Vijaya Lakshmi
Published on Dec 11 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?*వ్రాయని ప్రేమలేఖ*
రచన : శ్రీమతి.విజయశ్రీముఖి
ఉష పత్రిక వారి కీ.శే. శ్రీ వెలగపూడి సీతారామయ్య స్మారక నవలల పోటీ లో
ప్రోత్సాహక బహుమతి పొందిన నవల.
ప్రతిభకు ఆ రాత్రి అసలు నిద్రపట్టలేదు
పెళ్లిచూపుల్లో అతని రూపాన్నిచూసి ఆ కాసేపట్లో అతనితోజరిగిన సంభాషణలో అతని ఆలోచనాసరళిని, సంస్కారంని చూసి, 'నేను కోరుకునే "రైట్ పర్సన్" ఇతనే' అంటూ మనసు పిచ్చిగంతులు వేసింది సంతోషంతో... ఆసంతోషం అంతటితో ఆగిందా? ఆరోజు అటువాళ్లు ఇటువాళ్ళు అంగీకారంగా ఎంతో సాభిప్రాయంగా మాట్లాడుకుంటూ ఉంటే, ఆ సంతోషం ఆశల బీజాలు నాటి ఊహల పందిళ్ళు వేసింది...
'వెళ్లొస్తానంటూ' అతను కరచాలనం కోసం చేతిని చాపాడు. తాను బిడియపడి చేతులు జోడించింది... అతను చొరవగా తన చేతిని అందుకుని మృదువుగా కరచాలనం చేస్తుంటే... తొలిసారిగా కన్నె మేను, మనసు ఎంతలా ఝల్లుమందని!
ఆస్పర్శ.. అనుభూతి.. తలుచుకుంటుంటే ఇప్పటికీ తనువు పరవశంతో పులకిస్తూనే ఉందే!
కళ్ళలో పెళ్లిపందిరి కదలాడుతూ.. మదిని మురిపిస్తోందే! ఇన్ని మధురూహలతో.. అతని కోసం ఆ ఘడియకోసం ఎదురుచూస్తుంటే... ఇప్పుడు వాళ్లిలాంటి పరీక్షపెట్టడం? ఇలాంటి అనుమానం వాళ్లానాడే వ్యక్తం చేసిఉంటే.. వాళ్లేంటో ఆరోజే అర్థమైపోయి తగినజవాబు చెప్పేవాళ్ళం.. ఈ పిచ్చి ఊహలకు, అమాయకపు ఆశలకు పాదు చేసి నీరుపోసేదాన్ని కాదు కదా.. 'ఇప్పుడు మాత్రమేమైంది? వాళ్లడిగే పరీక్ష చేయించుకుంటే సరిపోతుంది కదా?' మనసు ప్రశ్నించింది
'అంటే? నేనిది అని నిరూపించుకోవాలా? సాటి మనుషులపై ఇంతనుమానమా! ఇది ఇంతటితోనే.. ఈవేళతోనే పోతుందని నమ్మకం ఏమిటి? అన్నయ్యన్నట్లు.. జీవితాంతం ఈ అనుమానపు మనుషుల మధ్యలో బ్రతకాలా? ఇలాంటివాళ్లతో జీవితం ఏం సుఖంగా, సజావుగా నడుస్తుంది? ఇది తప్పక పెళ్లికొడుకు అభిప్రాయమయి ఉంటుంది!
సీత రావణుడి దగ్గరనుండి తిరిగి వచ్చాకే అగ్నిపరీక్ష అడిగాడు రాముడు. వీళ్ళు? పెళ్లికాక ముందే పరీక్షలు పెడుతున్నారు.. ఎంత దౌర్భాగ్యం!' అనుకుంటున్న ప్రతిభకు ఆత్మాభిమానం దెబ్బతిన్నట్లయ్యింది.
