వ్రాయని ప్రేమలేఖ నవల | పార్ట్ 9 | Vrayani premalekha Telugu novel | Telugu kathalu

Vijaya Lakshmi

Published on Dec 18 2025

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here


*వ్రాయని ప్రేమలేఖ*

రచన : శ్రీమతి.విజయశ్రీముఖి

ఉష పత్రిక వారి కీ.శే. శ్రీ వెలగపూడి సీతారామయ్య స్మారక నవలల పోటీ లో

ప్రోత్సాహక బహుమతి పొందిన నవల.

కాంతమ్మ ఇల్లు...

"నేను ఇంటికి తాళంవేయటమూ, నువ్వు దాన్ని పగలగొట్టడం... ఏం ఆటగా ఉందా? కాంతమ్మ పెద్దకొడుకు నాగరాజు తల్లిపై అరుస్తున్నాడు.

"తాళంపగల గొట్టింది అమ్మ కాదు.. నేను" ముందుకొచ్చి చెప్పింది స్వేచ్ఛ.

"వచ్చిన దగ్గర్నుంచి చెబుతున్నాను నీకు కొంపలో వద్దు ఎటయినా చావమని. నీ కొజ్జాముఖాన్ని చూడలేక చస్తున్నాను. ఇన్నిసార్లు చెప్పించుకోవటానికి నీకు సిగ్గు లేదా?" స్వేచ్ఛపై రంకెలు వేస్తున్నాడు నాగరాజు.

"పెద్దోడా, నీలాగే ఆడూ పుట్టాడురా ఏడకి పొమ్మంటావు?" సర్దిచెప్పబోయింది కాంతమ్మ.

"పుట్టడం నాలాగే పుట్టాడులే. అట్టాగే లేడుగా? పెట్టమారి ఎదవ పేడిమొఖం వేసుకునివచ్చాడు. సిగ్గు ఎగ్గూ ఆడొదిలినా నేను తలెత్తుకు తిరగలేకపోతన్నాను" ఈసడింపుగా అన్నాడు నాగరాజు

 "అన్నా! నువ్వెన్నన్నా నాకేం కోపంలేదు. నాఅన్నేగా అనుకుంటున్నాను. నీకెందుకు దయలేదన్నా నా మీద?" దీనంగా అడిగింది స్వేచ్ఛ

        "ఏయ్ నువ్వు నాతో మాటాడబాకు. నిన్ను చూట్టానికే కాదు, నీ మాటినాలన్న నాకు రోతగానే ఉంది"

"ప్లీజ్ అన్న.. నేను నీతోడ పుట్టాను. నా కడుపులో దుఃఖం నీకు చెప్పుకోవాలని ఉందన్నా" స్వేచ్ఛ గొంతులో సుడులు తిరుగుతున్న దుఃఖం. నాగరాజు మాట్లాడక అటుతిరిగి కూర్చున్నాడు.

"అన్నా! ఒక్కసారి నా గోడు వినన్నా.."

నాగరాజు మాట్లాడలేదు. ఆమౌనమే అవకాశంగా తీసుకుని తన సొద చెప్పుకోసాగింది స్వేచ్ఛ...                          "నాకెందుకో మగపిల్లాడిగా ఉండబుద్ధి కాలేదన్నా. ఉండలేక పోయేవాడ్ని. ఇంట్లో ఎప్పుడన్నా నేను పైటతో బొట్టుతో నీకు కనపడితే నువ్వు చావగొట్టేవాడివి.బళ్లో నాటకంఅని తప్పించుకునేవాడిని.."

                 ".................."

"ఆడేది నాటకం, చెప్పేది అబద్ధమైతే ఏనాటికైనా బైటపడతాయి. ఆడపిల్లగా ఉండాలనుకునే నా ఉబలాటాన్ని నాజతగాళ్లకు చెప్పుకున్నాను. చెప్పుకొని వాళ్లకు నేనొక ఆటబొమ్మ అయ్యాను. ఆఖరికి ప్రైవేట్ చెప్పే పంతులుకూడా... నన్ను యాతన పెట్టాడన్నా! వాళ్ళ బాధపడలేక నీకు తెలిస్తే చావకొడతావని భయంతో ఇంట్లోంచి పారిపోయాను..."

