Vijaya Lakshmi
Published on Dec 10 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?
"మన గతానుభవాలు తల్చుకుంటున్నా, భవిష్యత్తును ఇష్టంగా ఊహించుకోవాలనుకున్నా, నిస్పృహని వదిలి నూతనోత్సాహం పొందడానికీ... అప్పుడప్పుడు మన మది మధురంగా చప్పరించుకోవడానికి కొన్ని మధుర స్మృతులు కావాలి. అవి లేకపోతే ఇంతటి విలువైన జీవితంలో జవజీవాలు లోపించి నిస్సారంగా నిస్తేజంగా ముగిసి పోతుంది.”
°°° °°° °°°
"మనం ఏదైనా అవతలివాళ్లను అడిగే ముందు, వాళ్లు కూడా మనల్ని ఏమైనా అడిగే అవకాశముంది. మనము అందుకు సిద్ధంగా ఉన్నామా? అని ఆలోచించి మరీ అడగాలి"
°°° °°° °°°
'మగవాడు, ఆడది ' ఈరెండు ముద్రలు లేకుండా
మూడవ మనిషిని గౌరవంగా బ్రతకనివ్వరా? స్వేచ్ఛగా బ్రతకలేరా? ఆత్మాభిమానంతో బ్రతికే వీలు లేనపుడు ఏం చేయాలి? ఏం చేస్తారు?
°°° °°° °°°
"విశృంఖలమైన కోర్కెలకు అందంగా వేసిన యవనిక నాగరికత. కొందరు ఆధునిక పేర్లుతో సమాజాన్ని మభ్య పెడుతున్నారా? వ్రాయని ప్రేమలేఖ*లో చూద్దాం….
°°° °°° °°° పెళ్లి చూపులు
"ఆ.. అటువారిని, ఇటువారిని చూస్తుంటే ఒండొరులకు నచ్చినట్లేఉంది. శుభస్య శీఘ్రం! అయినా నచ్చకపోవటం ఏమిటి? అమ్మాయి చూస్తే లక్ష్మీదేవిలా ఉంది. అబ్బాయిచూస్తే యువరాజులా ఉన్నాడు కానివ్వండి, మిగతా విషయాలు కూడా మాట్లాడేసుకుంటే పనయిపోతుందికదా" సంబంధాలు కుదిర్చే మధ్యవర్తి అన్నాడు.
"ఏంటండీ తొందర పడుతున్నారు? మరో బేరం ఏమైనా ఉందేంటి వెంటనే?"అబ్బాయి తరపువాళ్లెవరో నవ్వుతూ అడిగారు.
"ఏం బేరాలోనండీ... అంతంత మాత్రమే. మహాఐతే ఇంకో నాలుగైదేళ్ళు..అంతే! అదీ అతికష్టంమీద. ఆ తర్వాత ఇంక సంబంధాల ఊసే ఉండదు "
"ఎందుకనంటారు? మీరుమానేస్తారా?"
"లవ్వండీ...లవ్వూ.. లవ్వాడేసుకోడం, పెళ్లాడేసుకోడం! ఇంకమాతో పనేం ఉంది? మాకేం పనుంది?"
ఆయన చెప్పేతీరుకు అందరూ నవ్వేశారు. మిగతా విషయాలుకూడా మాట్లాడుకుని సంబంధం ఖాయం అనుకున్నారు.
"ఒకసారి అమ్మాయి అబ్బాయి కూడా మాట్లాడుకుంటే బాగుంటుందేమో, ఇద్దరు ఉద్యోగాలు చేసేవాళ్లే.. వాళ్లభిప్రాయాలు, అభ్యంతరాలు కూడా చెప్పుకుంటారు" అన్నారు మరొకరు.
"అలాగే...అలా పైకివెళ్లి మాట్లాడుకోండి" అబ్బాయికి సలహా ఇచ్చారు వాళ్ళవాళ్లు.
అబ్బాయిచూపు అమ్మాయివైపు వెళ్ళింది 'అంగీకారమేనా?' అన్నట్లుగా.
