Vijaya Lakshmi
Published on Dec 20 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?*వ్రాయని ప్రేమలేఖ*
రచన : శ్రీమతి.విజయశ్రీముఖి
ఉష పత్రిక వారి కీ.శే. శ్రీ వెలగపూడి సీతారామయ్య స్మారక నవలల పోటీ లో
ప్రోత్సాహక బహుమతి పొందిన నవల.
ఆరాత్రి ప్రతిభకు ఎంతకూ నిద్రపట్టలేదు. మేడంగారి ఇంటిదగ్గర భాస్కర్ మాటలు చూపుల్లోని ఇష్టం పదేపదే గుర్తుకు వస్తూ జరిగినవన్నీ తరచితరచి తర్కించుకోసాగింది...
వాళ్ళ తాతగారు నాన్నకు ఫోన్ చేసి 'అమ్మాయిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి పరీక్ష చేయించండి 'అనే మాటవిని అందరికీ కోపంవచ్చిన మాటనిజం!
ఆడపిల్ల తండ్రిగా, మధ్యతరగతి గృహస్థుగా అన్నివిధాల నచ్చిన సంబంధాన్ని వదులుకోలేని ఆరాటం ఒకవైపునుంటే, తనకూతురుపై నమ్మకం, కాదంటే పిల్లను అనుమానిస్తారేమోననే భయం తండ్రిలో ఊగిసలాట సబబుగానే కనిపిస్తోంది.
ఇంత అనుమానపు కుటుంబంలో దినం దినం ఎలాంటిమాటలు ఎదుర్కోవాలో ముందుముందు ఇంకెలా ఉంటుందోననే అనుమానం వచ్చిన తర్వాతకూడా ఇంకా ఆ లంపటాన్ని తగిలించుకోవడం కొరివితో తలగోక్కోవడమే! అనేది అన్నయ్య వాదన!
ఈతర్జనభర్జనల్లో భాస్కర్ మాటలు విన్న తర్వాత స్పష్టమైనది ఏమిటంటే.. భాస్కర్ ప్రమేయం లేకుండానే తాతయ్యే పెద్దమనవడి అనుభవం దృష్ట్యా ఆయనే నాన్నకు ఫోన్ చేసినట్లు తేలుతోంది...
భాస్కర్ తనను కలవడం, అతను చెప్పిన మాటలు ఎప్పటికప్పుడు వదినతో తను చెబుతూనే ఉన్నది.
వదిన అన్నయ్యకు అమ్మానాన్నల దృష్టికి తీసుకువెళ్తుందని ఆమెకు తెలుసు. 'వాళ్లెవరన్నా పెద్దవాళ్లు కదిలిస్తేనే మనం ముందుకెళ్దాం, మనంతటి మనమే వెళ్తే ఆ టెస్టుకు అంగీకరించినట్లుగ ఉంటుంది. తొందర ఎందుకు చూద్దాం' అని అన్నయ్య అన్నాడని వదినచెప్పింది.
అరమరికలులేని తోడుదొరికితే జీవితము ఆనందంగా గడుస్తుంది. ఆడవాళ్లుగానీ మగవాళ్లుగానీ ఆశలకు ఆకర్షణలకు లొంగితే బతుకంతా ఒడిదుడుకులుగానే ఉంటుంది.
ఎదురయిన సమస్యను, రెచ్చగొడుతున్న యవనాన్ని చాలెంజింగ్ గా తీసుకోవడంలోనే వ్యక్తిత్వాలు బైటపడేది ' ఒకసారి మాటలు సందర్భంలో ఇందుమతి మేడం అన్నారు.
'అందరికీ మొదట్లో అంతనుభవం ఎలా ఉంటుంది మేడం?' అని తను అడిగితే ఆమె ఇచ్చిన జవాబు...
'అనుభవం లేకున్నా ఆలోచనలుండాలి. అందుకు మనచదువును తెలివిని వాడు కోవాలి. చదువు అంటే కేవలం అక్షరాలు రాయడం, రాసినవాటిని చదవటమే చదువు కాదు' అన్నారామె... ఆలోచిస్తూనే నిద్రలోకి జారింది ప్రతిభ.
