వ్రాయని ప్రేమలేఖ నవల | పార్ట్ 15 | Vrayani premalekha Telugu novel | Telugu kathalu

Vijaya Lakshmi

Published on Dec 24 2025

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

*వ్రాయని ప్రేమలేఖ*

రచన : శ్రీమతి.విజయశ్రీముఖి

ఉష పత్రిక వారి కీ.శే. శ్రీ వెలగపూడి సీతారామయ్య స్మారక నవలల పోటీ లో

ప్రోత్సాహక బహుమతి పొందిన నవల.

 

రాజేంద్రవాళ్ళు వెళ్లిపోయాక స్వేచ్ఛని పిలిచి కూర్చోబెట్టింది ఇందుమతి.

"చూడుస్వేచ్ఛా! ఇందాక రాజేంద్రవాళ్లతో షాపుపెట్టడానికి అయ్యే ఖర్చులు నీతరుపున కొంతవరకు నేను పెడతానని చెప్పగానే నీవు కంగారుపడుతూ "వద్దు" అనేసావు. ఎందుకు కేవలం మళ్ళీ తీర్చలేననే భయంతోనేనా?" అడిగింది.

"మీరు నామీద ఎంతో అభిమానంతో నమ్మకంతో ఇప్పటికే చాలా విధాలుగా ఆదుకున్నారు. మేము జన్మంతా మీకు రుణపడేలా సాయం చేశారు. ఇంకా మీరు వేలరూపాయల్లో పెట్టుబడి పెడితే..." ఆగింది ఉద్వేగంగా.

     "ఆ... పెడితే?" నవ్వుతూ రెట్టించింది ఇందుమతి

"నమ్మకం అయితే కచ్చితంగా నిల్పు కుంటాను మేడం.. కానీ వ్యాపారంలో పెట్టిన ఖర్చును.. తీర్చలేని పరిస్థితి వస్తే?"

        ".................."

"సంపాదన, విజయం అనేవి ఒక్కొక్కసారి అదృష్టంతో కూడా ముడిపడి ఉంటాయి కదా మేడం?                 మీ ముఖాన్ని చూడలేని స్థితి నాకువస్తే తట్టుకోలేను." దోసిట్లో ముఖం దాచుకుంది స్వేచ్ఛ.

ఇందుమతి మనసు అర్ద్రతతో నిండింది మొదటిసారి స్వేచ్ఛను ఆత్మీయంగా స్పృశిస్తూ అనునయంగా చెప్పింది, "చూడుస్వేచ్ఛా, నీవన్నావు చూడు.. నమ్మకమైతే ఖచ్చితంగా నిలుపుకుంటా నని? అదిచాలు. నీపనిని నీవు చేయి. నేను ఆశించేది అదే. ఎందుకు నీమీద ఖర్చు పెట్టడానికి సిద్ధ పడ్డానంటే విను...." క్షణమాగింది ఇందుమతి, తలెత్తి ఆమెనేచూస్తోంది స్వేచ్ఛ.

"నేను రిటైరయ్యాను. రావాల్సినమొత్తం ఉద్యోగవిరమణ అనంతరం చేతికి అందాయి. నాకొడుకు కోడలు సింగపూర్లో జాబ్ చేస్తూ సంపాదిస్తున్నారు. మా తిండికి,బట్టకు అవసరాలకు లోటులేదు..."

         "................."

"...అవసరాలకు మించిన ఆశలకు అవకాశం ఇస్తే.. అవి మనల్ని ఎగరేసి ఆకాశంలోతిప్పి, నేలకేసి కొడతాయ్! ఎక్కువగా ఉన్న సొమ్మును ఏదైనా మంచి పనికి ఉపయోగిస్తే ఆ తృప్తి వేరు!"

"నిజమే మేడం కానీ, నాకు భయంగా ఉంది..."

"ఎందుకు భయం? యమున మంచి వర్కర్ ..తెలివైన అమ్మాయి. వెనుక ఆమెకు భర్త సహకారం ఉంటుంది. నీకా? నేనున్నాను"

  చేతులు జోడించింది స్వేచ్ఛ

"నేనీనిర్ణయం ఎందుకు తీసుకున్నానో తెలుసా?"

   "చెప్పండి మేడం"

"నువ్వు మొదట్లో మాట్లాడేప్పుడు ఒక ప్రశ్న అడిగావు గుర్తుందా?"

