వ్రాయని ప్రేమలేఖ నవల | పార్ట్ 14 | Vrayani premalekha Telugu novel | Telugu kathalu

Vijaya Lakshmi

Published on Dec 23 2025

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

*వ్రాయని ప్రేమలేఖ*

రచన : శ్రీమతి.విజయశ్రీముఖి

ఉష పత్రిక వారి కీ.శే. శ్రీ వెలగపూడి సీతారామయ్య స్మారక నవలల పోటీ లో

ప్రోత్సాహక బహుమతి పొందిన నవల.

                           

యమున తనకు వచ్చినంత వరకీ స్వేచ్ఛకు టైలరింగ్లో స్టిచ్చింగ్, కటింగ్ మెళకువలు నేర్పుతూనే ఉంది. యమున వాళ్ళ ఇంటి చుట్టుప్రక్కల వాళ్ళు, ఇందుమతి చెప్పగా ఆమె ఇంటి చుట్టుప్రక్కల మహిళలు కుట్టటానికి ఇచ్చి యమున పనితనంనచ్చి బట్టలు బాగానే మళ్లీమళ్లీ ఇస్తున్నారు. యమున వాళ్ళింటికి అవతల,ఇవతల వీధిల్లో వాళ్ళు కూడా అలవాటు పడ్డారు.

స్వేచ్ఛకూడా అణకువగా ఉంటూ శ్రద్ధగా నేర్చుకో సాగింది.

ఉండేది ఇందుమతి ఇంటివద్ద కనుకను, అక్కడ రాజేంద్రవాళ్ళ ఇంటిదగ్గర కనుక చుట్టుప్రక్కల వాళ్ళతో స్వేచ్ఛకి ఇబ్బంది లేకుండా పోయింది.

ఎప్పటికప్పుడు యమున స్వేచ్ఛ గూర్చిన ఇంప్రూవ్మెంట్, ఆమె ప్రవర్తన ఇందుమతి అడుగుతుంటే సంతృప్తికరంగానే చెబుతూ ఉంది.

రాజేంద్ర యమున ఆసక్తిని, కోరికను కాదనలేక ఆన్లైన్లో వెతుకుతూ మంచి కటింగ్ మాస్టర్స్ ని సంప్రదిస్తున్నాడు.

క్రొత్తమోడల్స్ ని, అవితయారుచేసే విధం, కత్తిరించే పద్ధతిని యమునకు చెప్పించే వాడు. ఆన్లైన్లోనే క్లాసులు ఇప్పిస్తూ వారికి ఇవ్వాల్సిన పారితోషికాన్ని గూగుల్ పే ద్వారా చెల్లిస్తున్నాడు.

ఇప్పుడు యమున, స్వేచ్ఛ కేవలం మహిళల జాకెట్స్, లంగాలు చుడీదార్లు కాక, స్కూల్ పిల్లలకు యూనిఫామ్ లు మగ పిల్లల నిక్కర్లు షర్ట్లు, ఆడపిల్లల స్కర్ట్లు, షర్ట్లు కూడా కుడుతున్నారు.

                                                       ***

ఒకరోజు యమున స్వేచ్ఛతో అంది "నీకు చాలా థాంక్స్ స్వేచ్చా" అని.

"అదేమిటి వదినా! మీరు గురువు. నేనే మీకు రుణపడి ఉంటాను. మీరు నాకు కృతజ్ఞతలు చెప్పడమేమిటి?" అంది.

"మొదటినుండి నాకు దుస్తులుతయారీలో ఆసక్తి ఎక్కువ. మరిన్ని మోడల్స్ నేర్చుకు ని లేడీస్ టైలరింగ్ షాప్ పెట్టాలనే కోరిక మొదటినుంచి ఉండేది. పెళ్లయ్యాక ఈ సంసారపు బాధ్యతలు మీదపడి వచ్చిన దాన్ని కూడా మర్చిపోయే స్థితికొచ్చాను. నీమూలంగానే దాన్ని మళ్ళీకాస్త ఎక్కువ గా, ప్రొఫెషన్ గా కొనసాగించే అవకాశం వచ్చింది, అందుకే నీకు థాంక్స్" చెబుతూ నవ్వింది యమున.

అప్పుడే వచ్చిన ప్రతిభ స్కూటీ స్టాండ్ వేసి, కాళ్లు కడుక్కుని వచ్చికూర్చుంది.

 "వదినా! నీకు స్వేచ్ఛకు ఒక గుడ్ న్యూస్ చెప్తాను... నాకేమిస్తారు?"అడిగింది యమున ఇచ్చిన టీ కప్పు తీసుకుంటూ.