***
బియ్యం కడుగుతున్న ఇందుమతి స్వేచ్ఛ వచ్చి తనదగ్గర సందేహంగా నిల్చోవటం చూసి "చెప్పమ్మా ఏంటి?" అని అడిగింది
"నాకు వంట చేయడం వచ్చండి. మీకు.. అభ్యంతరం లేకపోతే రోజూ నేను మీకు వండిపెడతాను" చెప్పింది స్వేచ్ఛ.
నవ్వింది ఇందుమతి "అభ్యంతరాలేమీ లేవు కానీ..ఎంత వంటమ్మా... ఒక్కదాన్ని. నీకెందుకు శ్రమ?" అంది
"మీరు కాలేజీకి వెళ్లి వస్తున్నారుగా.. పైగా వెన్నునొప్పితో ఉంటున్నారు. రెస్ట్ తీసుకోండి మేడమ్. ఐనా,నాకు వంటచేయడం బాగావచ్చు. మీకెలా కావాలో చెప్తేచాలు. నాకు సరదాకూడా. కాలక్షేపం ఉంటుంది కదా?"
"సరే, చెయ్యి.. బీరకాయలు తరిగిపెట్టాను ఉప్పు, కారం, నూనెలాంటి వన్నీ స్టవ్ ప్రక్క అరల్లోనే ఉన్నాయి" కడిగిన బియ్యంగిన్నెను స్వేచ్ఛకు ఇచ్చి స్నానానికి వెళ్లిందామె.
కాంతమ్మ స్వేచ్ఛ ఈమధ్య ఇందుమతి ఇంట్లోనే వెనుక వేరుగా ఉన్న వంటింట్లో కి వచ్చి ఉంటున్నారు. కారణం కాంతమ్మ పెద్దకొడుకు నాగరాజు గొడవతో విసిగిన కాంతమ్మ స్వేచ్ఛ బట్టలు తీసుకుని బైటకి వచ్చాక....
***
కాంతమ్మ ఒకనాడు పనిచేసి వెళ్లబోతూ పెద్దకొడుకు నాగరాజుకు స్వేచ్ఛకు జరిగిన గొడవ గురించి చెప్పింది.'ఆరోజునే ఇంటిలో నించి బయటకు వచ్చేసి వారంరోజులు అయిందమ్మ' అనిచెప్పింది
"మరిప్పుడు మీరు ఎక్కడుంటున్నారు కాంతమ్మా?" అడిగింది ఇందుమతి
"మా పెద్దయ్య కూతురు సుక్కమ్మక్కనీ ఈఊర్లోనే మెరకవీధిలో ఉంటదమ్మా.. ఇంట్లో ఉండేది అది ఒక్కతే. మాకూ ఒక గది ఇస్తదేమోనని వెళ్ళాం. తీరా ఎళ్ళాక చూత్తే తాళంపెట్టి ఉంది. మొన్ననే దాని కూతురింటికి చూసి రాను పోయిందని పక్కింటోళ్లు చెప్పారు. దానింటి పంచలోనే పడుంటున్నాం.. రెండు మూడు ఇళ్లల్లో అద్దెకి ఇత్తారానీ అడిగానమ్మ.. "ఇవ్వం. మారొచ్చిన నీ కొజ్జా కొడుకులంటోళ్లు మా మొగోళ్లతో సరసాలు మొదలెడతారు" అని ముఖం మీదే అన్నారు..నా రాత, ఆడి రాత..ఇట్టా ఏడిసింది.. మా కర్మకి.
మా సుక్కమక్క వొచ్చాక అదేవంటదో మరి.." చెప్పింది కాంతమ్మ.
"అయ్యో.. అసలే చలికాలం కదా? బైట ఎలాఉంటున్నారు? పోనీ.. వెనుక మా చుట్టిల్లుంది కదా.. లోగడ మేమందరము ఉండేటప్పుడు వంటిల్లుగా ఉంచేవాళ్ళం..
ఇప్పుడు నేను ఒక్కదాన్ని. అటు ఇటూ తిరగలేక స్టౌతెచ్చి ఈ ప్రక్కనే ఉన్న గదిలో పెట్టేసుకున్నాను. అప్పుడప్పుడు నువ్వు తాళం తీసి శుభ్రంచేస్తూ ఉంటావు తెలుసుగా?"