"నాకు అరికతలు చెప్పబాక. నీకు కొవ్వెక్కి కళ్ళకు పొరలుగమ్మాయి. తప్పట్లు కొట్టుకోవాలనే రంధితోనే పోయావు. నాకు తెలీదనుకోమాక" హూంకరించాడు నాగరాజు.

అయినా స్వేచ్ఛ ఆగక చెబుతోంది...

"గాలికి తిరిగి తిరిగి.." ఆళ్ళ" దగ్గరకెళ్ళాను ఎవరి భయంలేక హాయిగా ఉన్నారని భ్రమ పడ్డాను. నా జీవితం వాళ్ళ చేతుల్లో పెట్టాను.."

"...పెట్టి, ఉన్నా వాటిని కోపించేసుకుని ఆడంగిరేకులోడిగా తయారై వచ్చావు. ఆళ్లతోపాటు అక్కడేసత్తే పీడాపోయేది. సిగ్గులేని బతుకు..థూ"                             

అన్న చీత్కారాన్ని పట్టించుకోలేదు స్వేచ్ఛ అన్న వినకపోయినా తన కడుపులో దుగ్ధ తనవాళ్లకు చెప్పుకోవాలని, భారందించుకోవాలనే తపనతో చెబుతూనే ఉంది. అంతా విన్నాక ఆఖరికి అయినా తనని జాలితో అక్కున చేర్చుకుంటారనే భ్రమ!

"వాళ్లలో కొన్నాళ్ళు తిరిగాక అనుభవం అయింది. అమ్మాయినైతే అయ్యానుకానీ, ఏమగాడు నన్నుఆడదానిగా ఒప్పుకోడని! కాలక్షేపంకి.. సరసాలకే పనికొస్తాను గాని సంసారానికి పనికిరానని బతుకు తెరువుకు మనసును చంపుకుని స్వేచ్ఛ పేరుతో వెలిగా వెలితిగా రోజులు గడిపేదాన్ని. తర్వాత నాకు ఆ బతుకు నరకంగా ఉండేది అన్నా..."

"బుద్ధులు భూములు ఏలుతుంటే రాత గాడిదలు కాసిందంట. నీలా మదమెక్కిన వాళ్లకు అంతే కావాల్లే" కసిగా అన్నాడు నాగరాజు.

ఇద్దరివైపు గుబులు గుబులుగా చూస్తూ వింటోంది కాంతమ్మ.

తానంత ప్రాధేయపడుతూ చెప్పుకున్నా, అన్న చీత్కారాలు, చూపుల్తో కాల్చేస్తున్న అవహేళనలు స్వేచ్ఛ మనసును సూదుల్లా గుచ్చుతూ, కత్తుల్లాగా కోస్తున్నాయ్..

"ఎందరో పక్కవాళ్ళ బతుకులు కూల్చి పెత్తందారులుగా తిరుగుతుంటారు. మేము మాబతుకులను మా చేతులారా కూల్దోసుకొని మీలాంటి వాళ్ళ ఉమ్మి లో పడి కొట్టుకుపోతున్నాం..." శక్తిలేనట్లు ఏడవసాగింది స్వేచ్ఛ.                                     

కాంతమ్మ ఇద్దరిమాటలు వింటూ, వినలేక తల్లడిల్లి పోతుంది.

         "నీ ఆడంగి ఏడుపులు ఆపు" చిరాగ్గా అరిచాడు నాగరాజు

స్వేచ్ఛలో రోషం తలెత్తింది, 'అన్న, అన్న' అనుకునే తన మనసులో ఈ అన్నమీద చిరాకేసింది. కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ...

"ఏంటన్నా ఆడంగి ఏడుపా? ఆడది అంటే అంతచులకనా? మొగపుటక పుట్టగానే మొనగాడైనట్టు కాదు. మీసాలు పెంచేసి, తిప్పుకుంటూ తిరిగితేనే మొగోడై పోతా డనుకున్నావా? మొగోడు అంటే దయఉండాలి, ధైర్యం ఉండాలి, తనతోటివాళ్లను మనుషుల్లాగా చూసే మనసు ఉండాలి, ఏడ్చేవాళ్ళ కన్నీళ్లుతుడిచే గుండెల్లో తడి ఉండాలి.. మొగోడంటే...ఆడు మొగోడు!"

