Vijaya Lakshmi
Published on Dec 19 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?*వ్రాయని ప్రేమలేఖ*
రచన : శ్రీమతి.విజయశ్రీముఖి
ఉష పత్రిక వారి కీ.శే. శ్రీ వెలగపూడి సీతారామయ్య స్మారక నవలల పోటీ లో
ప్రోత్సాహక బహుమతి పొందిన నవల.
"ఏమిటక్కడే నిలబడి పోయావు?" అడిగింది ఇందుమతి
"ఎవరో బంధువులున్నారని..." అంటూ కదిలి లోపలికి వచ్చాడు భాస్కర్.
"ఈ అమ్మాయి పేరు ప్రతిభ. నా స్టూడెంట్ బీటెక్ పూర్తిచేసి జాబ్ చేస్తుంది. పేరుకేలే స్టూడెంట్. మా ఇంటి ఆడపిల్లంతటి అనుబంధం మా మధ్య...
ప్రతిభా! ఇందాక నువ్వడిగావు చూడూ నెలబాలుడు ఎవరని? ఇతనే ఆ బాలుడు బాల భాస్కర్!" పరిచయం చేసింది ఇందుమతి
ఏమాత్రం తెలియనట్లుగా "నమస్తే" అంది ప్రతిభ కళ్ళు వాల్చేసుకుని. ఆమె వైఖరిని గమనించి తనుకూడా "నమస్తే!" అన్నాడు భాస్కర్.
చేతిలోఉన్న క్యారీ బ్యాగ్ టేబుల్ పై పెట్టి, "నెలబాలుడు ఏమిటాంటీ" అడిగాడు ఇందుమతిని.
"ఈరోజు బాలు వస్తానన్నాడని చెబితే ఎవరా నెలబాలుడు అని అడిగిందిలే ప్రతిభ" నవ్వుతూచెప్పింది ఇందుమతి.
తనవైపు సంభ్రమంతో చూస్తున్న అతని చూపులనుండి తనచూపులు మరల్చు కుంది ప్రతిభ.
"రండి భోజనం చేద్దాం" అంటూ లేచింది ఇందుమతి
"ఏమిటో భోజనం చేయకుండానే ఈరోజు కడుపునిండిపోయినట్లుంది ఆంటీ" నవ్వుతూ చెప్పాడు భాస్కర్.
"మేడం మీరు కూర్చోండి.. మీకు నేను అందిస్తాను"
ప్రతిభ లేచివెళ్లి టేబుల్ మీదకు కంచాలు గ్లాసులు గరిటలు, వండిపెట్టిన పాత్రలు తెచ్చి ఆమెకు అందుబాటుగా సర్దింది.
"రెండు నిమిషాలు ఆగండి ఆంటీ" అన్నాడు భాస్కర్. తను తెచ్చిన క్యారీ బ్యాగ్ ఓపెన్ చేశాడు, దానిలో ఉన్న కేక్ టేబుల్ మీద అమర్చిపెట్టి, సంజయ్ కి వీడియో కాల్ చేశాడు.
అటు సంజయ్, అతని భార్య లైవ్ లోకి రాగానే సంజయ్ తో, "జై...ఇదిగోరా! ఆంటీ దగ్గరకు వచ్చాను. ఆంటీ కి బర్తడే విషెస్ చెప్పండి" అన్నాడు భాస్కర్.
"ఎన్నిసార్లు చెప్తారు? ఉదయమేచెప్పారు" నవ్వుతూ అంది ఇందుమతి
అటునుండి కొడుకు కోడలు మళ్లీ విషెస్ చెప్పగానే ఆమెతో కేక్ కట్ చేయించాడు బాలు.
కొవ్వొత్తులు వెలిగించడం.. వాటినార్పడం ఇందుమతికి ఇష్టంఉండదని భాస్కర్ కి తెలుసు..
'చూస్తూ చూస్తూ వెలిగేదీపాలన్నీ ఆర్పి, ఆనందంగా చప్పట్లుకొట్టడం నాకసలు నచ్చదు' అందామె లోగడ ఒకసారి.
కొడుకు కోడలు నవ్వుతూ క్లాప్స్ కొట్టారు. మరోసారి అభినందనలను తెలిపారు. వీడియోలో కనిపిస్తున్న ప్రతిభను చూసిన సంజయ్... "ఓ.. ప్రతిభా! బాగున్నావా? చాన్నాళ్ళు అయ్యిందమ్మా నిన్ను చూసి" సంతోషంగా అన్నాడు సంజయ్.
