Vijaya Lakshmi
Published on Dec 16 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?*వ్రాయని ప్రేమలేఖ*
రచన : శ్రీమతి.విజయశ్రీముఖి
ఉష పత్రిక వారి కీ.శే. శ్రీ వెలగపూడి సీతారామయ్య స్మారక నవలల పోటీలో
ప్రోత్సాహక బహుమతి పొందిన నవల.
ఎవరో ఒక అనాధ గర్భిణీ స్త్రీ రోడ్డు ప్రక్క అడుక్కునే మహిళ ఓ బిడ్డను కానీ చనిపోయిందని ఈ జగదాంబ ఇరవై ఏళ్ల క్రితం ఆ పాపను తాను తెచ్చుకుని పేరు "బంగారుపాప" అని పెట్టి పెంచుకుందిట. ఆ పాపకు ఆరేళ్లు వచ్చాక హాస్టల్లో ఉంచి చదివించటం, వారం వారం వెళ్లి చూసి, కావలసినవి కొనిపెట్టి వచ్చేదట. ఆ పిల్ల ఈమెను అమ్మ అని పిలిచేదట. కాలేజీ చదువులకు వచ్చాక హాస్టల్లోనే ఉంటూ 'డబ్బులుమాత్రం పంపించు. నువ్వు రావద్దు.. వీళ్ళందరి ముందు నాకెంతో చిన్నతనంగా ఉంటుంది' అందట. దాంతో జగదంబ మానసికంగా కృంగిపోయినా, డబ్బులు మాత్రం పంపుతూ ఉండేదట.."
"అదీ లోకమంటే..." అంది ఇందుమతి.
"...ఒకసారి జగదంబ పిల్లమీద మరీ బెంగ గా ఉండి హాస్టల్ కి వెళ్తే ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని హాస్టల్ ఖాళీచేసి వెళ్లిపోయింది అని చెప్పారట... 'మీరైనా నాకు తెలియజేయలేదేమిటి?' అనిఅడిగితే 'తను ఇప్పుడు మేజర్ కదా ' అని జవాబు ఇచ్చారట. ఎవరిని చేసుకుందో ఎప్పుడుచేసుకుందో ఎక్కడికి వెళ్లిందో జగదంబకు తెలియదు. ఎంతోమందిని అడిగేదట "మా అమ్మాయి ఎక్కడుందో తెలుసా? దానికి పెళ్లయ్యింది దాన్ని, వాళ్లాయన్ని ఒక్కసారి చూస్తాను" అని. ఎవరికీ తెలియదో చెప్పలేదో గానీ ఆపిల్ల అడ్రస్ తెలియక ఏడుస్తూ వెనక్కి వచ్చిందిట. అప్పటినుండి ఆమె దిగులు తోనూ అనారోగ్యంతోనూ మంచానికి పరిమితమైపోయిందిట..."
భారంగా నిట్టూర్చింది ఇందుమతి.
కొంతసేపు ఇద్దరి మధ్య నిశ్శబ్దం
"మేము వెళ్లివచ్చిన వారం పదిరోజుల్లోపే జగదంబ చనిపోయిందనే వార్త తెలిసింది. నాకు పదేపదే జగదంబ... ఆమె పెంచిన కూతురు, ఆ కూతురు చేసిన పనీ.. ఈమె కుంగుబాటు క్షణక్షణం వెంటాడేవి... ఏంటి ఈ జీవితం? నా అనేవాళ్ళు లేని ఒంటరి బ్రతుకు ఎంత నిస్సారంగా ఉంటుందో.. అర్థమైంది.
ఎవడో వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటాడని, నేను ఊహించుకున్న కుటుంబ జీవితం లభిస్తుందనే ఆశలు ఆవిరైపోయాయి... అశాంతి అసహాయత ఆందోళన ముప్పేట నన్నలుముకుని ఉక్కిరిబిక్కిరి చేయసాగా యి... కోరుకున్న జీవితం లభించక, ఉన్న అయినవాళ్లను దూరం చేసుకుని ఈ ఒంటరి వెలిబ్రతుకు ఎందుకు?ఎన్నాళ్ళు? ఈ ఆలోచనలతో నేను సతమతమై పోతూ ఉండేదాన్ని..."
"..................."
"...నేను ఇల్లు వదిలిపోయి ఎనిమిదేళ్ళు అయ్యింది. శస్త్ర చికిత్స చేయించుకుని ఆరేళ్లు అవుతోంది. నేను సంపాదించిన వాటితో వాళ్లునాకోసం ఖర్చుపెట్టినదాన్ని ఏడాదిక్రితమే తీర్చేసాను. నేను దేనికోసం ఎంపర్లాడానో ఆకోరిక తీరదు..తీరే ఆశ కూడాలేదు. అక్కడ ఉండాలనిపించలేదు తిట్లో దీవెనలో వెనక్కి నాఊరు నా వాళ్ల దగ్గరికి వచ్చేయాలనే కోరిక నన్ను నిలవ నీయలేదు..."