    "ఏం ప్రశ్న అండి?"

"మగవాడిగానో ఆడదానిగానో కాకపోతే ఒకమనిషిలా బ్రతకకూడదా? బ్రతకలేమా?... అని."

   " ఆ... అవునండీ"

"ఆ ప్రశ్న నన్ను చాలా వ్యధపెట్టింది, ఆలోచింపజేసింది. నిజమే కదా? ఆశతోనో అమాయకత్వంతోనో తెల్సీ తెలియక ఎంతోమంది పొరపాట్లు చేయొచ్చు. ఆ ఒక్క పొరపాటే జీవితాల్ని శాసించకూడదు. ఆ ఒక్క పొరపాటుతోనే బతుకు కోల్పోకూడదు అనిపించింది నాకు"

స్వేచ్ఛ సజల నయనాలతో తలను వంచుకుంది.

"అలా చేసినవాళ్లు చేసినది గ్రహించి నిజంగా జీవితాన్ని చక్కదిద్దుకోవాలి అనుకుంటే సాటివాళ్ళం వాళ్ళకొక అవకాశాన్ని అందించాలి. వాళ్లు దాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే అవతలి వాళ్లకూ సంతోషం. వీళ్ళకీ జీవితం ఒక గాడిన పడుతుంది"

         ".................."

"నువ్వెంత పట్టుదలగాఉంటున్నావో ఈఏడెనిమిది నెలలుగా గమనిస్తూనే ఉన్నాను. అందుకే నీకు సొంతంగా, బాధ్యతగా ఉండే పనయితే మరింత ఉపయోగంగా ఉంటుంది"

  "మేడం..." మాట్లాడలేకపోతోంది స్వేచ్ఛ

"చూడు, మనం బ్రతికేది కొద్దికాలం స్వేచ్ఛా..ఈ కాలంలో వ్యక్తిగతంగా మనం సుఖపడటం, సంతోషపడ్డమే కాక మనకు వీలైనంతగా ప్రక్కవాళ్లకి తోడ్పడ్డామంటే మనమీద మనకే అభిమానంతో పాటు గౌరవం కూడా కలుగుతుంది. ఎప్పుడైనా మనల్ని మనం మన జీవితాన్ని తరిచి చూసుకుంటే.. మనిషిగా పుట్టినందుకు మానవత్వంతో ప్రవర్తించామనే సంతృప్తి, జన్మసార్థకమైందనే ఆత్మతృప్తి ఉంటే.. పోయేప్పుడుఎంతో ప్రశాంతంగా ఉంటుంది. స్వేచ్ఛా .. నేనేదో వేదాంతం చెప్తున్నానా?"

         అడిగింది ఇందుమతి నవ్వుతూ. "అయ్యో.. అదేంకాదు మేడం, నా మనసులోఎప్పటినుండో ఒక ' కోరిక 'అనేంత పెద్దమాటనలేనులే గాని, ఆలోచనఉంది చెప్పనా మేడం?" బిడియంగా అడిగింది స్వేచ్ఛ

"ఊ...చెప్పేసేయ్" నవ్విందామె                              

"నేను ట్రాన్స్ జెండర్ గా మారేప్పుడు దానిగురించి పెద్దగా తెలీకపోయినా , నా ఇష్టంతోనే మారానండీ...

నాలుగైదేళ్ళలోనే నాకు ఆ జీవితం పరిస్థితులు..పరిసరాలు అనుభవం విసుగు పుట్టించాయి, విరక్తిని కూడా కలిగించాయనీ చెప్పాను కదండీ.."

    "అవునూ..."

"అందని వాటిపై ఆశలుంటాయి, కోల్పోయిన వాటిపై పశ్చాతాపము కల్గు తుంది. ఆ రెండు నావిషయంలో జరిగాయి. నా లాగానే ఎవరైనా విరక్తిగా వెనక్కివస్తే నాకు వాళ్లను ఆదుకునే శక్తి ఉంటే బాగుంటుందనే ఆలోచన ఉంది"

"బాగుంది ఆలోచన. ఆ దిశగా కష్టపడు ముందు, ఆ తర్వాత దాన్ని ఆచరణలో పెడుదువు గాని"

"తప్పకుండా కష్టపడతాను మేడం, నేను చచ్చేలోపు మీరునాకు హెల్ప్ చేసినట్లే నేనెవరికైనా సహకరించ గల్గితే నాజన్మ సఫలమైనట్లే మేడం" ఉద్వేగంగా చెప్పింది స్వేచ్ఛ

  నవ్వింది ఇందుమతి.

