Vijaya Lakshmi
Published on Dec 22 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?*వ్రాయని ప్రేమలేఖ*
రచన : శ్రీమతి.విజయశ్రీముఖి
ఉష పత్రిక వారి కీ.శే. శ్రీ వెలగపూడి సీతారామయ్య స్మారక నవలల పోటీ లో
ప్రోత్సాహక బహుమతి పొందిన నవల.
సాయంత్రం ఐదుగంటలు అయింది ప్రతిభ ఆఫీస్లో నుండి స్కూటీని నడిపిస్తూ గేటు దగ్గరికి వచ్చి, చుట్టూ చూడసాగింది.
ఎదురుగా చెట్టుక్రింద బైక్ ని ఆనుకుని నిలబడ్డ భాస్కర్ ఆమెనుచూడగానే ఎదురు వెళ్ళాడు.
లేతగులాబీరంగు డ్రెస్ మీద లేతాకు పచ్చ చున్నీ వేసుకునిఉంది.
'ఆకుల మాటునఉన్న గులాబీలాగ ఎంతో ముద్దొస్తుంది' మురిపెంగా తనలో తను అనుకుని "హలో" విష్ చేశాడు!
"ఎంతసేపు అయింది మీరువచ్చి?" చిరునవ్వుతో అడిగింది"
"జస్ట్... చెప్పండి... హోటల్కా? పార్క్ కా?" అడిగాడు
"మీ ఇష్టం" చెప్పింది
"మీ వెహికల్ ఇక్కడ ఉంచండి. మళ్లీ మనం తిరిగిటే రావాలి కదా?" అన్నాడు
"మీరు బైక్ పై వెళ్తుంటే నేను నడిచి రానా?" అడిగింది.
"నాబైక్ పై మరొకరికి చోటు సరిపోతుంది"నవ్వుతూ అన్నాడు
"వద్దులెండి. ఎవరిది వాళ్ళం వేసుకు వస్తే సౌకర్యంగా ఉంటుంది." స్కూటీ స్టార్ట్ చేస్తూ చెప్పింది ప్రతిభ.
"ముందు హోటల్ కి వెళ్దాం. ఆ తర్వాత పార్క్ కి. నాకు నిజంగా చాలా ఆకలిగా ఉంది. మీరుకూడా ఏదైనా తింటానంటేనే, వద్దంటే.. మిమ్మల్ని అలా కూర్చోబెట్టి నేను తినలేను. పార్కుకి వెళ్ళిపోదాం" అన్నాడు
"సరే, హోటల్ కే పదండి" చెప్పింది.
***
హోటల్ లో టిఫిన్ చేసి, పార్క్ కి వెళ్లారు.
'ఎక్కడ కూర్చోవడమా?' అని చుట్టూ చూస్తున్న భాస్కర్ కించిత్ భయంతో
"అదిగో.. ఆ దిక్కుకు మాత్రం వద్దులేండి, మొదటిసారి మనం కూర్చుంది అక్కడే. కలిసిరాలేదు. ఈసారి చోటు మారుద్దాం" నవ్వుతూ అన్నాడు భాస్కర్
ప్రతిభ కూడా నవ్వేసింది.
ఏకాంతంగా ఉన్నచోటును చూసుకుని కూర్చున్నాక అడిగాడు భాస్కర్. "ఆ...ఇప్పుడు చెప్పండి" అని.
"మీరే కదా మాట్లాడాలి అన్నారు?" గుర్తు చేసిందామె.
ఆమెని సాలోచనగాచూస్తూ అడిగాడు. "మీరెలా ఒప్పుకున్నారు? ఇంట్లో వాళ్ళ ఒత్తిడా?" అని.
