Vijaya Lakshmi
Published on Dec 12 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?*వ్రాయని ప్రేమలేఖ*
రచన : శ్రీమతి.విజయశ్రీముఖి
ఉష పత్రిక వారి కీ.శే. శ్రీ వెలగపూడి సీతారామయ్య స్మారక నవలల పోటీ లో
ప్రోత్సాహక బహుమతి పొందిన నవల.
ఇందుమతి జూనియర్ కాలేజీలో తెలుగు లెక్చరర్ గా చేస్తుంది. ఆమెఇంట్లో పనిచేసే మనిషి కాంతమ్మ.
కాంతమ్మ మూడు రోజులుగా పనిచేయడానికి రాకపోవడంతో ఇందుమతి కబురు పెట్టింది. జ్వరం వస్తోందని.. కొద్దిగా తగ్గాక వస్తానని చెప్పి పంపిందామె.
కాంతమ్మ ఐదారేళ్లుగా ఇంట్లో మనిషిలా నమ్మకంగా పనిచేస్తుంది. ఈరోజు కాలేజీకి ఆదివారం సెలవు. 'వెళ్లి కాంతమ్మని చూసి వస్తే బాగుండు' అనుకుంది ఇందుమతి.
కాస్తదూరంగా ఉన్న కాంతమ్మవాళ్ళ వీధికి ఆటో మాట్లాడుకుంది
కాంతమ్మకు భర్తలేడు. ఇద్దరు కొడుకులు అని చెప్పింది పెద్దవాడికి పెళ్లయింది తాపీ పనులకు వెళుతుంటాడట, కోడలు ఈమధ్య రెండోకాన్పుకి పుట్టింటికి వెళ్ళిన దని చెప్పింది కాంతమ్మ. ఇందుమతి ఆలోచనల్లో ఉండగానే ఆటో కాంతమ్మ వాళ్ళ వీధిలోకి వచ్చిఆగింది. దిగి ఆటోకి డబ్బులిస్తున్న ఇందుమతిని అంతదూరం నుంచే చూసిన కాంతమ్మ గబగబా దగ్గరకు వచ్చింది
"అమ్మా.. మీరొచ్చారా!" అంది
"జ్వరం తగ్గిందా కాంతమ్మా? డాక్టర్ కి చూపించుకున్నావా?"
తనుతెచ్చిన పండ్లున్న సంచిని ఆమెకు అందిస్తూ అడిగింది ఇందుమతి
"అయ్యో.. ఇయ్యెందుకుతెచ్చారమ్మా" మొహమాటంగా అంటూ సంచిని అందుకుంది కాంతమ్మ.
తాళంవేసి ఉన్న ఇంటిముంగిట్లోనే ఉండీ లేనట్లున్న చిటికేశ్వరపు చెట్టునీడలో నులకమంచంపై నిండాదుప్పటి కప్పుకుని పడుకుని ఉన్నారెవరో?
ఆచెట్టు మొదట్లో మట్టికుండపైన మూత, మూతపైన ఒకలోటా ఉంది. ఆ ప్రక్కనే ఓ గుడ్డలమూట కూడా ఉంది.
ఇందుమతి చుట్టూ చూస్తూండగానే కాంతమ్మ ప్రక్కింట్లోనించి ఓ కుర్చీని తెచ్చి "కూచ్చోండమ్మా'' అంది తను నిలబడి.
"ఇదేంటి కాంతమ్మా,ఇలా బైటున్నారేంటి? ఈ పడుకున్నదెవరు? జ్వరం నీకా, ఈ పడుకున్న వాళ్ళకా?"
అడిగింది ఇందుమతి
కాంతమ్మ జవాబు చెప్పకుండా తల వంచుకుంది. ఆమె ముఖంపీక్కు పోయి, నీరసంగా ఉంది.
"ఏమైంది కాంతమ్మా?" మళ్లీ అడిగింది ఇందుమతి
"ఏం చెప్పనమ్మా? అంతా నా ఖర్మ..పనికి రేపు వత్తాలే అమ్మా.." పైట కొంగుతో కళ్ళనీళ్లు తడుచుకుంటూ చెప్పింది.