"వాళ్లల్లో ఎవరికీ నీలాగ స్థిరపడాలనే కోరికలేదా?" అడిగింది ఇందుమతి.
" ఉంటుంది మేడం. కానీ, వీళ్ళకు ఉన్నా ఫలితం ఏముంది? అవతల వాడు కూడా నిజాయితీగా వీళ్ళని ప్రేమించి కట్టుబడి ఉండాలి కదా?
"ఇవన్నీ.. మొదట్లో ఒకరిద్దరికి తెలియక పోవచ్చు. క్రమంగా వాళ్లతో కలిసి తిరిగేవాళ్ళకి ముందే అర్థమౌవుతుంది కదా?" అడిగింది ఇందుమతి
"అర్థమౌతుంది మేడం..తమ అందంతో మాటల చాతుర్యంతో తమకలాంటి స్థితి రాదనే అతివిశ్వాసం ఉంటది. ముందుకు వెళ్లాక..వెనక్కి రాలేరు. వచ్చినా బతుకు తెరువు సమస్య..స్వంతవాళ్ళ నిరసన,
ఈసడింపులను తట్టుకోలేని భయం"
"నిజమే" అనుకుంది ఇందుమతి.
"అబ్బో, టైమ్ పదిదాటిందే నేను మాటల్లో పడి టైం చూసుకోలేదు మేడం ", స్వేచ్ఛ టైమ్ చూస్తూ అన్నది
"అరె..మనం గమనించనేలేదు. బైట వర్షం కురుస్తుంది కూడా" అంది ఇందుమతి
స్వేచ్ఛ లేచి, భుజం పైనున్న చున్నీని తీసి తలమీద కప్పుకొని "మేడం నేను వెళ్తాను" అంది.
"ఈ వర్షంలో అంతదూరం ఎలా వెళ్తావు? మీ అమ్మదగ్గర చిన్న ఫోన్ ఉందిగా..నేను చెబుతాను ఇక్కడే ఉందని" అంటూ ఇందుమతి కాంతమ్మకి చెప్పింది.
తనతో పాటు స్వేచ్ఛకు కూడా భోజనం పెట్టింది. లోపల తన మంచం ప్రక్కగా మడత మంచం వేసింది పడుకోమని.
పడుకున్నతర్వాత మళ్లీ ఇద్దరిమద్య అదే సంభాషణ కొనసాగింది...
***
రోజు రోజుకూ నాలో ఏదో అసంతృప్తి పెరగసాగింది మేడమ్.. నేనసలు ఏం కోరుకున్నాను! దేనికి నావాళ్ళను, నాచదువును వదిలేసుకుని వచ్చానూ? ఏందక్కింది? ఏం దక్కక పోగా నన్ను సైతం కోల్పోయి ఇలా మోడులా... ఎన్నేళ్ళు? బతికినంతకాలం..ఇక ఇదేనా జీవితం? విరక్తి పుట్టసాగింది మేడమ్..."
"..................." వింటుంటే జాలిగా అనిపించింది ఇందుమతికి.
"...నిజం మేడం, మా అమ్మను అన్నను చూడాలని ఎంతగానో మనసు చాలా ఆరాటపడింది. ఈ లోకంలో నాకింక 'నావాళ్ళు' అనుకోవడానికి వాళ్లు తప్ప ఎవరూ లేరని అర్థమైంది.
ముందు తిట్టినా కొట్టినా వాళ్లే నాకుదిక్కు అనుకున్నాను. గంపెడాశతో, గుండెల్లో భయంతో తిరిగివచ్చాను.. చూసారుగా మేడం? ఇక్కడ పరిస్థితిఇది. ప్రతి తప్పుకి శిక్ష, క్షమా ఉంటాయి. నాకు మాత్రం శిక్ష తప్ప, క్షమ దొరకడం లేదు..." దీనంగా అంటూ నిశ్శబ్దంగా కదిలి కదిలి ఏడవసాగింది స్వేచ్ఛ. ఇందుమతి నెమ్మదిగా "జరిగిందేదో జరిగిపోయింది. మీ అన్న ఇంట్లో వద్దంటున్నాడు కదా? మరి నీనిర్ణయం ఏమిటి? ఇకమీదట ఎలా జీవించాలని ఉంది?" అడిగింది.
కొద్దిసేపు ఆగి చెప్పింది స్వేచ్ఛ, "అమ్మ, నేను వేరుగా ఉంటామండీ.. నేను కూడా కష్టపడి బ్రతుకుదామని ఉంది. మీరూ ఏదైన సలహాఇవ్వండి మేడం" అర్ధింపుగా అడిగింది స్వేచ్ఛ.
***
స్వేచ్ఛకు తనకు జరిగిన సంభాషణంతా గుర్తుచేసుకుంటూ క్లుప్తంగా వివరించింది ఇందుమతి.