"అర్థంకాలేదు సరిగ్గా చెప్పండి" ప్రశ్నార్థకంగా చూస్తూ అడిగిందామె
"మాఅమ్మ, నాన్నగారు చెప్పారు.. రేపు మీ నాన్నగారు అన్నయ్య మా ఇంటికి వస్తున్నట్లు. నాకు తాతయ్య చెప్పారు,
మీరు.. టెస్ట్ చేయించుకోవడానికి ఒప్పుకున్నారని, డాక్టర్ నుంచి సర్టిఫికెట్ కూడా తీసుకునే మీవాళ్ళు వస్తున్నారని. వద్దని మీకు చెప్పాను కదా? మళ్లీ ఎందకిలా చేస్తున్నారు?" అసహనంగా అడిగాడు భాస్కర్
ప్రతిభ ప్రశాంతంగాచూస్తోంది అతనివైపు
"నిజంగా చెప్పండి, పెద్దవాళ్లు మిమ్మల్ని బలవంతంగా ఒప్పించారు కదూ?" మళ్లీ అడిగాడు
ఇంక ఆపుకోలేక కిలకిల నవ్వేసింది ప్రతిభ
"నవ్వింది చాలుగాని చెప్పండి ఎందుకు ఒప్పుకున్నారు?"
"పెద్దవాళ్ల ఒత్తిడితోనేనని ఎందుకు అనుకుంటున్నారు? మిమ్మల్ని ఒదులుకోలేక ఒప్పుకున్నాననుకోవచ్చు కదా? లేదా నన్ను ప్రూవ్ చేసుకోవటానికి అనీ అనుకోవచ్చుకదా మీరు?" అడిగింది.
"ఆ రెండో మాటను తీసేయండి. ఏదీ.. మీరన్న మొదటి మాటను ఇంకోసారి... మరొక్కసారి చెప్పండి.. వీనులవిందుగా పసందుగా ఉంది!" అతనిలో ఉత్సాహం ఉవ్వెత్తున ఎగసింది .హుషారుగా అన్నాడు
తనన్నమాట గుర్తొచ్చిన ప్రతిభకు సిగ్గు ముంచుకొచ్చింది. సంధ్యారుణ కాంతుల్లోని అరుణిమ ఆమె మోములో మెరిసింది!
" ఓహ్... సీరియస్ టైపు అనుకున్నాను ఇన్నాళ్ళు, చిలకమ్మకు సరసం కూడా తెలుసే!" హాయిగా నవ్వుతూ ఉల్లాసంగా అన్నాడు భాస్కర్.
కనురెప్పలు వాల్చి బిడియంగా, శబ్దం లేకుండా నవ్వుతున్న ప్రతిభని తదేకంగా తన్మయత్వంగా చూస్తూ మెల్లిగా, తమకం నిండిన లోగొంతుకతో అడిగాడు భాస్కర్
"ప్రభా, ఒకమాట చెప్పనా?"
అంతే మెల్లిగా 'ఊ..' అంది ప్రతిభ
"ఎవరమైనా భవిష్యత్తు ఊహించుకున్నా గతాన్ని నెమరువేసుకున్నా మన మది చప్పరించడానికి కొన్ని మధుర స్మృతులు కావాలి... అవి లేని జీవితం నిస్సారం నిస్తేజం!"
"..............."
"మిమ్మల్ని చూసిన తర్వాత మీరూపం కానివ్వండి, వ్యక్తిత్వమే కానివ్వండి... అన్నీ కలుపుకుని చూసుకుంటే నాకు ఏం అనిపించిందో తెలుసా?"
చెప్పమన్నట్లు మెల్లగా తలూపింది "నాలోని ఆశలు అభిప్రాయాలు, ఊసులు ఊహలు నీరూపందాల్చి, వెన్నెలకిరణమై నీవు నామనసును దీప్తివంతం చేశావు. నేనునోరువిప్పి చెప్పకనే గ్రహించి, అనుగ్రహించి నాముందర నిలువెత్తున నిలిచిన జీవనలేఖవై, 'వ్రాయని ప్రేమలేఖ' వై సాక్షాత్కరించావ్!"
".................."