'చెప్పలేకో చెప్పడం ఇష్టంలేకో జవాబును దాటేస్తోంది' అనుకున్న ఇందుమతి కాసేపు ఏవో మాట్లాడి లేచింది.
"సరే, నేనువెళ్తాను. మరీ ఒంట్లోబాగాలేక పోతే తప్ప మానవుకదా... అనుకుని చూడటానికొచ్చాను. పనిదేముందిలే.. నువ్వు స్థిమితపడ్డాకనే వద్దువుగాని" చెప్పింది ఇందుమతి.
కాంతమ్మ అందాకా వచ్చి ఆమెను ఆటో ఎక్కించింది.
***
ఆ మరునాడు కూడా కాంతమ్మ పనికి రాలేదు. రెండురోజుల తర్వాత వచ్చింది.
ప్రతిరోజూ కాంతమ్మ ఇంటి పనులు ముగించేసరికి ఇందుమతి తన పనులు పూర్తిచేసుకుని, కాంతమ్మతో పాటే తనూ బైటకువచ్చి,ఇంటికి తాళంపెట్టి కాలేజీకి వెళ్ళిపోతూఉంటుంది
ఆరోజు పనిపూర్తి చేసి వెళ్ళబోతూ ఆగి అడిగింది కాంతమ్మ. "ఏంటమ్మా, ఇంకా పేపర్ చూత్తన్నారు? ఈఏళ కాలేజీ బడిలేదా?"అని
"పబ్లిక్ హాలిడే కాంతమ్మా, కాలేజీ లేదు. ఉండు, ఇడ్లీలువేశాను ఇద్దరం తిందాం"
తనతోపాటు కాంతమ్మక్కూడా మరో ప్లేట్లో ఇడ్లీలుతెచ్చి పెట్టింది ఇందుమతి.
ఇందుమతి తాను తింటూ కాంతమ్మ వైపు చూసింది. ఆమె తినకుండా పరధ్యానంగా ఇడ్లీలను చిన్న చిన్న ముక్కలు చేస్తుంది. 'డబ్బులు ఏమైనా అవసరమై నన్నడగ లేక పోతుందేమో' అనుకుని ఇందుమతి తినడం ఆపి అడిగింది
"ఏమిటి కాంతమ్మా, ఏదైనాఇబ్బందా? డబ్బులు ఏమైనా కావాలాచెప్పు? సర్దుతాను" అని.
"అహ... డబ్బులేం వద్దమ్మా..." ఆమె కళ్ళు నీళ్లతో నిండిపోయాయి
"మరి ఎందుకంత మథన పడుతున్నావ్? నాకు చెప్పకూడదా?"
"అయ్యో.. మీకు కాక ఇంకెవరన్నారమ్మా నేను చెప్పుకుంటానికి.."అంటూ చెప్పడం మొదలుపెట్టిన కాంతమ్మ నోటి నుండి మాటలుకంటే ఎక్కువగా కళ్ల వెంటనీళ్లు ధారాపాతంగా వస్తున్నాయి. ఆమెగుండె
బరువును, నిస్సహాయతను దీనంగా వెళ్ళబోసుకుంటూ ఉంటే.. శ్రద్ధగా వింటోంది ఇందుమతి. కాంతమ్మ చెప్పేసి వెళ్లిపోయాక కూడా ఆమె చెప్పినవే ఆలోచించసాగింది ఇందుమతి
***
"మేడం నమస్కారమండీ? మీరు రమ్మని చెప్పారంట? వాకిట్లో నిలబడి అడుగుతుంది ఒక యువతి.
సాయంత్రం కాలేజీనుండి వచ్చి టీ పెట్టు కుని త్రాగుతున్న ఇందుమతి అటు చూసింది
పంజాబీడ్రెస్ లో నిలబడి ఉందో యువతి
"ఎవరమ్మా నువ్వు?" అనబోయిన ఇందుమతి చటుక్కున గుర్తొచ్చి, బైటకు వచ్చి నిశితంగా చూస్తూ అడిగింది
"నువ్వూ...స్వేచ్ఛవి కదూ?"
