వ్రాయని ప్రేమలేఖ నవల | పార్ట్ 12 | Vrayani premalekha Telugu novel | Telugu kathalu

Vijaya Lakshmi

Published on Dec 21 2025

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

*వ్రాయని ప్రేమలేఖ*

రచన : శ్రీమతి.విజయశ్రీముఖి

ఉష పత్రిక వారి కీ.శే. శ్రీ వెలగపూడి సీతారామయ్య స్మారక నవలల పోటీ లో

ప్రోత్సాహక బహుమతి పొందిన నవల.

 

"మీరువచ్చి మా అమ్మాయిని చూసుకుని వెళ్ళండి' అని ఆ వరంగల్ సంబంధం వాళ్ళు పదేపదే ఫోనుచేస్తున్నారు, వీడు ఏమంటాడు?" భార్యను అడిగాడు అర్జునరావు

"వాడి దృష్టిఅంతా లక్ష్మీపురం పిల్ల మీదే ఉందండి. ఏమి చెప్తాం? ఎవరికీ చెప్పలేని రోజులు" నిట్టూర్చింది పరిపూర్ణ

"నాన్నేదో అన్నారని వాళ్లకి కోపమో, మరి అభిమానమో అడ్డువచ్చింది. వీడు చూస్తేనేమో ఇలాగ...ప్చ్!" అన్నాడు అర్జునరావు

"పోనీ..మీరే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పొచ్చు కదా?"

        "ఏమని చెప్పమంటావ్?"

" పెద్దాయన ఏదో అన్నారు లెండి.. అవేమీ వద్దు. పిల్లలు ఇద్దరు ఇష్టపడ్డారు కనుక మీరొకసారి వచ్చి వెళ్తే, మంచిరోజు చూసి లగ్నాలు పెట్టుకుందాం, అని చెప్పండి"

"చెప్పొచ్చు పూర్ణా! కానీ, వాళ్ళముందు నామాటకి విలువలేకుండా చేసారు, నన్ను ఒకవిలన్ గా చూపారని నాన్న బాధపడతారేమో కదా?"

                 "..................."

" ఇన్నాళ్ళు ఊరుకుని ఆఖరికి గతిలేక మనమే అడుగుతున్నామని వాళ్ళుగానీ అనుకుంటారేమో?"

                                    

"ఇలాఅనుకుని మనము, అలాగనుకుని వాళ్ళు కూర్చుంటే.. ఈ సమస్య తెగదు. వాడుచూస్తే ఆ పిల్లమీదే మనసు పెట్టుకు కూర్చున్నాడు. రెండుమూడుసార్లు నన్ను అడిగాడు కూడాను"

        "ఏమని అడిగాడు?"

"అమ్మా! లక్ష్మీపురం వాళ్ళు ఏమన్నా కబురు చేశారా? నాన్న ఏమంటున్నారు? అని అడిగాడు"

"పెద్దాయన నోరుపారేసుకుని అలాగ ఇబ్బంది పెట్టారు. చిన్నాయన మనసు పారేసుకునిలా ఇరుకున పెడుతున్నాడు" విసుగ్గా అన్నాడు అర్జునరావు.

ప్రక్కగదిలో నుండి తండ్రి దగ్గటము విని, ఏదో చెప్పబోతున్న భార్యకు ఆగమని సైగచేశాడు 'నాన్న లేచారు ఈ మాటలు ఇంక ఆపమన్నట్లు'

అయితే అప్పటికే పెద్దాయన లేచి చాలా సేపు అయిందనే విషయం వీళ్లకు తెలియదు.

                                             ***

నాలుగైదు రోజుల తర్వాత....

ఆఫీసులోఉన్న భాస్కర్ చేతిలో పని అయ్యాక సైలెంట్ లో ఉన్న మొబైల్ ఆన్ చేసి చూశాడు

తండ్రి మొబైల్ నుండి, ఇంట్లో లేండ్ లైన్ ఫోన్ నుండి మూడుమిస్డ్ కాల్స్ ఉన్నాయి.

