వ్రాయని ప్రేమలేఖ నవల | పార్ట్ 5 | Vrayani premalekha Telugu novel | Telugu kathalu

Vijaya Lakshmi

Published on Dec 14 2025

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

*వ్రాయని ప్రేమలేఖ*

రచన : శ్రీమతి.విజయశ్రీముఖి

ఉష పత్రిక వారి కీ.శే. శ్రీ వెలగపూడి సీతారామయ్య స్మారక నవలల పోటీ లో

ప్రోత్సాహక బహుమతి పొందిన నవల.

                           

భాస్కర్ ఎన్నిసార్లు కాల్ చేసినా అవతల రింగ్ అవుతూనే ఉంది. కానీ తీయలేదు. విసుగ్గా మొబైల్ ను పక్కనపడేసి, ఆలోచి స్తూ కూర్చున్నాడు.

'ఏంటసలు తనఉద్దేశ్యం? పెళ్లిచూపుల్లో, తర్వాత..మాట్లాడినప్పుడు ఆమె కళ్ళలో కనిపించిన మెరుపు, మాటల్లో వ్యక్తమైన ఇష్టం ఆమె అనుకూలతను తెలిపాయి.

లవ్ ఎట్ ఫస్ట్ సైటో... ఇంకేమో కానీ 'ఆమే కావాలి' అని గుండెల్లో గొడవ. కేవలం తాతయ్య మాటలు విని, నా ప్రోద్బలంతో ఆయనలా అడిగారనే అపోహలో ఉంది. పార్క్లో తను చెప్పేవరకు తాతయ్యలా అడిగారనే సంగతే తనకి తెలియదు ఆమాటచెప్పి, ఆయన్ని తేలికపరచలేక పెద్దవాళ్ళ మాటలు అన్నట్లుగా తను తేల్చేశాడ ఆరోజు.

ఐనా...ఆమెకు నమ్మకం కలగడం లేదు. అనాలోచితంగా అనేసే మాటలెంతగా అవతలివాళ్లను కలవరపెడతాయో, విముఖులనిచేస్తాయో అర్థమైంది. ఆమెని ఎలా నమ్మించాలో అర్థం కావడంలేదు... కేవలం ఒక్క మాటతో తన దృష్టిలో ఎంత తేలికైపోయాను' విసుగ్గా నుదుటిపై రుద్దుకుంటూ,ఆలోచన లో మునిగిపోయాడు భాస్కర్.

                                                       ***

ఆదివారంనాడు అందరికీ సెలవే కనుక భోజనం చేసి, సిటీలోనే ఉన్న ప్రతిభా వాళింటికి బయలుదేరింది ఇందుమతి. లోగడ ఒకసారి వాళ్ళ అన్నయ్య పెళ్లికి, మరోసారి వాళ్ళ నాన్నగారి షష్టిపూర్తి వేడుకకు వెళ్లి రావడం వలన వాళ్ళ ఇంటి అడ్రస్ తెలుసు. ఆటో మాట్లాడుకుని బయలుదేరింది.                        ఆటోదిగి గేటుదాటి లోపలికి వెళ్ళిన ఇందుమతికి వరండాలోనే కూర్చునిఉన్న ప్రతిభవాళ్ళనాన్నగారు పేపర్ చదువుతూ కనిపించారు.

"నమస్కారం అండి" అంటున్న ఇందుమతి మాటతో తలెత్తి చూసిన సంజీవయ్య కుర్చీలోనుంచి లేచాడు.

 "నమస్కారమమ్మా, రండి రండి... ప్రభా! మేడం గారొచ్చారు" అంటూ లోపలికి చూస్తూ కూతుర్ని పిల్చాడు. ప్రతిభతో పాటు యమున కూడా బైటకు వచ్చింది.

        "నమస్కారం మేడం రండి" అంటూ లోపలికి తీసుకువెళ్లారు. ఇందుమతి లోపలికి వెళ్లి సుమిత్రమ్మను కూడా పలకరించాక ఆమెను ప్రతిభ గది లోనికి తీసుకువెళ్లారు.

