Vijaya Lakshmi
Published on Dec 25 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?*వ్రాయని ప్రేమలేఖ*
రచన : శ్రీమతి.విజయశ్రీముఖి
ఉష పత్రిక వారి కీ.శే. శ్రీ వెలగపూడి సీతారామయ్య స్మారక నవలల పోటీ లో
ప్రోత్సాహక బహుమతి పొందిన నవల.
చూస్తూ ఉండగానే కాలచక్రం గిర్రున తిరిగి సంవత్సరం దాటింది.
" లేడీస్ స్పెషల్" షాపులో అమ్మకాలు, ఆర్డర్స్ బ్రహ్మాండంగా కాకపోయినా, బాగా పెరిగాయి.
షాప్ పెట్టినందుకు సంతృప్తిగానే ఉంది. వాళ్ళిద్దరికీ సహాయంగా మరోఇద్దరిని కూడా షాపులో పెట్టుకున్నారు.
ముందు ముందు మరింతగా అభివృద్ది చెందుతుందనే నమ్మకం కుదిరింది.
యమున ఇంట్లో వంటపనిని చూసి, భర్త అటువెళ్ళగానే షాప్ కి వస్తుంది. అప్పటికే స్వేచ్ఛ షాప్ తీస్తుంది.
స్వేచ్ఛ తన తల్లి కాంతమ్మను ఇళ్లల్లో పని మానిపించేసింది. ఇందుమతికి మాత్రం సాయపడుతూ తన పని చేసుకుంటూ ఇంట్లోనే ఉంటుందామె. ఇందుమతి ఎప్పుడన్నా ఒకసారి షాప్ కి వెళ్లిచూసి వస్తూఉంది
***
ఒకరోజు ఉదయమే కాఫీతాగి, పేపర్ చదువుతూ కూర్చున్న ఇందుమతి స్వేచ్ఛ రావడం చూసి తలెత్తింది.
తలస్నానంచేసిన కురులకు హెయిర్ బాండ్ పెట్టి, పోనీ టెయిల్ వేసింది. స్టిక్కర్ బొట్టుక్రింద చిన్న కుంకుమకూడా పెట్టింది. కొత్త పంజాబీ డ్రెస్ లో నవ్వుతూ నిలిచిన ఆమె చేతుల్లో స్వీట్ ప్యాకెట్ ఉంది.
"ఏమిటి విశేషం?" అడిగింది
"నా పుట్టినరోజు మేడం! ఇన్నేళ్లలో నేను ఎప్పుడు చేసుకోలేదు. మీరిచ్చిన చేయూతతో మళ్ళీ జన్మెత్తినట్లుగా.. నాకు బతుకుమీద ఆశకలిగింది మేడం. నేను మగాడిగా పుట్టానా, ఆడదిగా మారానా అని కాదు. మనిషిగా పుట్టాను, మనిషిగానే బ్రతకాలని ఉంది. కారణం మీరే! అందుకే నేను ఈవేళ మొదటి పుట్టినరోజనుకుని మీ ఆశీస్సులకొచ్చాను మేడమ్!" ఏకధాటిగా చెప్పిన స్వేచ్ఛ స్వీట్ బాక్స్ ఇందుమతి చేతుల్లో పెట్టేసి, వంగిఆమె పాదాలకు నమస్కరించింది.
ఇందుమతి ఆమెను లేపి, స్వీట్ అందించి చెప్పింది.
"చూడు స్వేచ్ఛా! ఈజన్మే మనకొక "అదృశ్యలేఖ!" ఆ లేఖలో 'జీవితంలో ఎన్నెన్నో అందాలు,
ఆనందాలు, సుఖసంతోషాలనే గాక, ఆప్తులను,అనుబంధాలనుకూర్చి లిఖించి ఇస్తుంది. జీవితాన్ని సార్థకం చేసుకోమని హెచ్చరిక కూడా ఉంటుంది. దానిలో కళ్ళతోచూసి చదివేలా వ్రాసింది కాదు,
అనుభవిస్తూ, అనుభూతి పొందమనే అజ్ఞాతమైన "వ్రాయని ప్రేమలేఖ!" అది. జీవితాన్ని ప్రేమించమనే సందేశం అది! గాడ్ బ్లెస్స్ యు" మనసారా దీవించింది ఇందుమతి.
