Vijaya Lakshmi
Published on Dec 17 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?*వ్రాయని ప్రేమలేఖ*
రచన : శ్రీమతి.విజయశ్రీముఖి
ఉష పత్రిక వారి కీ.శే. శ్రీ వెలగపూడి సీతారామయ్య స్మారక నవలల పోటీ లో
ప్రోత్సాహక బహుమతి పొందిన నవల.
సమయం సాయంత్రం నాలుగు గంటలు దాటింది.
అప్పటికి ఇరవై నిమిషాలుగా అక్కడున్న ఒక ప్రైవేటు కార్యాలయం కి ఎదురుగా రోడ్డుకుఅవతల ప్రక్కనఉన్న చెట్టుకింద తనబైక్ ని ఆపి, దాన్ని ఆనుకు నిలబడి నిరీక్షించసాగాడు భాస్కర్.
నాలుగున్నరకు....
ఆ కార్యాలయంలో నుండి గేటువరకు తమ స్కూటీలు నడిపించుకుంటూ వచ్చారు ప్రతిభ, మరొక అమ్మాయి. ఆ గేటు దాటాక ఆమె బై చెబుతూ తన స్కూటీ స్టార్ట్ చేసి వెళ్లగానే , ప్రతిభ కూడా హెల్మెట్ పెట్టుకోబోతూ ఉండగా భాస్కర్ గబగబ నాలుగడుగులు ముందుకు వేసి ప్రతిభను సమీపించాడు.
చిరునవ్వుతో చేయిఅడ్డుగా పెట్టాడు ఆగమన్నట్లుగా. తలెత్తి చూసిన ప్రతిభ కళ్ళలో ఆశ్చర్యంతో పాటు చిన్నమెరుపు! నిశితమైన భాస్కర్ చూపు ఆ మెరుపును పట్టేసింది. పెదవుల పైకి రాబోయిన చిరు దరహాసాన్ని లిప్తపాటులో అణచివేసింది ప్రతిభ .
అవి చాలు భాస్కర్ కి...ఎనలేని తృప్తిని, ధైర్యాన్ని అందించాయి
"మీరా?" యథాలాపంగా అడిగినట్లుగా అడిగింది ప్రతిభ.
"బావున్నారా?" నవ్వుతూ అడిగాడు "నిక్షేపంగా ఉన్నాను. ఐనా, మీరేమిటి ఇక్కడ?" అడిగింది
"మీతో మాట్లాడాలి ప్రతిభా.. నేనా రోజునే చెప్పాగా త్వరలోనే మళ్లీ కలుద్దామని"
"ఇంకేమైనా కొత్తరకం టెస్టులు, సర్టిఫికెట్స్ అడగటం మర్చిపోయారా ఏమిటి?" కసి కనిపించకుండా అడిగింది.
"ఆడపిల్లనని రుజువు చేసుకున్నారు" నవ్వాడు.
"ఔను. ఆడపిల్లలం కదా..ఎన్ని రుజువులు చూపించి మమ్మల్ని మేము నిరూపించుకోవాలో? అడుగడుగునా మాదౌర్భాగ్యం"
తన మాటలకు ఖిన్నుడైనట్లున్న అతన్ని చూస్తూ మళ్ళీ అడిగింది ప్రతిభ
"త్వరగా చెప్పండి. దారిలో మనం అడ్డుగా ఉన్నాం కదా?" అని.
"మీకు అభ్యంతరం లేకపోతే ఇలా రోడ్డు మీద కాకుండా ఎదురుగాఉన్న హోటల్లో కాఫీ తాగుతూ మాట్లాడుకుందామా?" సందేహంగా అడిగాడు భాస్కర్
"................."
ఆలోచిస్తుంది ప్రతిభ
"ఒక్క ఐదునిమిషాలు చాలండి"
"సరే పదండి" అంది మామూలుగా.
"ఎలా? మీరు బండి, నేనునడిచా? పోనీ లిఫ్ట్ ఇస్తారా?"