"తెలుసమ్మ.. దులిపి ఊడుస్తూ ఉండేది నేనేగా"
"పెద్దగదే. అల్మరాలు కూడా ఉన్నాయి.. మీరిద్దరే కదా చక్కగా సరిపోతుంది. మరి మీకు ఇష్టమైతే ఉండండి" చెప్పింది ఇందుమతి
కాంతమ్మ ఒక్కసారిగా చెమర్చిన కళ్ళతో రెండుచేతులు ఎత్తి దండంపెట్టింది. "కన్నతల్లిలా మమ్మల్ని ఆదుకుంటున్నారు అమ్మా... మీ రుణం తీర్చుకోలేను" కన్నీళ్ళతో చెప్పింది.
ఆరోజు రాత్రికే కాంతమ్మ స్వేచ్ఛతో సహా ఆ చుట్టింట్లోకి వచ్చింది. కాంతమ్మ మరో నాలుగైదు ఇళ్లలో కూడా పనులుచేస్తూ ఉంటుంది. ఇందుమతి ఇంటికి వచ్చాక, స్వేచ్ఛ తల్లిని మిగతా ఇళ్లకు వెళ్ళమని, తనేమో ఇందుమతి ఇంట్లో పనిచేస్తోంది.
సాయంత్రం ఇందుమతి కాలేజీ నుండి వచ్చి తాళం తీయగానే స్వేచ్ఛ వచ్చి ఇందుమతికి 'టీ' పెట్టి ఇస్తూఉండేది.
"ఇద్దరికీపెట్టు స్వేచ్ఛా.. నాతోపాటు నువ్వు తాగు" అని మొదట్లోనే చెప్పింది ఇందుమతి.
ఈరోజు టీతాగుతూ ఎదురుగా కూర్చున్న స్వేచ్ఛను అడిగింది
"ఎన్నాళ్ళు ఇలా నాకు పని చేసి పెట్టి కాలం గడుపుతావు? నీకంటూ ఒక వ్యాపకం ఉండాలికదా? ఇల్లు గడిచే సంపాదన ఉండాలి. మీ అమ్మకైనా ఎల్లకాలం పనిచేసే ఓపికుండదు కదా?"
"అవును మేడం..నేనదే ఆలోచిస్తున్నాను. ఏం చేయాలాని.. కష్టపడతాను మేడం.. మీరూ నాకు ఏదైనా సలహాచెప్పండి"
"ప్రస్తుత పరిస్థితుల్లో నీకు ఇంట్లోనే ఉండి చేసుకునే పనులయితేనే బాగుంటాయి. బయట షాపుల్లో ఈ సేల్స్ గర్ల్స్ గానో, మరొకటో చేయడానికి వెళ్లినా... పబ్లిక్ లో కొందరు కొంటెకోణంగులిసిరే మాటలకు నువ్వు డిస్టర్బ్ అవుతావు పనిమీద దృష్టి పెట్టలేవు.."
"అవును మేడమ్..." తలొంచుకుని మెల్లగా అంది స్వేచ్ఛ.
"టైలరింగ్ అయితే నీకు సూట్ అవుతుంది అనిపిస్తుంది నాకు. పని నేర్చుకోవటానికి కొన్నాళ్ళు గడిచేసరికి నీకు, ఇక్కడున్న జనానికి కాస్త అలవాటవుతావ్ కదా?"
"అవును మేడం... కానీ నాకు ఎవరు నేర్పుతారు?"
"నాకు తెలిసిన ప్రతిభ వాళ్ళ వదినుంది. నీవు మొదట్లో నన్ను కలిసినప్పుడే నీ గురించి ఆలోచిస్తే నీకది బెటరేమో అని అనుకున్నాను. యమునకు చాలా మోడల్స్ వచ్చు. నీకు నేర్పుమని వాళ్లను అడిగాను. బహుశా.. ఒప్పుకోవచ్చు అనుకుంటున్నాను" చెప్పింది ఇందుమతి.
"అలాగే నేర్చుకుంటాను మేడం" అంది స్వేచ్ఛ.
"నీవుకాస్త స్థిమితపడి నిలదొక్కు కోవాలంటే టైలరింగే మంచిదేమో ఆ తర్వాత సంగతి అప్పుడు ఆలోచిద్దాం"
"అలాగే.. మేడం"
"స్వేచ్ఛా, నువ్వేమి అనుకోకపోతే ఒక మాట అడగనా?"