"ఐయాం ప్రౌడ్ అఫ్ యూ.. లైక్ యూ ప్రభా! లవ్ యూ సో...మచ్!" మాటమాటలో అతని మనసు నిండిన ప్రేమభావన! చెప్పేమాటల్లో తన హృదయావిష్కరణ చేస్తున్న ఆతని చూపులు! మమతను మార్దవాన్ని కలిపేసి, ధ్వని తరంగాలుగా ప్రసారం చేస్తున్న అతని ఆత్మీయస్వరం... ప్రతిభ అంతరంగాన్ని ఎంతో మృదువుగా స్పృశిస్తూ, కదిలిస్తూ ఉద్వేగంతో ఊపేస్తున్నాయ్!
మనసు మధుర తరంగాలను తనువంతా ప్రసరింపజేస్తుంటే.. మెల్లగా అతిమెల్లగా ఆమె పెదవులు పలికిన రెండక్షరాలు "ఐ...టూ!" అని!
"ఆహ్..ఎంతటి అపురూప క్షణాలివి!" అతనినవ్వులో సంతోషం సంతృప్తి కల్సి జమిలిగా పరవళ్ళు త్రొక్కాయ్!
'ఒక్కక్షణం' అంటూ లేచివెళ్లిన అతను రెండు ఐస్క్రీమ్ కప్పులతో వచ్చాడు "ఈ సమయాన్ని సంతోషాన్ని మనం సెలెబ్రేట్ చేసుకుందాం!" నవ్వుతూ కప్పును అందించాడామెకు అందుకుంది అపురూపంగా.
కాసేపటి తర్వాత లేచి వెళ్తున్నప్పుడు చెప్పాడు భాస్కర్
"మీ నాన్నగారికి చెప్పలేను గాని, రాజేంద్ర గారికి కాల్ చేస్తాను. మీరు మాత్రం ఏ డాక్టర్ దగ్గరకు వెళ్ళకండి"
నవ్వి ఊరుకుంది ప్రతిభ.
"అన్నట్లు.. చెప్పడం మరిచాను. మీవాళ్ళు రేపొస్తున్నారుకదా, వాళ్ళకిచ్చిపంపనా? లేక.. నేనే వచ్చి... తమరికి అందివ్వనా?" అడిగాడు
"ఏమిటది?" అడిగింది ప్రతిభ
"అదేనండీ.. ఏమిటదీ? ఆ, నన్నూ టెస్ట్ చేయించుకోమనీ...రిపోర్ట్..అడిగారుగా? అసలే మీకు పిల్లలంటే చాలా చా...లా ఇష్టంకదా?"
అతను ఆ అడగడంలో కవ్వింపు చూసి, ప్రతిభ వస్తున్న నవ్వును చిన్నదగ్గులా మార్చుకొని లేస్తూ "ఇంక వెళ్దాం, లేవండి" అన్నది.
మాటల్లోనుపొదుపు, నవ్వుల్లోను పొదుపు అన్నింట్లోనూ ఇంత పొదుపు పాటిస్తే... మై గాడ్! చాలా కష్టం"
తనుకూడా లేస్తూ అల్లరిగా నవ్వాడు భాస్కర్.
***
ఇంటికి తిరిగి వస్తున్న ప్రతిభకు మళ్లీ మళ్లీ గుర్తొస్తున్నాయ్ భాస్కర్ మాటలు.. "మీరు ఏ డాక్టర్ దగ్గరకు వెళ్ళకండి, రాజేంద్రగారికి నేను కాల్ చేస్తాను"భాస్కర్ మాటలు మననం చేసుకుని చిన్నగా
నవ్వుకుంటూ "భలే తాతయ్యలే!" అనుకుంటూ నాలుగు రోజులక్రితం రాత్రి తాతయ్య నాన్నగారికి ఫోన్ చేశారు...
ఆరాత్రి....