స్వేచ్ఛలో వచ్చిన ఆవేశం, ఆభాష చూసి నాగరాజు అదిరిపడ్డాడు. అతనికిప్పుడు తమ్ముడుగా కాక, ఎవరో కొత్త వ్యక్తిలాగా వింతగా కనిపించింది స్వేచ్ఛ.

ఇట్లాతయారైన వాళ్లందరూ వెకిలిచేష్టలు మాటలతో, సిగ్గూఎగ్గూ వదిలేసి పైసలు కోసం.. తిరుగుతారని అతని నమ్మకం...    'ఇట్టా కూడా మాటాడుతారా!' నమ్మలేనట్లుగా ఒకసారి స్వేచ్ఛ వైపుకి చూశాడు నాగరాజు

ఆమె ఇంకా ఆక్రోశంతో అరుస్తోంది...

"ఉన్నది వద్దనుకుని, లేనిది పొందాలనీ పొందలేక జీవితాన్ని చేతులారా చిందర వందర చేసుకున్న దౌర్భాగ్యులం మేము! ఆ దరిద్రం మా పుటకతో పుట్టిందో... మనసులో మొలిచిందో కూడా తెలియని అయోమయంతో ఆగమైపోయాం.."                                  

                 ".................."

గణాచారిలా ఆగకుండా ఊగిపోతున్న స్వేచ్ఛను అబ్బురంగా చూస్తూ ఉన్నాడు. ఇప్పుడతని మది మూలల్లో కించిత్ భయమో...సానుభూతో మెదిలినట్లైంది..

 

  "అన్నా! ఇందాక నన్నేమన్నావ్? కొజ్జా మొఖాన్నా? కొజ్జావాళ్లెవరో నీకుతెల్సా? మేము అడుక్కొచ్చో, ఆనందపెట్టో తెచ్చి దాచుకున్నడబ్బుకోసం కక్కుర్తి నాయాళ్లు ఉన్నారు. వాళ్లు మమ్మల్ని ఉద్దరిస్తామని, పెళ్లిచేసు కుంటామని మాయమాటలతో మభ్యపెట్టి మేము దాచుకున్నదంతా దోచుకునిపోయే వాళ్ళున్నారే? కొజ్జావాళ్ళంటే వాళ్ళన్నా కొజ్జావాళ్ళు! ప్రేమనటిస్తూనో, పైసలిస్తామనో చెంతచేరి శృంగారంపేరుతో అడవిపందుల్లాగా పొర్లి కుమ్మి..ఎవరికీ చెప్పుకోలేమనే ధైర్యంతో వికృతంగా.. జుగుప్స కలిగించే రోతచేష్టల పేడపురుగులు కొందరు వస్తారు... వాళ్ళ కుతి తీర్చుకునే క్రమంలో బతుకుమీద, మాశరీరాలమీద మాకే రోతపుట్టించే నీసు వెధవలున్నారే? వాళ్లు..వాళ్లన్నా అసలైన కొజ్జావాళ్ళంటే"

ఏం మాట్లాడుతున్నాననే స్పృహ లేకుండా పూనకం వచ్చినట్లు ఊగిపోసాగింది స్వేచ్ఛ.

'ఎన్నడూ తన ముందు తలెత్తి, నోరెత్తి మాటాడని ఒకప్పటి తమ్ముడికి, ఇవ్వాళ ఒకమాటకు పదిమాటలు చెరిగిపోస్తున్న ఈ మారిపోయిన తమ్ముడికి ఎంతతేడా!' తొలిసారిగా నాగరాజులో కొంచెం జంకు, కొంచెం బాధ కలిగాయి. అయితే అంతలోనే అతనిలో మరో భావన రేగింది.