"తొందరగాచెప్పు ప్రభా! మరొక టీ అదనంగా ఇస్తాను" నవ్వుతూ అంది యమున

"నువ్వేం ఇస్తావ్ స్వేచ్ఛ?"అడిగింది ప్రతిభ

"వదిన ఇచ్చిన టీలో నేను మరో స్పూన్ పంచదార ఎక్కువేస్తాను, మరింత తియ్యగా ఉండటానికి!" స్వేచ్ఛతో పాటు యమున కూడా నవ్వింది.

"మీఇద్దరికీ బిజినెస్ ట్రిక్స్ బాగానే ఒంటబట్టాయే!" నవ్విందిప్రతిభ.

"చెప్పు ప్రభా! ఏంటా గుడ్ న్యూస్?" మళ్లీ అడిగింది యమున.

"మా ఫ్రెండ్ వాళ్ళక్క ఒక ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్ గా చేస్తున్నారు. వాళ్ళస్కూల్లో విద్యార్థులకు యూనిఫారంలు కుడతారేమో కనుక్కోమన్నారు. క్లాత్ వాళ్ళే తెస్తారట. విద్యార్థులు కొందరు వేరేచోటకుట్టించు కున్నా, ఎక్కువమంది క్లాత్ కొనేసి, పిల్లలు కూడా అక్కడే ఉంటారుకనుక కొలతలు ఇచ్చి వెళ్తారట.

ఇంతకుముందు ఉన్న ఇద్దరు జెంట్స్ టైలర్స్.. మొదట్లో బాగానే కుట్టినా రాను రాను అలక్ష్యంగా, ఆలస్యం చేస్తున్నారని మార్చారట. ఏమంటారు మీరు?"

"మంచి అవకాశం ప్రభా, మీ అన్నయ్యకి ఓమాట చెప్పి, ప్రిన్సిపాల్ గారితో కూడా మాట్లాడదాం!" అంది యమున.

"ప్రభా! ఒక్కస్పూన్ కాదు, రెండుస్పూన్లు పంచదార ఎక్కువ వేస్తాను మీ టీ లో!" సంతోషంగా నవ్వుతూ చెప్పింది స్వేచ్ఛ.

         "నా తల్లే! ఎంతటి త్యాగమయివి!"నవ్వుతూ ఉంది ప్రతిభ.

                                                                 ***                               

  కాలం చకచక పరుగులు తీస్తోంది!

గడచినకాలంలో ముఖ్యమైనవి రెండు సంఘటనలున్నాయి.

ఒకటి : ప్రతిభా భాస్కర్లకు వివాహం జరగటం...

పెళ్లయిన తర్వాత రెండునెలలకే భాస్కర్ ప్రతిభ సిటీలోనే వేరుగా కాపురం పెట్టాల్సి వచ్చింది.

రోజూ భాస్కర్ భద్రగిరి నుండి ఆఫీస్ కు రావడం, ప్రతిభ పుట్టింట్లో ఉండి ఆఫీస్ కి వెళ్ళటం.. ఇద్దరికీ ఇబ్బందిగా ఉంది.

పోనీ, ఇద్దరూ భద్రగిరినుండే రావడానికి పరిపూర్ణ, అర్జునరావు ఒప్పుకోలేదు "ఆడపిల్ల ప్రతిరోజూ రానూపోనూ అంత దూరం ప్రయాణం కష్టంకదా ' అన్నారు. పైగా ఇద్దరు ఆఫీసులు దూరదూరం.

  భాస్కర్ కి ఆమెను కలుసుకోవడానికి రోజూ అత్తవారింటికి వెళ్ళడానికి ఇబ్బంది గా ఉండటం గమనించారు అర్జునరావు పరిపూర్ణ.

ప్రతిభ ఆఫీసుకు దగ్గరలోనే అపార్ట్మెంట్లో ఒకఫ్లాట్ అద్దెకు తీసుకుని కాపురం పెట్టించారు.

ప్రతి శనివారం రాత్రి భద్రగిరికి వచ్చేస్తే, సోమవారం ఉదయం వెళ్ళిపోవచ్చు అని అనుకున్నారు.

అలాగే వెళుతూ వస్తూ ఉన్నారు ఇద్దరు.

రెండవ సంఘటన: ఇందుమతి ఉద్యోగం నుండి రిటైర్ అయ్యింది. అయినా స్వేచ్ఛ ఇందుమతికి పనిచేయటం మానలేదు.

