వ్రాయని ప్రేమలేఖ నవల | పార్ట్ 4 | Vrayani premalekha Telugu novel | Telugu kathalu

Vijaya Lakshmi

Published on Dec 13 2025

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

*వ్రాయని ప్రేమలేఖ*

రచన : శ్రీమతి.విజయశ్రీముఖి

ఉష పత్రిక వారి కీ.శే. శ్రీ వెలగపూడి సీతారామయ్య స్మారక నవలల పోటీ లో

ప్రోత్సాహక బహుమతి పొందిన నవల.


ఇంటర్మీడియట్ లో రెండు సంవత్సరాలు ప్రతిభ ఇందుమతికి శిష్యురాలు. ఇప్పుడు బీటెక్ ఐపోయి, ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగంచేస్తున్న ప్రతిభకు మేడంపై గల గౌరవాభిమానాలతో ఇప్పటికీ ఆమెవద్దకు వస్తూపోతూనే ఉంది.      

        ప్రతిభపై ఇందుమతికి కూడా ప్రత్యేక వాత్సల్యంఉంది. అందుకే చదువైనా వారి అనుబంధం కొనసాగుతూనే ఉంది. మేడం ఇంట్లో ప్రతిభ ఆఇంటి ఆడపిల్లలా కలిసిపోయి తిరుగుతూ ఉంటుంది.

        "మేడమ్, ఇంతకీ ఈస్వేచ్ఛ ఎవరో చెప్పారు కాదు" మళ్లీ అడిగింది ప్రతిభ

        "ఆమె ఎవరు ఏమిటనేది ప్రస్తుతం రహస్యం. అవన్నీ నేను నీకు తర్వాత చెబుతాను"

నవ్వుతూ అంది ఇందుమతి

         "అరచేతిలో అద్దంలాగా ప్రపంచంలోని సమాచారం అంతా సెకన్లలో తెలిసిపోయే సాంకేతికయుగంలో ఉన్నాం. ఇంకా రహస్యం ఎక్కడుంది మేడం?"                               

"నిజమే నీవన్నట్లు ప్రపంచంలోని సమాచారమంతా సాంకేతిక సహాయంతో తెలుసుకోవచ్చు. కానీ.. ఒక వ్యక్తి అంతః సంఘర్షణ ఏమిటో ఎదుటివారికి అసలు తెలియకపోవడమే రహస్యం. స్క్రిప్టు స్క్రీన్ ప్లే లేని మనిషి మనుగడే మరో రహస్యం" అంది ఇందుమతి. "నిజమే" నంటూ నవ్వింది ప్రతిభ.

"సరే మీ అమ్మానాన్నగార్లు బావున్నారా? వదిన యమున ఎలావుందీ?" అడిగింది ఇందుమతి.

'స్వేచ్ఛగురించి చెప్పడం ఇష్టం లేకనే మేడం మెలికలుతిప్పి ఇలామాట్లాడుతూ ఉన్నారా?' అనుకుంది ప్రతిభ. పైకిమాత్రం అమ్మానాన్న.. వదిన అందరూ బాగున్నారు మేడం" అని చెప్పింది.

"యమున మంచిటైలర్ కదా? నీవు నాకు లోగడ ఒకసారి తనతో బ్లౌజులు కుట్టించి తెచ్చావు కదూ?" అడిగింది ఇందుమతి

"అవును మేడమ్! మా వదినకు టైలరింగ్ మీద మంచి పట్టు ఉంది. లేడీస్ టైలరింగ్ షాప్ పెట్టాలని తన కోరిక. చాలా మోడల్స్ వచ్చు. కానీ.. టైమ్ ఉండదుమేడం.. నేను అన్నయ్య, ఆఫీసులకు వెళ్తాము. అమ్మ నాన్నగారు పెద్దవారు. ఇంట్లో పనిని వదినే చూసుకోవాలి. మీకు మళ్ళీ కుట్టించుకు రమ్మంటారా మేడం?"