"ఏంటమ్మా ఇద్దరూ కూకోని ముచ్చట్లాడు కుంటన్నారు, పనయిపోయిందా?"అడుగుతూ వచ్చింది కాంతమ్మ.

"కూర్చో కాంతమ్మ.. స్వేచ్చా, ముగ్గురికీ కాస్త టీ పెట్టగలవా?" అడిగింది ఇందుమతి

"అలాగే మేడం" లేచి వెళ్ళింది స్వేచ్ఛ

ఇందుమతి కాంతమ్మ మాట్లాడుతూ కూర్చున్నారు.

                                                       ***                               

పదిరోజుల తర్వాత ఇందుమతికి ఫోన్ చేసింది యమున

"చెప్పమ్మా ఎలాఉన్నారు? అత్తయ్య, మామయ్యగారు బాగున్నారా? కాల్ చేసావ్ ఏమిటి? మీ షాప్ కోసం చేసే కసరత్ ఎంతవరకు వచ్చింది?" అడిగింది ఇందుమతి

"అంతా బాగున్నారు మేడం, వారం పదిరోజుల నుండి మావారు తనకి ఖాళీ దొరికినప్పుడల్లా షాపులోకి కావలసిన సరంజామా, పెట్టాల్సిన సెంటరు అయ్యే ఖర్చుల అంచనాల సమాచారం సేకరించారు మేడమ్"

"వెరీగుడ్.. ఎంత తేలిందమ్మా? సెంటర్ఎక్కడ అనుకుంటున్నారు?"

"స్కూల్ పిల్లలవి కూడా ఒప్పుకున్నాం కదా..ఆ స్కూల్ కి దగ్గరగా, అదే సెంటర్ లో కాస్త పైగా వర్కింగ్ వుమెన్స్ హాస్టల్ కూడా ఉందిట మేడమ్...అక్కడో షాప్ చూసారట..."

         "వెరీ గుడ్. ఎంతన్నారు ఏమిటి?"

         "అన్నీ వివరంగా కాగితంపై రాసారు. సాయంత్రం స్వేచ్ఛ ఇంటికి వచ్చేటప్పుడు మీకు పంపిస్తా మేడం చూడండి. ఏమైనా ఉంటే ఫోన్లో మాట్లాడుకుందాం"

         "అలాగేనమ్మా"

"మావారు ఎంతవరకు పెట్టగలరో కూడా దాన్లో వ్రాశారు మేడం. మీరు మిగతాది ఆలోచించగలరా? స్వేచ్ఛకు వాటాగా ఐనా సరే, షాప్ మీద మేమిద్దరం కలిసి నెమ్మదిగా మీకు బాకీ తీర్చేలాగా ఐనా కూడా సరేనండి..మీరు ఎలాగంటే అలాగే చేద్దాం మేడం" చెప్పింది యమున

         "అలాగే యమునా, నా పెట్టుబడి విషయం అంటారా? నెమ్మది మీద ఆమె ఇచ్చినప్పుడు ఇచ్చినంతగా తీసుకుంటూ ఉంటాను. ఒక వ్యధార్తి కి ఊరటనిచ్చేలా జీవనోపాధి కల్పించాలనే తృప్తికోసమే నేనిలా సిద్ధపడ్డాను యమునా"

"థాంక్యూ మేడం, మావారికి చెప్తాను. ఇంక మరో మాటేమిటంటే, అవసరమైతే కొంత మొత్తాన్ని ప్రతిభ సర్దుబాటు చేస్తానంది మేడమ్.. నెమ్మదిగా ఆమెకు తీరుస్తాము"

        "అలాగా.. మంచిదే కదా?"

"వీలుచూసుకుని మేమే ఓసారి అక్కడకి వస్తాం మేడమ్.. వివరంగా మట్లాడుకో వచ్చును."

"అలాగేనమ్మా, రండి" అంది ఇందుమతి.

     "ఉంటాను మేడమ్" అంటూ ఫోన్ పెట్టేసింది యమున.