"నేను ఇంట్లోనే ఉంటున్నానుకద స్వేచ్చా, చేసుకుంటానులే. నువ్వు నీ మిషన్ వర్క్ ఏమైనా ఉంటేచూసుకో" అని ఇందుమతి ఎంతచెప్పినా స్వేచ్ఛ వినిపించుకోదు.

"మీరు రెస్ట్ తీసుకోండి మేడం, ఇదిగో కాస్త నేను సొంతంగా సంపాదిస్తున్నానుగా, ఇక మాఅమ్మను కూడా ఇళ్లల్లో పనిచేయడం మానిపిస్తాను. ఇంకెన్నాళ్లు చేస్తది పాపం ' అనేది.

ఇప్పుడు యమున కట్ చేసి ఇచ్చేస్తే కుట్టడమేకాదు, స్వేచ్ఛకూడా స్వయంగా దుస్తులను కత్తిరించి కుట్టడముచేస్తుంది.                                     

ఒకరోజు యమున రాజేంద్ర తీరికగా కూర్చుని మాట్లాడుతున్నప్పుడు, ఆమె అడిగింది

"చుట్టుప్రక్కల వాళ్ళు చాలామంది డ్రెస్సులు, మోడల్ బ్లౌజెస్ ఎక్కువగానే ఇస్తున్నారండి...స్వేచ్ఛ కూడా కుట్టడంలో వేగాన్ని నేర్పును సాధించింది. ఇంట్లో పనిలో ఉండగా వాళ్లువీళ్లు బట్టలకు పదేపదే ఇంటికి రావడంతో ఇటు ఈ పనో, అటు ఆ పనో ఆగిపోతుంది...పైగా..."

"ఊ...పైగా?" అడిగాడు రాజేంద్ర.

"వచ్చేనెల సెలవులయిపోయి స్కూల్స్ ఓపెన్ చేస్తున్నారు. విద్యార్థులకు స్కూల్ యూనిఫారం కుట్టడానికి ఒప్పుకున్నాం"

 "ఏంచేద్దాం అంటావు?" అడిగాడు

"ఏదైనా షాప్ అద్దెకు తీసుకుందామండి. స్కూలుకు దగ్గరగా అయితే ఇబ్బంది లేకుండా బాగుంటుంది కదా?" అడిగింది యమున.

"నీ ఆలోచన బాగానే ఉంది యమునా.. ఆ ఏరియాలో కనుక్కుంటానులే. గానీ .. షాపుకి ముందు గుడ్ విల్, రెంట్, మరికొన్ని మిషన్స్ ,ఫర్నిచర్ లాంటివి అవసరమవుతాయి కదా...ముందు కొంత పెట్టుబడి కూడా అవసరమవుతుంది... స్వేచ్ఛ ఏమంటుందో అడుగు. నీతోపాటు చేస్తుందో, లేక..పని వచ్చింది కనుక తను వేరుగా పెట్టుకుంటాను అంటుందో?" ఆలోచిస్తూ చెప్పాడు రాజేంద్ర.

 "అలాగే " అంది యమున

"ఒకమాట ఇందుమతి మేడంగారికికూడా చెప్పు. స్వేచ్ఛ ఎలాగు ఆమెతో చెప్పినా, వారి సలహాకూడా తీసుకో" చెప్పాడు రాజేంద్ర.

   "సరే నండీ" అంది యమున.

ఆ సాయంత్రమే తన ఆలోచనను, భర్త అంగీకారం యమున ఇందుమతికి చెప్పి, ''ఏం చేస్తే బాగుంటుందో మీఅభిప్రాయం కూడా చెప్పండి మేడం" అని అడిగింది.ఇందుమతి కొద్దిక్షణాలు ఆలోచించాక, "స్వేచ్ఛ ఏమన్నది?" అని అడిగింది

"మేడంగారు, అన్నయ్య, మీరు ఎలా చెప్తే నేనుఅలా చేస్తాను వదినా'అందండి" 

 "సరే యమునా, ఇది ఫోన్లోకాదు మనం ఒకసారి రాజేంద్రకు ఖాళీగా ఉన్నప్పుడు కూర్చుని ఆలోచించాక నిర్ణయం తీసుకుందాం. మీరిద్దరూ వీలైనప్పుడు ఒకసారి మా ఇంటికి వచ్చినా సరే, లేదా నన్ను మీఇంటికి ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను, స్వేచ్ఛను తీసుకుని" అని చెప్పింది ఇందుమతి.