         'వీడినిట్లా చూసి రేపు నాపిల్లలు కూడా ఇట్టాగే తయారైతే? 'ఆ కొజ్జా ఇంట్లోఉంటే నేనక్కడికి రాన'ని తెగేసిచెప్పింది పెళ్ళాం. ఊళ్లో కూడా... ఊళ్లో కూడా నామర్దాగానే ఉంటది. లేనిపోని గోలతో చావడమెందుకు? ఇన్ని మాటలు చెప్పేవాడు ఎక్కడో చోట బతుకుతాడు ' అనుకున్నాడు నాగరాజు.

స్వేచ్ఛ వైపు తిరిగాడు

"సరే అయ్యన్నీ నాకెందుకులే, నీ బతుకు నీ ఇష్టం. నాకు పెళ్ళాం పిల్లలుండారు. కూలీనాలీ చేసుకున్నా పరువుగా బతుకు తున్నాను. ఇంట్లోనే కాదు ఈఊళ్లో కూడా నువ్వు ఉండొద్దు. ఇన్నేళ్లేక్కడున్నావో అట్టాగే చాటున పడిబతుకు. మా జోలి నీకు నీ జోలి మాకువద్దు అంతే!"      ఖరాఖండిగా చెప్పాడు నాగరాజు.                            

మాట్లాడకుండా అట్లాగే చూసింది స్వేచ్ఛ. ఇద్దరినీ ఆందోళనగా చూస్తూ ఏదో చెప్ప బోతూ ఉంటుంది కాంతమ్మ. ఇద్దరూ వినే స్థితిలో లేరు. ఐనా ఆందోళనగా పిలిచింది

  "పెద్దోడా నా మాట వినరా..."

         "అమ్మా, నాకేం చెప్పబాక వినను. అన్నాడు నాగరాజు. గోడమేకుకి వేలాడే

చొక్కాతీసి తొడుక్కుంటూ బయటికి నడవబోతున్నాడు

         "అన్నా, ఒక మాట వినేసి వెళ్ళు"అంది స్వేచ్ఛ. ఆగాడు నాగరాజు.

"నేనెక్కడికి వెళ్ళినా నీలాంటి పరువుగలవాళ్ళు ఎక్కడికక్కడే ఉంటారు. ఈ ఇంట్లో ఉండను. కానీ, ఊరు నీది కాదు. ఊరికి నువ్వో పెద్దవీ కాదు. ఈ ఊళ్లోనే ఉంటాను"

        స్వేచ్ఛమాటల్లో కోపం, కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. విసురుగా వెళ్లి బ్యాగు తీసుకుంది. తన బట్టలన్నీతెచ్చి అస్తవ్యస్తంగా దాన్లో పడేసి కుక్కసాగింది...

ఎవరికీ నచ్చచెప్పలేక, ఏంచేయాలో తోచనట్లు బిక్కుబిక్కుమని చూసే కాంతమ్మ "నా మాట వినండి రా.." నిస్సహాయంగా పిలిచింది

  "అమ్మా..." ఇద్దరూ ఒకేసారి అరిచారు మాట్లాడొద్దని, నువు ఏంచెప్పినా ఇంక మా నిర్ణయాలు మారవని హెచ్చరికగా.

  కూర్చున్నదల్లా విసురుగా లేచింది కాంతమ్మ.

"పెద్దోడా, నీకు పరువు ఉంది, పెళ్ళాము ఉంది, పిల్లలూ ఉన్నారు... వీడికి నీలాగా ఎవరూలేరు.. నువ్వు ఇడిచి పెట్టేసినట్టు నేనిడిచిపెట్టలేనురా! నేనెల్లి నాబిడ్డకు తోడుంటాను. ఆడితోపాటే నా సావో రేవో..." గబగబా దండెంపైని తన కట్టు గుడ్డలను లాక్కొచ్చుకుని చేతిసంచిలోకి తోసిన కాంతమ్మ "పద పోదాం" అంది స్వేచ్ఛతో.

                                             ***

ఆరోజు సంక్రాంతి పండుగ రోజు...

ఇందుమతి పుట్టినరోజు కూడా. ఇంకొద్ది నెలల్లోఆమె ఉద్యోగవిరమణ కూడాఉంది ఇంట్లోపని పూర్తి చేసుకుని, చదవటానికి ఓ పుస్తకం తీసుకుని హాల్లోకూర్చుంది ఇందుమతి.