అమ్మాయి కనురెప్పలు మెల్లగాఎత్తి తన అన్న వైపు సారించింది దృక్కులు! అన్న చిరునవ్వులో అనుమతి గ్రహించింది
చల్లని సాయంకాల సమయమే కనుక అబ్బాయి చొరవగా డాబా మెట్లవైపుకి నడిచాడు. అమ్మాయి అనుసరించింది.
°°° °°° °°°
క్రిందనుండి పైకి పాకించిన మల్లె, జాజి తీవెలు దట్టంగా అల్లుకొని మొగ్గలతో ముచ్చటగా ఉన్నాయి. ఓ మూలనున్న కుండీలో మరువం నుండి మంద్రంగా వచ్చి ముక్కుపుటాలను తాకుతున్న పరిమళం...
"ఓహ్... లవ్లీ ప్లేస్! "అన్నాడతను. చిరునవ్వుతో విని ఊరుకుందామె
"చెప్పండి నేనడగవలసినవి ఏమిలేవు. మీకు ఇష్టమేనా? అని మాత్రమే. మీరు ఏమైన అడగదలుచుకుంటే అడగండి" చిన్నగా నవ్వుతూ అన్నాడు.
"నాకు.. ఇష్టమేనండి, ఒక్క చిన్నకోరిక మీకూ ఇష్టమైతే..."
"మ్ ...చెప్పండి. మీరు కాస్త ఫ్రీగా మాట్లాడుదురూ" నవ్వుతూ అన్నాడు.
కొన్ని క్షణాలాగి, తలెత్తి బిడియంగా అంది "ఒకవేళ పెళ్లి ఖాయం అయితే..."
"అయితే ఏమిటి? మీరు 'ఊ..' అంటే అయిపోయినట్టే!" చొరవగా అన్నాడు.
"పెళ్లిలో ఆడపిల్లనిస్తూ వరునికి తండ్రి కాళ్లు కడిగి ఆ నీటిని తలపై చల్లుకోవడం చూస్తున్నాను. ఆచర్యలో ఉన్న ఉద్దేశ్యం మంచిది మహత్తరమైనదే కావచ్చు కానీ.."
" ఉ..చెప్పండి?"
"నన్ను కన్నందుకు మా నాన్న... మరొకరి కాళ్లు పట్టుకోవడం... కడిగిన నీళ్ళు తలపై జల్లుకోవడం... ఉహు.. నేను భరించలేను"
"ఐతే వద్దని చెప్పండి మీ నాన్నగారికి"
"నేను చెబితే మావాళ్లే కాదు మీ వాళ్ళు కూడా ఒప్పుకోరు"
తలవంచుకుని చేతివేళ్ల గోళ్ళను చూసు కుంటూ చెప్పిందా అమ్మాయి.
ఆమెభావం అర్థమై నవ్వాడు. నవ్వుతూ
"సరే, నాకే అది ఇష్టంలేదని ముందేచెప్పి వారిస్తాను... ఇంకా?"
"థాంక్యూ, ఇంకేమిలేవు. మీరేమైనా..."
"కుటుంబ వివరాలన్నీ మన పెద్దవాళ్లు మాట్లాడుకున్నారు. క్వాలిఫికేషన్, జాబ్, ఆఫీసులాంటివి మీరు చెప్పారు. నాకు అంతా ఓ కే...మీరు ఇష్టపడినట్లే కదా?" అడిగాడు.
అవునన్నట్లు తలూపుతూ"క్రిందికి వెళ్దాం" అంది ముందుకు నడుస్తూ.
ఆమె భావాన్ని భయాన్ని అర్థం చేసుకుని
నవ్వుతూ "సరే పదండి!" అన్నాడు.
°°° °°° °°°
ప్రతిభ స్కూటీని ఇంటిముందాపి ఇంట్లోకి నడిచింది ఇంట్లో అందరూ ఉన్నాఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. కాళ్లు చేతులు కడుక్కుని వచ్చేసరికి వదిన యమున టీ తెచ్చి ఇచ్చింది.
