అందరూ కలిసి రకరకాల నృత్యాలు చేసారు. పాటలు పాడారు. కేరింతలు కొట్టారు. కొత్తవాళ్ళు ఒక్కొక్కరే స్టేజిమీదకి వచ్చి తమను తాము పరిచయం చేసుకున్నారు. అప్పుడు సీనియర్లతో పాటు అందరూ చప్పట్లు చరిచి వారిని ఉత్సాహపరిచారు. విదేశీ విద్యార్థులు వచ్చినప్పుడు చప్పట్లు మరింత గట్టిగా వినిపించడం ముదావహం .
రెండు రోజుల తరువాత మొదటి సంవత్సరం విద్యార్ధిని, విద్యార్థులకు క్లాసులు ప్రారంభం అయ్యాయి .
ఆ రోజు ప్రిన్సిపాల్ డాక్టర్ రామరాజు కొత్తగా చేరిన అందరిని ఉద్దేశించి ప్రసంగించాడు. ప్రసంగం ఇంగ్లీష్ లో సాగింది.
“డియర్ స్టూడెంట్స్, మీరు అందరూ నాలుగు సంవత్సరాల కాలంలో డాక్టర్స్ అవబోతున్నారు. ఈ నాలుగు సంవత్సరాలు, తరువాత ఒక సంవత్సరం హౌస్ సర్జన్సీ మీ జీవితం లో అతి ముఖ్యమైన సమయం .మీరు మంచి వైద్యులు అవుతారా? లేక సాదాసీదా డాక్టర్ అవుతారా? అన్న విషయానికి ఈ సమయం లోనే బీజాలు పడతాయి. కనుక మీరందరు ఎంతో శ్రద్ధగా, జాగ్రత్తగా ఈ సమయం వినియోగించుకోవాలి. ఎవరికి ఏ సందేహం వచ్చినా ఏ మాత్రం మొహమాట పడకుండా వెంటనే అడిగి తెలుసుకోవాలి. వేరే డిగ్రీల వాళ్ళు ఉద్యోగరీత్యా వేరే లైన్ లోకి వెళిపోతే, అప్పుడు వాళ్ళు చదువుకున్నది మర్చిపోయే అవకాశం ఉంది. మనం, ఇంజనీర్లు చదువుకున్నది జీవితకాలం మరిచిపోకూడదు. మరీ ముఖ్యంగా మనం చదివింది జీవితాంతం గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే మనం చేసేది ప్రతీపనీ ఒక మనిషి ప్రాణంతో ముడిపడి ఉంటుంది. కొన్ని కోట్లమందిలో భగవంతుడు, మనుషులకు సేవ చేసే అవకాశం, మనకు ఇచ్చాడు. మనం బతికి ఉన్నంతవరకు సేవాదృక్పథంతోనే మెలగాలి... సంచరించాలి. మనం మన జీవితాన్ని, ఇంకొకరికి కొత్త జీవితం అందించడానికి వినియోగించాలి. మనం అందరం డాక్టర్లు కాగానే ‘హిప్పోక్రేట్ ఓత్’ తీసుకుంటాం. దాన్ని మన అందరం ఎల్లవేళలా మనసా ,కర్మణా, వాచా పాటించాలి.
ఇక మీ సహ విద్యార్థులతో స్నేహపూర్వకంగా మెలగాలి. మీ ఉపాధ్యాయుల పట్ల గౌరవభావంతో ప్రవర్తించాలి. ఈ కాంపస్ లో ఉన్న అందరం స్నేహితులం. అలాగే కలిసి ఉండాలి. అలాగే విడిపోవాలి.
ఇక్కడ క్రమశిక్షణకి ప్రథమస్థానం. ఎవరు దానిని అతిక్రమించినా అతి తీవ్రమైన శిక్షలు ఉంటాయి. దయచేసి అందరూ క్రమశిక్షణకి కట్టుబడి ఉండండి. దానిని అతిక్రమించి అనవసరంగా మీ జీవితాలను నాశనం చేసుకోకండి.
మనం చదువుకోడానికి వచ్చాం. చక్కగా చదువుకుని మన లక్ష్యం సాధిద్దాం. మాములు విద్యార్థులుగా వచ్చి, డాక్టర్లలా వెళ్ళడమే ఈ మెడికల్ కాలేజీ ప్రత్యేకత. “అల్ అఫ్ యు బెస్ట్ అఫ్ లక్.”
అందరూ చప్పట్లు కొట్టారు. ప్రిన్సిపాల్ డాక్టర్ రామరాజు ప్రతి ఒక్క కొత్త స్టూడెంట్స్ కి షేక్ హ్యాండ్ ఇచ్చాడు.
స్టూడెంట్స్ కి రెగ్యులర్ క్లాసులు స్టార్ట్ అయ్యాయి. మొదటి రోజు అనాటమీ క్లాసు అయిన తరువాత అందరిని శవాలను డిస్సెక్ట్ చేసే హాల్ కి తీసుకు వెళ్ళారు. అక్కడ వరుసగా పడుకోబెట్టిన శవాలను చూసిన స్టూడెంట్స్ లో కొంతమంది కంగారు పడితే, కొంతమంది భయపడ్డారు. ఇంకొంతమంది అక్కడి వాసనకి వికారం పాలయ్యారు.