దృష్టి పుస్తకంపైకి మళ్ళించి " ఒక యోగి ఆత్మకథ" చదువుతూ చదువుతూనే కొంతసేపటికి చేతుల్లోని పుస్తకాన్ని అలా గుండెలకు ఆన్చుకుని, తలను సోఫామీద వెనకకువాల్చి కళ్ళు మూసుకుంది...

తననికన్న తల్లిదండ్రులు, జీవితం అంతా తోడుంటాడనుకున్న భర్త.. స్వర్గవాసులై వెళ్లిపోయారు. ఉన్న ఒక్కగానొక్క కొడుకు ఉద్యోగరీత్యా విదేశంలో ఉంటున్నాడు. ఇన్నేళ్లు ఉద్యోగం ఉండటం వలన వేళకు ఇంత ఉడకేసుకొని తినటం, కాలేజీకివెళ్లి విద్యార్థులతో గడుపుతూ ఒంటరితనాన్ని వెళ్ళదీసింది. మరో రెండుమూడు నెలలు గడిస్తే ఉద్యోగము ఉండదు. ఇంక అంతా విశ్రాంతే! ఒంటరితనం పదింతలై తనని వెక్కిరిస్తుంది. మిగిలిన జీవితమంతా ఖాళీగా ఎలా గడపాలాని దిగులుగా గుబులుగా ఉంది ఇందుమతికి                                    

ఏమిటో మనిషి తత్వం? జనం మధ్యలో ఉంటే ఒంటరిగా ఆలోచించుకుంటాం. ఒంటరిగ ఉన్నప్పుడు జనంకోసం తపిస్తూ ఉంటాం..తలను విదిలించి ఆలోచనలను నెట్టేస్తూ చూపులను పుస్తకంపైకి మళ్లించి చదవసాగింది ఇందుమతి

"మేడమ్!" ఆ పిలుపుకు తలను తిప్పి చూసింది. చేతిలో ఓ ప్లాస్టిక్ బాస్కెట్ తో నవ్వుతూ నిలబడి ఉంది ప్రతిభ

"సంక్రాంతి.. ముఖ్యంగా మీకు జన్మ దిన శుభాకాంక్షలు మేడమ్!" చెప్పింది

 "ఓ... థాంక్యూ, రామ్మా! కూర్చో. పండగపూట ఎంచక్కగా నువు సంక్రాంతి లక్ష్మిలా సాక్షాత్కరించావు. శుభాభినందనలతో శుభాశీస్సులు!" నవ్వుతూ చెబుతున్న ఇందుమతిలో అంతవరకుఉన్న నిర్లిప్తతపోయి ఉత్తేజం ఆవరించింది.

సోఫాలో తను ఓ ప్రక్కకుజరిగి, ప్రతిభకు చోటిచ్చిందామె. ప్రతిభ తను తెచ్చిన బాస్కెట్ అవతల టేబుల్ మీదపెడుతూ "వదిన మీకివ్వమని పంపింది మేడం" అంటూ వచ్చి ఆమెప్రక్కనే కూర్చుని "భోజనంచేశారా మేడం?" అడిగింది.

"లేదమ్మా.. బాలు వస్తానని ఫోన్ చేసాడు అనుకోకుండా నువ్వు కూడా వచ్చావు, థాంక్ గాడ్! పండుగనాడు ఒక్కదాన్నే కూర్చుని తినకుండా ఇద్దరు పిల్లల్ని తోడుగా పంపాడు దేవుడు" నవ్విందామె

"ఎప్పుడు 'బాలూ బాలు' అంటుంటారు... ఇంతకీ ఆ నెలబాలుడు ఎవరు మేడం?" నవ్వుతూ అడిగింది ప్రతిభ                                        

        "నెల బాలుడు! బాగుందమ్మా పేరు. నిజంగానే బాలు "నెలబాలుడు" లాగానే ఉంటాడు కానీ, పాతికేళ్ల బాలుడు! మా సంజయ్ కి క్లాస్మేట్, బెస్ట్ ఫ్రెండ్ కూడా. ఇంటర్ నుంచి ఇద్దరు బాగా స్నేహితులు వాళ్ళు ఉండేది భద్రగిరి కానీ, అతనికి ఈ మహానగరంలోనే ఉద్యోగం. సంజయ్ దగ్గర లేకపోవడంచేత నాయోగ క్షేమలు చూసే బాధ్యతని వాడు బాలుకి అప్పగించాడు" చెప్పిందామె "అలాగా"అన్నట్లు విని ఊరుకుంది ప్రతిభ.