***
....ఆ రోజు రాత్రిపూట భోజనంచేసి ప్రతిభ డాబామీదకు వెళ్తూంటే తండ్రి పిలుపు వినిపించింది.
ఆయన గదికివెళ్లి "పిలిచారా నాన్న" అని అడిగింది
"కాస్త ఆ కొబ్బరినూనె సీసా ఇటు తెచ్చి పెట్టమ్మా" అన్నాడు సంజీవయ్య.
ప్రతిభ సీసా తీసుకువెళ్లి "తెచ్చాను నాన్న, తలకు పెట్టమంటారా?" అడిగింది
"తలకు కాదమ్మా, కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, నూనెతో మర్దనా చేసుకుందాం అని..."
"నేను చేస్తాను నాన్నా"అంటూ తండ్రి కాళ్ళకు, పాదాలకు నూనె రాసి మర్దానాచేస్తూ కూర్చుంది. తండ్రి తనఆఫీసు సంగతులడుగుతుంటే చెబుతోంది...అలా మాట్లాడుకుంటూ ఉండగానే తండ్రి దగ్గర ఉండే చిన్నఫోను మోగింది.
''ఈ వేళప్పుడు ఎవరబ్బా? దాన్నిటు ఇవ్వమ్మా" అన్నాడు.
తండ్రికి అందించి, రెండవ కాలుకు కూడా నూనెరాసి, వత్తుతోంది.
"ఎవరండీ?" అడిగాడు సంజీవయ్య
"సంజీవయ్యగారూ! నేను భద్రగిరి నుండి రామస్వామిని మాట్లాడుతున్నాను"
"ఓ.. మీరా చెప్పండి రామస్వామిగారు.."
వాళ్ళిద్దరి సంభాషణ అక్కడే ఉన్న ప్రతిభకు వినిపిస్తూనే ఉంది.
"సంజీవయ్యగారూ, మీరింకా వస్తారు, వస్తారని ఎదురుచూస్తున్నాం. పిల్లలిద్దరూ ఇష్టపడ్డారుకదాని మిగతా సంబంధాలు వాళ్ళను కూడా ఆపేస్తున్నామండీ" అంటున్నాడు రామస్వామి
తండ్రి ఏం చెబుతాడా అని మరింత శ్రద్ధగా ఆలకిస్తోంది ప్రతిభ
"ఏమండీ లైన్ లోనే ఉన్నారా??" అవతలనుండి రామస్వామి గొంతు.
"ఉన్నానండి, ఏం చెప్పమంటారు? మీరు అడిగిన పద్ధతి మా పిల్లలకు నచ్చలేదండీ అంటే, నాకు నచ్చిందని కాదు.. పెద్దవాళ్ళం మన చాదస్తాలు పిల్లలకు కష్టంగా ఉంటాయి"
'హమ్మయ్య.. నాన్న సున్నితంగానే ఐనా అసలు విషయం చెప్పేశారు' అనుకుంది ప్రతిభ
"సంజీవయ్యగారూ! దయచేసి మీరు నేను చెప్పేదాన్ని ఓపిగ్గా వింటారా?"
"పర్వాలేదు చెప్పండి"
"మా కుటుంబంలో పెద్దమనవడు అంటే నా పెద్దకొడుకు కొడుకు రాజా. వాడిని చిన్నప్పటినుండి ఎంతో గారంగా...వాడి పేరులాగ రాజాలాగానే పెంచాము. తెలివైనవాడు, మంచి ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఒక అమ్మాయిని చూసాము.
చదువుకుంది.అందగత్తే.ఇద్దరు ఇష్టపడిన తర్వాతే పెళ్లిచేసాం. అయ్యాక తెలిసింది.. ఆ అమ్మాయి ఎవర్నో ప్రేమించిందని, ఇద్దరూ ఏకంపాకంగా తిరిగే వాళ్ళని..."
వింటున్నాడు సంజీవయ్య.