"మీరు నన్ను గురువు దైవం తల్లిలాగా ఆదుకుంటున్నారు మేడం, మీరేమడిగినా నేను ఏమీ అనుకోను"
"నువ్వు ఎంతోకోరుకుని... నిన్ను నువ్వు మార్చుకున్నావ్, నువ్వు ఆశించిన ఆనందం, జీవితం అందక విసిగిపోయో విరక్తిచెందో ప్రస్తుతం ఇలా ఉన్నావ్. ఈ మార్పు తాత్కాలికమా? స్థిర నిర్ణయమా? మరికొద్ది రోజులు పోతేగాని తెలియదు. అవునంటావా?"
"..................."
"నేనడిగింది అర్థమైందనుకుంటా?"
స్వేచ్ఛ కొన్నినిమిషాలు మౌనంగా తలను వంచుకుని కూర్చుంది. తర్వాత.. తలెత్తి ఇందుమతివైపు చూస్తూ నెమ్మదిగా స్థిరంగా చెప్పసాగింది..
"మేడం మీకు నాగురించి అంత వివరంగా చెప్పాను. నేనుఅమ్మాయిలా గృహిణిలా తల్లిలాఉండాలనే అత్యాశతో ఉండేదాన్ని. అంతే గానీ..లాలసతో విశృంఖలమైన వాంఛలతో రగిలిపోతూ ఈమార్గం ఎంచు కోలేదండీ...అది నా అమాయకత్వమో, మూర్ఖత్వమో తెలియడం లేదు. ఇప్పుడు రెండింటికీ చెడ్డ రేవడినయ్యాను..."
"..................."
స్వేచ్ఛవేపు సూటిగా చూడకుండా వింటోంది ఇందుమతి
"...అక్కడకెళ్ళి వాళ్లతో తిరగడము మొదలు పెట్టాక..."
తలెత్తి చూసింది ఇందుమతి
"..మొదలు పెట్టాక.. కొన్నికొన్ని ఎదురైన చేదుఅనుభవాలు, నాతోటి వాళ్లుచెప్పేవి వింటూ కొంతకంగారు కంగారుపడ్డాను, భయపడ్డాను..."
"................"
"కంగారుపడినా, భయపడినా అప్పుడు చేయగలిగిందేమీ లేదు... అప్పటికే పైకి చెప్పుకోలేని ముద్రపడింది, పైగా ఇల్లు వదిలిపెట్టి పోయాను. గతిలేని స్థితిలో ఉన్నాను.."
".................."
"...అందులోనూ ఒక ఆశ మేడమ్... నేను శస్త్రచికిత్స చేయించుకునే వరకే, ఈ కాస్త
ఇబ్బందినీ దాటేస్తే.. నేను పరిపూర్ణ స్త్రీని ఐపోతాను.
అప్పుడు నేను ప్రేమించిన వాళ్లో, నన్ను ప్రేమించిన వాళ్లో నన్ను చేసుకోడానికి ముందుకు రాకపోతారా?.. ఆ తర్వాత ఇటువైపు కన్నెత్తి కూడా చూడను... హాయిగా సంసారం చేసుకుంటాను..అనే ఊహల్లో ఉండేదాన్ని మేడమ్"
".................."
"..కానీ అదంతా నాభ్రమని, వాస్తవం లో దుర్లభమని తేలిపోయింది.
కొందరి మృగవాంఛలకు, వికృత చేష్టలకు నాశరీరమే కాక, మనసు కూడా తూట్లు పడిపోయేది... మేడమ్.. మీ ముందు ఇంతకంటే ఎక్కు గా, పచ్చిగా చెప్పలేను..."
"అర్థం చేసుకోగలను, వదిలేయ్" అంది ఇందుమతి.
"ముఖ్యంగా జగదాంబ పరిస్థితి నన్ను పదేపదే వెంటాడి భయపెట్టింది, బాధ పెట్టింది..."
"..................."
"అమ్మను, అన్నని చూడాలని.. నేను వాళ్ళకు కలిగించిన బాధకు కాళ్లు పట్టుకుని క్షమాపణలు కోరాలనీ, చచ్చేదాకా ఇంక నా వాళ్ళతో కలసి ఉండాలని... తిరిగి వచ్చాను.. కానీ...."
".................."