                                                       ***                               

       "లేడీస్ స్పెషల్"

నీలిరంగుపై బంగారురంగులో ఉన్న పెద్ద అక్షరాలు అందంగామెరుస్తున్నాయ్!

ఆరోజు యమునా స్వేచ్ఛల కలలు "లేడీస్ స్పెషల్" రూపంలో సాకారమైన రోజు. షాప్ ప్రారంభోత్సవం!

 

షాప్ ముందువేసిన షామియానా క్రిందన కుర్చీల్లో ఇందుమతి, పరిపూర్ణ, సుమిత్ర, కాంతమ్మ ఇంకా మరి కొంతమంది వారి ఇరుగుపొరుగుల్లో మహిళలు, తెలిసిన స్నేహితులు అతిథులుగా వచ్చి కూర్చుని ఉన్నారు.

ఇటు ఒక ప్రైవేట్ పాఠశాల, అటు పైగా వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ కు దగ్గరగా ఉండేలా షాపును అద్దెకు తీసుకున్నారు. మహిళలకు అవసరమైన దుస్తుల తయారీయేకాక, శారీ ఫాల్స్, ఇన్నర్స్, నైటీస్, రెడీమేడ్ బ్లౌజులు, నైట్ వేర్స్, కొన్ని చుడీదార్స్, ఫ్యాషన్ టచ్ కవసరంమైన లేసులు, పూసలు వగైరాలన్నీకూడా మహిళలకు అందుబాటులో ఉండేలా పెట్టారు. మామూలు కుట్టుమిషన్లతో పాటు, జిగ్ జాగ్, ఎంబ్రాయిడరీచేసే డిజైనింగ్ ప్లేట్స్ మిషన్స్ కమర్చేవి కొనుగోలు చేశారు.

ఇచ్చిన దుస్తులు కుట్టడంతో పాటు కొన్ని అమ్మకం కూడా పెట్టడంతో షాపుకు ఇంకా మరింత నిండుదనం వచ్చింది.

షాప్ ను రెండుభాగాలు గా పార్టీషన్ చేసి ఒకటి యమున అమ్మకం చూసుకుంటూ ఉంటే, దానిలోనే మరోభాగంలో స్వేచ్ఛ దుస్తులతయారీకి, మిషన్స్ ముందు కూర్చుండేలా నిర్ణయించుకున్నారు. కత్తిరించి ఇస్తే కుట్టడానికి సంజన అనే అమ్మాయిని పీస్ వర్కర్ లా ఒప్పుకునిచేర్చుకున్నారు. కుట్టే శాల్తీలను బట్టి ఆమెకి 'ఇంత ' అని ఇవ్వవలసి ఉంటుంది.                                       

వచ్చిన అతిథులను ఆహ్వానించే పనిలో యమునా, స్వేచ్ఛ ఉంటే... ప్రతిభ, దీక్షిత వాళ్ళ స్నేహితులు కొందరు కబుర్లు చెప్పు కుంటూ,నవ్వు కుంటూ షాపులోని అరల్లో తెచ్చిన మెటీరీయల్ సర్దుతూఉన్నారు.

పూజా కార్యక్రమం ఐపోయిన తర్వాత, యమున స్వేచ్ఛచేతికి ఒక శాలువా ఇచ్చి కనుసైగ చేసింది. 

స్వేచ్ఛవెళ్లి కుర్చీలో కూర్చున్న ఇందుమతి భుజాల నిండుగా ఆ శాలువాను కప్పి, వంగి ఆమె కాళ్లకు నమస్కరించింది. నమస్కరిస్తూ, "మేడమ్! మీ ఆదరణ, చేయూత తోనే నా జీవితాన్ని మలుపుతిప్పారు. మనుషులపై గౌరవాన్ని, బ్రతుకుపై ఆశను కలిగించారు" కృతజ్ఞత నిండిన స్వేచ్ఛగొంతు సన్నగా కంపిస్తుండగా నీళ్లునిండిన కళ్ళతో హృదయపూర్వకంగా ఆమెకి వంగి నమస్కరిస్తూ చెప్పింది స్వేచ్ఛ.

"జీవితాన్ని ఎలాగోలా అనుభవించేయాలనే ఆరాటంతోనే గాక, కాస్త హుందాగా ప్రశాంతంగా దాన్ని మల్చుకోవాలనే తపన కూడా ఉండాలమ్మా, ఇప్పుడు నీకు ఆ అవగాహన పెరిగింది కనుక నిన్ను నీవు నిలబెట్టుకోగలవు. ఇందులో ప్రత్యేకించి నేను చేసింది ఏమీలేదు" స్వేచ్ఛ భుజాలుపట్టి లేపుతూ చిరునవ్వు తో చెప్పింది ఇందుమతి.