"అవును మేడమ్" అంటూ చేతులు జోడించిందా యువతి
"రా...కూర్చో!" హాల్లో తను కూర్చుంటూ, మరో కుర్చీ చూపింది. యువతి కుర్చీలో కూర్చోకుండా ఆ ప్రక్కనున్న బల్లమీద కూర్చుంది.
ఇందుమతి చూపులనుండి తప్పించు కుంటూ యువతి తల వంచుకుంది.
కొంతనిశ్శబ్దం తర్వాత ఇందుమతి అంది
"నీ విషయం తెలిసింది స్వేచ్ఛా, నేనర్థం చేసుకోగలను"
మరోసారి చేతులు జోడించిందా యువతి
"నాకు వీలైనంతగా నీకు సహకరిస్తాను. నన్ను ఒక లెక్చరర్ గా చూడక, అక్కలానో ఆత్మీయురాలిగానో అనుకో. నీబాధను భావాలను నాతో స్వేచ్ఛగా పంచుకో. నీ ఆలోచనలు విన్నదాన్ని బట్టి.. నేను నీకు ఎలా సహాయపడ గలనో ఆలోచిస్తాను" అనునయంగా చెప్పింది ఇందుమతి.
మౌనంగా ఉందా యువతి
తలవంచుకుని కూర్చున్న ఆమెని చూస్తూ, "చెప్పమ్మా, ప్రతిసమస్యకూ తప్పకుండా ఏదొక పరిష్కారం ఉంటుంది" అడిగింది ఇందుమతి మళ్ళీ.
ఇప్పుడు తలెత్తి చూసిందామె
"మేడం... నాకు అర్థమైంది ఏమంటే నేను ఎందరిని కావాలనుకున్నా.. నన్నునిజంగా కావాలనుకునేది, కడుపులో దాచుకునేది అమ్మ ఒక్కతేనని" చెప్పింది స్వేచ్ఛ.
"ప్రకృతో, దేవుడో మనిషికి ఇచ్చిన ఎంతో అపురూపమైన వరమే 'అమ్మ' ఒప్పుకుంది ఇందుమతి. "మేడమ్! మనకు నచ్చినట్లు, మనకిష్టం వచ్చినట్లుగా మనం బ్రతక కూడదా?" తలెత్తి చూస్తూ అడిగింది స్వేచ్ఛ.
"నచ్చినట్లు బ్రతకడానికి ఇష్టమొచ్చినట్లు ఉండటానికి తేడా ఉందమ్మా.. నీపరిధివరకే పరిమితమైన విషయమైతే నీకు నచ్చినట్లు బ్రతకొచ్చు. నీఇష్టం ఎదుటివాళ్లను ఇబ్బంది పెడుతూ హింసిస్తూ ఉన్నా, 'నాఇష్టం నేనిలాగే ఉంటానంటే ఎదుటివారు ఒప్పుకోరు కదా?" ఎదురు ప్రశ్నించింది ఇందుమతి
"హత్యలు దోపిడీలు మోసాలు లాంటివి నాఇష్టం వచ్చినట్లు చేస్తాననడం.. నేరమే మేడమ్. కానీ..అవేవీ చేయకుండా, నేను ఎవరిబ్రతుకులోను వేలుపెట్టకుండా నా బతుకు నేను బతికినా వెంటాడివేధించే వాళ్ళనేం చేయాలి? వాళ్లనుండి ఎలా తప్పించుకోవాల
"..................."
స్వేచ్ఛ మాటలువింటూ ఆమెను అంచనా వేస్తోంది ఇందుమతి.
ఇంకా అడుగుతోంది స్వేచ్ఛ... "మనం బస్సులో, రైళ్లల్లో ప్రయాణం చేస్తూ ఉన్నాం. అందరం ఎక్కింది ఒకే వాహనం, ఐనా అందరూ ఒకేచోట ఎక్కడం దిగటం లేదు. ఎవరి గమ్యం వారిది కదా?"