        "వద్దులేగానీ, రోజూ ఖాళీసమయంలో యమున స్వేచ్ఛకు కాసేపు టైలరింగ్ నేర్పుతుందేమో అడుగుతావా?"

ప్రతిభ జవాబేమీ చెప్పకుండా, ఆలోచనలో పడటంచూసి మళ్లీ అడిగింది ఇందుమతి                  

"యమునను నువ్వు అడుగుతావా నన్ను అడగమంటావా?"

 "అడగటంగురించి కాదు మేడం... స్వేచ్ఛ ఉండేదెక్కడ? రోజూ అంతదూరం నుండి ఆమె మాఇంటికి రాగలదా? అని.."

        "కాలేజీలన్నీ మీఇంటి ముందుంటేనే మీరు చదివారా? నీవు పనిచేసే ఆఫీస్ మీఇంటికి దగ్గరలోనే ఉందా? తన దూరం సంగతి నేను చూసుకుంటాను కదా?"

మేడం నవ్వుతూనేఅడిగినా ఆమె ప్రశ్నలో వాడిదనం ప్రతిభకు అర్థం అయ్యింది.

"సారీ మేడం.. వదినని అడిగి మీకు కాల్ చేస్తాను... పొద్దుపోతుంది, ఆఫీస్ నుండి ఇటే వచ్చేసాను. వెళ్లిరానా మేడం?   కూర్చున్నది లేస్తూ అంది ప్రతిభ

'ఎంత శిష్యురాలైనా, అంత నిష్టూరంగా తను అనకుండాఉండాల్సింది' అనుకున్న ఇందుమతి" వెళ్లొచ్చులే ప్రతిభా, స్కూటీ ఉందిగా? అన్నట్లు ఆమధ్య మీనాన్నగారు బజార్లో కనిపించారు.' అమ్మాయికి మంచి సంబంధం వచ్చిందండి' అని చెప్పారు. ఖాయం అయిందా? నీవు ఆ శుభవార్తను చెప్పడానికే వచ్చేవేమో అనుకున్నా" వాతావరణం తేలికపడేలా నవ్వుతూ అడిగింది ఇందుమతి.

"నిజమే మేడం! అసలు అది చెప్పడానికే వచ్చాను.." లేచినదల్లా మళ్లీ కూర్చుంది ప్రతిభ.

 "అవునా కంగ్రాట్స్! అబ్బాయి ఎలా ఉన్నాడు? ఏం చేస్తాడట?"

"ఎలాఉన్నాడు, ఏం చేస్తాడనేది తర్వాత సంగతి. అసలు ఏంకావాలని అడిగాడు? అని అడగండి"

         "సరే, ఏం కావాలని అడిగాడు?"                            

"నేను డాక్టర్ సర్టిఫికెట్ చూపాలిట! క్యాస్ట్ కాదు, స్టడీకాదు, డేట్అఫ్ బర్త్ కూడా కాదు మేడం.."

        "మరి?" అర్థం కాలేదామెకు

"మీముందు సిగ్గువిడిచి చెప్తున్నానండీ.. వర్జినిటీ..."

  "ఆగు. నిజమా! మీరేమన్నారు?" అసహనంగా అడిగింది ఇందుమతి

 

ఆరోజు యమున తనకు చెప్పిన దగ్గర నుంచి.. అతన్ని పార్కుకు రమ్మని చెప్పి దులిపేసిన వరకు అన్నీ వివరంగా చెప్పింది ప్రతి

 వినగానే మాట్లాడలేకపోయింది ఆమె. కొద్దిక్షణాల తర్వాత తేరుకుంటూ తెరలు తెరలుగా నవ్వసాగింది ఇందుమతి. నవ్వు మధ్యలోనే అడిగింది

"పిల్లలు అంటే నాకిష్టం. నువ్వుకూడ పరీక్ష చేయించుకోమని అడిగావా! అల్లరిపిల్లా! ఇంకా అతనక్కడున్నాడా? వెనక్కిచూడక ఉడాయించాడా?"