'భాస్కర్! నీది ఇంత సంకుచితమైన మనస్తత్వమా! ఆరోజున నేను కోరిన ఒక చిన్న కోరికను నీవు మంచి మనసుతో అర్థంచేసుకుని "సరే" అనడంతో నేనెంత సంబరపడ్డాను? నిన్నెంత ఎత్తులో నేను ఊహించుకున్నాను! ఇంటికెళ్ళి మళ్ళీ ఇలాంటి హేయమైన పరీక్ష అడుగుతావా? ప్చ్.. నిన్ను అంచనా వేయడంలో నేను పొరపడ్డానా?'నిరాశగా అనుకుంది ప్రతిభ
తన ఆక్రోశం, అసహనం.. ఆగ్రహం 'ఎవరి ముందు వెళ్ళబోసుకోవాలి?' ఆమెకు ఇందుమతి మేడమ్ గుర్తుకొచ్చింది. 'ఒకసారి మేడమ్ దగ్గరకు వెళ్లిరావాలి. ఆమెతనకు గురువే కాదు, అంతకంటే తన శ్రేయోభిలాషిణి, ఆత్మీయురాలు.. అంతకంటే ముందు...ఒకసారి అతన్ని కల్సుకోవాలి' అనుకుంటూ అస్తిమితంగానే నిద్రకోసం ప్రయత్నించసాగింది ప్రతిభ.
***
ముందుగా ఫోన్లో అనుకున్న ప్రకారంగానే అటునుండి భాస్కర్ మోటార్ సైకిల్ మీద ఇటునుండి ప్రతిభ స్కూటీపైన ఒకేసారి పార్కు దగ్గరకు వచ్చారు. తమ తమ బళ్ళు పార్కు చేశారు.
ముందుగా భాస్కర్ నవ్వుతూ అన్నాడు "ఓహ్! ఇద్దరం ఒకేసారి వచ్చాం కదూ!"
ప్రతిభ ముభావంగా ఊరుకుంది
"రండి, లోనికి వెళ్దాం" పార్కులోపలికి దారి తీశాడు భాస్కర్. మౌనంగా అనుసరించింది ప్రతిభ
అక్కడకూర్చున్న వాళ్ళందరికీ కాస్త ఎడంగా వెళ్లాక అడిగాడు భాస్కర్
"ఇక్కడ కూర్చుందామా?" అని.
మాట్లాడకుండా కూర్చుంది ఆమె
తనుకూడా కూర్చుని నవ్వుతూ చెప్పాడు భాస్కర్
"అసలు నేనే మిమ్మల్ని అడుగుదామనుకున్నానండీ... ఒకసారి హోటల్లోగాని, పార్క్లో గాని కలుసుకుందామా అని. కానీ ఆరోజు కరచాలనం కోసం చేయందించడానికే సందేహించిన మీరు.. ఇలా వస్తారనే నమ్మకంలేక, ఊరుకున్నాను. మీరే అడిగారు రమ్మని.. థాంక్యూ వెరీమచ్!" అతనిమాటలువింటూనే పరిసరాలను చూస్తోందామె...
"చెప్పండి ఎలాఉన్నారు? మీఅమ్మానాన్న గార్లు..మీ అన్నయ్య?" నవ్వుతూ అడిగాడు భాస్కర్
"బాగున్నారు" ముక్తసరిగా జవాబు చెప్పింది ప్రతిభ
ఇద్దరిమధ్య కొంతమౌనం తర్వాత మళ్లీ తనే అడిగాడు భాస్కర్
"ఏదో మాట్లాడాలి రమ్మని అడిగిన మీరే ఏమిటింత మౌనంగాఉన్నారు.. సిగ్గా?"నవ్వాడు
అతని నవ్వుచూస్తుంటే ఆమెకు కారం అంటినట్లు మండిపోతుంది లోలోపల మనసు.
'పెళ్లిచూపుల్లో ఈసుందర రూపాన్ని, పైపూత పలుకులను చూసేగా నేను మోసపోయాను. సంస్కారవంతుడైనట్లు పెద్ద ఫోజు.. ఇకమీదట ఏ సంబంధానికి వెళ్లినా ఇలాంటి పిచ్చిపరీక్షలకోసం అడగకుండా ఘట్టిగా డోస్ ఇవ్వాలి, ఏదైతేఅదవుతుంది లోలోన నిశ్చయించుకుంది ప్రతిభ. తలెత్తి అతనివైపుచూసి, చిరునవ్వుతో అడిగింది
"మనంఏదైనా కావాలనుకుంటే... అదేలెండి పొందాలంటే, దాని మంచిచెడులను నాణ్యతను ఋజువు చేసుకోవాలనుకోవడం "మీలాగా" తప్పదుకదండీ? తప్పుకూడా కాదేమో కదూ?"