టీ తాగుతూనే వెనక వసారాలో కూర్చొని దీపారాధనకు వత్తులు చేస్తూన్న తల్లి సుమిత్రమ్మ దగ్గరకు నడిచింది ప్రతిభ.
"ఏంటమ్మా ఈరోజింత ఆలస్యమైంది?" తనప్రక్కనే కూర్చున్న కూతుర్ని అడిగింది సుమిత్ర.
"అబ్బ! ఏంట్రాఫిక్ అమ్మా... విసుగనుకో, రేపటినుండి ఇంకాస్త ఆలస్యం కావచ్చు" అంది.
"ఎందుకు?" అడిగింది సుమిత్ర
"మా ఆఫీసులో ఇన్స్పెక్షన్ ఉందమ్మా" చెప్పింది ప్రతిభ.
"ఏం ఉద్యోగాలో... పొద్దున్న తొమ్మిదికెల్లిన దానివి నాల్గుగంటలకు వచ్చేస్తే బావుండు ఐదు, ఆరు కాకుండా" అంది సుమిత్ర
పకపక నవ్వింది ప్రతిభ. నవ్వుతూనే తల్లితో చెప్పింది
"ప్రైవేటు ఉద్యోగాలు అంతేనమ్మా... పైగా ట్రాఫిక్ లో బాగాఆలస్యం"
"ఏమిటో పిల్లల్ని చదివించాలని ఆశపడి చదివిస్తాం. చదివాక మంచి ఉద్యోగం వచ్చినందుకు సంబరపడతాము. పెళ్లిళ్ల దగ్గరకు వచ్చేసరికి పాతకాలం వాళ్ళకంటే అన్యాయంగాఉంటోంది" నిట్టూర్చింది ఆమె.
"ఏమైందమ్మా అదోలా మాట్లాడుతున్నావ్? అడిగింది ప్రతిభ
"ఏమీ లేదులే"
కూతురుప్రశ్నకు జవాబు దాటేసింది. తల్లి మాటతీరు, దాటవేత ఏదో అనుమానం రేకెత్తించింది ప్రతిభలో.
అంతలో...
"ప్రభా!" పిలిచాడు అన్న రాజేంద్ర
"ఏమిటి అన్నయ్యా?" అడిగింది
"మీ వదిన పిలుస్తోంది వెళ్ళు" గంభీరంగాచెప్పి, బజార్ కి వెళ్లి పోయాడు రాజేంద్ర
'ఏమిటి అన్నయ్య మాటకూడా ఏదోలాగ ఉంది?' అనుకుంది ప్రతిభ
తండ్రి ఇంట్లో ఉన్నజాడ కనిపించలేదు.
***
ఖాళీ కప్పును తీసుకుని వంటగది వైపు నడిచింది ప్రతిభ. యమున కడిగిన బెండకాయలను గుడ్డతో తుడుస్తోంది.
"ఏంటి వదినా... కేసు షీట్ నీ దగ్గరకు వచ్చిందా?" అడుగుతూ ఆమెకెదురుగా ఉన్న పీటమీద కూర్చుంది. కొద్దిక్షణాల తర్వాత మెల్లగా చెప్పింది యమున
"ఏంలేదు ప్రభా..మొన్న నిన్ను చూసుకోవ డానికి వచ్చిన సంబంధం వాళ్లు ఈరోజు ఫోన్ చేశారు...."
"ఓ... అదా? అనుకున్నాను అందరూ ఏదో గుంభనగా ఉన్నట్లుంటే ఏదో ఉందని. ఏమని చేశారు..కట్నం మరింత ఇమ్మనా?
అబ్బాయి కారు కావాలంటున్నాడనా?
పోనీ.. ఒక హెలీకాప్టర్ అయినా సరిపెట్టు కుంటాడట అనా? అవే కావాలంటే, కొన్నేళ్ళు డబ్బుకూడబెట్టాక కొనిస్తామూ, అప్పుడు వచ్చి చేసుకుందురుగాని అని చెప్పేయక పోయారా?" నవ్వుతూ తేలిగ్గా అంది ప్రతిభ.