"అసలు నేనడిగిన దానికి అర్థం అతనికి వెలగలేదో..వెలగనట్లుగా నటించాడో, అర్ధమై ఆమోదించాడో నాకుమాత్రం అర్థంకాలేదు మేడమ్.."

 ఇంకా నవ్వుతూనేఉంది ఇందుమతి

"ఏ ఉద్దేశంతో నేను వచ్చేటప్పుడు 'మళ్లీ తొందరలోనే కలుసుకుందాం' అన్నాడో తెలియడం లేదు" చెప్పింది ప్రతిభ

"నీకంటే ఘటికుడులా ఉన్నాడు..." ఇందుమతి ఇంకాఏదో అనబోయేంతలో ప్రతిభ మొబైల్ మోగింది

తీసిచూస్తూ "వదినా!చెప్పు" అడిగింది

"ఎక్కడున్నావ్? పొద్దు పోతుందిగా? అత్తయ్యగారు కంగారు పడుతున్నారు నువ్వింకా రాలేదని" అంటుంది యమున.            

 "ఇందుమతి మేడంగారి దగ్గరకు వెళ్ళి వస్తానని చెప్పానుకదా? వచ్చేస్తున్నాను." చెప్పి ఆఫ్ చేసింది ప్రతిభ

"మరి.. వెళ్లిరానా మేడం? అసలే లేట్ అయితే కంగారు. దానికితోడు.. ఇదిగో మొన్నవచ్చి వెళ్లినవాళ్ళు రేపిన అనుమానాలొకటి"

"సరేనమ్మా! నేను చెప్పినది యమునను అడుగు. వీలైనప్పుడు వస్తూఉండు" అంది ఇందుమతి

        "అలాగే మేడమ్"

ప్రక్కన పెట్టిన హెల్మెట్ ను తీసుకుని వెళ్లి స్కూటీ స్టాండ్ తీసి, రివ్వుమని దూసుకు వెళ్తున్న ప్రతిభను చూస్తూ ఉండిపోయింది ఇందుమతి.

                                                       ***

ఆఫీస్ వర్క్ ఏదైనా ఉంటే సిస్టమ్ లో కాసేపు చూసుకుని, భోజనంచేసి రాత్రి పూట డాబా పైకివెళ్లి కాసేపు వాకింగ్ చేయడం ప్రతిభకు అలవాటు. అలాగే పైకివెళ్ళింది భోజనంచేసి.

 

వెన్నెల తెల్లగా చల్లగా పాలకడలిలాగా కనిపించినంతమేరా పరుచుకుని హాయి గొల్పుతోంది! డాబామీద నెమ్మదిగా పచార్లు చేస్తున్న ప్రతిభ క్రిందనుండి పైకి పైపైకి పాకివచ్చిన దొంతర మల్లెతీగ డాబా పిట్టగోడ నిండా విచ్చలవిడిగా అల్లుకుపోయింది. ఆకులతో పోటీపడుతూ చెట్టు నిండుగా పూసిన మల్లెలు విడీ విడకుండా మత్తైన అరనవ్వులతో యవ్వనాన్ని రెచ్చగొడుతున్నాయ్!

రోజూ యమున వాటినికోసి, మాల కట్టి.. తను కొన్నిపెట్టుకుని, ప్రతిభ జడలోనూ కొంతమాలను పెడుతూ ఉండేది. 'వదినకు ఈరోజు పనివల్ల తీరికలేదను కుంటాను. పూలన్నీ ఉండిపోయాయి' వాటిని చూస్తూ అనుకుంది ప్రతిభ. మరో రెండడుగులు ముందుకేసింది. మరోప్రక్కన గోడకానించి డాబాపై వరకూ పాకించిన సన్నజాజితీగ కూడా నిండుగా, గుబురుగా అల్లుకుని విరగపూసి విడిలిన జాజులు నాజుగ్గా నవ్వుతున్నాయ్!