స్వేచ్ఛ కళ్ళలోనే కాక, ఆమెతల్లి కాంతమ్మ కన్నులనుండి కూడా జాలువారుతున్న నీటి బిందువుల్లో సన్నని మెరుపు!

ఆ మాటలు వింటున్నవాళ్ళంతా స్వేచ్ఛ వైపు సాభిప్రాయంగా చూశారు.

విసిగి వేసారిపోయిన వాళ్ళ బతుకుల్లో ఆనందాశ్రువులకు మించిన అతి గొప్ప బహుమతి ఇంకేముంటుంది!?                                      

ఇందుమతి కొంత పైకాన్ని యమున చేతి లోను, కొంత స్వేచ్ఛ చేతిలోను పెడుతూ "ఇది బోణీ అన్నమాట!" అంది నవ్వుతూ

ప్రతిభ, దీక్ష , స్వేచ్ఛ యమునవాళ్ళకు సహాయం చేస్తుంటే, వచ్చిన మహిళలు అందరికీ ఒక్కొక్క జాకెట్ ముక్కను, పండు,తాంబూలం కవర్లోపెట్టి ఇచ్చారు. వారంతా అందుకుని తమకు తోచిన పైకం వారిచేతుల్లో పెడుతూ " మీవ్యాపారం త్వరలోనే అభివృద్ధి చెందాలి" అంటూ ఆశీర్వదించారు.

"రిటైరయి ఖాళీగా ఇంట్లో ఉంటున్నాను, అప్పుడప్పుడు నేనొచ్చి మీకౌంటర్లో కూర్చుంటాను అమ్మాయ్! కౌంటర్ లోనే అని ఎందుకంటున్నాను అంటే.. నాకు కుట్టడం తెలీదు, అమ్మడమూ రాదు కనుక" నవ్వుతూ చెప్పింది ఇందుమతి.

"అప్పుడప్పుడు కాదు మేడమ్, రోజూ వచ్చి కూర్చోండి. మీరు ఉంటే మాకు కాస్త ధైర్యంగాను ఉంటుంది, మేము కబుర్లాపి పనీ త్వరగా సాగుతుంది" అంది యమున

వీళ్ళందరికీ కాస్తఎడంగా ఉన్న కుర్చీల్లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు రాజేంద్ర, భాస్కర్ . వాళ్లను రమ్మని పిలిచారు. వాళ్లు వచ్చాక వాళ్ళిద్దరి చేతికి అక్షింతలు ఇచ్చారు. యమునకు స్వేచ్ఛకు తలల మీద వేస్తూ, "ఆశీర్వదించి అరటిపండు తీసుకో వడం తప్ప, ఇక్కడమేము కొనేవేమున్నాయి?" అన్నాడు రాజేంద్ర నవ్వుతూ.                                             

"మీ భార్యకు ఏదోకటి కొనండి రాజేంద్రా" నవ్వుతూ అంది పరిపూర్ణ

"బాలూ! కొత్తగా పెళ్లైన వాడివి. మీ సతీ మణికి ఏమైనా తీసుకోకూడదు?" అడిగింది ఇందుమతి

"ప్రతిభా! నీకు, దీక్షకు ఏంకావాలో తీసేసుకోండి. షాపు మనదేగా, బిల్ మనం ఇచ్చినా యమున తీసుకోదులే" నవ్వాడు భాస్కర్

"ఆ చుట్టరికం ఇక్కడ చెప్పకండి. ఆల్రెడీ నేనూ, దీక్ష డ్రెస్సులు కొన్నాం, మీకు రుమాళ్ళసెట్ తీసుకున్నాను. ఇవ్వండి బిల్" చెప్పింది ప్రతిభ.