"నీకు నవ్వులాటగాఉంది"అంది యమున
"నవ్వులాట కాకపోతే ఏంటొదినా? అంతా బాగుంది, అమ్మాయి నచ్చిందని చెప్పి వెళ్లినోళ్లు ఇవికాక ఇంకేం అడుగుతారు?"
"వాళ్ళు అడిగింది అవికాదు"
"అబ్బా... వదినా టి.వి. సీరియల్ లాగా సాగదీయక చెక్ మని చెప్పేద్దూ "
"వాళ్లందరికీ...ముఖ్యంగా కుర్రాడికి నీవు బాగా నచ్చావట..."
"మరి? వాళ్ళతాతయ్య కళ్ళకి నచ్చలేదా మరీ చిన్నపిల్లలాగా ఉన్నానని?" సరదాగా అంది ప్రతిభ.
"ప్చ్...అవేం కాదులే ప్రతిభా" ఇబ్బందిగా ఆగింది యమున
"వదినా...మళ్లీ బ్రేకా? వాటె సస్పెన్స్!" నవ్వుతూనే ఉత్కంఠగా అడిగింది.
తలవంచుకు బెండకాయలు తరుగుతూ చెప్పింది యమున
"వాళ్లది సాంప్రదాయమైన కుటుంబమట. డబ్బుకంటే ఎక్కువగా పరువుకే విలువ ఇస్తారట"
"ఏం మనదికాదటా? ఆ పరువుకు మనం విలువఇవ్వమటా? అందరూ పాడే పాటే ఇది. అరిగిపోయిన రికార్డ్. తర్వాత?" అడిగింది ప్రతిభ.
"ఈ రోజుల్లో పిల్లలు ఆడ మగ తేడా లేక అర్ధరాత్రుళ్ళ వరకు ఆఫీస్ లంటూ తిరిగి, వేళపాళాలేకుండా ఇళ్ళకు చేరుతున్నారని మగవాళ్ళతో రాసుకు పూసుకు తిరుగుతు ఉన్నారనీ...అందుకని.." ఆగింది యమున
"ఆ...అందుకని?" రెట్టించింది ప్రతిభ
"మీ అమ్మాయినోసారి డాక్టర్కి చూపాకే లగ్నాలు పెట్టుకుందాం..అనీ..చెప్పారు" చెప్పేసింది యమున
ఫక్కున్నవ్వింది ప్రతిభ. నవ్వుతూనే
"నాకేమైనా రోగాలున్నాయేమోనని వాళ్ళ భయమా? ఇంతకూ నేను ఒక్కదాన్నే చాలా?నాతోపాటు మీరు అందరూ కూడా హెల్త్ సర్టిఫికెట్స్ సమర్పించాలటనా?" అడిగింది
మాట్లాడకుండా తన పని చేసుకుంటున్న వదినను అనుమానంగా చూస్తూ మళ్ళీ అడిగింది ప్రతిభ
"వదినా, దేనికో సందేహిస్తున్నట్లున్నావ్? నిజం చెప్పేయ్ వదినా" బ్రతిమాలింది
"రోగాలుకాదు ప్రభా.. నీకేమైనా స్నేహాలు ఉన్నాయేమోనని కావచ్చు..."
"అంటే?"
"అంటే... ఇంకెలా చెప్పను ప్రభా..?" దీనంగా బాధగా అడిగింది యమున
"అంటే...క్యారెక్టర్ సర్టిఫికెట్ నా వదినా వాళ్ళడిగింది?"
"..................."
యమున మాట్లాడలేదు. ఈమాట ప్రతిభ కు చెప్పమని ఇంట్లోవాళ్ళు తనకు చెప్తే ఇదివిన్న ప్రతిభ ఎంతగా చిన్నపోతుందో, లేదా, కోపంతో విరుచుకుపడుతుందోనని ఎంతో భయపడింది బాధపడింది కూడా. ప్రతిభ జవాబుకై ఎదురు చూడసాగింది యమున.
కొంతసేపు నిశ్శబ్దంగాఉన్న ప్రతిభ మెల్లగా ప్రశాంతంగా అడిగింది.
"వాళ్లడిగిన దానికి మనవాళ్లు ఏమన్నారు వదినా?"