 యమున కూడా మాట్లాడుతూ అక్కడే కూర్చుంది. "ఆదివారం వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు కదా?" నవ్వుతూ అడిగింది ఇందుమతి

.       "అదేంలేదు మేడం, మా నాన్నగారు దినపత్రికలో అక్షరాలెన్ని ఉన్నాయో ఉదయం లెక్కపెట్టుకుంటారు. మళ్ళీ సాయంత్రం అన్నీ అలాగే ఉన్నాయా, ఏవైనా జారీ పడిపోయాయా? అని మళ్లీ సరి చూసుకుంటారు. ఇంక మాఅమ్మ... సదా పూజకోసం చేసే లక్ష వత్తుల దీక్షలో ఉంటుంది. అన్నయ్య ఎమ్మార్వో ఆఫీస్ లో ఆర్.ఐ కదా? అప్డేట్స్ తో బిజీ..బిజీ.

ఇంక మిగిలింది..నేను, మా వదిన. మేము కనిపించే వాళ్లను, వినిపించేవాళ్లను కనిపించక వినిపించని వాళ్లను కూడా తలచి తలచి తలపోసుకుంటూ, కించిత్ ఆడిపోసుకుంటూ ఉంటామ్" గలగల చెబుతున్న ప్రతిభ మాటలకు నవ్వింది ఇందుమతి.

         "మేడం భోజనం చేద్దురుగాని రండి" పిలిచింది యమున.

         "భోజనం చేసే బయలుదేరానమ్మా" చెప్పింది ఇందుమతి.                            

లోపలికివెళ్లి గ్లాసు నిండుగా చల్లని మజ్జిగ తెచ్చి ఇచ్చింది యమున. ఆమె అవి తాగుబోతు ఉండగా గదిలోనికి రాజేంద్ర వచ్చాడు

 "మేడం నమస్కారమండీ." నవ్వుతూ చేతులు జోడించాడు

         "రండి బాబూ కూర్చోండి. ఈరోజు నేను మీతో కూడా మాట్లాడవలసిన పనిఉండి వచ్చాను." గ్లాస్ క్రింద పెడుతూ చెప్పింది ఇందుమతి.

  "నాతో నా మేడం!"ఆశ్చర్యంగా అంటూ నవ్వుతూ చెల్లెలి వైపు చూశాడు

మేడం కూర్చున్న పడకకుర్చీకి ఎదురుగా చెల్లెలు ప్రక్కనే మంచంమీద కూర్చున్నాడు రాజేంద్ర. యమున ఇందుమతి ప్రక్కన కుర్చీలో కూర్చుంది.

"చూడండి రాజేంద్రా! మిమ్మల్ని తక్కువ సార్లు చూసినా ప్రతిభ చెప్పేమాటల్లో మీ నైజం కొంతవరకు అర్థం చేసుకున్నాను. ఆ ధైర్యంతోనే..." నవ్వుతూ ఆగింది ఇందుమతి

        "అయ్యో సందేహించకండి మేడం... మీదగ్గర నేను మా ప్రతిభలా చదువుకోకపోయినా, మీరంటే మా ఇంట్లో అందరికీ గౌరవాభిమానాలు ఉన్నాయి. ఏమిటో చెప్పండి" అన్నాడు

        "బహుశా ప్రతిభ చెప్పే ఉంటుంది... యమున మంచిటైలర్ కదా? స్వేచ్ఛకు కొన్నాళ్ళు టైలరింగ్ నేర్పుతుందేమోనని అడగమని చెప్పాను"

"చెప్పింది మేడం" అంది యమున

 అర్థంకానట్లుగా భార్యవైపుచూసాడు రాజేంద్ర

"ఈయనగారు కాస్తబిజీగా తిరగటం వల్ల ఈయనకు చెప్పలేదు. ఈ రోజు వీరికి చెప్పి తర్వాత మీకు కాల్ చేద్దాం అనుకున్నాను. అనుకోకుండా మీరేవచ్చారు..." సంజాయిషీగా చెప్పింది యమున

"పర్వాలేదమ్మా, ఆదివారంకదా ఇంట్లో అందరూ ఉంటారు. అందర్నీ చూసినట్లు కూడా ఉంటుందని నేనే వచ్చాను" నవ్వుతూ అన్నది ఇందుమతి.                              