‌‌         మరో రెండడుగులు ముందుకేసింది. మూడవవైపున రెండుగోడలు కలిసిన మూలలో పెద్దకుండీల్లో పెట్టిన మరువం, దవనం పచ్చగా ఒత్తుగా పెరిగి గుట్టుగా గుభాళిస్తున్నాయ్.. అటుప్రక్కన పక్కింటి వాళ్ళ పున్నాగచెట్టు అంతెత్తున ఎదిగి.. ఉండుండి ఒకసారి గాలిమాటున దాగి చిలిపిగా పూలను ఇటు విసురుతోంది! మొత్తంగా మత్తుగొల్పుతున్న సుమపరిమళాలు ప్రతిభ అణువణువును ఆవరించి గుండె నిండిపోయి ఉక్కిరిబిక్కిరిగా చేస్తున్నాయ్! మోమునలా పైకెత్తి చూసింది..నింగినున్న నెలరేడులో తను చూసిన ఒకరూపం స్పష్టాస్పష్టంగా కనుపాపల్లో సాక్షాత్కరించి చిరునవ్వులు రువ్వుతోంది!

        ఉలిక్కిపడింది ప్రతిభ

'ఈ రూపాన్ని నామనసులో నుండి బైటకు నెట్టేస్తుంటే మళ్ళీ అక్కడినుంచి కనిపిస్తూ ఇలా కవ్విస్తుందేమిటి?' అనుకుని తల తిప్పేసుకుంది. కొన్నిక్షణాల తర్వాత 'మబ్బుతెరలతో మసకేసి ఉంటుందిలే' అనుకుని ఆగలేక మళ్లీ అటు చూసింది...

        ఈసారి మరింత ప్రకాశవంతమైన రూపంతో సంధిస్తున్న ఆ చిలిపినవ్వుల శరపరంపరలు ఆకాశంలోని నెలవంక నించి ప్రసరిస్తూవచ్చి,ఇక్కడున్న ఆమె ఎద లోతుల్లోకి దూసుకుపోతున్నాయ్!

'వద్దూ.. వద్దూ.. వీల్లేదంటున్నానుగా? వినిపించుకోనిదెవరు? ఆ రూపమా? లేక నా మనసా? నాలో ఎందుకీ ద్వైదీ భావాలు!? పిచ్చిగంతులేయొద్దని మదిని ఎన్నిసార్లు కట్టడిచేసినా...వినదేం? దాని దారి దానిదే! ఐనా,మనసుమీద మాటఎప్పుడుమాత్రం నెగ్గింది కనుక? నెగ్గించుకుని ఖపడినవాళ్లెవరున్నారు కనుక? మదిలో సందడించే భావోద్వేగాలను అధరాలు అదిమిపెట్టినా, ఊహలసలు ఊరుకోవు, ఉసిగొల్పుతూ ఊరేగిస్తూనే ఉంటాయ్!

ప్రతిభకు అసంకల్పితంగానే పాత పాటల ఆల్బమ్ లో విన్న ఒకపాట అలవోకగా పెదాలపై తారట్లాడింది..

 

         'ఒకే ఒక్కసారి ఎగాదిగా చూసి

         లెక్కలేని ఊహలలో చిక్కుకుంది.  ప్రేయసి... ప్రేయసీ...'

ఆమె అధరాలు ఆలపిస్తూనే ఉన్నాయ్.. వీక్షణాలు వినువీధికెగసాయ్... అదే రూపాన్ని పదేపదే చూడాలని పిచ్చి ఆశ..ఆరాటం!

ప్రతిభ తననితాను నిలువరించుకుంటూ ప్రశ్నించుకుంది. 'వాళ్లడిగిన దానికి ఎంతో రోషపడ్డానే? మళ్లీ ఈ ఊహలేమిటి?రాజీ పడుతున్నానా? కాదు. మరి? ఏమో...అతనలా అడిగి ఉండడు. ఇది పెద్దవాళ్ళ పనని.. మొన్నటి అతని మాటలు వింటే...'ఆమె అంతరాంతరాల్లోనుంచి సన్నగా వెక్కిరింపు నవ్వేదో వినిపించినట్లు భ్రమ! ఆకర్షణకు, ఆత్మాభిమానానికి ఏదో గొడవ మొదలైనట్లుంది... ప్చ్... నిట్టూర్పు ఆపుకుంటూ క్రిందికి దిగింది ప్రతిభ.