వింటూనే ఉంది ఇందుమతి
స్వేచ్ఛ ఇప్పుడు సంశయాన్ని, బిడియాన్ని విసిరేసి ఆవేశపు కెరటంలా ఎగసిపడు తోంది. "పుట్టుకతో మొదలై, చచ్చేవరకు సాగే ఈ జీవనయానం కొందరికి సజావుగా సాగితే నాలాటి వాళ్లకు..." ఉధృతంగా ఎగసిన కెరటం విరిగిపడి ఆక్రోశిస్తూ వెనుతిరిగినట్లు స్వేచ్ఛ స్వరం. సన్నని కంపనతో ఆగి పోయింది.
'నిండా పాతికేళ్ళులేవు..ఎంత లాజిక్కుగ మాట్లాడుతోంది! మనిషికి అనుభవాల్ని మించిన చదువు వేరేలేదేమో'అనుకుంది ఇందుమతి
"నాకు ఇష్టం లేని ఆనందించలేని బ్రతుకు తీరును చచ్చేదాకా ఎలా భరించేది మేడం? నన్ను నేనే చంపుకుంటూ, నాలో నేను రగిలిపోతూ..ఈమూన్నాళ్ళ జీవితంలో ఇంత దొంగబతుకు అవసరమా మీరు చెప్పండి మేడం?" అడుగుతోంది స్వేచ్ఛ.
ఇందుమతికి అర్ధమై పోయింది
'ఒడిదుడుకుల జీవితం మనసుకు శాంతి, సౌఖ్యాన్ని ఇవ్వకపోగా తర్కాన్ని ధైర్యాన్ని నేర్పుతుందని!
కాదంటే.. తాము చేసింది పొరపాటని, తొందరపాటని గ్రహించేశాక ఎదుటివాళ్ళ అయిష్టతను, వ్యతిరేకతను మాటలతో ఎదుర్కొనే చాతుర్యమూ కావచ్చు' అనిపించిందామెకు.
స్వేచ్ఛ ఇంకా చెబుతూనే ఉంది... "నేనూమనిషినే మేడం. నాకూ ఓ మనసు ఉంది. నావాళ్ళందరితోకలిసి సంతోషంగా బతకాలనుంది. కానీ.." అంతవరకు ధైర్యంగా మాట్లాడిన ఆమె దైన్యంగా మారిపోయి.. శక్తి సన్నగిల్లినట్లు నీరసంగా దుఃఖిస్తూ దోసిలిలో మొహం దాచుకుంది.
ఇందుమతి కొన్నిక్షణాలాగి, కుర్చీలోంచి కొంచెం ముందుకు వంగి ఊరడిస్తూ అంది
"ఊరుకో, ఏడవకు నీకంటూ ఖచ్చితంగా కొన్నిఆలోచనలుండి నీ ప్రయాణం ఎటో నిర్ణయించుకున్నప్పుడు కొన్ని భరించాలి. ఎదుటివాళ్ళు చెప్పినట్లు నీవెలా ఉండ లేననుకుంటున్నావో, వాళ్ళకూ నిన్ను సమర్ధించాల్సిన అవసరం ఉండదుకదా? ఆలోచించు..." ఇందుమతి స్వేచ్ఛను ఓదార్చే సమయం
లో.. ఇంటిముందు వాకిట్లోకి ఒక స్కూటీ వచ్చి ఆగింది.
దిగిలోపలికి వస్తున్న ప్రతిభ చేతులు జోడించి "మేడమ్ నమస్కారమండీ!" చెప్పింది ఇందుమతికి .
"ఏయ్ ప్రతిభా ఎలాఉన్నావు? ఏమైనావ్ ఈమధ్య? చాలా రోజులైంది" అడిగింది.
"బాగున్నాను మేడం, మీ ఆరోగ్యం ఎలా ఉంది?"
అడుగుతూనే అక్కడే ఉన్న స్వేచ్ఛ వైపు
చూసింది ప్రతిభ
"తను స్వేచ్ఛ. నీలాగే నాకు ఓల్డ్ స్టూడెంట్" ప్రతిభతో చెప్పింది ఇందుమతి
"నైస్!" నవ్వుతూ కరచాలనం కోసం చేయి చాపింది స్వేచ్ఛ వైపు.
ప్రతిభ చేయిఅందుకోకుండా 'నమస్తే'చెప్పి, "వెళ్లోస్తాను మేడం!"అంటు లేచింది స్వేచ్ఛ.