నవ్వు నదిమిపెట్టుకుంటూ, కొంటెతనం కనిపించకుండా అడిగాడు భాస్కర్
ఎదురుగా చెట్టుకింద ఆపి ఉన్న అతని బండి కనిపిస్తోంది. లోగడ తామిద్దరూ పార్కులో కలిసినప్పుడు చూసిందా బైక్. అయినా బయటపడకుండా,
"దగ్గరేగా నేనూ నడుస్తాలే పదండి" అంది భాస్కర్ నవ్వుకుంటూ తన బైక్ వైపు నడిచాడు.
***
హోటల్లో ఒక మూలగా ఉన్న టేబుల్ దగ్గరికి వెళ్లి కూర్చున్నారు.
"టిఫిన్ ఏం చెప్పమంటారు?" అడిగాడు భాస్కర్.
"నాకు కాఫీ చాలు" చెప్పింది ప్రతిభ
"ఉదయంనుండి ఆఫీసులో శ్రమపడ్డారు, లంచ్ అరిగిపోయుంటుంది. కాస్తఏమైనా తినొచ్చుకదా?" అడిగాడు.
"నాకు వద్దు. మీరు తీసుకోండి" అంది
ఇద్దరికీ కాఫీఆర్డర్ చేశాడు భాస్కర్.
ప్రతిభ మౌనంగా చుట్టూ పరికించి చూస్తోంది. భాస్కర్ ఆమెని గమనిస్తూ కూర్చున్నాడు.
గంజిపెట్టి ఇస్త్రీ చేసిన మంగళగిరి కాటన్ చుడీదార్ కొద్దిగా నలిగినట్లుగా ఉన్నా, ఆమెకు హుందాగా ఉంది. శిరోజాలను మొదట్లోనే దగ్గరకునొక్కి క్లిప్పుపెట్టింది. కట్టుబడని చిన్ని చిన్ని ఉంగరాలు తిరిగిన ముంగురులు మాత్రం నుదురుమీద చిరు చెమటకు కొన్ని అతుక్కుని, మరికొన్ని రేగిపోయి వింత అందాన్ని ఇస్తున్నాయి. రోజంతా పనిఒత్తిడితో కలిగిన అలసట.. అలసటలోకూడా ఎంతో ఆకర్షణీయంగా ఉంది. బహుశః.. శ్రమజీవన సౌందర్యం అంటే ఇదేనా?' అనుకున్నాడు భాస్కర్.
తన చేతికందుబాటులో ఉన్న ఆమె ఫాలభాగంలో స్వేదానికి చిందరవందరగా అతుక్కు పోయిన ఆ ముంగురులను ప్రేమగా సవరించాలని, ఆ చిరుచెమ్మను తన చేరుమాలతో సున్నితంగా అద్దాలనే బలమైన కోరికను బలవంతంగా అణచుకున్నాడు.
"మీరేదో మాట్లాడాలన్నారు?"
భాస్కర్ ని చూస్తూ అడిగింది ప్రతిభ
"ఆ? ఆ..అవునండి మిమ్మల్ని చూసేసరికి ఆమాటలు మర్చిపోయాను"
నవ్వు దాచుకుంటూ అన్నాడు
"గుర్తొచ్చినప్పుడే చెప్పండి. మరైతే నేను వెళ్ళనా ?" లేవబోయింది నవ్వుతూ
"ఆగండాగండి..గుర్తు వచ్చింది"
"అయితే చెప్పండి"
మళ్లీ కూర్చుంది ప్రతిభ
"మాతరఫు నుండి వచ్చిన ఆ ప్రతిపాదనకి మీరెంతగా నొచ్చుకున్నారో మమ్ములను ఎంత కుసంస్కార్లుగా ఊహించుకున్నారో ఆరోజు పార్క్ లో మీ మాటలు, ఇప్పటి వరకు మీ పెద్దవారి మౌనపు వైఖరి స్పష్టం
చేస్తున్నాయి..."
బేరర్ కాఫీ తేవడంతో ఆగాడు భాస్కర్
అతను కాఫీ కప్పులు అక్కడ పెట్టి వెళ్లిన తర్వాత ఆమె ముందున్న కాఫీ కప్పును ఎత్తి ఆమెకు అందిస్తూ "కాఫీ తీసుకోండి" చెప్పాడు భాస్కర్
"అతిథి మర్యాద చేస్తున్నారు, ఇది మీ ఇల్లు కాదండోయ్... హోటల్!"