                                             ***

        "భాస్కరా! భోజనానికి రా.." గది దగ్గరకువచ్చి పడుకున్న కొడుకుని పిలిచింది పరిపూర్ణ.

  "నాకు వద్దమ్మా, ఆకలి లేదు" తలతిప్పి చూడకుండానే జవాబిచ్చాడు భాస్కర్

"నువు మధ్యహ్నంకూడా తినలేదు ఆకలి ఎందుకుండదు? రా..నాన్నా" దగ్గరకొచ్చి కొడుకు చేయిపట్టుకుందామె.

"వద్దన్నానుగా? నన్ను విసిగించొద్దమ్మా"

"అందరూ భోజనానికి కూర్చుని ఉన్నారు, తినకుండా నీకోసమే చూస్తున్నారు"

ఆ మాట వినగానే చటుక్కున లేచి కూర్చున్నాడు. "అమ్మా, నన్నిలా బ్లాక్ మెయిల్ చేయొద్దు అని వాళ్ళకు చెప్పు" ఆవేశంగా అరిచాడు భాస్కర్. అతని అరుపులు విని భోజనాలకు కూర్చున్న తండ్రి, తాత, చెల్లెలు లేచి గది ముందుకు వచ్చి నిలబడ్డారు.

         "అదేం కాదుగాని, రా.. నాన్నా! చూడు వాళ్లు కంచాలముందునించి లేచిపోయి వచ్చారు"

         బతిమాలుతుంది పరిపూర్ణ

"మరేం పర్వాలేదులే ఒక పూటకు. నేను రోజంతా తినకపోయినా చచ్చిపోలేదు కదా?" చిరాగ్గాఅనేసి మళ్లీ అటు తిరిగి పడుకున్నాడు

 "ఎందుకురా అలాంటి మాటలు?" వినలేనట్లుగా అంటోంది పరిపూర్ణ.

 "ఇంతకూ అసలు నీఉద్దేశం ఏవిట్రా?" గుమ్మం దగ్గరే నిలబడి వింటున్న తండ్రి అర్జున్ రావు అసహనంగా అడిగాడు. విని కూడా మాట్లాడలేదు భాస్కర్ తాత రామస్వామి అందుకున్నాడు

"ఏముంది... మొన్న నేనా పిల్లతండ్రికి ఫోన్ చేశానని రా... వీడి రుసరుసలు" అన్నాడు

 

  "మీరలా అడగొచ్చునా వాళ్ళను?" చివ్వున తలతిప్పి అడిగాడు భాస్కర్.

"వాళ్లు సరేనంటూ ముందుకు వస్తే మనకి అనుమానం ఉండేది కాదుగా? వద్దులే అనేవాళ్ళం. వాళ్ళకా జంకు దేనికో?" అన్నాడు రామస్వామి

 గభాల్న లేచి కూర్చున్నాడు భాస్కర్. "అదిగో..అదే వద్దని చెబుతున్నాను. అలా అడగటం ఆ అమ్మాయిని అనుమానించి నట్లు కాదా? వాళ్లకది ఎంత అవమానం? ఇలాంటి రుజువులను మీరెంత మందిని అడుగుతారు?" తాతగారి వైపుచూస్తూ కోపంగా అడిగాడు భాస్కర్.                         

"సరే, పెద్దాయన నీ మంచికోరి ఏదో అలా అన్నారనుకో.. దానికింతటి రాద్ధాంతం అవసరమా?"

తాతా మనవళ్ళమధ్య యుద్ధం పెరిగేలా ఉందనేభయంతో కొడుకుకి సర్దిచెప్పాలని ప్రయత్నించాడు అర్జునరావు.