ఆమె మృదువుగా అడిగినట్లున్నా.. ఆ అడగడంలో ఉన్న వాడీవేడి లో ఏదో వ్యంగ్యం కూడా దట్టించినట్లుగా ఉంది భాస్కర్ కి.
ముఖ్యంగా "మీలాగా" అనే పదాన్ని ఆమె ఒత్తి పలికినతీరు అర్థంకాక ఆలోచనలో పడ్డాడు
"కొంచెం స్పష్టంగా చెబుతారా?" నవ్వుతూనే అడిగాడు
"అదేనండీ.. మీరడిగించిన దానికి నేను సంసిద్ధంగానే ఉన్నాను. ఐతే..." ఆగింది. ఆమెగొంతులోనో.. గుండెలోనో ఏదో అడ్డు పడుతున్నట్లుగా ఇబ్బందిగా పూర్తిచేయలేక తలొంచుకొని తన చేతివేలికి ఉన్న ఉంగరాన్ని అటుఇటు కదిలిస్తూ ఉంది.
ఆమె స్వరంలోను, ముఖకవళికల్లోనూ ఆత్మాభిమానం దెబ్బతిన్న ఛాయలు గమనించాడు 'ఎందుకు?' అర్థం కాలేదు భాస్కర్ కి
ఆమె ఇంకా అంటోంది... "బయటకొచ్చి తిరిగే ఆడపిల్లలంతా బరితెగించిన వాళ్లనుకోవడం.. అనుకునే
వాళ్ళసంస్కారాన్ని ఎత్తి చూపుతోంది.."
ఆమె మాటలు వింటున్న అతని నొసలు ముడిపడ్డాయి. ఆమెను నిశితంగా చూస్తూ
"మీరేమంటున్నారో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు" అన్నాడు. ఇప్పుడు అతని ముఖంలో నవ్వులేదు.
"అవునా!? ఇంతకుమించి మీకు ఇంకెలా చెప్పాలో నాకూ అర్థంకావడం లేదు"అంది. మనసులో 'ఎంత నాటకం!' అనుకుంది ప్రతిభ
ఇద్దరి మధ్యన నిశ్శబ్దం. కొంతసేపు అలాగే కూర్చున్నతర్వాత అతను లేస్తూఅన్నాడు
"ఒక్కనిమిషం అండీ"
కాస్త ఎడంగావెళ్లి ఎవరితోనో ఫోన్ చేసి మాట్లాడటం కనిపిస్తూనే ఉందామెకి.
తిరిగివచ్చి మళ్లీ యథాస్థానంలో కూర్చుని "ఇంకేమైనా అడగాలనుకునేవి, చెప్పాలని అనుకునేవి ఉంటే నిస్సందేహంగా అడిగేసేయండి" అన్నాడు భాస్కర్
ఆమె అతనివైపోసారి చూసి కళ్ళువాల్చు కుంటూ "థాంక్స్ . నాకు..పిల్లలంటే చాలా ఇష్టం" చెప్పింది
ఫోన్ మాట్లాడినతర్వాత అన్యమనస్కంగ ఉన్న అతను ఆమాట వినగానే ఒక్కసారి పెద్దపెట్టున నవ్వాడు. నవ్వుతూనే ఆమెని చూస్తూ అడిగాడు
"పిల్లలంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి!"
"నా భావాన్ని... మీరు అర్థం చేసుకోలేదు.. మీరు అడిగిన పరీక్షకు నేను సిద్ధంగానే ఉన్నానని చెప్పాను. నా ఇష్టం ఏమిటో కూడా చెప్పాను. పదండి ఇద్దరం డాక్టర్ దగ్గర పరీక్షలు చేయించుకుందాం" అంది
అతని ముఖంలో అదే చిరునవ్వు!