కప్పు అందుకుని నవ్వుతూ అంది ప్రతిభ
"అయితే, అలాంటి సుదినం కోసమే నేను ఎదురు చూస్తున్నాను" అన్నాడు భాస్కర్.
వినీ మౌనంగా ఊరుకుంది ప్రతిభ.
"మీరు పార్క్ లో నన్ను అలా అడిగేవరకు తాతయ్య మిమ్మల్నలా అడిగారనే విషయం నిజంగా నాకుతెలియదు, మీరు నమ్మాలి"
"................."
"ప్రతిభగారూ, మనమూ ఉద్యోగాలు చేస్తూ బైట తిరుగుతున్నాం. ఈనాటి నాగరికపు పోకడలు కొందరిలో ఎంతటి విపరీతంగా ఉంటున్నాయో, ఎంత విచ్చలవిడిగా సంచరిస్తున్నారో.. మనకూ
తెలుసు. అలాంటి వ్యక్తులు మనకి మాత్రం తారసపడటం లేదా?"
"...............
"అలాగని తాతయ్యను సమర్థిస్తున్నానని ఆయనమాటే నా మాటని అనుకోకండి"
"..................."
సాసర్ మీద చూడువేలుతో రింగులుగా గీస్తూ వింటుంది
"యవ్వనోత్సాహంలోనో లేక అతిగా నమ్మేసో... ప్రలోభాలకులొంగిపోయో కానీ కొంతమంది కొన్ని తప్పటడుగులు వేస్తూ ఉండొచ్చు. లేదా ఈ జీవితం హాయిగా ఆనందించడానికే అనే పాలసీని కొందరు మెయింటైన్ చేస్తూను ఉండొచ్చును..."
"..............."
"...అలాంటిదేదో మా అన్న..మా పెదనాన్న కొడుకుచేసుకున్న ఆమె విషయంలోనూ జరిగిఉంటుందని నేననుకుంటున్నాను. ఒకవిషయం గురించి ఖచ్చితంగా మనకి తెలియనప్పుడు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఊహించుకుంటారు కదా..."
భాస్కర్ మాటలువింటూ ఆలోచనలో పడింది ప్రతిభ. తన స్నేహితురాలు జయ గుర్తుకు వచ్చింది...
జయకు నెలరోజుల క్రితమే ఎంగేజ్మెంట్ అయ్యింది. ఎంగేజ్మెంటయిన నాల్గో రోజు ఆమె కనిపిస్తే "నిన్న నీకు కాల్ చేశాను జయా! నీవు లిఫ్ట్ చేయలేదు" అంది తను
"ఔను ప్రభా! నువ్వు కాల్ చేసినప్పుడు నేను, సుధీర్ సినిమాహాల్లో ఉన్నాం!" అన్నది.
"ఏమిటి! నువు సుధీర్ తో సినిమా హాల్లో ఉన్నావా?" ఆశ్చర్యంగా రెట్టించి మరీ అడిగింది తను.
"అవునూ ఏం?"ఎదురు ప్రశ్నించింది "నువ్వు, సుధీర్ మీ స్నేహం.. సాన్నిహిత్యం నాకుతెల్సు జయా.. మీరిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటామంటూ తిరిగారు... చివరికి ఇంట్లోవాళ్ళు మీపెళ్లికి ఒప్పుకోవడం లేదు అని కదా, నీకు మరొకరితో ఎంగేజ్మెంట్ అయింది?"
"అవునూ అయితే?" మళ్లీ జయ ప్రశ్న
"మళ్లీ సుధీర్ తో సినిమాలకి...?" "వెళ్తే ఏమైంది ప్రభా? కొంపలేమైన మునిగిపోతాయా? ఆకాశం కుంగిపోతుందా? ఎక్కడవక్కడ ఎప్పట్లాగే ఉంటాయి. మన కోరికలే కుళ్లి పోతాయ్!" నిర్లక్ష్యంగా ఉంది జయ జవాబు.
"వేరొకరితో పెళ్లిఖాయం అయినాక కూడా ఇతనితో సినిమాలు షికార్లు ఇంకెందుకు జయా?"