"అన్నది కూడా తప్పులేదులే మేడం.. అందరిలాంటి వాడే తనుకూడా. ఆలోచిస్తుంటే.. తనకిభార్య, పిల్లలున్నారు వాళ్ళకు ఇష్టంలేకుండా నన్ను చేరదీసి తనసంసారం పాడుచేసుకోలేడు కదా" ఎదుటి వాళ్ళకు చెబుతున్నట్లుగా కాక, తనను తాను విశ్లేషించుకునే ఆ తీరుకు, భావప్రకటనకు మరోసారి అబ్బుర పడింది ఇందుమతి.
'ఔరా! నేర్చుకోవాలే కానీ మంచివాని కంటే చేదుఅనుభవాలే మనిషిని మరింతగా సానబెడతాయి' అనుకుంది.
"వెళ్లిన వాళ్లంతా నీలాగా వెనక్కి రావడం లేదుకదా? వాళ్లకి బాగానే ఉన్నట్లా?" అడిగింది ఇందుమతి
"అదినేను చెప్పలేనండి..ఎవరిష్టం వాళ్లది వాళ్లకి అదే ఆనందంగా ఉండొచ్చు, రాజీపడి కావచ్చు.. దారి లేకపోనూవచ్చు కదామేడం?"
"నిజమే లే" ఒప్పుకుందామె.
"ఈ బతుకులో ఇంకెన్ని ఆటుపోటులు ఉన్నాయో.. ఎటూ అలవాటుపడ్డానుగా?" చిన్నగా నవ్వింది స్వేచ్ఛ
"పోయేదేంలేదు బేలతనం తప్ప" ఇందుమతి తనూ శృతి కలుపుతూ, "మొదట్లో ఎలాఉన్నా నీతెలివిని ఇప్పుడు మాత్రం ఉపయోగించావు. అభినందనలు స్వేచ్ఛా" మెచ్చుకోలుగా అంది ఇందుమతి.
"మేడం ఒకమాట చెప్పండి. అసలు ఒక మగవాడిగానో లేదా ఆడదానిగానో తప్ప, ఒకమనిషిలా గౌరవంగా బ్రతకనివ్వరా? బ్రతికే స్వేచ్ఛ లేదా?" ప్రశ్నించింది స్వేచ్ఛ
"సబబైన ప్రశ్న స్వేచ్ఛా.. లింగబేధం వాళ్ల గుర్తింపు కోసం. ఒక మనిషిలాగా బ్రతికితే వ్యక్తిత్వపు గుర్తింపు ఉంటుంది.. అందుకు మూడవ వ్యక్తి ఈ సమాజంలో మరింత జాగ్రత్తగా పట్టుదలగా తనని తాను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. అరుదైన వాటిని పరిశీలనగా చూడటం మానవనైజం" ఇందుమతి సమాధానంకి స్వేచ్ఛ మెల్లిగా తల ఊపింది అర్థమైనట్లు.
కాసేపాగి మళ్లీ అంది స్వేచ్ఛ, "మగవాళ్ళలోనే కాదు ఆడవాళ్లలోకూడా అనైతికంగా తిరిగేవాళ్లున్నారు. నిలువునా హత్యలుచేసీ, దోపిడీలు చేసి, మోసాలతో..కళ్ళెదుట నిస్సిగ్గుగా తిరిగే వాళ్లను చూస్తూకూడా వాళ్లెదురుగా ఏం అనరు, చాటుమాటున మాత్రమే చెవులు కొరుక్కుంటారు... మరి... మమ్మల్ని ఎందుకింత చులకనగా ఎగతాళితో వేధిస్తారు?" స్వేచ్ఛప్రశ్నలు అనంతంగా ఉన్నాయ్.
అసలే తెల్లగాఉండే పాతికేళ్ల స్వేచ్ఛ ముఖం ఆలోచనలతో ఆవేశంతో ఎర్రగా కందిపోయింది.
మౌనంగా ఉండిపోయింది ఇందుమతి
కన్నీళ్లు తుడుచుకోవటానికి టీ కప్పులను కడిగేనెపంతో ఖాళీకప్పులు తీసుకుని అవతలకు వెళ్లిపోయింది స్వేచ్ఛ.
ఆమె అడిగిన ప్రశ్నల గురించి ఆలోచిస్తూ కూర్చుంది ఇందుమతి.
***
సశేషం
మిగిలిన కథ రేపటి బ్లాగ్ లో
ఇవి కూడా చదవండి