***
యమున మూడు మాసాల గర్భవతి అని తెలిసింది. అప్పటినుంచి స్వేచ్ఛ ఆమెను షాపులో సాధ్యమైనంత వరకు ఎక్కువగా శ్రమపడనీకుండా తానే చాలావరకు షాప్ చూసుకోవటానికి ప్రయత్నిస్తుంది.
"నువ్వలా కౌంటర్లో కూర్చో వదినా! ఏవైనా చేయాలంటే నాతో చెప్పు. ఇంకా మనకు ఇద్దరు వర్కర్సున్నారు కదా? వాళ్లు, నేను చూసుకుంటాం" అంటుంది.
'స్వేచ్ఛ నన్ను మరీ సోమరిపోతులా కూర్చోబెడుతుంది, ఏదీ చేయనీటం లేదు' అని ఇంట్లో రాజేంద్రకి చెప్తే నవ్వాడు. 'పోనీలే నా బదులు తను జాగ్రత్తగా చూసుకుంటుంది నిన్ను' అన్నాడు.
షాపుకి చాలామంది ఖాతాదారులుగా మారారు.
***
ఒకరోజు ఇందుమతి ఏదో ఫంక్షన్ కి వెళ్లి, సాయంత్రానికి తిరిగి ఇంటికి వచ్చింది. తాళంతీసి లోపలికి వెళ్ళేసరికి వెనకవైపు కాంతమ్మ వాళ్ళు ఉండేగదిలో నుండి పసిపిల్ల ఏడుపు వినిపిస్తోంది.
'ఇక్కడ చిన్నపిల్లలు ఎవరబ్బా?' అనుకుంటూ వెళ్లి, వెనుకవైపు తలుపులు తీసింది.
ఆరోజు ఆదివారం కనుక "లేడీస్ స్పెషల్" షాపుకు సెలవు. స్వేచ్ఛఇంట్లోనే ఉన్నది. ఒక మూడేళ్ల పసిపిల్ల ఎందుకో తెగ ఏడుస్తుంది. స్వేచ్ఛ ఆ పిల్లని ఎత్తుకొని సముదాయిస్తూ తిరుగుతూ ఏదో తినిపిస్తుంది. కాంతమ్మ ఆపిల్లకు పట్టడానికి నీళ్ళగ్లాసు తో వాళ్ళవెనుకే తిరుగుతుంది.
ఇందుమతికి సూచాయిగా అర్థమైనా అడిగింది
"స్వేచ్చా ఎవరా పిల్ల?" అని. తిరిగి చూసిన స్వేచ్ఛ నవ్వుతూ,
"మాఅన్న కూతురు మేడం, దీని పేరు "రాజీ" చెప్పింది.
"ఓ... మీ వదిన వచ్చిందా?" అంది.
"లేదు మేడమ్, మాఅన్న తాపీపనికి వెళ్తే పెద్ద సిమెంట్ ఇటుక ఒకటి బండిమీద నుంచి జారి అన్న పాదంమీద పడ్డదంట. అసలే షుగర్ ఉండటంతో గాయం బాగా వాసి జ్వరంతో ఆస్పత్రిలో పడిఉన్నాడని తెలిసి అమ్మ వెళ్లి చూసివస్తానని అడిగింది.
అమ్మకు నేనెంతో అన్నా అంతేకదా? వెళ్ళమన్నాను.. వెళ్లింది.."
"అలాగా?"