యమున మనసు ఇప్పటికీ స్థిమితపడి 'హమ్మయ్య శాంతంగానేఉంది ' అనుకుని,
"ఇదేమి విడ్డూరం? ఇదెక్కడన్నా ఉందా? ఎక్కడన్నా ఎవరన్నా కట్టుతెగిన పిల్లలు ఉంటారేమో..అందరూ అలాగే ఉంటారా? అని అత్తయ్యగారు రుసరుసలాడారు.."
"................"
"పిల్లా పిల్లాడు ఇష్టపడ్డారు. ఈడు జోడు బాగుంది, మంచి సంబంధం...మనకి అందుబాటులోకి వచ్చిందని ఆశపడ్డాం. ఇంతలోనే ఈ విపరీతపు పరీక్షలేమిటి? అని మావయ్య గారు బాధపడ్డారు..."
"..............."
"ఇప్పుడు ఒక్కసారి డాక్టర్ పరీక్షచేయిస్తే చాలటనా? పెళ్లయ్యాక్కూడ ప్రతిరోజు ఆఫీసుకు వెళ్లి రాంగానే చేయించుకోవాలా ఈ పరీక్షలు? ఆ పాటి నమ్మకంలేనోళ్లకు ఉద్యోగంచేసే అమ్మాయిలు ఎందుకట?' అని మీ అన్నయ్య మండిపడ్డారు" చెప్పింది యమన.
మౌనంగావింటోంది ప్రతిభ. మళ్లీ యమునే చెప్పింది.
"మావయ్యగారు మళ్ళీ ఏమన్నారో తెల్సా ప్రభా?"
ఏమన్నారన్నట్లుగా చూసింది ప్రతిభ
"అయినా... హద్దుఅదుపూ లేకుండా తిరిగేవాళ్లకు భయంగాని, మన ప్రభకేంటి నిప్పు! మనం కాదంటే... వాళ్లకు లేనిపోని అనుమానాలొచ్చి, వాళ్ళనుమానమే నిజమనుకుంటారేమో.. ఆ అవకాశం మనం ఎందుకివ్వాలి? పైగా మంచి సంబంధం కూడాను..' అన్నారు ప్రభా.."
"....................."
"మీ అన్నయ్య మాత్రం మావయ్యగారి పై అరిచారు. 'మీరెంతసేపు వాళ్ళ భయాలు మన బరువు బాధ్యతలను గూర్చే ఆలోచిస్తున్నారు గాని ఈవిషయం వింటే ప్రభకెంత బాధగాఉంటుందో ఊహించరే? వీళ్ళుకాకపోతే మరొకరు. దేశం గొడ్డుపోలేదని చిరాకు పడ్డారు"
"...................."
"చివరికి మావయ్యగారు తేల్చిందేమంటే విషయం నీకుచెప్పి, నిర్ణయాన్ని నీకే వదిలేద్దాం అని. నీకు చెప్పమని నామీద పెట్టారు ప్రభా.. నమ్మవు, ఈ మాట నీకు చెప్పటానికే నాకు బాధగాఉంది" తనకప్పజెప్పిన బాధ్యత, తనపై భారం తీరినట్లు చెప్పింది యమున.
వదిన చెప్పినవన్నీ శ్రద్ధగా విన్నది ప్రతిభ. ఆలోచనలో పడింది
'ఉద్యోగాలు చేస్తూ ఆడవాళ్లు ఎంతో సుఖపడి పోతున్నారనుకుంటారు కానీ, ఎన్నిసమస్యల సుడిగుండాలలో వాళ్లుగా పడుతున్నారో.. నెట్టబడుతున్నారో గానీ.. బతుకంతా ఊపిరి సలపనంతగా ఉక్కిరి బిక్కిరౌతూ తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకో డానికి కొట్టుమిట్టాడుతూనే ఉన్నారు..'
కూరవండుతూనే కలవరంగా ప్రతిభ వైపు చూసింది యమున
ప్రతిభ మౌనంగా అక్కడనుండి లేచివెళ్ళి పోయింది.
***