"జస్ట్ చిల్! ఇంట్లోవాళ్ళు వద్దన్నారే కానీ, మేము వద్దనుకోలేదు కదా?" కన్నుగీటి నవ్వేస్తూ అంది జయ.
తన వెర్రిచూపులు చూసి మళ్లీ జయే చెప్పింది
"అయిపోయింది ప్రభా .ఇంక జన్మ అంతా ఆమొగుడికి నేను బానిసనే కదే? అందుకే..ఆఖరిసారి సుధీర్ కి వీడ్కోలు.." చెప్పిందామె
తనకేమిటో ఆమాటలు వెగటుగా అఇష్టం గా అనిపించి తల తిప్పుకుంది.
ఆఫీసులో తనతోపాటు చేసే కొలీగ్స్ రేవతి, సంయుక్త ఉన్నారు. వాళ్ళు తను ఒకచోటనే కూర్చుని లంచ్ చేస్తారు. అలా లంచ్ చేస్తున్నప్పుడు ఒకసారి సంభాషణ పెళ్లిళ్లపై చర్చగా మారింది. 'నేను ఒకరితో సహజీవనం చేస్తున్నాను' అనిచెప్పింది రేవతి.
'అదెందుకండీ? ఏకంగా పెళ్లి చేసుకుంటే బావుంటుంది కదా?' అని తనడిగింది 'ఆయనకు ముందే పెళ్లయిపోయిందండీ' చాలా మామూలుగా చెప్పింది రేవతి.
'సహజీవనం ' అనే మాట ఇప్పటి తరం నాగరీకులు పెట్టినపేరు. దీన్నే మన పెద్దవాళ్లు మోటు మాటల్లో "ఉంచుకోవడం" అనేవారు లెండి" అంది సంయుక్త.
ఆమాటతో రేవతికి చాలా కోపం వచ్చింది.
'రేపు ఎప్పుడైనా మీఇద్దరికీ పొసగక పోతే పుట్టినపిల్లలు ఎవరిదగ్గర ఉండాలి? వాళ్లకేం జవాబుచెప్తారు?' అడిగింది మళ్ళీ సంయుక్త.
'మాపర్సనల్ విషయాలు మీకనవసరం' అంది రేవతి. ఇద్దరికీ కాసేపు వాగ్వివాదం కూడా జరిగిందారోజు.
ఈ పరిణామం పాశ్చాత్య నాగరికతా ప్రభావమా? లేకపోతే.. పురుషాధిక్యతతో దశాబ్దాల తరబడి ఇంటాబైటా నలిగి పోయి..అణగిమణగి పడిఉన్న గతతరాల వాళ్ళ అసహాయతను ఆక్రోశాల్ని వినివిని చూసిన తెగింపుతో వస్తోన్న ఎదిరింపా? బంధాల బందిఖానాలో బంధితులుగా ఇరుక్కోకూడదనే ప్రబోధమా...?'
"హలో.. ప్రతిభగారూ ! మీరు రాత్రంతా సరిగా నిద్ర పోలేదనుకుంటాను?" టేబుల్ మీదుగా కొంచెం ముందుకు వంగి ప్రతిభ కనుల ముందు వేళ్ళతో చిటికెలు వేస్తూ అడిగాడు భాస్కర్
ఉలిక్కిపడి తలెత్తి చూసింది ప్రతిభ
"అదేం లేదే..ఎందుకలా అడిగారు?"
"చాలా సేపటినుండి మాట పలుకు ఏమీ లేకుండా అలా కళ్ళువాల్చి కూర్చుండి పోతే నిద్ర పోతున్నారనుకున్నాను లెండి" అల్లరిగా నవ్వుతూ అన్నాడు భాస్కర్
చిరుకోపంతో ఎదురుగా ఉన్న గ్లాసులోని మంచినీళ్లు అతని మీదకు చిమ్మాలని అనిపించింది ప్రతిభకు. తనను తాను కంట్రోల్ చేసుకుంటూ అడిగింది."ఆ..ఏంటో చెబుతున్నారు చెప్పండి"అని.