"మేడమ్, పొద్దున్నుంచి ఈమాట మీకు చెబితే మీరు "సిగ్గులేదా?"ని తిడతారని అమ్మ అనుకుంటుంది"
"నేను తిట్టడంఏమిటి? మీరు ఎప్పటికైనా కలుసుకోవడం మంచిదే కదా? కలుసుకోవాలి కూడాను. కోపతాపాలు ఎల్లకాలం ఉండవు కదా కాంతమ్మా?" అంది ఇందుమతి
స్వేచ్ఛ చేతుల్లోని పిల్లఏడుపు ఇంకా ఎక్కువైంది...
"అరె.. ఏడవకమ్మా, కాకులు చూడు.. ష్... అను" పిల్లను సముదాయిస్తూ అవతలకు తీసుకువెళ్ళింది స్వేచ్ఛ.
అక్కడేఉన్న కాంతమ్మ చెబుతుంది ఇందుమతితో.. "అమ్మా, పెద్దోడట్టా ఆసుపత్రిలో ఉండాడు
అని తెలిసి పేణం ఆగలేదు. ఎల్లాక నన్ను సూసి ఆడికి, ఆడిని సూత్తా నాకు దుక్కం ఆగిందికాదు.."
చెబుతూ కళ్ళు తుడుచుకుంది.
ఇందుమతి వింటుంది
'కోపతాపాలు ఎల్లకాలం ఉంటాయా అత్తమ్మా..' అంది కోడలు. పెద్దపిల్ల బళ్లోకి వెళతంది. ఇప్పుడు దానికి ఐదునెలల కడుపు.. "అసలే నీరసంగా ఉంటంది..ఇక్కడ ఆస్పత్రి లో నీ కొడుకునే చూడనా? ఆ ఇద్దరు పిల్లల్నే సాకనా? ఏవిళ్ళతో నాకూ తిండి సయించటం లేదు అందమ్మా"
"నిన్ను ఆస్పత్రిలో నీ కొడుకు దగ్గర ఉండమందా?" అడిగింది ఇందుమతి
"పెద్దపిల్లని మా యమ్మ చూత్తంది, నువ్వు పనికిఎళ్ళటం లేదుగా.. దీన్ని నీ కాడ ఉంచుకుంటావా అత్తమ్మా...' అని అడిగిందమ్మా. నువ్వే చిన్నోడ్ని అడుగమన్నాను..మద్దేల ఈపిల్లదాన్నీ సంకనేసుకు వచ్చి అడిగిందమ్మా."
"మరి... స్వేచ్ఛ ఏమంది?"
"అదికూడా నాలాగా తయారవుద్దనే భయం అన్నకి, నీకు లేకపోతే ఉంచెళ్లు వదినా.. అది మీకుఎంతో నాకూ అంతే అనే సరికి పిల్లనుంచి ఎల్లిందమ్మా" చెప్పింది కాంతమ్మ.
ఇందుమతికి ఏవేవో... గుర్తొచ్చాయి.. 'అవసరాలనుబట్టి పరువు మర్యాదలను సవరించుకుంటారన్న మాటమనుషులు! అవకాశవాదుల మనస్తత్వాలు ఇలాగే ఉంటాయి!' లోలోన నవ్వుకుంది. ఏడుపు మానేసి నిద్రకు పడిన పిల్లను భుజాన వేసుకునివచ్చి పిల్లను తల్లికి అందిస్తూ చెప్పింది స్వేచ్ఛ, "దీన్ని తీసుకెళ్ళి పడుకోబెట్టమ్మా"అని.
తల్లి లోపలికి వెళ్ళిపోయాక ఇందుమతితో,
"మేడం మీరోసారి నాతో అన్నారు.. కోపం ద్వేషం ప్రతీకారం లాంటి భావాలకు మన మనసులో చోటిస్తే.. వాటి సెగ అవతలివాళ్ళకంటే మనకే ఎక్కువగా తగిలి మనశ్శాంతిని కోల్పోతాము, మసకబారిపోతాము అని! నాకు మీ మాటలు ఎప్పుడూ గుర్తుంటాయి మేడం.." నిజాయితీగానే ఐనా, సంజాయిషీ గా కూడా చెప్పింది స్వేచ్ఛ.