రాజేంద్ర, యమున ప్రతిభలకు 'మనం చూసే ట్రాన్స్ జెండర్స్ అశ్లీల పదజాలంతో చప్పట్లుచరుస్తూ రికామీగా తిరిగే కులాసా వ్యక్తుల్లా కనిపించే వాళ్ళ మనసుల్లోనూ, జీవన విధానంలో ఇంతటి విషాదమా' అనుకున్నారు ఎవరికి వాళ్లు.
"హార్మోన్స్ ఇన్ బ్యాలెన్స్ వలన, మానసిక రుగ్మతలవలనే కాక, వైద్యపరంగా ఉన్న కారణాలుకూడా ఇలాంటి ఆలోచనలకు, నిర్ణయాలకు హేతువని అంటూ ఉంటారు. ఏదైనా కానివ్వండి, ఈ సంస్కృతి లోగడ కంటే ఈమధ్య మరీ ఎక్కువగ విస్తరించిన దంటున్నారు. అసంబద్ధ కోరికలకుతోడు, కష్టపడడానికి ఇష్టపడని వాళ్ళు కూడా వీళ్ళసంఖ్య పెరగటానికి కారణంకావచ్చు" అన్నాడు రాజేంద్ర.
"................."
"వాళ్ల స్థితిని అర్థం చేసుకోపోయినా పర్వాలేదు, వాళ్లు రెచ్చిపోకుండా, మాన సికంగా చచ్చిపోకుండా మాటల ఈటెలతో వెంటాడకపోతే చాలు" అంది ప్రతిభ
వాళ్ళలా మాట్లాడుతూ ఉండగానే లేచి వెళ్ళి యమున టీ పెట్టుకుని వచ్చింది. అంతలో ఇందుమతి పర్సులో ఉన్న మొబైల్ మోగింది.. ఇందుమతి మొబైల్ తీసి ఆన్ చేసింది
"ఆ.. బాలు.. అయ్యో ఇంటికొచ్చార? నేను మాస్టూడెంట్ వాళ్ళ ఇంటికొచ్చాను. అలాగా? సంజయ్ కి అంతా తొందరే... నేను పిలిపించుకునే దాన్నికదయ్యా... ఫేన్ లున్నాయని అశ్రద్ధచేసా..నీకు శ్రమ.. సరే, గంటలోపు వచ్చేస్తాను, వరండాలో కుర్చీలున్నాయిగా... కూర్చోండి." మొబైల్ ఆఫ్ చేసింది. దాన్ని పర్స్ లోపల పెట్టేస్తూ చెప్పింది "ఇంట్లో ఏసీ పనిచేయ డం లేదు వారంరోజులుగా.. ఇదిగోఅదిగో అనుకుంటూనే అశ్రద్ధచేస్తున్నాను. మాటలసందర్భంలో ఇక్కడవేవి చెప్పినా మా అబ్బాయి గుర్తుంచుకుంటాడేమో... వాళ్ళఫ్రెండ్ కి చెప్పాడట. అతనిప్పుడు టెక్నీషియన్ ని తీసుకుని ఇంటికొచ్చాడట.
ఇంతకీ నేను చెప్పేది ఏమిటంటే తను గౌరవంగా కష్టపడి బ్రతుకుతా అంటుంది కాబట్టి, మనం కాస్త సహకరించి తను నిలదొక్కుకునేట్లు చేయి అందిద్దాం. ఏమంటారు?" అడిగింది ఇందుమతి.
"మీ హెల్పింగ్ నేచర్ అర్థమైంది మేడం, ఎలాగో చెప్పండి..చేద్దాం" అన్నాడు రాజేంద్ర
"అవును మేడమ్" అంది ప్రతిభ
"సరే, మనం దీనిగురించి మరోసారి మాట్లాడుకుందాం. అవతల నాకు వాళ్ళు వచ్చారు కదా?" అంటూ లేచిందామె. రాజేంద్ర, ప్రతిభ కూడా లేచినిలిచారు
యమున వెళ్ళబోతున్న ఆమెకు ఒక చిన్న బ్యాగులో కొన్ని స్వీట్స్ పండ్లు పెట్టి తెచ్చి అందించింది.
"ఎందుకమ్మా ఇవన్నీ?" అందామె
"మేడం, నేను వచ్చి మిమ్మల్నిఇంటి దగ్గర దింపి వస్తాను" అని ప్రతిభ తన స్కూటీ వేపు వెళ్ళబోయింది.
"వద్దమ్మా.. మళ్లీ నువ్వెనక్కి రావాలింత దూరం. నేను ఆటోలో వెళ్లిపోతాను" వారించి బైలుదేరింది ఇందుమతి. వెళ్ళబోయే ముందు ప్రతిభ వాళ్లమ్మా, నాన్నగార్లకి కనిపించి, వెళ్ళొస్తానని చెప్పింది.
ప్రతిభ ఇంటిముందున్న రోడ్డువరకు వచ్చి మేడమ్ ని ఆటో ఎక్కించి వెళ్ళింది.
***
సశేషం
మిగిలిన కథ రేపటి బ్లాగ్ లో
ఇవి కూడా చదవండి