భాస్కర్ మళ్ళీచెప్పసాగాడు...."మీరు అర్థం చేసుకోవాల్సింది తాతయ్య మాటల్లో భావాన్ని. అసలు ప్రతిమాటకు మనం రెండు అర్ధాలు లాగవచ్చు. మంచి, చెడు. వ్యక్తులను బట్టి సందర్భాన్నిబట్టి ఆ మాటల్లో భావం గ్రహించాలి. మాకుటుంబం అనే నాటకంలో తాతయ్య కుటుంబపెద్ద అనే పాత్ర పోషిస్తున్నారు. ఐతే, స్క్రిప్టులో లేని సొంత డైలాగును చెప్పేశారు తాతయ్య. నాటకాన్ని మరింత రక్తి కట్టిస్తుందనుకున్నారు ఆ డైలాగ్! కథ సుఖాంతం చేస్తుందనుకున్నారు. కానీ, అనుకోని విధంగా అడ్డంతిరిగి నాటకం అంతా రసాభాసగా తయారయింది" ఇబ్బందిగా నవ్వుతూ చెప్పాడు భాస్కర్.
ఇద్దరి మధ్య కొన్ని క్షణాలు నిశ్శబ్దం
"అయ్యో...కాఫీ చల్లారిపోతుంది, ముందు తాగండి" విషయాన్ని అర్థం చేసుకున్నాను అనే సంకేతంతో నవ్వుతూ చెప్పింది ప్రతిభ
"ఇదిహోటల్ అండి, అతిథి మర్యాదను ఆత్మీయతను మీ ఇంటికి పిలిచి చూపించ వచ్చు కదా? " టీజింగ్ గా ఇందాకటి ఆమెమాటనే తిప్పి అప్పగించాడు భాస్కర్.
తను అన్నట్లే ఆమెకూడా 'ఆ రోజు కోసం చూస్తున్నాను' అని అంటుందేమోనని ఆశించాడు.
ఆమె చిన్నగా నవ్వేసి ఊరుకుంది.
కాఫీకప్పు ఖాళీచేసి పక్కన పెట్టేస్తూ అన్నాడు "మీకు ఫోన్ చేస్తూనే ఉన్నాను మీరే తీయడం లేదు" ప్రతిభ విని ఊరుకుంది.
"ఇకనైనా మీకు అభ్యంతరం లేకపోతే, మీపెద్దవారితో మాట్లాడమని మా వాళ్లతో చెబుతాను. ముందసలు మీనిర్ణయమేదో చెప్పండి" అన్నాడు
కొద్దిసేపు ఆగి తర్వాత నెమ్మదిగా చెప్పింది
"నేను...మా ఇంట్లో చెప్తాను"
"ఏమని చెప్తారు?" హుషారుగా అడిగాడు
"చెప్పాక చెప్తాను ఏమనిచెప్పానో" చేతివాచీ చూసుకుని హ్యాండ్ బ్యాగ్ లో నుండి డబ్బులు తీస్తుంది ప్రతిభ.
"ఆగండి నేను ఇస్తాను" అన్నాడు భాస్కర్
"వద్దు. నేను త్రాగినవాటికి నేనేఇస్తాను"
"అయితే నాబిల్లు కూడా ఇచ్చేద్దురూ"
"మీది నేనెందుకు ఇవ్వాలి?" నవ్వుతూనే అడిగింది .
"ఎందుకంటే... ఆ! ఫ్రెండ్స్ మి కదా?"
"రెండుసార్లు మాట్లాడగానే ఫ్రెండ్స్ మి అయిపోతామా?"
"పోనీ... కాబోయేచుట్టాలం అనుకోండి"
"అయినప్పుడు అనుకుందాం లెండి" నవ్వుతూ తన బిల్లు మాత్రమే ఇచ్చింది ప్రతిభ.
'అబ్బ! ఎదుటివాళ్ళను గీతకు బయటే నిలబెడుతుంది. అవకాశం ఇవ్వదు, తను తీసుకోదు' తనలో తను అనుకున్నాడు భాస్కర్.
***
సశేషం
మిగిలిన కథ రేపటి బ్లాగ్ లో
ఇవి కూడా చదవండి