         'ఇన్ని కాల్స్ ఎందుకు చేసారబ్బా?' కంగారుపడ్డాడు భాస్కర్. వెంటనే తండ్రికి కాల్ చేశాడు. ఆయన లిఫ్ట్ చేయలేదు. ఇంట్లోని ల్యాండ్ లైన్ కి చేశాడు. ఎవరూ తీయలేదు. చెల్లెలు దీక్షితకు చేశాడు ఆదుర్ధాగా. ఆమె తీస్తే అడిగాడు భాస్కర్

"నేను కాలేజీలో ఉన్నాను అన్నయ్యా,

నాకెవరూ చేయలేదు. ఏమై ఉంటుంది?" ఎదురు ప్రశ్నించిందామె.

"సరే నేను కనుక్కుంటానులే, పెట్టేయ్" అన్నాడు.                                    

మళ్లీ తండ్రికి కాల్ చేశాడు. ఉహూ.. తీయడం లేదు. భాస్కర్లో ఆందోళన ఎక్కువైంది.. ఏమై ఉంటుంది? 'తాతయ్యకు ఏమైనా అయిందా? నేను వచ్చేసరికి ఆయన పడుకునే ఉన్నారు. లేక.. అమ్మకు.. ఈమధ్య గుండెల్లోనొప్పి వస్తుంది అంటుంది.. హాస్పటల్ కి వెళ్దాం రమ్మంటే, గ్యాస్ మూలాన పట్టేసింది, టాబ్లెట్ వేస్తే తగ్గిపోయిందిలే' అంటోంది మొన్నామధ్య... ఇంక ఆలోచించలేక పోయాడు.. మళ్ళీ ఇంటికే కాల్ చేశాడు

 "హలో... ఎవరు?" రామస్వామిగొంతు.

        "తాతయ్యా ...ఏంచేస్తున్నారు?" ఆదుర్దాగా అడిగాడు భాస్కర్

"ఏంచేస్తున్నానో తెలియడంలేదట్రా? నీతో ఫోన్లో మాట్లాడుతున్నానుగా హ..హా..." నవ్వాడాయన

తాతయ్య వేసిన జోక్ కి ఒళ్ళుమండినా, మనసు మాత్రం చల్లబడింది. "తెలుస్తుందిలే గాని, నాన్న కాల్ చేశారు. నేను చూసుకోలేదు. మళ్ళీ చేస్తుంటే తీయడంలేదు. నాన్నకు ఇవ్వండి.."

"మీనాన్న ఇంట్లో లేడురా, మార్కెట్ కి వెళ్ళాడు. ఆ సంత గోలలో వినపడదులే"

"మరి, ఇంట్లో నుండి కూడా కాల్స్ ఉన్నాయ్ అమ్మ ఏం చేస్తుంది? పిలవండి"

"ఇంట్లోనుండి చేసిందినేనే. మీ అమ్మ ఏం చేస్తుందా...కూనిరాగాలు తీస్తూ ఇల్లంతా సర్దుతుంది. రేపు నీకోసం ఆ సంబంధం వాళ్లు వస్తున్నారుకదా? అందుకని.. ఆ మాట చెప్పటానికి నేనే చేశానురా!"

తాపీగా చెప్పాడు రామస్వామి.

తాతగారి మాటలతో ఆదుర్దాఎగిరి పోయి నిలువెల్లా అసహనం, చిరాకు ఆవరించి ఆవేశంగా అడిగాడు భాస్కర్

"ఎవరూ.. ఆ వరంగల్ వాళ్లేనా? రావద్దని చెప్పమని వందసార్లు చెప్పా..నా మాట వినిపించుకోరేం? ఛ..."విసుక్కున్నాడు.

"వరంగల్ పిల్లయితే.. కొడంగల్ పిల్లయితే ఏదో పిల్ల.. చేసేసుకుంటే పోలేదంట్రా? ఏదైనా ఆడపిల్లేగా!" నవ్వాడు తాతయ్య.                                   

"ఇదిగో తాతయ్యా.. సహనం చచ్చిపోయి నేనేదైనా అన్నానంటే, పెద్ద చిన్న లేకుండా మాట్లాడానని వీరంగం వేస్తావ్? ముందు ఫోన్ పెట్టేయ్" కోపంగా అంటూ ఆయనకంటే తానే ముందు ఫోన్ ఆఫ్ చేశాడు భాస్కర్.