"బాగున్నా అన్నయ్యా, హాయ్.. వదినా!" పలకరించింది ప్రతిభ నవ్వుతూ
"నీవు వచ్చివెళ్ళినప్పుడల్లా అమ్మ నాకు చెబుతూనే ఉంటుంది.. ఈరోజు ప్రతిభ వచ్చింది రా' అని. నాలాంటి కొడుకులు అమ్మల్ని వదిలిపెట్టి ఇలా దేశాలు పట్టి తిరుగుతుంటే నీలాంటి మానసపుత్రికలే అమ్మలాంటివాళ్ళకి అండ" సంజయ్ లోని భావోద్వేగాన్ని ఆంటీకళ్ళల్లో మెరిసే చెమ్మనూ గమనించిన భాస్కర్ కల్పించుకుని
"జై...ఆకలేస్తుంది రా! ఈవేళ నీ వంతు కూడా నేనే తినేస్తాను. ఉంటాం. బై..." అంటూ మొబైల్ ఆఫ్ చేశాడు.
ఇందుమతి కొడుకు మాటలకు తడిదేరిన కళ్ళను తనపైట చెంగుతో ఒత్తుకుంది. తేరుకుంటూ కేకుముక్క తీసి భాస్కర్ కి పెట్టబోయి ఆగి.. నవ్వుతూ చెప్పింది
"ఉండు బాలూ.. ముందు ఆడపిల్లకు పెట్టనివ్.. ఆతర్వాత నీకు పెడతాను" అని ప్రతిభకు నోట్లో పెట్టబోయింది.
ప్రతిభ ఇందుమతి చేతిలో కేక్ ముందు కొద్దిగాతీసి ఆమెకి పెట్టాక, నోరు తెరిచింది ప్రతిభ నోట్లో కేక్ పెట్టిన ఇందుమతి మరో ముక్కతీసుకుని బాలునోట్లో పెట్టబోతే..
"మేడం ఆగండి, చేయి కడుక్కోండి. నాకు పెట్టేటప్పుడు మీవేళ్ళు నా పెదాలను తాకాయి. ఎంగిలి..."
కంగారుగా చెబుతూ నీళ్ల గ్లాసు ఆమెకు అందించింది ప్రతిభ.
క్షణం ఆగింది ఇందుమతి. అంతలోనే "ఆంటీ పెట్టండి! నాకు ఆ చేత్తోనే కావాలి" చటుక్కున ఇందుమతి చేతిని తానే అందుకుని గభాల్న తన నోట్లో పెట్టించు కున్నాడు భాస్కర్.
"ఆ..!!" ఆశ్చర్యంగా బాలుని చూసింది ఇందుమతి
"అ.. అదే ఆంటీ.. మీ చేత్తోనే పెట్టండి అనబోయి.. ఆచేతితోనే అనేసాను.." తత్తరపాటుగా చెప్పాడు భాస్కర్
ప్రతిభ తలవంచుకుని మౌనంగా టేబుల్ పై పాత్రలను సర్దుతోంది. ఇందుమతి వడ్డించసాగింది.
ఇందుమతి చేసిన పాయసం, గారెలు పులిహోర, పప్పు, చిక్కుడుకాయల వేపుడు, దోసకాయపచ్చడినీ కొద్దికొద్దిగా వడ్డిస్తుంటే, ప్రతిభ తను తెచ్చినవి కూడా ప్లేట్స్లో పెట్టింది. తెల్లనువ్వులు నిండుగా అద్దిన అరిసెలు, పెరుగు ఆవడలు, కజ్జికాయలు, కారప్పూసలను చూసి ఇందుమతి అడిగింది "ఎందుకమ్మా ఇన్ని తెచ్చావు?" అని.
"మీఇంటికీ రోజు నాలాంటి తిండిపోతులు వస్తారని ముందే ఊహించారేమో ఆంటీ" భావగర్భితంగా అన్నాడు భాస్కర్.
చురుగ్గా చూసింది ప్రతిభ అతన్ని.
"పాపం, ఆంటీ కెందుకండీ శ్రమ? మీరు వడ్డించవచ్చు కదండీ?" అన్నాడు మళ్ళీ ప్రతిభనుద్దేశించి అమాయకత్వం నటిస్తూ
అతని కనిపించని అల్లరి ప్రతిభకు అర్థం అవుతూనే ఉంది.
"పర్వాలేదు బాలు, ఇవన్నీ తనే కదా సర్దిపెట్టింది. ఈవేళ నా చేత్తోనే మీకు వడ్డిస్తే నాకు తృప్తిగా ఉంటుంది" అన్నది ఇందుమతి
భాస్కర్ కి ఎదురుగాఉన్న కుర్చీల్లో ఇందుమతి, ఆమె ప్రక్కన కుర్చీలో ప్రతిభ కూర్చున్నారు. ఇందుమతి మాట్లాడుతూ భోజనం చేస్తుంది. ఆమె మాటలకు జవాబులు ఇస్తూనే ప్రతిభను క్రీగంటన పరిశీలించసాగాడు భాస్కర్.