"యమునా! ఏదో ఈమధ్యనే కొత్తగాపెళ్లి అయిన వాళ్ళం, మాకు ఏమైనా స్పెషల్ డిస్కౌంట్ ఇవ్వకూడదూ?" సరదాగా అడిగాడు భాస్కర్

"మేము ఈ రోజే క్రొత్తగా పెట్టినవాళ్ళం కదా అన్నయ్యా? ఇప్పుడు కాదులే..రేపు మీకు పుట్టబోయే బుజ్జి బుజ్జి.." యమున మాటలను మధ్యలోనే అందుకున్న స్వేచ్ఛ,

"మీరు ఎంతమంది బుజ్జి బుజ్జి పాపలను కంటే... అంతమందికీ అత్తలుగా మేము బహుమానంగా మేము బోలెడు డ్రస్సులు ఇస్తామండీ ఉచితంగా" అంది

"థాంక్యూ మంచి ఆఫర్ ఇచ్చారు. మీరిచ్చే ఉచిత డ్రెస్సులు కోసమైనా మేము డజన్ మంది పాపాయిలను కనేస్తాము. ఇదే మాటమీద ఉందాం. ఏం ప్రభా? డీల్ ఓకే చేద్దామా?"యమున చేతికి బిల్ డబ్బులిస్తూ ప్రతిభ ను అడిగాడు భాస్కర్

"వదినా! అన్నయ్య ఆఫర్ కోసమైనా.. నిన్ను డజన్ మంది పిల్లల్నీ కనమనేట్టు ఉన్నాడు...మై గాడ్...నీ పని..హ హా.." ప్రక్కనే ఉన్న ప్రతిభను తన మోచేత్తో పొడుస్తూ నవ్వింది దీక్షిత.                                

అన్నాచెల్లెళ్ల మాటలకు, సిగ్గుపడే ప్రతిభ ను చూసి కుర్చీల్లో కూర్చున్న మహిళలు నవ్వేశారు.

"ఏమిటర్రా! నేను వచ్చేసరికి అంతా అయిపోయినట్టుందే? అరటిపళ్లన్నా, స్వీట్లన్నా నాకు మిగిల్చారా.. అవీ లేవా?" గబగబా రొప్పుతూవచ్చి, అడిగాడు రామస్వామి.

"మీకు లేకుండా ఎలా తాతయ్యా?"

ఆయన్ని కుర్చీలో కూర్చోబెట్టి, ఒక పేపర్ ప్లేట్లులో స్వీట్స్, హాట్ అరటిపళ్ళు పెట్టి ఆయన చేతికి ఇచ్చింది యమున.

రామస్వామి ఆ ప్లేట్ అందుకోబోయే ముందు తన లాల్చీ జేబులోనుండి రెండు వందలు తీసి యమునకు స్వేచ్ఛకు చెరో వందా ఇచ్చాడు

వాళ్లు నమస్కరిస్తుంటే తలలపైఅక్షింతలు వేస్తూ "మీ వ్యాపారం తొందరలోనే వృద్ది చెందుతుంది. ఈసారి నాక్కూడా లుంగీ లాంటివి తెచ్చిపెట్టండి. నేను డబ్బులు ఇచ్చే తీసుకుంటాను" అన్నాడు నవ్వుతూ

                                                        ***

సశేషం

మిగిలిన కథ రేపటి బ్లాగ్ లో


ఇవి కూడా చదవండి


Recent Posts
2026 జూన్ నెల ముఖ్యమైన తేదీలు, పండుగలు & ప్రత్యేక దినాలు | June 2026 Important Dates, Festivals & Special Days in Telugu
2026 జూన్ నెల ముఖ్యమైన తేదీలు, పండుగలు...
వ్రాయని ప్రేమలేఖ నవల  |  పార్ట్ 16  | Vrayani premalekha Telugu novel  |  Telugu kathalu
వ్రాయని ప్రేమలేఖ నవల | ...
2026 మే నెల ముఖ్యమైన తేదీలు, పండుగలు & ప్రత్యేక దినాలు | (May 2026 Important Dates, Festivals & Special Days in Telugu)
2026 మే నెల ముఖ్యమైన తేదీలు, పండుగలు...
ఏప్రిల్ 2026 నెల పండుగలు, ముఖ్యమైన దినాలు  | April 2026 Festivals & Important Days in Telugu
ఏప్రిల్ 2026 నెల పండుగలు, ముఖ్యమైన దినాలు...
వ్రాయని ప్రేమలేఖ నవల  |  పార్ట్ 15  | Vrayani premalekha Telugu novel  |  Telugu kathalu
వ్రాయని ప్రేమలేఖ నవల | ...