  "చెప్పండిమేడం నేనేం చేయగలను" అడిగాడు రాజేంద్ర

"విషయాన్ని ముందు మీకు విపులంగా చెప్పి, మీ సహకారం కోర్దామని వచ్చాను"

"తప్పకుండా మేడం ఏమిటో చెప్పండి" చిరునవ్వుతో అడిగాడు రాజేంద్ర. ఒకసారి ప్రతిభ యమునల వైపుకూడా చూసింది ఇందుమతి. వాళ్లుకూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు చెప్పసాగింది ఆమె...

"మా ఇంట్లో కాంతమ్మనే ఆవిడ ఆరేళ్లుగా పనిచేస్తుంది. భర్తలేడు. ఇద్దరు కొడుకులు పెద్దకొడుకు తాపీ పనులకు వెళ్తాడట. అతడికి పెళ్లయ్యి ఒకపాప ఉంది. రెండవ కానుపుకి భార్య పుట్టింటికి వెళ్ళిందిట. ఇలా ఉంటే...కాంతమ్మ చిన్న కొడుకు ఇంటర్ మొదటిసంవత్సరం పరీక్షలకు ముందు ఒకరోజు చీటీరాసి ఇంట్లో పెట్టేసి, వెళ్లిపోయాడు. చీటీలో 'నేను చదవలేక పోతున్నాను, పరీక్షల్లో తప్పితే అన్నయ్య చంపేస్తాడనే భయంతో ఇల్లువదిలి పారి పోతున్నాన'ని రాసిపెట్టి వెళ్లిపోయాడు. అలా వెళ్ళినవాడు తొమ్మిదేళ్లుగా ఆచూకీ దొరకలేదట..." ఇందుమతి చెబుతుంది మిగతా ముగ్గురు వింటున్నారు

"చివరికి మొన్న ఈమధ్యనే ఇంటికితిరిగి వచ్చాడు. కాదు... తిరిగివచ్చింది అననా?" ఆగింది ఇందుమతి.

వింటున్న ప్రతిభకు ఆ రోజు మేడమ్ గారి ఇంట్లో తను చూసిన స్వేచ్ఛ రూపానికి, మేడం చెప్పే విషయానికి ఇప్పుడు లింక్ కుదిరినట్లనిపించింది. ఆరోజు మేడం ఎందుకు విషయాన్ని దాటేసారో ఇప్పుడు అర్ధమైనట్లుగా తల పంకించింది.                                

ఏభావాన్ని వ్యక్తపరచకుండా వింటూనే ఉన్నాడు రాజేంద్ర

"వెళ్ళినవాడు తిరిగివచ్చిందేమిటి?అంటే ట్రాన్స్ జెండర్ గానా?"ఆశ్చర్యంగా గభాల్న అడిగేసింది యమున. 

రాజేంద్ర భార్యవైపు 'చెప్పేది విన'మన్నట్లు చూసాడు. యమున సర్దుకుంది. ఇందుమతి చిన్నగా తల పంకించి, మళ్లీ చెప్పసాగింది.

"ఔను. ఒకసారి కాంతమ్మకు జ్వరం అని పనికిరాకపోతే చూసి వద్దామని నేను వాళ్ళింటికి వెళ్ళాను. తాళం పెట్టిన ఇంటి ముందు.. ఉండీలేనట్లున్న చెట్టునీడలో కాంతమ్మ కూర్చుని ఉంది. ఆమె ప్రక్కనే నులకమంచం మీద నిండుగా దుప్పటిని కప్పుకుని అమ్మాయిగా మారిన ఆమె చిన్నకొడుకే పడుకున్నదని ఆ తర్వాత కాంతమ్మ చెప్పింది.."