  "పెద్దాయన! మనకూ మనఇంటి వరకే. ఊళ్లోవాళ్ళందరికీ కాదు. అయినా 'తన మన' భేదం చూపక పోవడమే "పెద్దరికం" అంటే." విసురుగా అన్నాడు భాస్కర్

రామస్వామికి బాగా ఆగ్రహం వచ్చింది, అవమానంగా కూడా తోచింది..

"నీ మంచి కోరడం పెద్దవాడిగా నా బాధ్యత అనుకున్నాను! నువ్వింత పెద్దవాడివైపోయావనుకోలేదు. ఒకపక్క మీ అన్న... పెదనాన్న కొడుకు అదే రాజుగాడి పెళ్ళాం ఎట్టాంటిదో ఎప్పుడురా తెలిసింది? పెళ్లయ్యాకేగా?" అరిచాడు రామస్వామి.

"జరిగిపోయిందెందుకు? ఊరుకో నాన్నా" అర్జునరావు తండ్రిని వారించాడు

"నువ్వాగరా.. వీడికి తెలియనివ్వు, రాజుగాడి పెళ్ళాం ఎవడ్నో ప్రేమించి, ఆడితో చెడతిరుగుడు తిరిగి.. ఆ తిరుగుళ్లలోనే ఒళ్ళూ పై తెలియకుండా నడమంత్రపు ఫోజుల్లో ఎన్ని ఫోటోలు తీసుకున్నారు?

అంతటితో ఆగారా? ఉహూ, మాఫోజులు చూడండహో...అని వాట్సాప్ ల్లోనూ ఫేస్ బుక్ ల్లో పెట్టీ చాటింపేసుకున్నారు.. చివరికే మయ్యిందిరా?"

  "అయ్యిందిలే నాన్నా..వదిలేయ్.." అర్జునరావు అడ్డు వచ్చాడు.

"ఏవిట్రా వదిలేసేది? ఆ పిల్ల వదిలేసిందిలే.. ఆఫోటోలు చూసినోళ్లు వదిలేసారా? పెళ్లికొచ్చినోళ్ళు.. రానోళ్ళు ఫొటోలును చూసినోళ్ళంతా 'ఆడేమయ్యాడు.. నువు చేసుకున్నావ్? అని రాజుగాడిని అడుగు తుంటే ఆడెంతగా సిగ్గుపడి చచ్చాడో మీకు తెల్వదా?"

        "తెలుసులే..పద నాన్నా" ఆయన్ని పట్టుకుని అవతలకు నడిపించ బోయాడు అర్జునరావు.                                   

ఓ చేత్తో కొడుకుని పక్కకు తోసేసి, మళ్లీ మొదలు పెట్టాడు రామస్వామి

"ఆ ఫోటోలన్నీ వీడి కంటపడి, వాటిల్లో వాళ్ళముద్దులు కావిలింతల సీనులన్నీ చూసి వీడు జీర్ణించుకోలేక..."

"అబ్బబ్బ...మావయ్యగారూ దయచేసి మీరు అవతలకు పదండి"అసహనంగా అంది పరిపూర్ణ.

"నాన్నా! నువ్వు చెప్పేవన్నీ నిజాలేగానీ, అవతలి వాళ్ళకి ఇవన్నీ తెలియవుకదా? అవమానంగా అనుకుంటారనే వీడు అంటున్నాడు..మీరిద్దరూ రైటేలే పదండి " అర్జునరావు బలవంతంగా తండ్రిని

అవతలకు తీసుకువెళ్లాడు.

అయినా పెద్దాయన ఆగడంలేదు, ఇంకా అరుస్తూనే ఉన్నాడు. "ఉద్యోగాలంటూ ఆడామగ అందరూ అర్ధరాత్రిదాకా బైట ఉండడం, నాగరికత పేరున రాసుకుపూసుకు తిరగడం! అదేమంటే "ఫ్రెండ్షిప్ ..నాగరికత" లాంటి రంగురంగుల పేర్లుచెప్పడం..."