                                                        ***                               

రెండురోజుల తర్వాత రాజేంద్రకు ఖాళీ దొరికి యమున రాజేంద్ర బైక్ మీద ఇందుమతి ఇంటికి వచ్చారు.

"మేము అక్కడికే వస్తున్నాం స్వేచ్ఛా, నీవు ఇంటిదగ్గరే ఉండమ"ని ముందే ఆమెకు చెప్పింది యమున.

బైక్ ఆగినచప్పుడు విన్న స్వేచ్ఛ బైటకు వచ్చి చూసి "అన్నయ్యా, వదినా రండి! మేడంగారికి చెప్తాను" అంటూ లోపలికి వెళ్లి ఇందుమతికి చెప్పింది.

ఇందుమతి నవ్వుతూ ఆహ్వానించింది.

        "మేము వచ్చేటప్పుడు ' ప్రతిభా! మేడంగారి ఇంటికివెళ్తున్నాం, మీరుకూడా వస్తారా సెలవే కదా? అని కాల్ చేశాను అండి.. ఏదో ఫంక్షన్ కి వెళ్తున్నా వదినా, మేము మరోసారి వెళ్తాంలే' అని చెప్పిందండీ" ఇందుమతికి చెప్పింది యమున.

         "ప్రతిభ ఇప్పుడు బ్యాచిలర్ కాదమ్మా, అచ్చమైన గృహిణి. మొన్నటి సండే ఇద్దరు వచ్చి వెళ్లారమ్మా" అంది ఇందుమతి.

         వాళ్ళు మాట్లాడుతూ ఉండగానే స్వేచ్ఛ వాళ్ళ ముగ్గురుకు ప్లేట్స్ లో స్వీట్స్ హాట్ తెచ్చి పెట్టింది. టీ పెడతానంటూ లోపలికి వెళ్ళింది.

"టీ తాగుతాములే.. ఇప్పుడు ఇవన్నీ వద్దులెండి మేడమ్" అన్నాడు రాజేంద్ర.

"ఈ ఏర్పాట్లు నావి కాదు బాబూ, స్వేచ్ఛవి. ప్రస్తుతం మాఇంట్లో పెత్తనం స్వేచ్ఛదే!" నవ్విందామె.

తర్వాత వాళ్ళ సంభాషణ అసలు విషయం మీదికి మళ్లేముందు స్వేచ్ఛను కూడా పిలిచి కూర్చోమన్నారు.

"షాప్ అంటూ అద్దెకు తీసుకుంటే, కేవలం టైలరింగ్ కే కాక, లేడీస్ కు కావలసిన కొన్ని ఐటమ్స్ ని కూడా అందుబాటులో పెడితే బాగుటుంది. టైలరింగ్ కి సపోర్టింగ్ గా ఉంటుంది కదా?" అడిగింది ఇందుమతి.                                   

 "మీరుచెప్పిన సూచన బాగుంది మేడం. ఎటూ షాప్ కు వచ్చేవారు లేడీసే కనుక, వారికి అవసరమైన కొన్ని ఇన్నర్స్ , నైటీస్ శారీఫాల్స్, రెడీమేడ్ బ్లౌజులు లాంటివి కూడా పెడితే బాగుంటుందనే ఆలోచన నాకూ ఉంది. కానీ, ఈయన ఏమంటారో అని..ఆగాను" భర్తవైపు చూసి సందేహంగా చిన్నగా నవ్వుతూ చెప్పింది యమున.

 "ఏమంటాను? అనేది తర్వాత విషయం. ముందు నీ మనసులో ఊహలు ఉద్దేశం నాకు తెలియాలి కదా?" నవ్వుతూ అడిగాడు రాజేంద్ర.

"అడగాలంటే.. పెట్టుబడిని ఆలోచించి అడగలేక పోయిందేమో లెండి"అంది ఇందుమతి.

"సరిగ్గా అంతే మేడం, ఆయన శాలరీతోనే ఇంట్లోఅన్ని చూసుకోవాలి కదా, ఇవన్నీ అంటే ఎక్కడ తెస్తారని.. అడగలేదు".

"స్వేచ్చా నువ్వు ఏమనుకుంటున్నావు? నీఅభిప్రాయం ఏమిటి? వర్క్ వచ్చింది కనుక, నువ్వు వేరే చేసుకోవచ్చనా? లేక.. ఏం చేద్దామని?" స్వేచ్ఛను అడిగింది ఇందుమతి.