 ముగ్గురు మాట్లాడక వింటున్నారు

"... తర్వాత ఒకరోజు కాంతమ్మ నాదగ్గర కూర్చుని వెళ్లబోసుకున్న వ్యధ ఏమిటంటే.. ఇంట్లోనుంచి వెళ్లిపోయిన చిన్నకొడుకు అక్కడక్కడ తిరిగి తన కోరిక ప్రకారమే ట్రాన్స్ జెండర్ అయి, "స్వేచ్ఛ" అనే పేరుతో ముంబాయిలో కొన్నేళ్లు గడిపి...ఇన్నేళ్ల తర్వాత ఇంటికి తిరిగివచ్చాడట. అదేలే...అమ్మాయిగా ఇంటికి వచ్చింది"

         ".................."

"...పెద్దకొడుకు నాగరాజు అమ్మాయిలాగా మారిన తమ్ముడిని ఇంట్లో వద్దని ఎటైనా పొమ్మని రోజూ గొడవేనట. 'ఇది నీకేకాదు నా ఇల్లుకూడా, నేను ఇక్కడే ఉంటాను' అని స్వేచ్ఛ వాదనట. ఇద్దరిలో ఎవరికీ చెప్పలేక కాంతమ్మ సతమతమౌతోంది..."

  "తల్లికదా పాపం.." అంది యమున 

  వింటూనే ఆలోచిస్తున్నాడు రాజేంద్ర                                

"..వాడిరాతట్టా ఏడ్చింది. ఇన్నేళ్లకుతిరిగి వచ్చాడు, ఎక్కడికి పోతాడు? ఉండనీ..' అని కాంతమ్మ పెద్దోడిని బ్రతిమాలితే, ఆడు ఇంట్లో ఉంటే.. ఊళ్లోనూ, నాపెళ్ళాం ముందు నాకు తలవంపులుగ ఉంటుంది. రేపు నాపిల్లల్ని కొజ్జావాళ్ళ పిల్లలని ఎక్కి రిస్తారు.. ఇంట్లోవద్దు. నువ్వు వాడికి తిండిపెట్టొద్దు.. అని పెద్ద కొడుకు తల్లితో పోట్లాటంట.."

                 "..................."

'..నేను వాడిని పొమ్మని చెప్పలేనని తల్లి అంటే, వాడితోపాటు నువ్వూ బైటికి ఫో.. నాపెళ్ళాం వచ్చేసరికి ఇంట్లో ఉండొద్దు' అంటూ వాళ్ళిద్దర్నీ బయటకు నెట్టి ఇంటికి తాళంవేసి పోయాడట. అందుకని ఆరోజు నేను వెళ్లేసరికి వాళ్ళు బయట వాకిట్లో పడిఉన్నారు..."

                 "................."

"...తల్లి అసహాయత, అన్నవేధింపు బైట చెట్టుకిందనేపడి ఉంటే వీధిలోవచ్చిపోయే వాళ్ళచూపులను తట్టుకోలేని ఆ స్వేచ్ఛ ఒకరోజు అర్ధరాత్రి ఆ చెట్టుకి ఉరిపెట్టు కుంటుంటే...."

        "అయ్యో..." 

 "అరే...." యమున, ప్రతిభ ఇద్దరూ ఒకేసారన్నారు. రాజేంద్ర ఏదోచెప్పబోయి, మళ్లీ ఆగిపోయి వింటున్నాడు.

"కృంగిపోయి ఏడుస్తున్న స్వేచ్ఛ ఎప్పుడు ఏం చేసుకుంటుందోనని తల్లిభయంతో కాపలా కాసుకుంటూనే ఉందిట. ఏడుస్తూ అడ్డుపడి' నీతోపాటు నాకూ ఉరిపెట్టు... ఇద్దరం ఒకేసారి పోదాం' అని ఏడుస్తూ అడ్డుపడిందట.."