వింటున్న భాస్కర్ లోపల నుండి రివ్వున

దూసుకొచ్చాడు

         "ఆమాటలే వద్దనిచెప్తున్నాను. ఇంటి చాకిరీచేస్తూ, పిల్లల పెంపకాన్ని చూస్తూ

ఆఫీస్ పనులుకూడా నెత్తినేసుకుని మగాడికంటే ఎక్కువగా శ్రమ పడుతున్న ఆడవాళ్ళ కష్టంమాత్రం నీకు కనిపించదు. ఎక్కడో ఎవరో ఒకరు ఏదోచేస్తే అందరికీ అదేముద్ర వేస్తారా?

ఇదిగో మనకీ ఉందో ఆడపిల్ల. ఇది కూడా కాలేజీలకని, కంప్యూటర్ ల కని బైట తిరగటంలేదా? రేపెవరైనా దీన్ని కూడా మీలాగేఅంటే మనకి ఎలా ఉంటుంది?"

అప్పటివరకు మౌనంగా వింటున్న దీక్షిత భాస్కర్ వాక్ప్రవాహానికి అడ్డొచ్చింది

 "మధ్యలో నన్నంటావ్ ఎందుకు?" అన్నమీద గయ్యిన లేచింది.

 "నోర్ముయ్! ఊళ్లోవాళ్లు కూడా నీలాంటి వాళ్లేనని చెబుతున్నాను" చెల్లెల్ని కసిరాడు భాస్కర్

"దీక్షా.. నువ్వాగు" అరిచింది పరిపూర్ణ

అర్జునరావు భార్యవైపు చూశాడు. గ్రహించిన ఆమె కొడుకు దగ్గరగా వెళ్లింది. లాలనగా అతనినడుము చుట్టూచెయ్యేసి నడిపిస్తూ "నాన్న.. నా మాటవినరా, నువ్విటు రా" అంటూ అతన్ని గది లోనికి తీసుకువెళ్లింది.

ఆ రాత్రి... బతిమాలుతూ తండ్రికి అర్జునరావు కొడుక్కి పరిపూర్ణ అన్నం తినిపించినారు. దీక్షిత బుంగమూతి పెట్టుకుని ఏదోతిని వెళ్లిపోయింది. ఆకలితో,ఆలోచనలతో అన్యమనస్కంగా జాగారం చేసినవాళ్ళు మాత్రం అర్జునరావు పరిపూర్ణలు.

                                                       ***   

సశేషం

మిగిలిన కథ రేపటి బ్లాగ్ లో



ఇవి కూడా చదవండి


Recent Posts
రథ సప్తమి విశిష్టత: సూర్య జయంతి  |  పూజా విధానం | శాస్త్రీయ కోణం | ఆధ్యాత్మిక ప్రాముఖ్యత | Rath Saptami importance
రథ సప్తమి విశిష్టత: సూర్య జయంతి ...
తిరుమల (టిటిడి)  |  జనవరి 25న తిరుమలలో ర‌థ‌స‌ప్త‌మి వేడుకలు  | TTD news  |  Rath Saptami celebrations in Tirumala on January 25
తిరుమల (టిటిడి) | జనవరి...
తిరుమల 2026 ఏప్రిల్ నెల దర్శన, సేవల కోటా విడుదల వివరాలు | Tirumala April darshan, seva quota release details
తిరుమల 2026 ఏప్రిల్ నెల దర్శన, సేవల...
ఫిబ్రవరి నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో విశేష పర్వదినాలు | TTD news  |  important festivals  in Tirumala temple
ఫిబ్రవరి నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో విశేష...
2026 శ్రీ పంచమి (మదన పంచమి) ప్రాముఖ్యత  |  సరస్వతి పూజ విశేషాలు | Significance of sree panchami (Madan panchami) 2026
2026 శ్రీ పంచమి (మదన పంచమి) ప్రాముఖ్యత...