"ఎంతగాఅంటే, ముద్దులు కౌగిళ్లతో ఉన్న ఫోటోలను ఫేస్ బుక్, ఇంకా అట్లాంటి అద్దానం మద్దానం వాటిల్లోను పెట్టుకుని, అందరికీ తమ ప్రేమను చూపించుకుంటూ మహా సంబరపడ్డారని! మరి వాళ్ళిద్దరికీ ఎందుకు చెడిందోనండీ తెలియదు. పెళ్లిమాత్రం మనవాడితో జరిగిపోయింది ..."
"అయ్యో...అలాగా?" అన్నాడు సంజీవయ్య
"అట్లాంటి ఫొటోలన్నీ వాళ్లు వీళ్లు పంపి, వీడక్కడిక్కడ చూసి "ఇవేమిటి?" అని ఆపిల్లనడిగితే, ఏమని చెప్పిందో తెలుసా సంజీవయ్యగారు?"
"ఏమని చెప్పిందండి?"
"అవును. మేము ప్రేమించుకున్నాం. పెళ్లి చేసుకుందామని కలిసితిరిగాం. కొన్నాళ్ళు గడిపాక మా ఇద్దరి అభిప్రాయాలు వేరని, కలవ్వనీ.. ఒకరిని మరొకరు జీవితాంతం భరించలేమని అర్థమైపోయింది. అందుకే
బ్రేకప్ చెప్పుకున్నాం..అన్నదండీ "
"అలాగా!" అంతకుమించి ఇంకేం అనాలో తెలీలేదు సంజీవయ్యకు
"...అయినా పెళ్లి కాకముందే నీకు నేను పెళ్ళాన్ని అవుతానని నువ్వు అనుకోలేదు నేనూ అనుకోలేదు. నా గతమనేది నీకు అనవసరం. పెళ్లయిన తర్వాత మాత్రమే నీ అజమాయిషీ..' అందట! మావాడికి దిమ్మతిరిగిపోయిందనుకోండి. ఆపిల్లమీద వీడికి మనసు విరిగిపోయింది సంజీవయ్యగారూ! మా వాడింకా ఆ పిల్ల ఎదిగినంత ఎత్తుకుఎదగలేదండీ... పిచ్చిసన్నాసి, జీర్ణించుకోలేక, ఆమెతోటి కాపురం చేయలేక.. ఈనాటికీ సతమతమౌ తున్నాడు.."
సంజీవయ్య మాట్లాడక వింటున్నాడు
"... పోనీ విడిపోదామంటే వాళ్లకైన ఖర్చు గాక వాళ్ళడిగినంత ఇస్తేనే విడాకులకు ఒప్పుకుంటానంటుంది. అసలు ముందు అన్నీ ఎంక్వయిరీ చేసుకోక పోవడమే మా తప్పట! వాళ్ళ అమ్మ నాన్నయినా ఏం చెబుతారు? దానికి మేము చెప్పలేకపోతు ఉన్నాం అంటున్నారు..."
"................."
"...వాడు, వాడినలా చూడలేక నాపెద్ద కొడుకు కోడలు, వాళ్లందర్నీ చూడలేక మేము క్షోభపడుతున్నాం"
"నిజమే లెండి "అన్నాడు సంజీవయ్య మనస్ఫూర్తిగానే.
"... వాడిలాంటి దౌర్భాగ్య పరిస్థితి వీడికి రాకూడదని ఆలోచించి నేనే అమ్మాయి గురించి అలా అడిగాను. మా వాళ్లకు తెలియదండి. నేనైనా అమ్మాయి మీద అనుమానంతోనో మిమ్మల్ని అవమానిం చాలనిగానీ కాదండి... నామనవడితో సహా ఇంట్లోఅందరూ నాది తప్పు అంటున్నారు నిజమే. అలాఅడిగి ఉండకూడదు.."రామస్వామి గొంతులో పశ్చాతాపం.