ఇందుమతి చెప్పడం ఆపి, కుర్చీకి అటు ఇటు చూసింది. గ్రహించిన యమునలేచి ఆమెకు మంచినీళ్ళబాటిల్ అందిస్తూ "పోనీ..తల్లిని తీసుకుని ఎటైనావెళ్లొచ్చు కదా మేడం ఆ స్వేచ్ఛ?" అన్నది

"నిజమే యమునా, నేనూ ఆమాటే అన్నా ఇంకా విను.." అందామె.                         

మంచినీళ్లు తాగి బాటిల్ ని క్రిందపెట్టిన ఇందుమతి, "కాంతమ్మ బాధ చూడలేక స్వేచ్ఛను ఒకసారి నాదగ్గరకు పంపమని చెప్పాను. ఒకసాయంత్రం తను మాఇంటి కొచ్చింది..."

"స్వేచ్ఛను మీ ఓల్డ్ స్టూడెంట్ గా నాకు పరిచయం చేశారు, ఆ రోజేనా మేడం?" అడిగింది ప్రతిభ.

"అవును. నీ రాకతో ఆరోజు మా మాటలు ఆగిపోయాయి. మళ్లీ ఆ మరుసటిరోజు, ఆ..తర్వాత రెండు రోజులుకూడా స్వేచ్ఛ వస్తూనేఉంది. తనుపూర్తిగా తన గురించి నాకు చెప్పినదంతా విన్నాక, ఎలాగైనా ఆమెకు నాచేతనైనంత సహకరించి తన కాళ్ళమీద తను నిలబడే గౌరవప్రదమైన జీవనోపాధి ఏదైనా చూపించాలనుకున్నా. అందుకే ఆప్రయత్నంలో మీతో నాకున్న చనువు కొద్దీ మీసహాయాన్ని కూడా నేను కోరుతున్నాను" అంది ఇందుమతి.

         "ఇంతకీ స్వేచ్ఛ ఏంచెప్పింది మేడం?" ఆసక్తిగా అడిగింది యమున. మిగతావాళ్లు అడగకపోయినా వాళ్లకూ తెలుసుకోవాలనే ఉంది.

విషయమంతా స్పష్టంగా వీళ్ళకు కూడా వివరిస్తేనే.. ఏం చేయాలనేదానికి ఒక ఆలోచన, రూపం ఏర్పడతాయనుకున్న ఇందుమతి తనకు స్వేచ్ఛ చెప్పినదంతా యథాతథంగా గుర్తు చేసుకోసాగింది....

                                                       ***

సశేషం

మిగిలిన కథ రేపటి బ్లాగ్ లో



ఇవి కూడా చదవండి


Recent Posts
రథ సప్తమి విశిష్టత: సూర్య జయంతి  |  పూజా విధానం | శాస్త్రీయ కోణం | ఆధ్యాత్మిక ప్రాముఖ్యత | Rath Saptami importance
రథ సప్తమి విశిష్టత: సూర్య జయంతి ...
తిరుమల (టిటిడి)  |  జనవరి 25న తిరుమలలో ర‌థ‌స‌ప్త‌మి వేడుకలు  | TTD news  |  Rath Saptami celebrations in Tirumala on January 25
తిరుమల (టిటిడి) | జనవరి...
తిరుమల 2026 ఏప్రిల్ నెల దర్శన, సేవల కోటా విడుదల వివరాలు | Tirumala April darshan, seva quota release details
తిరుమల 2026 ఏప్రిల్ నెల దర్శన, సేవల...
ఫిబ్రవరి నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో విశేష పర్వదినాలు | TTD news  |  important festivals  in Tirumala temple
ఫిబ్రవరి నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో విశేష...
2026 శ్రీ పంచమి (మదన పంచమి) ప్రాముఖ్యత  |  సరస్వతి పూజ విశేషాలు | Significance of sree panchami (Madan panchami) 2026
2026 శ్రీ పంచమి (మదన పంచమి) ప్రాముఖ్యత...