అనాటమీ ప్రొఫెసర్ స్టూడెంట్స్ ని ఉద్దేశించి, “డియర్ స్టూడెంట్స్... మీరు ఎవ్వరూ ఏమీ భయ పడక్కర్లేదు. మనం బతికున్న మనుషులను చూసి భయపడాలిగాని, పాపం నిర్జీవంగా పడి ఉన్న శవాలను చూసి ఎందుకు భయపడడం. ఎనీ వే రెండు రోజులలో మీరే అలవాటు పడిపోతారు.” అంటూ అందరికి ధైర్యం చెప్పాడు.
ఆ తరువాత రెండురోజులు అనాటామీ క్లాసు అయిన తరువాత స్టూడెంట్స్ అందరిని శవాల చుట్టూ స్టూల్స్ వేసుకుని, శవాలని చూస్తూ కుచోమన్నారు. అలా మెల్లిగా స్టూడెంట్స్ కి భయం పోయింది. తమ చదువులో శవజాగరణ కూడా ఒక భాగమని వాళ్ళు తెలుసుకున్నారు .
మెల్లిగా, దాదాపు అందరు విద్యార్థులు, కాలేజీ వాతావరణానికి, హాస్టల్ జీవితానికి, మెస్ తిండికి అలవాటుపడ్డారు. కానీ ఒకరిద్దరు ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. వాళ్ళలో ఒకరు ఆఫ్రికాఖండం లో కెన్యా దేశంనుంచి వచ్చిన ‘గుగు’ అనే అమ్మాయి. మొదటసారిగా తల్లిదండ్రులను వదలిరావడం, దేశం కానీ దేశంలో అంతా కొత్తవ్యక్తుల మధ్య బతకడం, ఆహార, విహారాలలో ఎంతో మార్పు... వీటన్నింటికి తట్టుకోలేకపోయింది. ఎంత సెల్ ఫోన్ ఉన్నా, తల్లిదండ్రులను రోజు చూస్తూ వీడియోకాల్ లో మాట్లాడినా, ఆ దూరం తను అనుభవిస్తోంది. ఒకరిద్దరు అమ్మాయిలు కలగజేసుకుని ధైర్యం చెప్పే ప్రయత్నం చేసారు. కానీ ‘గుగు’ రోజూ పొద్దున్న, సాయంత్రం కన్నీళ్ళు పెట్టుకుంటూనే ఉంది .
‘గుగు’ పక్క రూమ్ లో ఉంటున్న నివేదిత, “ఎందుకు గుగు... అలా బాధ పడతావు? మేమందరం కూడా తల్లిదండ్రులను వదిలి దూరంగా వచ్చిన వాళ్ళమేగా.” అంది .
“నివేదిత.మీ అమ్మ నాన్నలు గంట దూరంలో ఉన్నారు. నువ్వు ఎప్పుడు కావలిసిస్తే అప్పుడు వెళ్ళి చూసి రావచ్చు. కానీ, మరి మా అమ్మ...! ఎంత త్వరగా వెడదామన్నా కనీసం ఒక రోజు పడుతుంది.” అంది గుగు బిక్క మొహం పెట్టి.
“గుగు నువ్వు చెప్పింది నిజమే .కాదనను. కానీ మేమందరం లేమూ? నీకు ఏం కావాల్సివచ్చినా మమ్మల్ని అడుగు. నువ్వు అలా రూమ్ లో కూచోకుండా, క్లాసులు అవగానే అలా పార్క్ వైపు రా. అందరం సాయంత్రం అక్కడే కూచుంటున్నాం” అంది నివేదిత .
“కానీ రూమ్ లో ఒంటరిగా అనిపిస్తోంది “అంది గుగు .
“అలా అయితే నువ్వు పడుకునే వరకు నాతోను, మిగతా ఫ్రెండ్స్ తోను గడుపు. ఈ రోజే మనకు చెప్పారు కదా. మనకు ఇకనుంచి అసలు టైం ఉండదని. ఎంత టైం కూడా కాలేజీకి చదువుకు సరిపోదని. అప్పుడు అసలు తీరిక లేక ఏమీ ఆలోచించే, ఎవరిని గురించి బెంగపెట్టుకునే టైం ఉండదు.’ అంది నివేదిత.
ఆ మరునాడు సాయంత్రం గుగు పార్క్ కి వెళ్ళింది. అక్కడ ఆ అమ్మాయికి నివేదితతో పాటు శరణ్య, స్నేహ, హసిత అనే అమ్మాయిలతో పరిచయం అయ్యింది. నివేదిత చక్కగా మాట్లాడితే, శరణ్య నోరు తెరిస్తే ఇక మూయదు. స్నేహ మంచి జోకులు వేసి అందరినీ నవ్విస్తుంది. హసిత సార్ధక నామధేయరాలుగా అలా నవ్వుతూనే ఉంటుంది. వాళ్ళ సాన్నిహిత్యం గుగు లో కొత్త ఉత్సాహం నింపింది. కాలేజీ లో చేరిన తరువాత మొదటిసారిగా నవ్వింది గుగు .అక్కడున్న అమ్మాయిలంతా సంతోషించారు. అది మొదలు గుగు రోజూ సాయంత్రం ఆ నలుగురిని కలుస్తూ ఉండడం మొదలు పెట్టింది. వాళ్ళు ‘గుగు’ ని ఉత్సాహ పరుస్తూనే ఉన్నారు. గుగు క్రమంగా తన బెంగనీ, భయాన్నీ దూరం చేసుకోవడం నేర్చుకుంది.
అయితే ఆమెకి ఇంకో సమస్య మొదలయింది.
***************
సశేషం
మిగిలిన కథ రేపటి బ్లాగ్ లో