"మాకు ఆ విషయాలన్నీ తెలియవుకదా, అదీగాక, అందరూ ఒకలాగే ఉండరు కదండీ?" అన్నాడు సంజీవయ్య
"అవునండి...ఆ మాట మర్చిపోండి. నాయందు దయఉంచి మీరొకసారి మాఇంటికి వస్తే, మంచి ముహూర్తం స్థిర పరచుకుందామండీ.. ఏమంటారు?"
"మా పిల్లలకు కూడా చెబుతానండి"
"ఇంకొక మాట వినండి..."
"చెప్పండి"
"మా అర్జునరావుకేకాదు, నేను మీ భార్య సుమిత్రమ్మకు కూడా తండ్రిలాంటివాడిని. మా అమ్మాయిని, మీఅమ్మాయిని కూడా అడిగానని చెప్పండి"
"అలాగేనండి తప్పకుండా" సంజీవయ్య ముఖంలో సంతోషంతో కూడిన వెలుగు కనిపించింది
"మంచిరోజు చూసుకుని నేను, అబ్బాయి తప్పకుండా వస్తామండి" ఆనందంతో మాటకూడా ఇచ్చేశాడు.
"సంతోషం. చివరిగా ఒకమాటను గుర్తు పెట్టుకోండి సంజీవయ్యగారు..." ఫోన్లో కూడా గొంతును తగ్గించి మెల్లిగా రహస్యంగా అన్నాడు రామస్వామి
"అయ్యో... చెప్పండి.."
"నేనిలా మీకు ఫోన్ చేశానని మా వాళ్లతో అనవద్దులెండి, మీ అంతట మీరే వచ్చి నట్లుంటే బాగుంటుందని నా ఉద్దేశం.."
"అలాగే లెండి"
"ఐనా.. ఏముందండీ.. ఇందులో ఎత్తి చెప్పుకోవడానికి? వాళ్లకు చెప్పడం ఎందుకులే అని నా ఉద్దేశం"
అన్నాడు రామస్వామి
"అవునండి ఎందుకులే.. అనం లెండి"ఉబికివస్తున్న నవ్వును, సంతోషాన్ని ఆపు కుంటూ వినమ్రంగా చెప్పాక అడిగాడు
"మరి ఇంక ఉండనాండి?"
"ఉండండి. చెప్పినవన్నీ గుర్తుంచుకోండి. మీ రాకకోసం చూస్తుంటాను"ఫోన్ పెట్టేసాడు రామస్వామి. సంజీవయ్య కూడా ఫోన్ ఆఫ్ చేశాడు.
తలొంచుకుని తన కాళ్లు ఒత్తుతూనే వింటూ తనలోతను నవ్వుకుంటున్న కూతుర్నిచూసి పెద్దగా నవ్వేశాడు సంజీవయ్య.
తలెత్తిచూస్తూ శృతి కలిపింది ప్రతిభ .
"పాపం మంచోడేనమ్మా...ఒకసారి దెబ్బతిని ఉండటము చేత అట్లా అడిగారు" కూతుర్ని ఒప్పించే ప్రయత్నంగా అన్నాడు సంజీవయ్య.
తలూపుతూ నవ్వింది ప్రతిభ.
"సర్లేగాని, నువ్వెళ్లి అన్నయ్యతో నేను రమ్మంటున్నానని చెప్పమ్మా" అన్నాడు "అలాగే నాన్న" లేచి వెళ్ళిపోయింది.
తాతయ్య సంభాషణ ఆవిధంగా సాగింది ఆ రోజు... అందుకే ఈవేళ పార్కులో భాస్కర్ తో ఇవేమీ చెప్పకుండా నవ్వేస్తూ మాట మార్చింది ప్రతిభ.
అలా గుర్తు చేసుకుంటూ ఇల్లుచేరి.. స్కూటీ వాకిట్లో ఆపి లోపలికి నడిచింది ప్రతిభ.
***
సశేషం
మిగిలిన కథ రేపటి బ్లాగ్ లో
ఇవి కూడా చదవండి