                                                        ***

రాజేంద్ర, యమున వాళ్లకు స్వేచ్ఛసంగతి మరోసారి గుర్తుచేసింది ఇందుమతి. ఆమెనిర్ణయం పట్టుదల గురించికూడా వివరించింది.

"ముందు యమున తనకు వచ్చిన వరకు నేర్పితే, ఆ తర్వాత విషయం ఆలోచిద్దాం అప్పటికి తన ఆసక్తి, ఆచరణ కూడా ఎంతవరకూ అనేది మనకూ అర్థం అయిపోతుంది కదా!" అంది ఇందుమతి

అందుకువాళ్ళిద్దరూ సమ్మతించారు.

స్వేచ్ఛకు చెప్పింది. రోజూ ఉదయమేలేచి కాంతమ్మ మిగతా ఇళ్లల్లో పనికోసం వెళ్తే, స్వేచ్ఛ ఇందుమతికి వంటపని, ఇంటి పని చేసి ఆమె కాలేజీకి వెళ్ళిపోగానే, ప్రతిభ వాళ్ళింటికి తను వెళుతుంది.

        అప్పటికే రాజేంద్ర ప్రతిభ తమతమ ఆఫీసులకు వెళ్లిపోతారు. యమున ఇంటి పని పూర్తిచేసుకునో, చేసుకుంటూనో ఉంటుంది. వాళ్ళఇంటికి వెనుకవైపు వసరాలో ఉన్న మిషనుదగ్గర స్వేచ్ఛకు ఏంచేయాలో.. ఎలా చేయాలో నేర్పుతూ ఉంటుంది యమున.

మిషన్ కు కాస్త అవతలగా కూర్చుని సుమిత్రమ్మ దీపారాధన వత్తులు చేసు కుంటూనో, పత్తి విడదీస్తూనో కూర్చుని ఉంటుంది. సుమిత్రమ్మ మితభాషిణి. ఎవరైనా ఏదైనా అడిగితే తప్ప ఆమెగా మాట్లాడటం చాలా అరుదు. తనేమో తన పనేమో అన్నట్లు మౌనంగా ఉంటుంది.

రాజేంద్ర ప్రతిభ స్వేచ్ఛ విషయం అంతా ముందుగానే తల్లిదండ్రులకు చెప్పారు కనుక, స్వేచ్ఛ కనిపించి, నమస్కారం చెప్పగానే వాళ్లు చిరునవ్వుతో 'జాగ్రత్తగా నేర్చుకోమ్మా' అంటూ ఉంటారు.

యమునను 'వదినా!' అని పిలుస్తూ ఆమెచెప్పేది శ్రద్ధగావిని నేర్చుకోసాగింది స్వేచ్ఛ. ఆమె దృష్టంతా ఇప్పుడు పని పని పనిమీదే!  యమున ఇచ్చిన శాల్తీకి సన్నగా నాజూగ్గా చేతిపని చేయడం, హుక్స్ లు, గుండీలు కుట్టడం వచ్చేసింది. ఆమె కత్తిరించినవి ఎలాకుట్టాలో చెబితే అలా కుట్టసాగింది. స్వేచ్ఛలో భవిష్యత్ గురించి ఆశలు ఊహలు చిగురించసాగాయి. జరిగినది పీడకలలా మర్చిపోయి మంచి గుర్తింపు తెచ్చుకోవాలనే పట్టుదల బలంగానే పాదుకుంది ఆమెలో.

అందుకు కారణం ఇందుమతి సహాయ సహకారాలు, యమున, ప్రతిభ, వాళ్ళ కుటుంబ సభ్యుల ఆదరణ.