ఆమె ఆశించిన ఉలికిపాటు అతని మొహంలో కనిపించక పోయేసరికి ఆమెకి, 'తను ఏభావంతో ఆ మాటన్నదో అసలు ఈ బుద్దావతారంకి వెలిగిందా?'అనే అనుమానం కలిగిందామెకి.
పెద్దగా తెరలుతెరలుగా నవ్వుతున్న భాస్కర్ ప్రతిస్పందనను ఎలా అర్థం చేసుకోవాలో తెలియక ప్రశ్నార్థకంగా చూసింది ప్రతిభ
"డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిందేనా? మరో మార్గం లేదంటారా? కొంటెతనానికి అమాయకత్వాన్ని అద్ది అడిగాడు. కరుగ్గా చూసిందతని వైపు.
"ప్రతిభగారూ, మీరేదో నర్మగర్భంగా మాట్లాడుతున్నట్లున్నారు. ఐనా, మావల్ల ఏదైనా బాధకలిగితే సారీ అండి.."
"సారీలు ఏంచేసుకుంటాం లెండి" నిష్టూరంగా అన్నది
"ప్లీజ్, నేను చెప్పేది వినండి ప్రతిభా! మాఇంట్లో మనకంటే రెండుతరాల పెద్ద వాళ్ళున్నారు. పెద్దరికంగా వాళ్లు ఏమైనా అనిఉంటే...సారీ."
"ఎంత తేలిగ్గా అమాయకంగా చెబుతూ ఉన్నారు మీకేం తెలియనట్లుగా? నమ్మమంటారు!"
"నమ్మనంటారా?" అడిగాడు
".................."
"ఇంతకుముందు కుటుంబంలో ఏవైనా చేదు అనుభవాలు ఎదురై, ఆ భయంతోనో అనుమానంతోనో.. లేక, చాదస్తంతోనో ఏదైనా అన్నారేమో.. నాకింకా క్లియర్ గా తెలియదు" చెప్పాడు భాస్కర్ చురుగ్గా తలెత్తింది చూసింది ప్రతిభ
"మా మేనత్తను ఆమె భర్త తరచూ కొట్టి, పుట్టింటికెళ్లి డబ్బులు తెమ్మంటూ వేధిస్తూ ఉండేవాడు. ఒకసారి తాగొచ్చి చావబాదే సరికి ఆ దెబ్బలతోనే ఆమె చనిపోయింది. కడుపునొప్పికి తాళలేక, తనే ఉరివేసుకు చనిపోయిందని ఆమె భర్త,అత్తింటివాళ్ళు చెప్పారు...'మీరూ అలాచేస్తారా?' అని మిమ్మల్ని మావాళ్ళు అడిగారా?"
ప్రతిభ గొంతులో ధ్వనించే ఆవేశాన్ని గమనిస్తూ, సాలోచనగా ఆమెనే చూస్తూ ఉండిపోయాడు భాస్కర్.
"................"
"ఈరోజు మీరు మీకేమీ తెలియనట్లుగా నటించినా, నమ్మేంత పిచ్చివాళ్ళం కాదు"
"................"
"ఇది దాగుడుమూతలాట కాదండీ దాగినవాళ్లను కనుక్కోగానే ఇంక ఆట ఐపోయింది అనుకోవటానికి.. జీవితమనే ఆట. పరస్పర నమ్మకంతోనే ఈఆటలో ఓటమి గెలుపుంటుంది. నమ్మకాలు లేనిచోట అనుబంధాలే కాదు బంధాలు కూడా నిలవ్వు." కోపంగాఅంటూనే చటుక్కున లేచింది "సెలవ్ .. మరెప్పటికీ" అనేసి గిరుక్కున వెనుతిరిగి వెళ్ళిపోతోంది ప్రతిభ.
కొద్దిక్షణాలు అవాక్కైన భాస్కర్ తేరుకుని, "ప్రతిభగారూ!మనం తొందర్లోనే మళ్లీ కలుసుకుందాం."
వెనుకనుండి పెద్దగానే అరిచి చెప్పాడు భాస్కర్.
వినిపించినా వినిపించనట్లు వెళ్లిపోయింది ప్రతిభ.
***
సశేషం
మిగిలిన కథ రేపటి బ్లాగ్ లో
ఇవి కూడా చదవండి