ఎప్పుడూ చుడీదార్లులోకనిపించే ప్రతిభ పండగని కాబోలు పట్టుచీర కట్టుకుంది. గోధుమరంగు పట్టుచీరకు సన్నని మావిచిగురురంగు అంచు,ఆ అంచుపై సన్నని జరీలతలు. చీరంచు రంగులోని జరీపూలతోఉన్న మోడరన్ జాకెట్... కనుబొమ్మల మధ్య చిన్నబొట్టు, కళ్ళకు సన్నని కాటుకరేఖలు, మెడలో బంగారు చైనుకు వేలాడుతున్న చిన్న పగడాల పతకం.. తలస్నానం చేసిన వాలుజడలో జాలుగా గాలికి సుతారంగా ఊగుతున్న మరువం కనకాంబరాల చిక్కనిమాల! ప్రతిభ సరికొత్తగా మరింత అందంగా కనిపిస్తోంది...
ఇందుమతి అడిగేవాటికి ప్రతిభ తలవంచుకుని తింటూ జవాబిలిస్తూ ఉంది. హాల్లో టి.వి.లో స్వరాభిషేకం సినీపాటల కార్యక్రమం వస్తుంది. దానిలో ఎవరోచిన్న కుర్రాడు పాడుతున్న పాట డైనింగ్ టేబుల్ దగ్గరకు చక్కగా వినిపిస్తోంది....
''ఏవేవో చిలిపితలుపు లుబుకు చున్నవీ
అవి ఎలాఎలా చెప్పాలో తెలియకున్నదీ..
ఆ పాట వింటూ అరిసెను కొరుక్కుని తింటున్న భాస్కర్ "వా..వ్!" అన్నాడు
'అరిసెల రుచికా? అమ్మాయి అందానికా? దేనికి 'వా..వ్?' అనుకుంది ఇందుమతి. ఆమెకేదో అందీ అందనట్లుగా అందుతోంది..
బాలు ఎప్పుడూ హుందాగా క్లుప్తంగా మాట్లాడేవాడు. ఈరోజు మోతాదుమించి చొరవగా ఉల్లాసంగా ప్రవర్తిస్తున్నాడు, కేవలం...వయసు ప్రేరణా? లేక..ఇద్దరికీ ఇంతకుముందే పరిచయం ఉండీ బయటపడటం లేదా?' ఆలోచిస్తూ వడ్డిస్తున్న ఇందుమతి
"మేడం, చాలు.. చాలండీ" అని ప్రతిభ అనడంతో తేరుకుని, తన అన్నంలో పెరుగుకలుపుకుంటూ భాస్కర్ ని అడిగింది ఇందుమతి "బాలూ! ఆమధ్య ఏదో సంబంధం చూసివచ్చాను అన్నావు ఏమైంది.. మళ్లీ ఏమాట చెప్పలేదు?"
"మాకైతే ఖాయం చేసుకుందామనే ఉంది ఆంటీ.. అమ్మాయి అందంగా ఉంటుంది, తెలివైనది కూడా. కాకపోతే.. ఆమెకు కాస్త చెముడు ఉన్నట్లుంది. మనం చెప్పేదసలు వినిపిస్తుందో లేదో తెలియడం లేదు"
చెప్పాడు భాస్కర్.
సుష్టుగా తింటూనే సీరియస్ గా చెప్తున్న అతనితీరుకు నవ్వు, కోపం కలగాపులగమై ప్రతిభకు గొంతులో పొలమారింది
"అరే..ఇవిగో మంచినీళ్లు తాగమ్మా" అందించింది ఇందుమతి
"మిమ్మల్ని మీవాళ్ళుఎవరో తలచుకుంటున్నట్లున్నారు ప్రతిభగారూ!" గుంభనగా నవ్వుతూ అన్నాడు భాస్కర్
ప్రతిమాటకు ప్రతిస్పందిస్తూ, చలాకీగా మాట్లాడే ప్రతిభ ఈరోజు ఇంత మౌనంగా ఉండటం... బాలు మాటల్లో ఏవేవో గూఢార్ధాలు చూసి ఇందుమతికి ఉన్న అనుమానం మరింతగా బలపడింది.
"ఔనూ.. ప్రతిభా! నీకూ ఒక సంబంధం వచ్చిందికదా ఆ సంగతేమిటి?" ప్రతిభను అడిగింది మళ్లీ.
"వద్దులే అది వదిలేయండి మేడం..వేస్ట్! వాళ్లదొక అనుమానపు పార్టీలెండి" క్రీగంట భాస్కర్ ని చూస్తూ చెప్పింది ప్రతిభ.
పెరుగన్నం తింటున్న భాస్కర్ గతుక్కు మన్నాడు..అతని గొంతు పొరబోయింది.
"ఇవిగో, ముందు మంచినీళ్లు తాగు బాలు, ఏం పిల్లలర్రా...మీరు" మంచినీళ్లు గ్లాస్ అందించి, అతనుతాగి, స్థిమితపడ్డాక నవ్వుతూఅంది ఇందుమతి
"పండగపూట నిన్నెవరో తిట్టుకుంటున్నారయ్యా బాలూ..." అని,ఇంక ఆసంభాషణని మార్చిందామె.
***
సశేషం
మిగిలిన కథ రేపటి బ్లాగ్ లో
ఇవి కూడా చదవండి