                                                        ***

ఆఫీసులో ఉన్న ప్రతిభ లంచ్ అవర్ లో చేతులు కడుక్కుని వచ్చింది..ఈ రోజు సంయుక్త సెలవుపెట్టింది. రేవతి 'ఉహూ, గురువారం నేను భోజనంచేయను. మీరు తినేసేయండి' అని చెప్పింది. ప్రతిభ లంచ్ బాక్స్ తీసింది. దానిలో ఉన్న మరో చిన్నబాక్స్ తీసి పక్కన పెట్టింది. స్పూన్ తీస్తూఉండగా పాట వినిపించింది

        'గుండె గూటికి పండగొచ్చింది

        పండువెన్నెల పంచుతోంది

        మబ్బుల్లో జాబిల్లీ

        ముంగిట వాలిందీ...'

ప్రక్కన పెట్టుకున్న మొబైల్లో నించి. తీసి చూసింది.. నెంబర్ పైగా ఉన్న అందమైన ఛాయాచిత్రంలో ఒకచక్కని నెలవంక ని సెట్ చేసుకుని, పేరుని "నెల బాలుడు" గా సేవ్ చేసుకుంది.

అదిచూడగానే ఆమెహృదయ స్పందనలో వేగంతో కూడిన సరికొత్త సందడి! 'పేరుకే భాస్కరుడు.రూపం మాట మనసు చల్లని శశాంకుడే!' అనుకుంది.

మొబైల్ స్క్రీన్ మీద ఉన్న నెలవంకలో ఛాయామాత్రంగా కనిపించే నెలబాలుడు మోహనరూపం గుర్తొచ్చి ఆమె అధరాలపై పరచుకున్న మధురమైన మందహాసం ఆమె మోమంతా వెన్నెల వెలుగుతో చిందులు వేసింది!

నిన్ననే సంశయాల పరదాను పక్కకిలాగి, ఆ నంబర్ కి, రింగ్ టోన్ గా సెట్ చేసిన పాట... 'గుండె గూటికి పండగొచ్చిందీ..' అని.

ఆ పాటను మళ్లీమళ్లీ వినాలనే కోరికతో, నెలబాలుడును కొద్దిసేపు ఉడికించాలనే చిలిపితనంతో వెంటనే లిఫ్ట్ చేయకుండా ఆగి..ఆగి మళ్ళీమళ్ళీ వస్తున్న పాటని వింటూ తనలో తను నవ్వుకుంటూ భోజనం చేయసాగింది ప్రతిభ.                                     

వింటున్నపాటో, వినిపిస్తున్న నంబరోగానీ ఆమెలో నూతనోత్సాహాన్ని, అల్లరిని రేకెత్తిస్తుంది. కొంతసేపు ఆనందించాక... 'ఇంక చాలు...' అనుకుని, కొంటెతనాన్ని కంట్రోల్ చేసుకుంటూ "హలో" అంది చాలా మామూలుగా అన్నట్లు!

        "ఎలా ఉన్నారు?" అతని మాటల్లో మార్ధవం తొణికిసలాడు తోంది

          "బావున్నాను"   ఈమె స్వరం మృదువుగా పలికింది.

"లంచ్ అవర్ కదా, ఖాళీగానే ఉంటారని చేశాను. అబ్బ ఎన్నిసార్లు చేశానని?" అలక ధ్వనించింది అతని గొంతులో.

"ఔనా! నాకు కాస్త చెముడు ఉంది లెండి. త్వరగా వినిపించదు"    చిన్నగా నవ్వుతూ చెప్పింది ప్రతిభ

"ఓహ్! ఆరోజు నేను ఆంటీవాళ్ళ ఇంట్లో అన్నమాటని పదిలంగా దాచిపెట్టి, మరీ ఈరోజు నాకు అప్పగించేశారన్న మాట!

దెప్పుళ్లు ఆడవారికి జన్మహక్కు కదూ?"

 "చెప్పండి, ఏమిటి కాల్ చేశారు?"

"మీరు చేయరు. నేను చేసినప్పుడేమో పొడిపొడిగా పొదుపుగా మాట్లాడుతారు. కాస్త నవ్వుతూ మాట్లాడవచ్చు కదా? ఏం భయమా, విముఖతా?" నిష్టూరంగా అడిగాడు భాస్కర్.                              "ఆ రెండూ కాదు. ఇద్దరి మధ్యన.. ముఖ్యంగా అంతగాపరిచయంలేని ఇద్దరి యువతీ lయువకుల మధ్య ఫోన్లో జరిగే సంభాషణలు మెల్లగ దారితప్పే అవకాశం ఆపైన చిక్కుల్లోపడేసే ప్రమాదం ఉందట" చెప్పింది ప్రతిభ.