"మీ అమ్మనాన్నగారు ఎలాఉన్నారు? యమునను కూడా నీతోపాటు రమ్మనక పోయావా ?"

"పండుగ కదా మేడం.. హడావుడి. పైగా ఈరోజున అన్నయ్య కూడా ఇంటిదగ్గరే ఉంటారు కదా?"

"అవును కదా.. ఈసారి నువ్వు వచ్చేప్పుడు తనని కూడా వెంటబెట్టుకొని రా!"

"అలాగేనండి. మీకోసం వదిన ఏవో ఇస్తే, ఇచ్చి వెళ్దామని వచ్చాను. ఇంక నేను వెళ్తాను మేడం" లేచింది ప్రతిభ

         "పండగపూట వచ్చి ఏం తినకుండానే వెళ్ళిపోతావా? ఉండు, నాతోపాటు ఈపూట నీవిక్కడే భోజనంచేయాలి" మళ్లీ కూర్చోబెట్టింది ఇందుమతి.

ఇందుమతికాలేజీ కబుర్లు, ప్రతిభ ఆఫీస్ ముచ్చట్లు చెప్పుకుంటూ ఉండగానే.. వాకిట్లో ప్రతిభ స్కూటీ ప్రక్కగా ఒక బైక్ వచ్చి ఆగింది.

చేతిలో క్యారీబ్యాగ్ పట్టుకున్న ఒక యువకుడు లోపలికి వస్తున్నాడు. అతన్ని చూడగానే ప్రతిభ అవాక్కయింది. క్షణాల్లో తననితాను తమాయించుకుని, చూపుని మరల్చుకుంది.

 

"రావయ్యా బాలూ! నువ్వు వస్తున్నావని ఫోన్ చేయగానే పండగ నాడు సంజయ్ వస్తున్నంతగా సంబరపడ్డాను" అంటున్న ఇందుమతి ప్రక్కనున్న ప్రతిభ ను చూడగానే క్షణకాలం నమ్మలేనట్లుగా అక్కడే ఆగిపోయాడు భాస్కర్.

                                                     ***

సశేషం

మిగిలిన కథ రేపటి బ్లాగ్ లో


ఇవి కూడా చదవండి


Recent Posts
రథ సప్తమి విశిష్టత: సూర్య జయంతి  |  పూజా విధానం | శాస్త్రీయ కోణం | ఆధ్యాత్మిక ప్రాముఖ్యత | Rath Saptami importance
రథ సప్తమి విశిష్టత: సూర్య జయంతి ...
తిరుమల (టిటిడి)  |  జనవరి 25న తిరుమలలో ర‌థ‌స‌ప్త‌మి వేడుకలు  | TTD news  |  Rath Saptami celebrations in Tirumala on January 25
తిరుమల (టిటిడి) | జనవరి...
తిరుమల 2026 ఏప్రిల్ నెల దర్శన, సేవల కోటా విడుదల వివరాలు | Tirumala April darshan, seva quota release details
తిరుమల 2026 ఏప్రిల్ నెల దర్శన, సేవల...
ఫిబ్రవరి నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో విశేష పర్వదినాలు | TTD news  |  important festivals  in Tirumala temple
ఫిబ్రవరి నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో విశేష...
2026 శ్రీ పంచమి (మదన పంచమి) ప్రాముఖ్యత  |  సరస్వతి పూజ విశేషాలు | Significance of sree panchami (Madan panchami) 2026
2026 శ్రీ పంచమి (మదన పంచమి) ప్రాముఖ్యత...