"నేను షాపు పెట్టుకునేటంతగా ఇంకా ఎదగలేదు మేడం. వదిన అయినా షాప్ పెడితే మరొకరి సహాయం తీసుకోవాలి కదా? ఆమెకు ఇష్టమైతే వదిన దగ్గరే చేయమంటే చేస్తాను. పైగా..."

    "ఆ... పైగా?"

 "ఇప్పుడు నేను వేరుగా సొంతంగా పెట్టుకుని చేయగలిగేంత సొమ్ముగాని, ధైర్యంకూడా లేవు మేడమ్"

ఆమె చెప్పింది ముగ్గురూ విన్నారు. కొంతసేపు అందరూ మౌనంగా ఉండి పోయారు.

"రాజేంద్రబాబూ, ఒకపని చేద్దామా?" అడిగింది ఇందుమతి.

 "చెప్పండి మేడం" అన్నాడు

"ఇప్పుడు యమున అన్నట్లు షాపుతీసు కుంటే కట్టే అడ్వాన్స్ , ఇంకా కొనవలసిన మెషిన్స్ కి, ఫర్నిచర్ కి కలిపిమొత్తం ఎంతవుతుందో అంచనా వేయండి. ఆ మొత్తంలో యమున తరఫున మీరెంత పెట్టుబడిగా పెడతానంటే, స్వేచ్ఛబదులు నేను మిగతాది పెట్టగలుగుతాను.

అలాకాదు.. ఖర్చును చెరిసగంగా భరిద్దామన్నా సరే, సర్ధుతాను. అద్దె, మిగతా ఖర్చులు

లాంటివి పోగా.. మిగిలినవి పెట్టుబడి పెట్టిన నిష్పత్తుల్లో ఇద్దరినీ పంచుకోమని చెబుదాం.ఏమంటారు?"

అడిగింది ఇందుమతి.

"అమ్మోమేడం? నాకోసం అంత పెడతారా వద్దు..వద్దు, తీర్చలేను మేడం.. ప్లీజ్.. వద్దండి. వదిన దగ్గరపని చేస్తాను. ఎంత ఇస్తే అంతే తీసుకుంటాను" గాభరాగా చెప్పింది స్వేచ్ఛ.

ఆమె మాటలకుముగ్గురూ నవ్వారు.

"తీర్చలేకపోతే మా ఇంట్లో నుంచి నిన్ను కదలనివ్వను కదా? సరే, నువ్వాగు. నీకు తర్వాత చెప్తాను.మీరుచెప్పండి రాజేంద్రా! నా ప్రతిపాదన ఆలోచించండి.. మీకు అంగీకారమైతే దాన్నిబట్టి చూద్దాం"

"సరే, మేడం మీరు చెప్పింది ఆలోచిద్దాం. స్వేచ్ఛ ఏంటో కంగారు పడుతుంది చూడండి? ఆమెను నెమ్మదిగా ఆలోచించి చెప్పమనండి. ఈలోపు వాటన్నింటికీ ఎంతఖర్చవుతుం ది అనే వివరాలన్నీ నేను సేకరించి మీకు చెప్తానండీ"అన్నాడు రాజేంద్ర.

                                                       ***

సశేషం

మిగిలిన కథ రేపటి బ్లాగ్ లో


ఇవి కూడా చదవండి


Recent Posts
రథ సప్తమి విశిష్టత: సూర్య జయంతి  |  పూజా విధానం | శాస్త్రీయ కోణం | ఆధ్యాత్మిక ప్రాముఖ్యత | Rath Saptami importance
రథ సప్తమి విశిష్టత: సూర్య జయంతి ...
తిరుమల (టిటిడి)  |  జనవరి 25న తిరుమలలో ర‌థ‌స‌ప్త‌మి వేడుకలు  | TTD news  |  Rath Saptami celebrations in Tirumala on January 25
తిరుమల (టిటిడి) | జనవరి...
తిరుమల 2026 ఏప్రిల్ నెల దర్శన, సేవల కోటా విడుదల వివరాలు | Tirumala April darshan, seva quota release details
తిరుమల 2026 ఏప్రిల్ నెల దర్శన, సేవల...
ఫిబ్రవరి నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో విశేష పర్వదినాలు | TTD news  |  important festivals  in Tirumala temple
ఫిబ్రవరి నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో విశేష...
2026 శ్రీ పంచమి (మదన పంచమి) ప్రాముఖ్యత  |  సరస్వతి పూజ విశేషాలు | Significance of sree panchami (Madan panchami) 2026
2026 శ్రీ పంచమి (మదన పంచమి) ప్రాముఖ్యత...