         "అబ్బో....ఎలాగంటా?" అడిగాడు

"మొదట సభ్యతగాను, ఆతర్వాత సఖ్యతగానూ మొదలైన మాటలు గలగల పారే సెలయేరులై ప్రవహించి, పోను పోనూ నదిలా విస్తరించి... ఆపైన సాగరంలో కల్సిపోయాక.. ఇంక అప్పుడు... అప్పుడే మొదలవుతాయట..." ప్రతిభమాటలకు నవ్వుతూ కొంటెతనంగా అడిగాడు భాస్కర్

"ఏమిటి చల్లని చలిగాలులా? లేక... రెచ్చగొట్టే పిల్లగాలులా?"

"అవేవీకాదు...ఆటుపోట్లు! ఎగసిఎగసిపడుతూ అంతలోనే విరిగిపడే కెరటాలు. .నిరంతరం ఆగనిఘోష!"

"బాప్ రే! ఎవరండీ బాబూ మీకు ఇలాంటి మెట్టవేదాంతం చెప్పినవారు?"

"మా మేడమ్ చెప్పారు. సరే, మీరెందుకు కాల్ చేశారో ఇకనైనా చెప్తారా?"

"తప్పకుండా. రేపు మా ఇంటికి సంబంధం స్థిరపరచుకోవటానికి అమ్మాయి తరపు వాళ్ళు వస్తున్నారు. ఆవిషయాన్ని.. అహ, ఆ ఆనందాన్ని మీతో పంచుకుందామని!"

ప్రతిభ కొన్నిక్షణాలు మౌనంగా ఉంది. తర్వాత చాలా మెల్లగా చెప్పింది కంగ్రాచ్యులేషన్స్ అండి!" అని.

         "థాంక్యూ.. చిన్న రిక్వెస్ట్" అన్నాడు

        "చెప్పండి" అంది మామూలుగా                             

సాయంత్రం ఆఫీసు ఐపోయేవేళకు నేను అక్కడికి వస్తాను. పదినిమిషాలు మీతో మాట్లాడాలి"

        "ఇంకా అవసరం అంటారా?"

         "ప్లీజ్.. పదినిమిషాలే"

అవును కాదనకుండా ఆలోచించుకుంటూ తినడం ఐపోయి బాక్స్ కి మూత పెట్టబోతూ ప్రక్కకు చూసింది ప్రతిభ. అసంకల్పితంగానే నవ్వొచ్చేసిందామెకి. ఫక్కున పెద్దగా నవ్వేసింది.. ఏ అడ్డూలేని హాయైన నవ్వది!

"థాంక్యూ ప్రతిభ! ఈ నవ్వు చాలండీ! శ్రావ్యంగా వినిపించి సేదతీర్చారు. నాలోని సంశయాలన్నిటినీ పటాపంచలు చేశారు. థాంక్యూ, థాంక్యూ వెరీమచ్! ఈవేళ మీరు మనసారా నవ్విన ఈ నవ్వుని నాకు మీరిచ్చిన మొదటి బహుమతి గా పదిలపరచుకుంటాను...థాంక్యూ!"

ఎంతో సంబరంగా చెబుతున్న భాస్కర్ మాటలువిని ప్రతిభ బిత్తరబోయింది!

తాను నవ్విన కారణం.. భాస్కర్ తో మాట్లాడుతూనే భోజనం పూర్తిచేసి, బాక్స్ కు మూతపెట్టబోతూ ప్రక్కన చూస్తే.. కూరతోఉన్న చిన్నబాక్స్ ని మూతకూడా తీయలేదుతను. అది అలాగేఉంది. అంటే తానిప్పటివరకు తిన్నది కూర కలుపుకోని ఒట్టి పొడిఅన్నం మాత్రమే!

                                                       ***

సశేషం

మిగిలిన కథ రేపటి బ్లాగ్ లో


ఇవి కూడా చదవండి


Recent Posts