"మంచిమాటలను గుర్తుంచుకోవటం వేరు వాటిని ఆచరించటం వేరమ్మా స్వేచ్చా.. నీకు అభినందనలు!
ఇంగ్లీషులో ఓ సామెత కూడా ఉంది నీళ్లకంటే రక్తం చిక్కనని! రక్తసంబంధాలు ఇలాగే ఉంటాయి.." చెబుతున్న ఇందుమతికి ముందువైపు వాకిట్లోకి బైక్ వచ్చినట్లు వినిపించింది.
వెనుక తలుపులు వేసేసి, ముందు వైపు వరండాలోకి వచ్చింది ఇందుమతి.
భాస్కర్ బైక్ కి స్టాండ్ వేస్తున్నాడు, ప్రతిభ నవ్వుతూ లోపలికి వస్తుంది. ప్రతిభ చేతిలో పళ్ళు స్వీట్స్ పెట్టిన చిన్న బాస్కెట్ ఉంది.
భాస్కర్ బైక్ స్టాండ్ వేసేసి గబగబా ప్రతిభ పక్కకు వచ్చి ఆమె చేతిలోఉన్న ఆ చిన్న బాస్కెట్ గభాల్న తాను అందుకుంటూ ఇందుమతితో చెప్పాడు ఫిర్యాదుగా,
"ఆంటీ! ఈ అమ్మాయికి మీరెలాగ చదువు చెప్పారోగానీ.. మనం చెప్పే మాటలు అసలు వినిపించుకోదు కదా?"సీరియస్ గా చెప్పాడు భాస్కర్.
అప్పటికే వరండాలో నిలబడి ఉన్న ఆమె దగ్గరకు వచ్చేశారిద్దరూ.
"నా దగ్గరున్నన్నాళ్ళు చెప్పిన మాటలు బాగానే వింది బాలూ...నీ దగ్గరకొచ్చాకే ఇలా పెంకిగా తయారు చేసినట్లున్నావ్? ఇంతకీ నీవుచెప్పిన మాట ఏంవినలేదు?" అడిగింది ఇందుమతి.
"డాక్టర్ ఏమాత్రం బరువులు పట్టుకోవద్దు అని చెప్పారు, ఐనా వింటుందా? చూడండి... ఈ ఫ్రూట్స్ ఉన్న బాస్కెట్ ని ఎలా మోసుకొస్తుందో వినకుండా?" అర్థవంతంగా నవ్వుతూ చెప్పాడు.
"అబ్బా...నన్ను అల్లరల్లరి చేసేస్తున్నారు మేడం!" సిగ్గుగా నవ్వుతూ అంది ప్రతిభ.
గ్రహించింది ఇందుమతి.
వెంటనే వాళ్ళందించిన బాస్కెట్ లోని స్వీట్ బాక్స్ లోని ఒకస్వీట్ ను తీసి, ప్రతిభ నోటికి నవ్వుతూ అందించింది.
"బాలూ! ఈ చేత్తోనే నీ నోట్లో కూడా పెట్టమంటావా?"అని అడుగుతూనే అతని నోటికి కూడా స్వీట్ అందించింది.
ఇందుమతికే కాక, ప్రతిభ భాస్కర్ లకు పెళ్లికాక ముందు సంక్రాంతి రోజున ఇందుమతి ప్రతిభ నోట్లో స్వీట్ పెడితే..'ఆ చేతితోనే నాకూపెట్టండి' అంటూ గభాల్న అతను తనచేయి పట్టి నోట్లో పెట్టించుకోవటం గుర్తొచ్చి ముగ్గురు పెద్దగా నవ్వేసుకున్నారు.
"కాబోయే అమ్మానాన్నలకు హార్దికాభినందనలు! శుభాశీస్సులు! రండి లోపలికి" ప్రతిభ భాస్కర్ లను నవ్వుతూ లోనికి ఆహ్వానించింది ఇందుమతి.
ఇవి కూడా చదవండి