ఇందుమతి 'సరేనని 'తలూపగానే ఆమె వెళ్లిపోయింది
"కూర్చో ప్రతిభా" చెప్పింది ఇందుమతి
వెళ్తున్న స్వేచ్ఛ వైపే ఆరాగా చూస్తూ అడిగింది ప్రతిభ. "ఆమె మాకన్నా సీనియరా? జూనియరా మేడమ్? ఏ సంవత్సరం?"
"అయ్యో , అడగనేలేదు నీకు మంచినీళ్లు ఇవ్వనా ప్రతిభా?"
" వద్దు మేడం" అంది
"అయితే ఆగు, నేను తాగివస్తాను" లేవబోయింది ఇందుమతి
"మీరుకూర్చోండి మేడం, నేను తెస్తాను" మేడంగారి ఇల్లు అలవాటే కనుక ప్రతిభ లేచివెళ్లి తెచ్చిఇచ్చింది. ఇందుమతి తాగబోతూ "టేబుల్ పై ఆపిల్స్ ఉన్నాయి తెచ్చుకోమ్మా" చెప్పింది.
ప్రతిభ వెళ్లి ఒక యాపిల్ కడిగి చాకుతో కట్ చేయబోతుంటే,
"నాకువద్దు ప్రతిభా నీవుతిను" అందామె
ప్రతిభ చాకు పక్కన పెట్టేసి, కూర్చుని కొరుక్కుతింటూ మళ్లీ అడిగింది.
"చెప్పండి మేడం.. స్వేచ్ఛ ఓల్డ్ స్టూడెంట్ అన్నారు ఏబ్యాచ్ తనది?"
ఆమె మంచినీళ్లు తాగి గ్లాస్ ప్రక్కన పెట్ట బోతుఉండగా మొబైల్ మోగింది. తీసి
మాట్లాడసాగింది ఇందుమతి
"ఆ.. బాలూ ఎలాఉన్నావ్?.. ఎవరు చెప్పారు?.. సంజయ్ అప్పుడే చెప్పేసాడా.... పర్వాలేదు.. ఆ.. వేసుకుంటున్నాను... అన్నీ ఉన్నాయి... అలాగే... అవసరమైతే చెప్తానుగా..వాడికి కంగారెక్కువ బాలూ .. అలాగే.. సరే.. ఉంటాను" మొబైల్ ఆపేసి పక్కన పెట్టేసింది.
"ఏంటి మేడమ్.. మీకు ఆరోగ్యం బాగా లేదా?" ఆపిల్ తినడంఆపేసి అడిగింది ప్రతిభ.
"ఈమధ్య వెన్నునొప్పి వస్తుందమ్మా, నీకు తెలుసుగా సంజయ్ సింగపూర్ లో ఉన్నాడని?ఉదయం నాతోమాట్లాడుతూ 'నీరసంగా ఉన్నట్లున్నావు ఏమిటమ్మా?' అనడిగాడు. వెన్నునొప్పిగా ఉంటుంది, టాబ్లెట్స్ వాడుతున్నానని చెప్పాను. ఇదిగో.. వాళ్ళ ఫ్రెండ్ కి ఫోన్చేసి అమ్మను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళమన్నాడట. ఇప్పుడు మాట్లాడిన కుర్రాడు సంజయ్ కి క్లాస్మేట్, బెస్ట్ ఫ్రెండ్ కూడా.నా యోగక్షేమా లు చూస్తూఉండమని అతనికి చెబుతూ ఉంటాడు. అతనిది ఈ ఊరు కాకపోయినా జాబ్ చేసేది ఇక్కడే, తరచూ వచ్చి వెళుతూ ఉంటాడు నా దగ్గరకు" చెప్పింది ఇందుమతి.
"అశ్రద్ధచేయకండి మేడం. మా అమ్మ కూడా మీలాగానే. ఏది వచ్చినా 'అదే పోతుంది లెమ్మంటూ' ముదిరే వరకు పట్టించుకోదు" అంది ప్రతిభ
చిన్నగా నవ్వింది ఇందుమతి
***
సశేషం
మిగిలిన కథ రేపటి బ్లాగ్ లో
ఇవి కూడా చదవండి